Friday, October 31, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 8 : దీపారాధన : ప్రత్తి వత్తులు - విధి విదానాలు!


ముందుమాట:

దీపారాధనకు ప్రత్తి తో చేసిన వత్తులే వాడతారు. ఈ రోజుల్లో ఎవరైనా ఈ వత్తులు ఏదైనా షాప్ కి 

వెళ్ళినప్పుడు కొనటం కద్దు. కాని మా చిన్నతనం లో ప్రతి ఇంట ఈ వత్తులు చేసుకునే వారు. మా 

ఇంటి పక్కన పెద్ద అరుగుల ఇల్లు కిష్టమ్మ గారు అపరాహ్నం వేళ అంత ప్రత్తి ముందు వేసుకుని 

వత్తులు చేస్తూ ఉండేవారు. నేను, మా అక్కగారు బడి నుండి వచ్చాక ఆవిడ దగ్గర కూర్చునే 

వాళ్ళం. ఆవిడ మాకు కూడా కొంత ప్రత్తి ఇచ్చి వత్తులు చేయమనే వారు. పద్ధతి ఆవిడ చూపితే, 

మేము మాకు వచ్చిన రీతిలో బుజ్జి బుజ్జి వత్తులు చేసే వాళ్ళం. తరువాత మాకు కొద్దిగా 

మరమరాలు చేతిలో పోసేది. ఆ రోజులు ఇంకా బాగా జ్ఞాపకం.  మన పాఠకులు కొందరు వ్రత్తులు 

చేసే పద్ధతి, విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అని అడగటం జరిగింది. అందుకొరకు ఈ వ్యాసం 

మీ ముందుకు తెస్తున్నాం.


రమణ బంధకవి


సంపాదకుడు




దీపారాధన : ప్రత్తి వత్తులు - విధి విదానాలు!



శ్రీమతి నయన కస్తూరి


కార్తీకమాసం లో దీపారాధనకు ఎంతో  ప్రాముఖ్యత ఉంది అని నిన్నటి వ్యాసం లో చెప్పుకున్నాము. దీపం ఎప్పుడూ పరబ్రహ్మ స్వరూపమే అనుకోండీ! నిత్యం ఇంట్లో దీపం వెలగాలి. ఏ పండుగైనా శుభకార్యమైనా దీప జ్యోతిని ప్రజ్వరిల్లించిన పిదపే ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు మనం దీపారాధనకు ఎటువంటి వత్తులు వాడాలి; వాటిని దేనితో తయారు చేసుకోవాలి; వాటిని ఎలా తయారు చేసుకోవాలి; వాటిని ఏయే రోజుల్లో ఏయే వేళల్లో చేయాలో ఏయే ఆకారాల్లో  చేసుకోవచ్చో క్లుప్తంగా తెలుసుకుందామా మరి?

శుభ్రమైన ప్రత్తి తో చేసిన వత్తులు దేవుని దీపారాధనకు ఉత్తమం! ఇదివరకైతే మన అమ్మమ్మల, బామ్మల మధ్యాహ్న కాలక్షేపం వత్తులు చేసుకోవడమే!  మరి ఇప్పుడో? హడావిడి జీవితాల పరుగులాట లో వత్తులు చేసుకునే సమయం, ఓపిక, ఆసక్తి ఎక్కడ? అందువలన అన్నీ రెడీమేడ్ గా దొరికేవి కొని తెచ్చేసుకుంటున్నాం. 'భోజనం లోకి కూరలే కర్రీ పాయింట్ల నుండి తెచ్చుకుంటుంటే ఇక వత్తుల్ని కూడా ఎవరు చేసుకుంటారండీ బాబూ?' అని అనబోతున్నారా?  కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం ఆలకిస్తే, 'మేము కూడా ఇక నుండి ఖాళీ సమయాల్లో స్వయం గా మా హస్తాలతో వత్తుల్ని చేసుకుని, దేవునికి దీపారాధన చేసుకోడానికి తప్పక ప్రయత్నిస్తాం' అని అనక మానరు.

ఇంటి భోజనానికి, హోటల్ తిండికి ఎంత వ్యత్యాసం వుంటుందో మీ జిహ్వే చెప్తుంది కదా? మీరు స్వయం గా ఆప్యాయతానురాగాలతో వండి, మీ కుటుంబాని కి ప్రేమగా వడ్డిస్తుంటే వారు తృప్తి గా  తింటూ వుంటే, మీకు ఏమీ తినకుండానే ఆనందం తో కడుపు నిండి పోదూ? అలాగే మీరు చేసిన వత్తులతో దీపం వెలిగించి, మీ ఇంటి చెట్టు కు పూసిన పూలను కోసుకుని వచ్చి, మనలను అనుక్షణం కాపాడే ఆ దైవానికి అర్పిస్తే మన మనసు అలౌకికానందానికి లోను కాక తప్పదు.  ఆ ఆనందం అనిర్విచనమైనది. అది ఎవరికీ వారే అనుభవించి తీరాలి.

అయితే మరి ఇక చూడండి వత్తులు ఎలా చేసుకోవాలో! ఎప్పుడూ  స్నానం చేసిన తర్వాత మాత్రమే  వత్తులు చెసుకొవాలి. దైవ కార్యానికి వినియోగించేవి కనుక భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. ముందుగా గింజలను తీసుకుని, ప్రత్తిని శుభ్రపరుచుకోవాలి. పవిత్రమైన విభూది కూడా దగ్గర పెట్టుకోండి . ప్రత్తిని కొంచెం కొంచెం గా ఎడం చేతి తో పట్టుకుని, కుడి చేతి బొటన వేలుకి, మధ్యవేలు, ఉంగరం వేలుకి విభూధిని బాగా రాసుకుని,ఎడమ చేతిలోని ప్రత్తిని తాడులాగా లాగుతూ,మూడు పొరలుగా వ్రేళ్ళకు  చుట్టుకుని, మనం ప్రమిద సైజ్ ను బట్టి వత్తులుగా చేసుకోవాలి. వత్తులు చేసుకుంటున్నప్పుడు చేతులను శుచిగా ఉంచుకోవాలి. మధ్యలో ఏదైనా పనికోసం లేచి వెళ్ళి వస్తే కాళ్ళూ చేతులను  కడుగుకుని మళ్ళీ ప్రారంభించాలి. మౌనం గా కూర్చుని చేసుకుంటే మంచిది.     
             
మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వత్తుల్ని ఆది, బుధ, గురు వారాల్లో మాత్రమే  చేసుకోవచ్చు. సోమ, మంగళ, శుక్ర, శని వారాలు వత్తులు చేసుకోవడానికి నిషిద్దం అని పెద్దలు చెప్తారు. ఆ రోజుల్లో ప్రత్తి విత్తులను ఏరి పారేయకూడదు అంటారు. ఆ రోజుల్లో ప్రత్తిని కొనుక్కోకూడదని కూడా చెప్తారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడ్డాకా వత్తులు చేసుకోకూడదు. పెద్దలు ఏమి చెప్పినా ఎందుకలా చెప్పారో వివరంగా తెలియక పోయినా మన మంచికే చెప్తారు అనే నమ్ముతాను నేనైతే!

వత్తుల్లో ఇక మూడు పోగుల వత్తులు, పువ్వు వత్తులు, కమలం వత్తులు వుంటాయి. పువ్వు వత్తులు చిన్న ప్రత్తి ఉండను తీసుకుని, పై భాగం లో కొంచెం వత్తిని పైకి లాగి చిన్న వత్తు ల్లాగా  చేత్తో నలుపుతారు. కింద భాగం ఉండ లాగా ఉండి ప్రమిదలో బాగా నిలబడుతుంది. దీపం మధ్యలో నిలబడాలను కున్నప్పుడు, ముఖ్యం గా అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపాలు వెలిగించేటప్పుడు, కార్తీక మాసం లో ఉసిరిక దీపాలు వెలిగించేటప్పుడు పువ్వు వత్తులు వాడతారు. ఇక కమలం  వత్తులు కింద భాగం ఉండలాగా ఉండి, పైన మాత్రం అయిదు వత్తుల్లాగా చేసుకోవాలి. వారి వారి గురువుగార్ల సలహా మీద కొన్ని కొన్ని ప్రత్యేక పరిష్కారాల కోసం  కమలం వత్తులను వినియోగిస్తారు. 

మనం ఇంట్లో చేత్తో  చేసుకునే వత్తులు మెలిక తిరిగి నూనె ను తక్కువగా పీల్చుకుని, ఎక్కువ సేపు వెలుగుతాయి.  బజార్లో కొన్నవి లావుగా ఉండి, ఎక్కువ సేపు వెలుగునివ్వవు. నూనె కూడా వృధా అవుతుంది. పైగా అన్ని నిత్యావసర వస్తువుల్లాగానే వత్తుల ధరలు కూడా ఆకాశంలోనే వున్నాయని మీకూ తెలిసిన విషయమే కదా? మనం ఇంట్లో చేసుకుంటే వస్తువూ బాగుంటుంది, తక్కువ ధరలోనూ దొరుకుతుంది, మనసుకి తృప్తీ కలుగుతుంది.  అందుకని దేవుని కోసం చేసే దీపారాధనకు మనం స్వయంగా పవిత్ర భావం తో వత్తులను చేసుకుంటే పుణ్యం, పురుషార్ధం రెండూ  పొందవచ్చుకదండీ

స్వస్తి!





Wednesday, October 29, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 7 : దీపారాధన - పాప నివారణ


ముందుమాట:

కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మాసం లో దీపాలను వెలిగిస్తే 

పాపక్షయమే కాక, పుణ్య మార్గ సోపానాలను పరుస్తుంది. మట్టి ప్రమిదలలో ఆవు నేతి మరియు 

నువ్వుల నూనె లలో తడిపిన ప్రత్తి వత్తులను వెలిగించటం; దేవాలయాలలో, ఇండ్లలో ఆకాశ 

దీపాలను వెలిగించి దర్శించటం; జ్వాలా తోరణాలను ప్రజ్వరిల్ల చేయటం; దీప దానాలు చేయటం; 

ఇలా ఎన్నో ప్రక్రియల ద్వారా, భగవత్క్రుపకు పాత్రులవటానికి ఈ పవిత్ర మాసం అవకాశాలు 

కల్పిస్తుంది. వీటన్నిటి గురించి సవివరం గా మనకు తెలియ జేస్తున్నారు శ్రీమతి నయన.


రమణ బంధకవి


సంపాదకుడు




దీపారాధన - పాప నివారణ


శ్రీమతి నయన కస్తూరి



కార్తీక  స్నానాల తర్వాత ఈ మాసం లో మోక్ష సాధనకు సులభ సాధనం దీపారాధన! కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు నిత్యం  ప్రాతః మరియు సాయం సంధ్యా సమయాల లో దీపారాధన చేస్తే సాంబశివుడు భక్తుల పూర్వజన్మ పాపములు, ఈ జన్మలో తెలిసీ  తెలియక చేసిన పాపకర్మములు  పటాపంచలు చేసి, ఇహపర సుఖములు ప్రసాదిస్తాడు అని మనకు పురాణాల వలన తెలుస్తోంది!

ఈ దీపారాధన చేసే సమయం మరియు విధానం ఇప్పుడు చూద్దాము! సూర్యోదయానికి ముందు తలారా స్నానం చేసిన తర్వాత గృహము లోని దేవుని దగ్గర మరియు  తులసి కోట దగ్గర దీపారాధన చేసుకుంటే ఎంతో పుణ్యప్రదం! అలాగే సాయంకాలం దైవసన్నిధి లో, తులసమ్మ దగ్గర మరియు ఇంటి సింహద్వారానికి ఇరువైపుల దీపాలు పెట్టుకోవాలి. ఇంటి ముంగిట ఈ దీపాలు పితృదేవతలకు దారి చూపుతూ ఆహ్వానం పలుకుతాయి. ఇలా కార్తీక మాసం పొడుగునా పెట్టుకుంటే, కార్తీక దీపారాధన ఫలం లభిస్తుంది.

