Saturday, August 30, 2014

మన సంప్రదాయాలు! ‘ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!’


ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!’

శ్రీమతి పద్మా రఘునాద్

పార్ట్ 2

ఇదే సంస్కృతి మన భారత దేశం లో అణువణువునా నిండిపోయి ఉందని గట్టిగా చెప్పచ్చు. అందునా మన తెలుగువారు పెట్టుపోతలకు ఏ మాత్రం వెనుకంజ వేయరనే తెలుస్తుంది. అయితే పెట్టేటపుడు, మనం అవతల వారికి ఏదో తక్కువ ఉందని ఇస్తున్నామని, దానితో వారి అవసరాలు అన్ని గడచి పోతాయని ఉద్దేశం మనస్సులోకి రాకుండా ఇస్తే మంచిది. అలాగే కొన్ని సాంప్రదాయాలు పాటించ వలసి వచ్చునపుడు, మనం ఇవ్వకపోయినా వాళ్ళకేమి లోటు లేదు, ఇవ్వటం అనవసరం, దండుగ అని మాత్రం అనుకుని సాంప్రదాయాన్ని దాటవేసే నెపాన్ని మాత్రం దగ్గరకు రానివ్వకుండగా చుసుకొవాలి. మనం ఇచ్చేటపుడు ఎంత గౌరవం, సంతోషం కనబరుస్తామో, పుచ్చుకునే టపుడు వారు కూడా అంతే సంతోషం, గౌరవం కనపరచే అవకాశం ఉన్నది. మనం పెట్టేది మన సంస్కారాని తెలిపితే,  వారు పుచ్చుకునే విధానం వారి సంస్కారం తెలుపుతుంది సుమండీ!

బంధుమిత్రుల రాకపోకలు, సాంప్రదాయాలు, పెట్టు పోతలు, ఇచ్చి పుచ్చుకోవటాలు అన్ని సక్రమగా పాటించిన ఇళ్ళల్లో పెరిగే పిల్లలు కూడా చాల సులభంగా ఈ సంస్కారాలన్ని ఎవరూ కూర్చోపెట్టి నేర్పకుండగానే సులభంగా  నేర్చుకునే అవకాశం ఉంటుంది. మన సంస్కారాలు భావితరాలకి అందజేసి అవి కొన సాగేలాగా చేసే సాధనాలు మన పిల్లలు, సంతానమని అని ఒక మహానుభావుడు చెప్పిన మాట ఎంతో నిజమనిపిస్తుంది. 

ఈ ఇచ్చి పుచ్చుకునే ఆచార వ్యవహారాలని గమనించినట్లయితే, మన సంస్కృతి మనకు వీలయినంతలో ఎపుడూ అందరికి ఏదో సందర్భం లో ఇవ్వమనే చెప్తుంది. అవి పండగలు, పబ్బాలు కానివ్వండి, వేడుకలు శుభకార్యాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు పేరంటాలు కానివ్వండి, నోములు వ్రతాలు కానివ్వండి, పూజలు పునస్కారాలు కూడా కానివ్వండి. ఇలాంటి ఏ సందర్భమయినా తమ తృప్తిఆనందం వ్యక్తీకరించటానికి ఈ కానుకలను ఇవ్వటం అనే ఆచారం అలవాటుగా వస్తోంది.

ఈ "ఇవ్వటం"మన బంధు మిత్ర వర్గానికి మాత్రమే పరిమితం కాకుండగా అవసరం లో ఉన్నవారిని ఆదుకోవటానికి, కష్టాలలో ఉన్నవారికి చేయూత అందించటానికి, నిస్సహాయులకు సహాయరూపంలో, మన శక్తి కొలది అందజేయటం కరుణ తో కూడిన దాన, ధర్మ గుణం గా పిలువబడుతోంది. 

