Monday, October 20, 2014

దీపావళి ప్రత్యేక వ్యాసాలు 1: దీపాల మరియు పటాసుల పండుగ – దీపావళి




ముందు మాట:

దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే మన చిన్నతనం లోకి వెళ్లి పోతాము. ఆ సరదాలు, ఆ ఆనందాలు వేరు! కనీసం నెల రోజుల ముందునుండే ఇంట్లో ప్రతి రోజూ పెద్దల, పిల్లల అత్యవసర సమావేశాలు, వేడి వేడి నిర్నయాలు. దేని మీద అంటారా? మతాబాలు ఎన్ని కట్టాలి, చిచ్చు బుడ్లు ఎన్ని కూరాలి, జువ్వలు ఎన్ని కొనాలి, మరి తాటాకు టపాకాయలు, నేల టపాకాయలు (వీటిని ఉల్లిపాయలు అని కూడా అంటారు) ఎన్ని కట్టలు తెచ్చుకోవాలి; భూచక్రాలు, విష్ణు చక్రాలకు అసలు బడ్జెట్ ఉందా? ఇలాంటివే ఎన్నో విషయాలు, చర్చలు, భేదాభిప్రాయాలు!

మరి సిసింద్రీల తయారికి వీది బుడ్డోళ్ళ ప్రత్యేక సమావేశాలు; వాటి గొట్టాలు ఏ కాగితం తో చెయ్యాలి, వాటిలో బొగ్గు, సూరేకారం ఏ పాళ్ళలో ఉంటే బాగా ఎగురుతాయి ఇలాంటి ఎన్నో సాంకేతిక విషయాలు చర్చించుకునే వాళ్ళం. అవసరం బట్టి వీది సీనియర్లని సలహా అడగటం; టీములు గా మారి ఒకళ్ళు జిల్లేడు బొగ్గు తయారీ లోను, కొందరు సిసింద్రీ గొట్టాల తయారీ లోను ఉండే వాళ్ళం. పెద్ద పేట బజారుకు వెళ్లి మతబాలకు కావలసిని గంధకం, సూరేకారం, తగరం తెచ్చుకునే వాళ్ళం. మా అమ్మ గారు, దీపావళికి చక్కటి మైసూరు పాకం తప్పనిసరి గా చేసేవారు. వారం రోజులు ముందు నుండి డాబా మెట్ల పై కూర్చుని ఆకాశం లో ఎన్ని జువ్వలు ఎగురుతున్నాయో లెక్కపెట్టే వాళ్ళం... తలుచుకుంటే ఎన్నెన్నో సంగతులు.

ఇవన్నీ ఒక ఎత్తైతే, మరి పండగ రోజులు రెండు నుండి ఇదు రోజులు వరకు, ప్రాంతానుసారం జరుపుకుంటారు. మరి ఈ ఇదు రోజులు ఏ విధం గా జరుపుకుంటారు; ఏ రోజు కు ఏ ప్రాధాన్యత ఉంది; ఆ రోజు జరప వలసిన కదా కమామిషు ఏమిటి; ఇవన్నీ సవివరం గా మనముందుకు తెస్తున్నారు శ్రీమతి నయన కస్తూరి. లోగడ నవరాత్రికి మనం చదివి, అనందించి, ఆచరించిన విధంగానే, ఇప్పుడు కూడా అందరి సౌలభ్యం కోసం ఈ దీపావళి వ్యాస పరంపర మూడు రోజులు ముందుగానే మొదలు పెడుతున్నాము. 

పాఠకులందరికీ దీపావళి పండుగ శుభా కాంక్షలు.

రమణ బంధకవి

సంపాదకుడు


దీపాల పండుగ దీపావళి

శ్రీమతి నయన కస్తూరి


హిందూ పండుగల లో పిల్లల పండగ గా చెప్పుకో దగ్గది దీపావళి. దీపావళి వెలుగుల పండుగ. ‘దీపావళిఅంటే దీపముల వరుస’. ఈ పర్వదినం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకుంటారు. హిందూ పండగలలో ఉన్న విశిష్టత ఏమిటంటే ప్రతి పండుగ విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని  కలుగజేస్తుంది. ఆధ్యాత్మిక విషయాన్ని అందిస్తూనే ఆనందోత్సవాల వేడుకగా సంబరాన్ని కలుగజేస్తుంది. అంతే కాక దుష్టశక్తి అంతమొందక తప్పదని, మంచిని విజయం వరించక మానదని తెలియజేసి మన వ్యక్తిత్వాన్ని మెరుగు పరుస్తాయి మన పర్వదినాలు.

ఇప్పుడు దీపావళి పండగ వేడుకలు అసలు ఎందుకు, ఎలా మొదలయ్యాయో చూద్దాము! పూర్వం భూదేవి  పుత్రుడైన  నరకాసురుడనే  రక్కసుడు  గర్వాంధకారాలతో  దైవ మానవ గణాలనీ అందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఎవరి వద్దా  తనకు అపజయం  లేదనీ, ఒక్క  తన తల్లి చేతుల్లోనే తనకు మరణం ఉండగలదనే వరం పొంది, అహంకారం తో స్త్రీ లనందరినీ అవమాన పరుస్తూ, అపహరించడం మొదలుపెట్టాడు. బాధితులు శ్రీ మహావిష్ణువు తో మొరపెట్టుకోగా శ్రీ కృష్ణుని అవతారం లో భూదేవి అంశ కలిగిన సత్యభామతో నరకాసురుని అంతమొందించాడు. నరకాసురుడు తన మరణాన్ని ప్రజలంతా వేడుకగా జరుపుకోవాలని కోరడంతో ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చుకుని, దీపావళి పండుగ పేరుతో సంతోషం గా జరుపుకునే ఆచారం వచ్చిందని చెప్తారు.

కొంతమంది రావణాసురుని వధించిన  తర్వాత  శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆనందంగా దీపాలు వెలిగించి, దీపావళి వేడుకను ప్రారంభించారని చెప్తారు. మరికొంతమంది, పాండవులు తమ అజ్ఞాత వనవాసాలు ముగించుకుని తిరిగివచ్చిన సందర్భం లో మొదలు అయింది దీపావళి అని నమ్ముతారు.

ఇక మన తెలుగు వారు  దీపావళి పండగను రెండు రోజులు జరుపుకునే వారు. మొదటి రోజు నరక చతుర్దశి పండగ. ఈ రోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. ఈ రోజు తెల్లవారుజామునే లేచి,  నరకాసురుని బొమ్మని చేసి కాలుస్తారు. వంటికి నువ్వుల నూనె పట్టించుకుని, తలంటుకుని,  వేడి నీళ్ళు, చన్నీళ్ళు  కలిపిన నీళ్ళల్లో ఆముదపు చెట్టు కొమ్మతో కలయ తిప్పి, తలస్నానం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి, తండ్రికి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి, నూనెతో తలంటి, హారతి పడతారు. తండ్రి, అన్నదమ్ములు ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు ఇస్తారు. అందుకే సాధారణంగా ఈ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు.  కొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాకాయలు కాల్చుకుని, మిఠాయిలు తింటారు.  (సశేషం)

  








4 comments: