ముందుమాట:
పాఠకులందరూ శరన్నవరాత్రులు అత్యంత
భక్తిశ్రద్ధలతో తమతమ విభవము కొలది పరమేశ్వరిని కొలుచుకుని, ఆనందోత్సాహాలతో
బంధుమిత్రులతో కలిసి జరుపుకున్నందుకు ‘తెలుగు భోజనం’ అభినందనలు అందజేస్తోంది.
పవిత్రమైన దేవీనవరాత్రుల సందర్భంగా
మనం కొలుచుకున్న అవతార రూపాలను పరిశీలిస్తే మనకు ఒక విషయం తేటతెల్లమవుతుంది.
జీవకోటికి శోక, దుఃఖ, ఆర్తులను దూరం చేసి, సుఖ, మోక్ష హర్షాలను కలుగజేసే శక్తి స్వరూపిణి పేరే భగవతి. అమ్మవారు ప్రతి ప్రాణి లోని శోభాయమాన గుణంలో
వసిస్తుంది. శోభాయమానం అంటే కంటికి కనిపించే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు.
అంతర్లీనమైన పరిపూర్ణమైన వ్యక్తిత్వం! ఆంగ్లం లో ఒక రచయత అన్నట్లుగా ‘హ్యాండ్ సం ఈజ్ దట్ హేండ్ సం డత్’ శోభాయమానం అంటే
సుకర్మలు చేసే నైజం! అదియే అమ్మ వారి నివాసమైన మణి ద్వీపం!
అమ్మవారి వివిధ అలంకారాలు, నివేదనలు గురించి
ఈ పది రోజులు, అప్రతిహతంగ తమ వివరణాత్మకమైన వ్యాస పరంపర లో శ్రీమతి నయన కస్తూరి, అమ్మవారి
వివిధ రూప వైశిష్ట్యాన్ని మనముందు ఆవిష్కరించారు. అంతేకాక శ్రీమతి పద్మ రఘునాద్ శాకంబరి మాత గురించి, తమ ప్రత్యేక వ్యాసం తో ఈ పరంపరకు మరింత శోభ చేకూర్చారు. ఈ ముగింపు వ్యాసం లో కొస మెరుపు
లాగా శ్రీమతి నయన మరి కొన్ని విశేషాలు మన ముందుకు తెచ్చి ఈ వ్యాస పరంపరకు సరియైన మక్తాయింపు
ఇస్తున్నారు. వారందరికి 'తెలుగు భోజనం' తరఫున ధన్యవాదాలు!
దసరా వేడుకలు నేటితో ముగిస్తాయి.
పాఠకులు ఈ శీర్షికను విశేషంగా ఆదరించారు. అందరికి
హృదయ పూర్వక వందనాలు. మళ్ళీ ఇంకొక పర్వదిన సమయం లో మరి యొక వ్యాస పరంపర మీ
ముందుకు తెస్తాము. ఈ లోగా విభిన్నమైన విశేషాలతో ‘తెలుగు భోజనం’ నిత్యం మిమ్ములను అలరిస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు! లోకా సమస్తా
సుఖినో భవంతు!
రమణ బంధకవి
సంపాదకుడు
విజయోత్సాహాల విజయదశమి
!
శ్రీమతి నయన
కస్తూరి
ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి దశమి వరకు
వరుసగా దేవీ ఆరాధనలు, సామూహిక పూజలు, వ్రతాలూ ఆచరించడం,
వాయనాలు ఇచ్చి పుచ్చుకోవడాలు, కానుకలు
ఇచ్చుకోవడాలు, ఇళ్ళను శుభ్రపరుచుకుని అలంకరించు కోవడాలు,
బంధుమిత్రులను కలుసుకోవడాలు, బాల పూజలు,
సువాసినీ పూజలు, రకరకాల వంటకాలను అమ్మవారి
నివేదన కొరకు తెలుసుకుని, తయారు చేసి వంట నైపుణ్యాన్ని
పెంచుకోవటం, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయుట,
వాటిలో పాల్గొనుట,.....లాంటి కార్యక్రమాల వలన మనకు
తెలియకుండానే ఎన్నో విషయాలను నేర్చుకుంటాము. మన పండగలు మనకు తెలియకుండానే ఎన్నో
శిక్షణా తరగతులను నడుపుతాయి. క్రమశిక్షణ ను నేర్పుతాయి. దసరా కానుకలు కూడా
ప్రోత్సాహకారకాలు గా వుండి, పని వారి నైపుణ్యాన్ని
పెంచి, యాజమాన్యం-కార్మికుల మధ్య సత్సంబంధాలు పెంచుతాయి.