ఈ గుణాలకి  ఇచ్చిన ప్రాముఖ్యత చూస్తుంటే, ఇచ్చే వారికి మాత్రమే పుచ్చుకునే అర్హత కూడా వస్తుందని చెప్పకనే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ జన్మ లో ఇచ్చిన దాన ధర్మాల అనుగుణం గానే మరు జన్మలు వస్తాయని మన సనాతన  ధర్మం చెప్తోంది. అందుకనే  ' పెట్టి పుట్టారు' దేనికైనా "పెట్టి పుట్టాలి" అనే వాడుక పదాలని అడపా దడపా మనం వింటూనే ఉంటాము. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, పెట్టేటపుడు అటు శక్తి కి మించి పెట్టరాదు; అలాగే శక్తి ఉన్నా కూడా లోభం చుపించరాదని  పెద్దలు మనల్ని హెచ్చరిస్తారు కూడా. 


మొత్తానికి ఈ ‘ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!’ లో ఎన్ని మర్మాలున్నాయో తెలుసుకున్నాం కదా! ఇక మనం ఈ సంప్రదాయాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, మన తరువాతి తరాలకు కూడా అందించుదాం!





Friday, August 29, 2014

మన సంప్రదాయాలు!


ముందు మాట:

‘ఇచ్చి పుచ్చుకోవటాలు’ అనాదిగా  మన సంప్రదాయంలో కొనసాగుతున్నాయి. పండగలు 

పబ్బాలు, వ్రతాలూ నోములు, ఏమైనా కానివ్వండి; ఇవ్వటం, పుచ్చుకోవటం మనం చూస్తూనే, 

చేస్తూనే ఉంటాము. ఇలాంటి సందర్భాలలో మనం తరుచు వినేది ‘ఇస్తినమ్మా వాయనం

పుచ్చుకుంటి నమ్మ వాయనం!’ దీని ప్రాముఖ్యత గురించి, దీని అంతరార్ధం గురించి, అది 

రాబోయే తరాలకు ఎలా మార్గదర్శనం చేస్తుందో చాల విపులంగా వివరించారు శ్రీమతి పద్మ గారు. 

ఇక చదువుదామా?


రమణ బంధకవి

సంపాదకుడు



'ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!'

శ్రీమతి పద్మా రఘునాద్

మన తెలుగు నాట, ప్రత్యేకించి దక్షిణాయనం లో శ్రావణ మాసం నుండి నోముల, వ్రతాల రద్దీ మొదలవుతుందని చెప్పాలి. ఆ రోజుల్లో పేరంటాల సందడులు, శనగలు, అరటి పండ్లు, తాంబులాల హడావుడిలు  దాదాపు అందరిళ్ళ లోను కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. వీటి లో ముఖ్యంగా చెవిన  పడేది "ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!" అంటే వాయనాలు, తాంబూలాలు ఇవ్వటం, పుచ్చుకోవటం అన్నమాట. ఈ ఆచారం అనాదిగా మన సంస్కృతిలో జీర్ణించుకుని పోయింది. ఇది ఒక అందమైన ఆనందమైన ఆచార వ్యవహారం గా చెప్పుకోవచ్చును మనం. 

ఎందుకంటే, ఏదైనా వస్తువు ఇవ్వటం లో ఉన్న సంతోషం, అది పుచ్చుకున్నపుడు కూడా రెట్టింపు అవుతుంది. నోములు, వ్రతాల సమయాలలో, ముందు రోజు నానపెట్టిన శనగలు, తమలపాకులు, వక్కపొడి, పసుపు, కుంకుమ, పండ్లు, వీలయితే ఒక రవికెల గుడ్డ (ఇది వస్త్రంతో సమానం అన్నమాట!) కొంచెం చిల్లర దక్షిణగా పెట్టి ఇవ్వటం సాంప్రదాయం గా వస్తోంది. 

