శ్రీమతి రత్నా శ్రీనివాస్
పెసర పప్పు పప్పుచారు పేరు వినగానే ఎప్పుడో మా
చిన్నతనంలో మా అమ్మ చేసేది కందిపచ్చడిలో నంచుకుని తినటానికి అనటం సహజం. ఈ రోజుల్లో
సాంబారు,రసం ఎక్కువగా వాడుకలో వుండటం వలన మనం
ఈ పెసరపప్పు పప్పు చారును దాదాపుగా మర్చిపోయామనే చెప్పవచ్చును. అమ్మ చేతి వంటని గుర్తుకు తెచ్చే మరో వంటకమే ఈ
పప్పు చారు. మరి దీని కదా కమామీషు ఏమిటో చూద్దామా!
కావలసిన పదార్దములు :
పెసర పప్పు
150 గ్రాములు
ఉల్లిపాయలు
పెద్దవి 6
పచ్చిమిర్చి
2
చింతపండు
30 గ్రాములు
ఉప్పు
తగినంత
పసుపు
చిటికెడు
పోపుకు కావలసిన పదార్దములు:
నూనె
2 టేబుల్ స్పూన్స్
ఎండు మిర్చి
2
ఆవాలు,జీలకర్ర,
మెంతులు
చెరొక టీస్పూన్
ఇంగువ
1/2 టీస్పూన్
కరివేపాకు రెబ్బలు
4-5
తయారు చేయు విధానము:
ముందుగా పెసరపప్పుని శుభ్రంగా నీటిలో కడిగి ప్రక్కన
పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పొర తీసి శుభ్రంగా కడుక్కుని ఒక్క పాయని నాలుగు అర్ధ
భాగాలుగా చేసుకోవాలి. ముక్కలు కొంచెం పెద్దవిగానే వుండాలి. పచ్చిమిర్చిని రెండు తుంపులుగా
చేసుకోవచ్చు, లేదా నిలువుగా చీల్చవచ్చు.
ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక టేబుల్
స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కేక ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి
వేయించుకోవాలి. పచ్చి తనం పోయి కొంచెం వేగేక స్టవ్ ఆపుచేసుకోవాలి.
ఇప్పుడు కడిగి ప్రక్కన పెట్టిన పెసర పప్పుని ఒక గిన్నెలోకి
తీసుకుని తగినంత నీరు పోసి అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు
వేసి ప్రెజర్ పాన్ లో పెట్టి స్టవ్
మీద పెట్టుకోవాలి. ఈ లోగా చింతపండుని శుబ్రంగా కడిగి ఒక కప్పులో తగినంత నీరు
పోసి నాన పెట్టుకోండి.
ఇప్పుడు కుక్కర్ మొదటి విజిల్ రాగానే తగ్గించి ఐదు నిమిషాలు
చిన్నమంట మీదనే వుంచి రెండవ విజిల్ వచ్చేక స్టవ్ ఆపేసుకోవాలి. ప్రెజర్ విడుదల అయ్యేలోగా పోపుకి ఒక చిన్న బాండీ
పెట్టుకుని వేడెక్కేక మొదట మెంతులు వేసి కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి. తరువాత పైన చెప్పిన పోపు దినుసులు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు
వేసి పోపు పెట్టుకోవాలి.
ఇపుడు ప్రెజర్ విడుదలైందేమో చూసుకుని పెసరపప్పు గిన్నెను
బైటకి తీసి ,ఒక గుండ్ర గరిటెతో పప్పుని కలియబెట్టి, దానిలో
తగినంత నీరు పోసి, ఉప్పు వేసి, వేయించుకున్న
పోపును అందులో కలిపి తిరిగి గిన్నెను స్టవ్ పైన చిన్న మంటమీద పెట్టుకోవాలి. తరువాత నానబెట్టిన
చింత పండుని పిసికి ఆ గుజ్జును
మరుగుతున్న పప్పు చారులో వేసి గరిటెతో తిప్పుకోవాలి. కొంచెం సేపు స్టవ్
మీదనే పప్పు చారుని మరగనిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి.
ఘుమఘుమలాడే పెసరపప్పు చారు తయారైపోయినట్లే!
దీనిని అన్నంలోకి ఆధరువుగానే కాకుండా కందిపొడి, కందిపచ్చడిలో కూడా నంచుకుంటే చాల రుచిగా
వుంటుంది.
అన్నంలో వేడి వేడి పప్పు చారుతో పాటు పిండి వడియాలు, లేదా గుమ్మడికాయ వడియాల తో తింటే ఆ అనుభూతే
వేరు!
No comments:
Post a Comment