పిల్లల్లో పెద్దల్లో ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. స్తోత్రాలు పారాయణం చేయడం వలన వాక్ శక్తి
పెంపొంది, వాక్ శుద్ధి కలుగుతుంది. ఇలా శ్రీ దుర్గా దేవి పూజ
మన దుర్గతులను రూపుమాపడమే కాకుండా మనలోని దుర్గుణాలను కూడా దూరం చేస్తుంది.
శరన్నవరాత్రులలో సకల సుగుణాల రాసి అయిన
జగన్మాతను ఆరాధించడం ద్వారా మనవ జాతి ఆ గుణాలు కొంతలో కొంతవరకైనా తమలో
పెంపొందించుకునే అవకాశం వుంది. స్త్రీ లో ఉన్న శక్తి అనంతమైనది. దానిని బహిర్గతం
చేసుకుని, ఆచరణలో పెట్టడానికి ఆదిపరాశక్తి ఆరాధన ఎంతో ప్రేరణ
కలుగజేస్తుంది. నిద్రపోతున్న శక్తిని జాగృతం చేస్తుంది. విశ్వశాంతికే తోడ్పడ కలిగే
శక్తి స్త్రీ జాతిలో వుంది. కనుక స్త్రీ పూజనీయం. ఎక్కడ స్త్రీ
పూజింపబడుతుందో అక్కడ అంతా సస్యశ్యామలం! అంతా అష్టైశ్వరయం!
అంతా శోభాయమానం! ఇక మనం అమ్మ వారి ఒక్కొక్క
అవతారం లోని విశిష్టతను చూద్దాము.
ప్రధమ అవతారమైన స్వర్ణకవచాలంకృతా దేవీ
నుండి, ప్రతి మానవుడు తన కుటుంబాన్ని, సమాజాన్ని
రక్షించే బాధ్యతను విస్మరించరాదు అని తెలుస్తుంది. బాలా త్రిపురసుందరీ దేవి లోని
నిర్మలత్వం, అన్నపూర్ణాదేవి లోని మాతృత్వం, గాయత్రీ దేవిలోని తేజోవంతమైన బుద్ధి, శ్రీ లలితా
త్రిపురసుందరీ దేవిలోని లాలిత్యం, శ్రీ మహాలక్ష్మీ దేవి లోని
కళా సంపద, శ్రీ సరస్వతీ దేవిలోని విద్యాబుద్దులు,
దుర్గాదేవి లోని దుర్గుణాలను ఎదిరించి, కష్టాలను
ఎదుర్కునే ధైర్యము, మహిశాసురమర్దినీ దేవిలోని దుష్ట శిక్షణ
-శిష్ట రక్షణ గావించే ధైర్యము, నిత్యమూ అన్యాయాన్ని
ఎదురించి, న్యాయాన్ని సమర్ధించే సుగుణం, చివరగా శ్రీ రాజరాజేశ్వరీ దేవిలోని ప్రసన్నత............... ఇలా ఎన్నో
గుణాల మేలికలయకే పరిపూర్ణ వ్యక్తిత్వం!
ప్రతీ స్త్రీ ఒక దేవతా మూర్తిగా ఎదిగి, తన
ఇంటిని స్వర్గ సీమ చేసుకోవడానికి ఈ పండగ చాలా దోహదం చేస్తుంది. ప్రతీ పురుషుడు
దానికి తన చేయి అందిస్తాడు. కనుక మనమందరమూ ప్రతి ఏడు, ఈ నవరాత్రి పండుగను
భక్తి శ్రద్దలతో జరుపుకుని, మన జీవితాలను అర్థవంతం చేసుకుందాము.
స్వస్తి!
No comments:
Post a Comment