ఈ దక్షిణ కూడా ఇవ్వటం వలన తాంబూలం లో  ఏదైనా లోపిస్తే ఆ లోటు భర్తీ చేస్తుందని పెద్దలు చెప్తారు. అలాగే మనింట్లో పూజలు పునస్కారాలు, వ్రతాలు చేయించిన  పురోహితులకు కూడా దక్షిణ తాంబూలాదులు  మన శక్తి కొలది ఇవ్వాలని కూడా చెప్తారు ఎందుకంటే దక్షిణ సమర్పించనదే ఏ  విద్య కాని, పూజ కాని సఫలికృతం కాదని; అందుకని దక్షిణ తప్పక సమర్పించమని చెప్తారు. 

ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు మనకు పురాణ కాలం నుండి కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని పురాణాలలో అపుడపుడు ఈ ప్రశక్తులు కూడా ఉన్నట్లు పెద్దవారు చెప్తుంటారు. 
శ్రీ రామాయణం లో సీతా మహాతల్లి శ్రీరామచంద్ర మూర్తితో అరుంధతి, అనసూయల కుటీరానికి విచ్చేసినపుడు వారిని పసుపు కుంకుమలుదివ్య వస్త్రాలతో సత్కరించి తమ అభిమానాన్ని చూపించారని తెలుస్తోంది. 

కనుక ఎవరైనా అతిధులు, పెద్దవారు మన ఇంటికి వచ్చినపుడు వారికి తగు మర్యాదలు సలిపి, భోజనం తో పాటుగా వస్త్ర, తాంబూలాల తో సత్కరించటం, వారి మీద మనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ప్రకటించినట్లే అని చెప్తారు. అలాగే చిన్నవారు వచ్చినపుడు వారికి  మనకు వీలయినంత లో వస్త్రాలు లేదా కానుకలు ఇవ్వటం కుడా మన ఆశీర్వాదాలు అందజేసినట్లే అని చెప్తారు. 

ఇక ఇంటి ఆడపడచులు, అక్కచెల్లెళ్ళ కి ఎల్లపుడు ఆ కుటుంబం లో ప్రత్యేక స్థానమే. వారు వస్తే తప్పక పసుపు కుంకుమ, చనివిడి లతో పాటుగా తాంబూలాది వస్త్రాలను సమర్పించటం ఆ కుటుంబం యొక్క ఆప్యాయత, భాంధవ్యాలను ప్రకటించేది గా చెప్పబడుతుంది. ఇలాగే కూతుళ్ళు అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు,  అత్తలు, మామయ్యలు, పిన్నులు బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఇలా రకరకాల భాంధవ్యాలతో నిండి పోయిన మన కుటుంబ వ్యవస్థ,  ప్రపంచం మొత్తం లోనే చాల గుర్తింపు తెచ్చుకుందని అందరికి తెలిసిన విషయమే!   (సశేషం)







Thursday, August 28, 2014

మోదక హస్తా గణనాధా ! కుడుముల తండ్రీ గణనాధా!


ముందు మాట!

సాధారణం గా మనం ఏ దేవతలనైనా ప్రసన్నం చేసుకోవాలంటే, భక్తి శ్రద్ధలతో పూజించటమే కాక, ఆ దేవత కు ప్రీతి పాత్రమైన చక్కటి నైవేద్యం కూడా సమర్పించుకుంటాము. ప్రసాదం లేకుండా పూజలు జరగవంటే నమ్మండి. మరి ప్రసాదానికి ఉన్నప్రాముఖ్యత అది. అవి చేయటానికి  శక్తి లోపం లేకుండా చక్కటి దినుసులను వాడి రుచికరం గా సువాసనా భరితం గా చేసుకుంటాం. మరి శ్రీ గణనాధునికి ప్రియమైనవి ఏమిటో మన అందరకు తెలిసినదే! అవే ఉండ్రాళ్ళు లేదా కుడుములు మరియు మోదకాలు.  మరి వీటి తయారీ గురించి శ్రీమతి పద్మ గారు ఏం చెప్తున్నారో చూద్దామా?


రమణ  బంధకవి

సంపాదకుడు




మోదక హస్తా గణనాధా !  కుడుముల తండ్రీ గణనాధా!

