Friday, August 29, 2014

మన సంప్రదాయాలు!


ముందు మాట:

‘ఇచ్చి పుచ్చుకోవటాలు’ అనాదిగా  మన సంప్రదాయంలో కొనసాగుతున్నాయి. పండగలు 

పబ్బాలు, వ్రతాలూ నోములు, ఏమైనా కానివ్వండి; ఇవ్వటం, పుచ్చుకోవటం మనం చూస్తూనే, 

చేస్తూనే ఉంటాము. ఇలాంటి సందర్భాలలో మనం తరుచు వినేది ‘ఇస్తినమ్మా వాయనం

పుచ్చుకుంటి నమ్మ వాయనం!’ దీని ప్రాముఖ్యత గురించి, దీని అంతరార్ధం గురించి, అది 

రాబోయే తరాలకు ఎలా మార్గదర్శనం చేస్తుందో చాల విపులంగా వివరించారు శ్రీమతి పద్మ గారు. 

ఇక చదువుదామా?


రమణ బంధకవి

సంపాదకుడు



'ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!'

శ్రీమతి పద్మా రఘునాద్

మన తెలుగు నాట, ప్రత్యేకించి దక్షిణాయనం లో శ్రావణ మాసం నుండి నోముల, వ్రతాల రద్దీ మొదలవుతుందని చెప్పాలి. ఆ రోజుల్లో పేరంటాల సందడులు, శనగలు, అరటి పండ్లు, తాంబులాల హడావుడిలు  దాదాపు అందరిళ్ళ లోను కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. వీటి లో ముఖ్యంగా చెవిన  పడేది "ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటి నమ్మ వాయనం!" అంటే వాయనాలు, తాంబూలాలు ఇవ్వటం, పుచ్చుకోవటం అన్నమాట. ఈ ఆచారం అనాదిగా మన సంస్కృతిలో జీర్ణించుకుని పోయింది. ఇది ఒక అందమైన ఆనందమైన ఆచార వ్యవహారం గా చెప్పుకోవచ్చును మనం. 

ఎందుకంటే, ఏదైనా వస్తువు ఇవ్వటం లో ఉన్న సంతోషం, అది పుచ్చుకున్నపుడు కూడా రెట్టింపు అవుతుంది. నోములు, వ్రతాల సమయాలలో, ముందు రోజు నానపెట్టిన శనగలు, తమలపాకులు, వక్కపొడి, పసుపు, కుంకుమ, పండ్లు, వీలయితే ఒక రవికెల గుడ్డ (ఇది వస్త్రంతో సమానం అన్నమాట!) కొంచెం చిల్లర దక్షిణగా పెట్టి ఇవ్వటం సాంప్రదాయం గా వస్తోంది. 

ఈ దక్షిణ కూడా ఇవ్వటం వలన తాంబూలం లో  ఏదైనా లోపిస్తే ఆ లోటు భర్తీ చేస్తుందని పెద్దలు చెప్తారు. అలాగే మనింట్లో పూజలు పునస్కారాలు, వ్రతాలు చేయించిన  పురోహితులకు కూడా దక్షిణ తాంబూలాదులు  మన శక్తి కొలది ఇవ్వాలని కూడా చెప్తారు ఎందుకంటే దక్షిణ సమర్పించనదే ఏ  విద్య కాని, పూజ కాని సఫలికృతం కాదని; అందుకని దక్షిణ తప్పక సమర్పించమని చెప్తారు. 

ఈ ఇచ్చి పుచ్చుకోవటాలు మనకు పురాణ కాలం నుండి కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని కొన్ని పురాణాలలో అపుడపుడు ఈ ప్రశక్తులు కూడా ఉన్నట్లు పెద్దవారు చెప్తుంటారు. 
శ్రీ రామాయణం లో సీతా మహాతల్లి శ్రీరామచంద్ర మూర్తితో అరుంధతి, అనసూయల కుటీరానికి విచ్చేసినపుడు వారిని పసుపు కుంకుమలుదివ్య వస్త్రాలతో సత్కరించి తమ అభిమానాన్ని చూపించారని తెలుస్తోంది. 

కనుక ఎవరైనా అతిధులు, పెద్దవారు మన ఇంటికి వచ్చినపుడు వారికి తగు మర్యాదలు సలిపి, భోజనం తో పాటుగా వస్త్ర, తాంబూలాల తో సత్కరించటం, వారి మీద మనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని ప్రకటించినట్లే అని చెప్తారు. అలాగే చిన్నవారు వచ్చినపుడు వారికి  మనకు వీలయినంత లో వస్త్రాలు లేదా కానుకలు ఇవ్వటం కుడా మన ఆశీర్వాదాలు అందజేసినట్లే అని చెప్తారు. 

ఇక ఇంటి ఆడపడచులు, అక్కచెల్లెళ్ళ కి ఎల్లపుడు ఆ కుటుంబం లో ప్రత్యేక స్థానమే. వారు వస్తే తప్పక పసుపు కుంకుమ, చనివిడి లతో పాటుగా తాంబూలాది వస్త్రాలను సమర్పించటం ఆ కుటుంబం యొక్క ఆప్యాయత, భాంధవ్యాలను ప్రకటించేది గా చెప్పబడుతుంది. ఇలాగే కూతుళ్ళు అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు,  అత్తలు, మామయ్యలు, పిన్నులు బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు ఇలా రకరకాల భాంధవ్యాలతో నిండి పోయిన మన కుటుంబ వ్యవస్థ,  ప్రపంచం మొత్తం లోనే చాల గుర్తింపు తెచ్చుకుందని అందరికి తెలిసిన విషయమే!   (సశేషం)







No comments:

Post a Comment