ముందుమాట:
కార్తీకానికి ఎన్నో పవిత్రమైన ప్రత్యేకతలు. అలాంటి వాటిలో ముందు వరసలో
ఉండేది – కార్తీక ఉపవాసాలు. మనలో చాల మందికి ఉపవాసాలు అంటే కొంత బెరుకు ఉండటం కద్దు!
నాకు తెలిసినవారిలో కొందరు, తరువాతి రోజు ఉపవాసం అంటే, ముందు రోజునుండే దానికి
సన్నాహాలు ప్రారంభిస్తూ ఉండేవారు. రెండు హస్తాల అరటి పండ్లు, అర డజను యాపిల్
పండ్లు, ఇక కమలాలు, సంత్రాలు, వేరుసెనగ గుళ్ళు, అబ్బో ఎన్నో రెడీ చేసుకునే వారు. మాకైతే
పెద్దలు ఉపవాసం చేసే రోజున, ఉప్పిడి పిండో, దిబ్బరొట్టె అథవా సగ్గు బియ్యం పరవాన్నమో
దొరక్క పోదు అన్న ధీమా ఉండేది. కానీ అసలు ఉపవాస ధర్మం ఏమిటి, దానిని ఎలా పాటించాలి,
అందువల్లన ఒనగూడే, అద్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి మొదలైనవి వివరిస్తున్నారు శ్రీమతి
నయన కస్తూరి. ఇక చదువుదామా?
రమణ బంధకవి
సంపాదకుడు
ఉపవాస దీక్ష
---హరిహర రక్ష!
శ్రీమతి నయన కస్తూరి
కార్తీక మాసం లో పట్టే ఉపవాస దీక్ష సకల
పాపాలను హరించి, ఎనలేని పుణ్యాలను ప్రసాదించి, స్వర్గలోక
ప్రవేశాన్ని సులభం చేస్తుంది. అందుకని ఈ మాసం లో హరిహరుల ఆరాధన లో
భాగం గా ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం అంటే మనందరికీ ఒక అపోహ ఉంది. అది ఏమిటంటే,
ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం ఏమీ తీసుకోకుండా, ఆకలి
తెలియకుండా రోజంతా ఎదో విధం గా గడిపి వేయడం అనుకుంటాము. ఏమీ తినకుండా త్రాగకుండా
శరీరాన్ని శుష్కించడం మాత్రమే కాదండోయ్! ఉపవాసానికి
అసలైన అర్ధం దైవానికి దగ్గరగా వసించడం. ఉపవాసం ఉన్న రోజు దైవ ధ్యానం తో గడిపి, దైవ కార్యాలు చేసుకోవడానికి వీలుగా ఆహారం తీసుకోకుండా ఉండటం.
మనం కార్తీక మాసం లో భక్తులు ఏ
విధములైన ఉపవాసములు ఆచరిస్తారో చూద్దాం. కొంతమంది కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు
కార్తీక బహుళ అమావాస్యవరకూ మాసమంతా తల స్నానం చేసి, దీపారాధన
చేసి, పగలంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా, శివాభిషేకాలతో, అర్చనలతో ధ్యానాలతో సత్కాలక్షేపం
చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం తర్వాత ఆహరం భుజిస్తారు. ఈ విధంగా చేయడాన్ని ‘నత్తాలు’ లేక ‘నక్తాలు’
అంటారు. కొంతమంది ఇదే విధం గా కార్తీక సోమవారాలు మాత్రం పగలంతా
అభోజనం గా ఉండి, శివాభిషేకాలు కానీ సత్యనారాయణ స్వామి
వ్రతాలు, అర్చనలు చేసుకుని, సాయంకాలం
నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండి,
మరునాడు ద్వాదశి గడియల్లో భోజనం చేస్తారు. కొంతమంది బంధు మిత్రులతో
కలిసి సామూహిక భోజనాలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి,
సాయంకాలం తులసిమొక్క వద్ద ఉసిరి మొక్కను కూడా పెట్టి, దీపాలతో అలంకరించి, తులసీ దాత్రీ సమేత శ్రీ లక్ష్మీ
నారాయణుడికి పూజ చేసుకుని అప్పుడు భుజిస్తారు. కొంతమంది సాయంకాల వేళలో కూడా అన్నం
తినకుండా ఫలాలను మాత్రమే తీసుకుంటారు.
కోటి సోమ వారం:
మనం పైన చెప్పుకున్న రోజులే కాక ఇంకో
విశేషమైన రోజు ఈ మాసం లో పొదగబడింది. ఆ రోజు చాలా పవిత్రమైనది. ఆ రోజు ఏ దైవకార్యం
చేసినా ఎంతో పుణ్యం మూట కట్టుకోవచ్చు. ప్రత్యేకించి ఉపవాసానికి ఈ రోజు మిక్కిలి
విశిష్టమైనది. మరి 'ఏమా రోజు? ఏమా ప్రత్యేకత?' అని తెలుసుకోవడానికి మీ మనసు తొందరపడుతోంది కదూ? ఇక
గుర్తు పెట్టుకోండి. కార్తీక మాసం లో ఏ రోజైతే శ్రవణా నక్షత్రం వుంటుందో ఆ రోజుని 'కోటి సోమవారం' అంటారు. ఓపిక లేనివారు లేక ఏ ఇతర
కారణాలతోనైనా కార్తీక సోమవారాలు ఉపవాస దీక్ష చేయలేని వారు ఈ 'కోటి సోమవారం' ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం
ఉన్న ఫలితం లభిస్తుంది. ఈ రోజు ఉపవసి స్తే సదాశివుడు భక్తులకు మోక్షదామం
ప్రసాదిస్తాడు. పునర్జన్మ లేకుండా స్వర్గలోక వాసం కల్పిస్తాడు అని పెద్దల ఉవాచ! కార్తీక
మాసం లో ఉపవాస దీక్ష పాటించిన వారు ఎల్లప్పుడూ హరిహరుల రక్షణ లో వుంటారు. కోటి
సోమవారం ఈ కార్తీక మాసంలో 31 వ తేదీ నాడు అనగా శుక్రవారం
వస్తుంది.
కార్తీక మాసం శీతల కాలం లో వస్తుంది. చలి
తీవ్రత ఎక్కువగా వుండి, పగలు సమయం రాత్రి సమయం కన్నా
తక్కువగా ఉంటుంది. అందుచేత శారీరక శ్రమ కూడా తక్కువగా వుండి, అరుగుదల కూడా తక్కువ స్తాయిలో ఉంటుంది. కనుక ఆహారం ఎంత తక్కువ తీసుకుంటే
అంత మంచిది. అందుకని ఉపవాసాల ద్వారా మన జీర్ణ వ్యవస్తను క్రమబద్దం
చేసుకోవచ్చు. అందుచేత మనం చెప్పుకున్న వాటిల్లో
అన్నీ కాకపోయినా, కొన్నిటిని అయినా ఆచరించి, శివ
కేశవులిరువురినీ ఆరాధించి, మనం తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు పరిహరించుకుని, ఎప్పటికీ తరగని
పుణ్య సంపదనే కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా మన స్వంతం చేసుకుందాం!
స్వస్తి!
No comments:
Post a Comment