శ్రీమతి పద్మా రఘునాద్

భాద్ర పద మాసం లో వచ్చే అతి ముఖ్య మైన పండుగ, పిల్లలు, పెద్దలు, ఆడవారు, మగ వారు సంతోషంగా అందరూ కలసి జరుపుకునే అతి ప్రియమైన పండుగ, మన వినాయక చవితి పండుగ. ఈ పర్వ దినాన మనం అందరం ప్రీతి పాత్రంగా కొలుచుకునే  దైవం మన గణ నాధుడు. 

కేవలం తెలుగు వారికే కాకుండగా, హిందువులు అందరకు కూడా గణపతి ప్రధమ దైవంమనం  పని ప్రారంభించాలన్నా శుభాకార్యానికైనాఏ పండుగ  పూజలో  నైనా  వ్రతాలు  తలపెట్టినాముందుగా పూజించి ఆయన అనుగ్రహం సంపాదించిన తరువాతనే ఏ పని అయినా  ప్రారంభిస్తాముఆయన ఆశీర్వాదముతోనే  మనకి  తలపెట్టిన పనులు  సవ్యంగా  అవుతాయి, విజయాలు లభిస్తాయివిద్యార్ధులు కూడా తప్పక పుజించాల్సిన దైవం  మన గణపతి

పాలవెల్లిని  రక రకాల కూరగాయలు, పండ్లు, మొక్క జొన్న పొత్తులతో అలంకరించి, మట్టి వినాయక ప్రతిమను పెట్టుకుని, రక రకాల పత్రి తో  పుజించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. దేశ మంతట గణపతిని తొమ్మిది రోజులు శ్రద్ధ భక్తిలతో పూజించి పదవ రోజున శాస్త్రీయమైన పధ్ధతిలో నిమజ్జనం జరపటం కూడా మన సాంప్రదాయం గా చెప్పబడుతోంది. 

ఉండ్రాళ్ళు, మోదకాలు, అటుకులు, వడపప్పు, పానకం, చెరకు ముక్కలు, బెల్లం, చనివిడి మొదలైనవి నైవేద్యం గా గణపతికి సమర్పిస్తారు. మరి ఈ వినాయక చవితి పండుగ రోజు చేసే నైవేద్యాలలో అతి ముఖ్య మైన ప్రసాదం ఉండ్రాళ్ళు, మోదకాలు.  మరి వీటిని తయారు చేసే విధానం తెలుసుకుందామా?

ఉండ్రాళ్ళు:
వీటినే కుడుములు అని కూడా కొందరు పిలుస్తారు. 

కావలసిన వస్తువులు:
బియ్యపు నూక: 1కప్పు
శనగపప్పు : పావు కప్పు
జీలకర్ర: ½ స్పూను,  ఉప్పు: ½ స్పూన్ లేదా తగినంత.

తయారు చేయు విధానం: 
బియ్యాన్ని మొదట మిక్సీ లో వేసి నూక లాగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ నూక లో ఒకటిన్నర కప్పులు నీరు పోసికడిగిన శనగపప్పును, జీలకర్ర, ఉప్పు కూడా కలిపి కుక్కర్ లో పెట్టాలి. మూడు లేదా నాలుగు విజిల్సు వచ్చాక ఆపుచేసి స్టీమ్ పోయాక బైటకు తీసి వుడికిందో లేదో చూసి చల్లారాక ఉండ్రాయి పిండి మీద నేయి కూడా వేసిబాగా కలిపిచేతికి మధ్య మధ్య తడి చేసుకుంటూ పిండిని చిన్న చిన్న ఉండలుగా గుండ్రంగా చేయాలి. ఒక వెడల్పు పళ్ళెం లో ఒకదాని పక్కన ఒకటి పెడితే అంటుకోకుండగా ఉంటాయి. ఇప్పుడు ఉండ్రాళ్ళు తయార్!

