Saturday, October 11, 2014

సాయంకాలం ఉపాహారం: అలరించే ఆనపకాయ వడ



శ్రీమతి రత్నా శ్రీనివాస్

ఆనపకాయ వడ! కొంచెం కొత్తగా వుంది కదూ! మనం బంగాళ దుంప, వంకాయ, ఉల్లిపాయ, అరటికాయలతో బజ్జీలు, పప్పులతో వడలు విన్నాము; ఆనపకాయతో విని వుండరు. ఒకసారి మీరు చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సాయంకాలం కాఫీ, టీ తో పాటు తినటానికి చాల బావుంటుంది. స్కూల్ నుండి తిరిగి వచ్చి, అన్నం తినమని, స్నాక్స్ కావాలని పేచీ పెట్టె పిల్లలకి చేసి పెట్టవచ్చు. ఇది చేయటం తేలికే ఐనప్పటికీ ఎలా చేయాలో ఒక సారి తెలుసుకుందాం!

కావలసిన పదార్దములు:
ఆనపకాయ                                          1 లేదా సగం ముక్కతురిమినది ఒక కప్పు  
కార్న్ ఫ్లోర్                                            1 కప్ 
బియ్యప్పిండి                                         1 టేబుల్ స్పూన్ 
ఎండు మిర్చి /పచ్చి మిర్చి                       5 లేక 6
ఉప్పు                                                  తగినంత 
ఇంగువ                                                సువాసనకు 
కరివేపాకు లేదా కొత్తిమీర                         తురిమినవి కొద్దిగా 
నూనె                                                   వేయించటానికి సరిపడా 

తయారు చేయు విధానం 
ఆనపకాయను శుబ్రంగా కడిగి చెక్కు తీసుకుని ఒక కప్పుకు సరిపడా  తురుముకోవాలి. మిక్సీ లో ఎండుమిర్చిని(లేదా పచ్చిమిర్చి ని) వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, బియ్యప్పిండి, తురిమిన ఆనపకాయ, ఎండు(లేదా పచ్చి)మిర్చి ముద్ద, ఉప్పు, ఇంగువ, కరివేపాకు/కొత్తిమీర  వేసి, కలిసేలాగా కొద్దిగా నీరు పోసి వడ  వేయటానికి వీలుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక పాలితీన్ కవర్ కాని, చిన్న కుట్టుడాకు లేదా బాదం ఆకు, లేదా అలవాటు వుంటే చేతిలో కాని కొద్దిగా నూనె రాసుకుని వడ లాగా చేసుకోవాలి. చిల్లు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన బాండీ  పెట్టి నూనె పోసి వేడెక్కేక  వడలు వేసి వేయించుకోవాలి.  వడలు నంచుకోవటానికి సెనగ చట్నీ లేదా అల్లం, టమేటా చట్నీ, కొత్తిమీర చట్నీ మొదలైనవి అన్ని బాగుంటాయి. ఏమి లేకపోతె కెచప్ తో కూడా తినవచ్చును. 


 






No comments:

Post a Comment