పాఠకులకు నమస్కారం! కొన్ని సాంకేతిక
కారణాలవలన ఇటీవల మనం తెలుగు భోజనం లో కలుసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. అందుకు
క్షంతవ్యులం. మన వెబ్ సైట్ తయారీ కూడా వేగం పుంజుకుంది. త్వరలోనే తెలుగుభోజనం వెబ్
సైట్ కూడా ఆవిష్కరించబడుతుంది.
వేసవి వేడిమి మొదలైంది. పిల్లలందరూ పరీక్షలు
అవీ చక్కగా వ్రాసి వేసంగి విహారయాత్రలుకు సిద్దం అవుతూ ఉండి ఉంటారు. ఉద్యోగస్తులంతా
ఆర్ధిక సంవత్సర ముగింపు జాతరలు పూర్తి చేసుకుని హమ్మయ్యా అనుకుంటూ వుంటారు.
అమ్మలందరూ క్రొత్త ఊరగాయల పర్వానికి సన్నద్ధం అవుతూ ఉండి వుంటారు. మీ అందరికి
తెలుగుభోజనం తరఫున శుభాభినందనలు.
వేసవిలో తాజా కూరగాయల కొరత కొంత ఉండక మానదు.
ఇక పప్పు దినుసుల ధరలు అంబరాన్ని చుంబిస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు. అంతేకాదండీ!
పప్పుకూడు చేసుకోవాలన్నా అప్పు చేయక తప్పదేమో! అందుకే మరి ఇల్లాళ్ళకు కలగూర
పప్పులు వండే అవసరం మరియు అవకాశం ఈ రోజుల్లో మెండు. పప్పుకూడు- అప్పు ఈ రెండిటికీ
ఉన్న సంబంధం గురించి తనదైన రీతిలో విశ్లేషిస్తూ, పాఠకులకు రుచికరమైన తోటకూర పప్పు
చేయడం గురించి వివరిస్తున్నారు శ్రీమతి నయన.
రమణ బంధకవి
సంపాదకుడు
అప్పు చేసి పప్పు కూడు తినకురా!
శ్రీమతి నయన కస్తూరి
'అప్పు చేసి పప్పు కూడు తగదు'
చాలా మంది మన హితులు శ్రేయోభిలాషులు మనకు సలహా ఇస్తూనే వుంటారు.
అయితే ఇక్కడ 'పప్పు కూడు' అంటే కేవలం 'పప్పన్నం' మాత్రమే కాదు అని మనం గ్రహించాలి. ''ఏమ్మా! పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావ్?” అని ఎవరైనా
ఒక పెళ్ళికాని అమ్మాయిని అడిగారంటే 'పెళ్లెప్పుడమ్మా?'
అని అడగకనే అడిగినట్టన్న మాట! వారి ఉద్దేశ్యం లో 'పప్పన్నం' అంటే ఏంతో ఖర్చు తో కూడిన అనేక మధుర
పదార్ధాలతో కూడిన సంపూర్ణ పెళ్లి భోజనం అన్న మాట. పెళ్లిభోజనం పెట్టాలంటే పెళ్లి
చేయాలి. పెళ్లి చేయాలంటే పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం! కాబట్టి 'పప్పు కూడు' అంటే పెళ్లి భోజనం లేక ఏదైనా పండగ భోజనం
మాత్రమే కాకుండా దాని వెనుక వుండే ఒక వేడుక ....ఒక పండగ.....ఒక సరదా.... జరుపుకోడానికి అయ్యే ఖర్చు అన్నమాట!
ఇలా
చూసుకుంటే 'అప్పు చేసి పప్పు కూడు' మంచిది కాదు.
మన సరదాలకి, వేడుకలకి మన దగ్గర వున్నంతలో
ఖర్చు పెట్టుకోవాలి కాని వాటి కోసం
మనం అప్పులు చేయకూడదు. అసలు పూజలికి కానీ పండగలకి కానీ అప్పు చేసి సంబరాలు జరుపుకొరాదు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు. మన యధాశక్తి చేసుకోవాలే కానీ శక్తికి మించి జరప రాదు. చాలా మందికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, తమ సరదాలు తీర్చు కుంటూ వుంటారు. అయిన దానికి కాని దానికి తమ దగ్గర తగినంత ఆదాయం లేకపోయినా అప్పులు చేసి అన్ని హంగులు అమర్చుకుంటూ ఉంటారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక నానా అగచాట్లు పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని చూసే ఈ నానుడి వాడుక లోకి వచ్చి వుంటుంది.
మనం అప్పులు చేయకూడదు. అసలు పూజలికి కానీ పండగలకి కానీ అప్పు చేసి సంబరాలు జరుపుకొరాదు అని మన పెద్దలు చెప్పనే చెప్పారు. మన యధాశక్తి చేసుకోవాలే కానీ శక్తికి మించి జరప రాదు. చాలా మందికి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి, తమ సరదాలు తీర్చు కుంటూ వుంటారు. అయిన దానికి కాని దానికి తమ దగ్గర తగినంత ఆదాయం లేకపోయినా అప్పులు చేసి అన్ని హంగులు అమర్చుకుంటూ ఉంటారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక నానా అగచాట్లు పడుతూ ఉంటారు. ఇలాంటి వారిని చూసే ఈ నానుడి వాడుక లోకి వచ్చి వుంటుంది.