చక్కగా ఉండ్రాళ్ళను గణపతికి నైవేద్యం పెట్టుకుని ప్రసాదంగా తినవచ్చును. కొంచెం నేయి వేసుకున్నఉండ్రాళ్ళ లోకి నంచుకోటానికి కారప్పొడి కాని, అల్లం పచ్చడి కాని చాల బాగుంటుంది.




మోదకాలు:
కొబ్బరి,బెల్లం, బియ్యం పిండి తో చేసే ఈ నైవేద్యం కూడా గణపతికి చాలా ప్రీతికరమైన నివేదన గా పెద్దలు చెప్తారు. 

కావలసిన వస్తువులు:
బియ్యంపిండి : 1 కప్పు
కొబ్బరి తురుము : 1 కప్పు
బెల్లం : 100 గ్రాములు
నూనె : 1 టేబుల్ స్పూన్
నీరు : ½ కప్పు 

తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరి కోరుని ఒక మూకుడు లో స్టవ్ మీద సిమ్ లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని తురుము చేసి అదికూడా కొబ్బరి కోరు తో కలిపి 10 నిమిషాలు లేదా అది గట్టి పడే వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి.

బెల్లం లోంచి పాకం వచ్చాక గట్టి పడి కొబ్బరి లౌజు గా తయారు అవుతుందిఅది చల్లారాక 
చేతికి కొంచెం నేయి కానీ నూనె కానినీళ్ళతో కాని తడి చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేయాలి. 

ఇంకో గిన్నె లో ఒకటిన్నర గ్లాసు నీరు స్టవ్ మీద పెట్టి, అవి మరిగాక ఒక గ్లాసు బియ్యం పిండిని  వేసి మంట తగ్గించి బాగా కలుపుతూ ఉండాలి. దానిలో ఒక స్పూన్ నూనె కూడా వేసి కలపాలి. చాల కొద్దిగా ఉప్పు వేసీ వేయనట్లుగా వేయాలి. లేక పోయినా పరవాలెదు. బియ్యపుపిండి గట్టిగా ముద్దలాగా అయిపోతుంది

స్టవ్ మీద నుండి దింపి వేసి చల్లారాక తర్వాత బియ్యపు పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుకొబ్బరి వుండలకన్నా కొంచెం పెద్దవి చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక పిండి ఉండను తీసుకుని కొంచెం పలుచగా నొక్కి దానిలో కొబ్బరి ఉండను పెట్టి అన్ని పక్కల కవర్ చేసి చేతి కి కొంచమే నూనె రాసుకుంటూ మోదకం షేప్ లో(వెల్లుల్లి పాయ రూపం లో) వచ్చేలాగ చేతితో దానిని మలచాలి. ఇప్పుడు బజారు లో మోదకాలు మంచి ఆకారం లో  వచ్చేలాగ సహాయపడే మూసలు కూడా అమ్ముతున్నారు. వాటిని వాడితే చక్కటి ఆకృతి వస్తాయి.

అలా అన్ని పిండి వుండలలోనుకొబ్బరి ఉండలు పెట్టి మోదకాల షేప్ లో చేసుకుని పెట్టుకొవాలితర్వాత వీటిని ఒక గిన్నెలో పరచి ఒకదానిపక్కన ఒకటి పేర్చి కుక్కర్ లో వెయిట్ లేకుండగా పెట్టి ఇడ్లీని చేసినట్లు స్టీమ్ చెయాలి. ఇప్పుడు మొదకాలు తయార్! 

కేవలం వినాయక చవితి రోజు  మాత్రమే కాకుండగా, ఏ చవితి తిధి రోజు నయినా  మనం ఉండ్రాళ్ళు, మోదకాలు వినాయకునికి సమర్పించటం చాలా శ్రేష్టం అని పెద్దలు చెప్తారు.

మరి వీటిని చేసే విధానం నేర్చుకున్నాము కనుక,  చవితి పండుగ రోజున ఈ ప్రసాదాలు శ్రద్ధగా చేసి గణపతికి భక్తితో సమర్పించుకుని ఆయన కృపకు పాత్రులము అవుదామా?