ఈ దీపారాధనకి మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చును. ప్రత్తి తో మూడు లేక అయిదు పోగులతో చేసిన వత్తులు ఉపయోగించాలి (ప్రత్తి తో వత్తులు చేసే విధానం, రకాలు, విధి విధానాలు గురించి రేపటి వ్యాసం లో తెలుసుకుందాము). కార్తీక మాసం లో దీపారాధనకు నువ్వుల నూనె వాడితే అష్టకష్టాలు పోయి, సకల సుఖాలు లభిస్తాయాని చెప్తారు. అయితే పూజలో దేవుని దగ్గర దీపారాధనకు ఆవు నెయ్యి వాడితే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు పొందుతారని కూడా మనకు పురాణాలు చెపుతాయి.
"ఘ్రుతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం,
దీపం దాస్యామితే దేవీ గృహాణ ముదితాభవ!"  
దీప జ్యోతులు అజ్ఞానంధకారాల్ని తొలిగించి,జ్ఞాన జ్యోతులను వెలిగిస్తాయి.

కార్తీక శుక్ల పాడ్యమి రోజు తెల్లవారు జామున చేసుకునే వాళ్ళు ఆకాశదీపం ప్ర్రారంభించి ఆమావాస్య వరకు రోజూ  వెలిగిస్తారు. ఆకాశదీపమంటే ఏమిటో, ఎలా వెలిగిస్తారో మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా ఒక్కసారి ఆకాశదీపాన్ని ఎక్కడ వెలిగిస్తారో ఎలా వెలిగిస్తారో గుర్తుచేసుకుందాం. దేవాలయాల్లో అయితే ధ్వజస్తంభం పైన, గృహాలలో అయితే ఎత్తుగా దేనికైనా దీపాన్ని వ్రేలాడదీసి గాలి తగలకుండా ఏర్పాటు చేసుకుని, ఆకాశం కేసి చూస్తున్నట్టుగా దీపం వెలిగించుకుంటారు. ఆకాశ దీపాన్ని వెలిగించినా, దర్శించుకున్నా జన్మజన్మలకు సరిపడ పుణ్యం సంప్రాప్తిస్తుందాని పెద్దల ఉవాచ!

ఈ మాసం హరిహర తత్వానికి ప్రతీక కనుక గృహము నందే  కాక శివాలయాల్లోను, వైష్ణవాలయా ల్లోను ధ్వజ స్తంభము వద్ద దీపారాధన చేస్తే ముక్తి దాయకం!  నాగుల చవితి నాడు  పాము పుట్ట వద్ద కానీ, సర్పరూప సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిని కానీ ఆవు నేతి తో దీపం వెలిగిస్తే సంతానం కోరే స్త్రీలకు సత్సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. తల్లులు వెలిగిస్తే సంతానానికి ఆయురారోగ్యాలు, ఉత్తమ విద్యాబుద్దులు, ఉన్నత పదవులు, సుఖమయ జీవితాలు స్వంతం అవుతాయి అని నమ్ముతారు.