అందుకే మనందరం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏ పని
చేయవలసి వచ్చ్హినా ముందుగా మనకున్న వనరులు చూసుకుని, ఆర్ధిక
ప్రణాళిక తయారు చేసుకుని దానికి లోబడే మన ఖర్చులుండేలా చూసుకోవాలి. ఒక వ్యక్తీ
అయినా, ఒక సంస్థ అయినా, ఒక దేశమైనా ఈ
సూత్రాన్ని అనుసరించి, 'పప్పు కూడు'
కోసం అప్పు చేయకుండా తమ ఆదాయ ఖర్చులు
బేరీజు వేసుకుని, అర్ధం లేని అనవసర ఆడంబరాలకి మన శక్తి కి
మించి పోకుండా తమ ఖర్చులను నియంత్రణ చేసుకుంటే అప్పుల పాలయ్యే ప్రశక్తే లేదు.
ఎవరికీ లోటు బడ్జెట్ సమస్య అనేదే వుండదు. అదే నిజమైన పండగ .... నిజమైన
'పప్పు కూడు' అంటే మరి మీరిప్పుడు
గ్రహించారా? 'అప్పు చేసి పప్పు కూడు
తగదు' అనే నానుడి లో పెద్ద మేనేజ్ మెంట్ దాగి ఉందండోయ్! ఈ
విషయాన్ని ఇంటి ఖర్చులు చూసుకునే గృహిణులు మరియు ఇంటి యజమానులు గుర్తించుకుంటే
ప్రతి ఇల్లు ఒక స్వర్గ సీమ అవుతుంది. కుటుంబ కలహాలకు తావే వుండదు.
ఇక అసలు
పప్పు విషయానికి వస్తే ఈ రోజులలో అన్ని ధరలతో పాటు
పప్పుల ధరలు ముఖ్యంగా పెసరపప్పు ధర నక్షత్రాలను అంటుతున్నాయి అంటే అతిశయోక్తి
కాదు. పప్పులు సమృద్ధిగా కొనుక్కుని గిన్నె నిండా పప్పు చేసుకుని తినాలంటే సామాన్య
మానవుడికి అప్పు చేయకుండా వుండటం కష్టమే! అందుకే మీకందరికీ నాదొక సలహా .......
పప్పుని కొంచెం గా తీసుకుని తక్కువ ధరలో లభ్యమయ్యే ఆకు కూరలు, ఆ కాలం లో విరివిగా దొరికే కాయగూరలు ఎక్కువగా తీసుకుని, కలగలుపు పప్పులు చేసుకుంటే రుచికి రుచి, బలానికి
బలం, ఆదాకి ఆదా! అవునా కాదా? ఉదాహరణకి
తోటకూర-కందిపప్పు, పాలకూర-శనగపప్పు, బచ్చలి
కూర-పెసరపప్పు, దోసకాయ పప్పు, మామిడికాయ
పప్పు, సొరకాయ పప్పు, బీరకాయ పప్పు
.......... ఇలా అన్నిరకాల కూరలు కలిపి పప్పులు చేసుకోవచ్చు
తోటకూర-కందిపప్పు:
ఇప్పుడు తోటకూర-కంది
పప్పు ఎలా చేసుకుంటే రుచిగా ఉంటుందో తెలుసుకుందాం. మూడు
తోటకూర కట్టలు తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని, సన్న గా తరుగుకోవాలి. ఒక ఉల్లిపాయ, నాలుగు
పచ్చిమిరపకాయలు ముక్కలుగా తరుగు కోవాలి. ఒక చిన్న కుక్కర్ ని తీసుకుని, అందులో ఒక అరగ్లాస్ కందిపప్పు తీసుకుని, దాంట్లో మనం ముందే తరిగి ఉంచుకున్న తోటకూర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, చిటికెడు పసుపు, ఒక పావు చెంచాడు కారం, తగినంత ఉప్పు కొంచెం గా పులుపు రావడానికి కొంచెం చింత పండు గుజ్జ్జు
కలిపి, సరి పడ నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పక్క
స్టవ్ మిద ఒక చిన్న మూకుడు పెట్టి, ఒక చెంచాడు నూనె పోసి, వేడెక్కాక రెండు ఎండు మిరపకాయలు ముక్కలుగా
చేసుకుని, ఒక చెంచాడు మినప్పప్పు, ఒక
అరచెంచాడు ఆవాలు, జీలకర్ర, కొంచెం
ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాక వుడికిన పప్పులో బాగా కలిసేలా కలుపుకుని
ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇదే ఎంతో రుచిగా వుండే
తోటకూర కలగలుపు పప్పు! ఇది అన్నం లోకి బాగుంటుంది.
చపాతీల్లోకి, పూరీల్లోకి కూడా బాగుంటుంది. చేసుకుని తినండి.