క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయం సమయమున తులసి వనం లో ఉసిరిక మొక్కకు పూజ చేసి, ఉసిరికాయల మీద ఆవునేతి తో దీపారాధన చేస్తే స్వర్గద్వార ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసదీక్ష చేసి, రాత్రి గృహంలో బృందావనం [తులసి వనం] లో తులసీ ధాత్రి (ఉసిరి మొక్క) సమేత లక్ష్మీనారాయణ స్వామి చెంత అయిదు లేక తొమ్మిది ఉసిరిక దీపాలు, వీలైనన్ని ప్రమిదలలో దీపాలు వెలిగించి, ఇల్లంతా కూడా దీపావళి రోజు న అలంకరించినట్లు అలంకరించుకుంటారు. శివాలయాల్లో శివలింగ స్వరూపంలో దీపాలు  పేర్చి అలంకరిస్తారు. జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ రోజున ఒక పెద్ద ప్రమిదలో 365 వత్తులతో నువ్వుల నూనె తో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఉసిరిక దీపం మట్టి లేక వెండి ప్రమిదలో దీపారాధన చేసి, బ్రాహ్మణునికి దీపదానం చేస్తే పుణ్యప్రదమని చెపుతారు. ఇలా పవిత్రమైన కార్తీక మాసం అంతా ప్రతి నిత్యం దీపారాధన చేసుకోగలిగిన జీవిత సౌభాగ్యం అనంతం! ప్రత్యేక రోజులలో విశేష దీపారాధన చేస్తే, లభించే పుణ్యం అసామాన్యం!

ఇలా పవిత్రమైన దీపారాధన ను మనమందరం కార్తీక మాసమంతా చేసుకుని, ఇహపర సౌఖ్యాలని పొందుదాం!     
స్వస్తి!

 








కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 6 : ఉపవాస పానీయాలు – ఉపాహారాలు!


ముందుమాట:

మనం నిన్న చెప్పుకున్నట్లుగా పూర్తి అభోజనం గా ఉపవాస దీక్ష చేయటం అందరి వలన సాధ్యం 

కాదు. అందుకే పెద్దలు, ఆద్యాత్మిక వేత్తలు, ఉపవాసం చేసినప్పుడు కొన్ని పానీయాలు లేక 

ఉపాహారం గా కొన్ని పదార్ధాలను స్వీకరించ వచ్చు అని సెలవిచ్చారు. మన పాఠకుల లో కూడా 

కొందరు, రాత్రి ఉపవాస ఆహరంగా ఏమి తినవచ్చు అని అడిగారు. అందరికి ప్రయోజనకరం గా 

ఉండటం కోసం, మనం ఈ వ్యాసంలో మరి ఆ ఉపవాస పానీయాలు, ఉపాహారాలు ఏమిటో 

తెలుసుకుందాం. దీనివలన నీరసానికి లోను కాకుండా ఉపవాస దీక్ష కొనసాగిస్తూ పూర్తి ఉపవాస 

ఫలాన్ని పొందవచ్చు.


రమణ బంధకవి


సంపాదకుడు




ఉపవాస పానీయాలు – ఉపాహారాలు!



శ్రీమతి నయన కస్తూరి


కార్తీక మాసం అనగానే మనలో చాలామందికి   'ఈ సారి ఏమైనా సరే నేను కూడా ఉపవాసం ఉంటాను....., ఈ సారి ఎలాగైనా సరే ఉపవాసం ఉండి తీరాలి' అని అనిపిస్తుంటుంది. అవునా? పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి భోజనం చేస్తారు. కాని చాలామందికి ఉపవాసం అనగానే "నీరసం వస్తుందేమో!" "ఉండలేమోమో!'' అని ఉదయం నుండే కంగారుపడి నీరసపడిపోతారు. అలా మీరేమీ కంగారుపడక్కర్లేదు! పాపం ఈ కాలంలో అన్నిటా ఎక్కడ చూసినా కాలుష్యం... కాలుష్యం. దీనికి తోడూ చదువుల, పనుల వత్తిడులు, సుదీర్ఘ పని వేళలు, రాత్రి వేళల్లో కూడా ఆఫీసులు, అకాల భోజనాలు..... అన్నీ ఆరోగ్యం  మీద ప్రభావం చూపి, మధుమేహం, రక్తపోటు థైరాయిడ్ లాంటి సమస్యలు ఎదురై వాటికి మందుల వాడకం తప్పనిసరి అయి, ఉపవాసం సమయంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు. వయసులో పెద్ద వారికి కూడా ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండటం కష్టం అనిపించవచ్చు. మీకు అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురవ్వకుండా మీ 'తెలుగు భోజనం' కొన్ని బలవర్ధకమైన పానీయాలను మీకు తెలియజేస్తుంది. చక్కగా వాటిని తయారు చేసుకుని, సేవించి, నిస్త్ర్రాణాలూ, నీరసాలూ లేకుండా మనసంతా శివకేశవుల మీద లగ్నం చేసుకుని, ఉపవాస పూర్ణ ఫలితాలను పొందండి.   అంతే  కాకుండా కొంతమంది సాయంకాలం పూట భోజనం కాకుండా, కొంచెం తేలికగా వుండే ఉపాహారాలను తీసుకుంటే బాగుంటుందని భావిస్తారు. వారికోసం కూడా 'తెలుగు భోజనం' రెండు మూడు ఉపాహారాలను మీకు అందిస్తోంది.

పానీయాలు: ‘పళ్ళు బాదం పిస్తా పాలు’
ముందుగా ఉపవాస సమయంలో నీరసం అనిపించకుండా భగవంతుని మీద దృష్టి నిలిచేలా పగలు ఒక సారి మీకు ఎక్కువ ఆకలి వేసే సమయం లో ఒక గ్లాస్ పాలల్లో ఒక అరటి పండు ముక్కలుగా చేసి వేసి, రెండు మూడు ఆపిల్ ముక్కలు కాని మీకిష్టమైన మరి ఏ పండైనా కానీ వేసి, దానికి మూడు బాదం పప్పులు, నాలుగైదు పిస్తా పప్పులు, కచ్చాపచ్చాగా కొట్టుకుని, ఒక చెంచాడు తెనేకలుపుకుని త్రాగితే మీకు ఏంతో  శక్తివంతంగా ఉండి, మీ పనులు మీరు చక్కగా చెసుకొగలరు(ఇది మధుమేహులకు కాదండోయి!).

కార్తీక మాసం లో సీతా ఫలాలు ఎక్కువగా దొరుకుతాయి కనుక పాలల్లో సీతాఫలం గుజ్జు వేసుకుని తాగినా చాలా శక్తివంతంగా ఉంటుంది. రుచి కూడా 'అద్భుతః!’

అంతేకాకుండా ఒక గ్లాస్ పాలల్లో రెండు చెంచాల రాగి పిండిని మెత్తగా ఉడకబెట్టుకుని, ఒక చెంచాడు తేనె కాని రెండు చెంచాల పంచదారను కాని కలుపుకుని తాగచ్చు.
ఇంకో పానీయం ఎమిటంటే, ఒక గ్లాసు పాలల్లో [ఆవుపాలు అయితే మరీ మంచిది] కొంచెం బెల్లంపొడి ని వేసుకుని కలుపుకుని, ఒక్క చిటికెడు మిరియాల పొడిని కలుపుకుని తాగితే చాలా  మంచిది. ఉపవాసం వున్నప్పుడు ఏ మాత్రం ఆరోగ్యానికి మంచివి కానీ కాఫీ టీ ల కన్నా ఇలాంటివి సేవించడం చాలా మంచిది!
(పైన చెప్పినవన్నీ మధుమేహులకు కాదు సుమా!)

ఉపాహారాలు:
అలాగే పగలంతా ఏమీ తినకుండా రాత్రి ఒక్క సారిగా భోజనం ఎక్కువగా సేవించడం వలన కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. అలాంటి వారు రాత్రి పూట ఏమైనా తేలికగా జీర్ణం అయే ఉపాహారాలు తీసుకుంటే మంచిది. అలాంటి వాటిలో మొదటిది;

సగ్గుబియ్యం కిచిడీ :
కావలిసిన వస్తువులు: సగ్గుబియ్యం-రెండు గ్లాసులు, వేయించిన వేరుశనగ పొడి-మూడు చెంచాలు, పచ్చిమిరపకాయలు నాలుగు, కరివేపాకు-ఒక రెమ్మ, మినప్పప్పు రెండు చెంచాలు, శనగపప్పు-అరచెంచాడు, ఆవాలు పావు చెంచాడు, జీలకర్ర ఒక పావు చెంచాడు, నూనె పోపువేయించుకోడానికి సరిపడా. ఉప్పు-తగినంత.  

ఒక గంట ముందుగా మీకు కావలిసిన పరిమాణంలో సగ్గు బియ్యం తీసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు మనం రెండు గ్లాసుల సగ్గు బియ్యాన్ని తీసుకుని కిచిడీ ని చేసుకుందాం. పచ్చి మిరపకాయలను సన్నటి ముక్కలుగా తరుగుకోండి.

నానిన సగ్గు బియ్యాన్ని ఒక చిల్లుల పళ్ళెం లో వేసి, నీళ్ళను పూర్తిగా తీసివేయండి. స్టవ్ మీద ఒక దళసరి మూకుడు పెట్టి,  నూనె పోసి, వేడెక్కాక పైన చెప్పిన పోపు దినుసులు వేసుకుని పోపు వేయించుకోండి. పోపు వేగినతర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేయించండి. ఇప్పుడు నానిన తడి సగ్గు బియ్యం వేసి, తగినంత ఉప్పు వేసి, బాగా కలిపి మూత పెట్టి సన్న సెగ మీద పది నిమిషాలు సేపు వుంచండి. మూత తీసి, మూడు చెంచాల వేరుశనగ పప్పు పొడిని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత సగ్గు బియ్యం మెత్తబడ్డాయో  లేదో చూసుకుని  దించేయండి. సగ్గుబియ్యం కిచడీ ఉపాహారం రెడీ!  దీనినే ఇతర రాష్ట్రాల వారు 'సాబూదానా కిచిడీ' అంటారు. ఇది వేడి వేడిగా తింటే ఎక్కువ బాగుంటుంది. ఇది తింటే కడుపు నిండినట్టుగా ఉంటుంది. తొందరగా జీర్ణమవుతుంది.

స్వజ్జ:
కావలిసిన వస్తువులు: సన్నటి బియ్యపు రవ్వ -రెండు గ్లాసులు, నీళ్ళు-నాలుగు గ్లాసులు, ఉప్పు తగినంత. 
ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరగనివ్వండి. మరిగిన తర్వాత ఉప్పు వేసి కలపండి. రవ్వను తీసుకుని, ఉండకట్టకుండా కలుపుతూ, మరుగుతున్న నీళ్ళలో వేయండి. ఒక చెంచాడు నెయ్యి వేసి, కలిపి మూత  పెట్టి, సన్న సెగ మీద రవ్వ వుడికే దాకా వుంచండి. అడుగంటకుండా చూసుకోండి. ఇది అలాగైనా తినవచ్చు లేకపోతె ఏ పచ్చ్హడి తోనైనా తినవచ్చు. కొంతమంది ఉపవాస సమయంలో అన్నం కాకుండా ఏదైనా ఫలహారం తింటూ వుంటారు. అలాంటి వారు ఇది నిస్సంకోచం గా తినవచ్చు. అన్నం భిన్నం అయితే వుపవాసానికి పనికి వస్తుందంటారు. మనం దీనికి బియ్యం వాడినా రవ్వ రూపం లో వాడుతున్నాం కనుక ఉపవాసానికి పనికి వస్తుంది అని పెద్దలు చెపుతారు.

ఈ స్వజ్జ లోనే ఉప్మా  పోపు పెట్టేసుకుంటే ఉప్పిడి పిండి అయి తినడానికి చాలా రుచిగా వుంటుంది. ఇలాగే మన తెలుగు వారికి భోజనానికి ప్రత్యామ్నాయం గా చాలా వుపహారాలు వున్నాయి. వాటి గురించి కూడా సమయం దొరికినప్పుడల్లా 'తెలుగు భోజనం' మీకు అందిస్తూనే ఉంటుంది.