Friday, August 15, 2014

వాణి వంటింటి విచిత్రాలు:


మళ్ళీ వాణి తన పాక శాస్త్ర ప్రావీణ్యం తో మరొక గమ్మత్తు వంటకం తో మన ముందుకు వచ్చింది. 

ఆ వంటకం సంగతి,  కధ కమామిషు ఏమిటో చూద్దాం పదండి!


రమణ

సంపాదకుడు


లలితా సహస్రనామ పారాయణం – మైసూరు లడ్డూ!


శ్రీమతి నయనా కస్తూరి, హైదరాబాద్


“వాణీ! మా ఇంట్లో రేపు లలితా  సహస్ర నామ పారాయణం వుంది. నలబై మంది అవుతారు మొత్తం. ఏం ప్రసాదం చేయాలో నాకు తెలియడం లేదు. ఏదైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకోవే బాబూ!” వాణి  స్నేహితురాలు జానకి ఫోన్ చేసి అడిగింది. 

వాణి తనకు తోచిన ప్రసాదాలు పేర్లు పది దాకా చెప్పింది. “అన్ని అందరు చేయడం ఐపోయింది. కొత్తదేమైనా చెప్పు”  అంటోంది. 

“వాణీ! అన్ని రకాల పప్పులు నానబెట్టి, పాలకూర, కాబెజ్ వేసి వడలు  వేస్తా! వాటికి తోడుగా సులువుగా ఐపోయే ఒక స్వీట్ చెప్పుదూ!” అంది. 

వాణి ఒక్క నిమిషం  ఆలోచనలో పడింది.  ఈ మధ్యనే కూతురు పుట్టిన రోజుకి ఆఫిస్ లో అందరికి పంచడానికి చేయమంటే చేసిన లడ్డు గుర్తుకు వచ్చింది . అందరికి చాలా బాగా నచ్చింది. వాళ్ళే దానికి 'మైసూర్ లడ్డు' అని పేరు పెట్టారు. వాణి  ఫోన్ లో అన్నీ వివరంగా చెప్పింది. కాగితం, పెన్ను తీసుకుని అంతా  అర్ధం అయేటట్టు రాసుకుంది జానకి.  శ్రద్ధగా చేయడం మొదలు పెట్టింది స్నేహితురాలు. “మరి మాకు చెప్పరా? అంతా  మీ ఫ్రెండ్ కేనా?” అంటారా?

“కాదండీ, మీరందరూ కూడా నేర్చుకుని, చేసుకుని దాని రుచిని ఆస్వాదించాలనే మా కోరిక. అందుకే  మా ఫ్రెండ్ మీ అందరికి కనిపించేలాగానే చేస్తోంది. చూడండి ఏది మిస్ కాకుండా! చేసాక రుచి చూసి మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకుని మీ వాళ్ళందరికీ తినిపించండి. 

జానకి దళసరిగా ఉన్న ఒక బాండి తీసుకుంది. అందులో ఒక కప్పు శనగ పిండి వేసింది. దాంట్లో మూడు కప్పులు పంచదార, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు పాలు వేసి, ఒక గరిట  తీసుకుని బాగా కలిపింది. స్టవ్ వెలిగించి, దాని మీద ఈ మిశ్రమం ఉన్న బాండీ ని పెట్టి గరిటతో బాగా కలిపింది.  స్టవ్ మంట మాత్రం సిమ్ లో ఉండాలండోయ్!  మొదట్లో అంతగా కలపక్కర్లేదు. సుమారు ఒక ఇరవై నిమిషాల్లో శనగ పిండి బాగా వేగి, పంచదార తీగ పాకానికి రెడీ అయింది.  పక్కనే చిన్న ప్లేట్ లో కాసిని నీళ్ళు పోసుకుని అందులో కొంచెం ఈ పాకాన్ని వేసి చూసింది. అది ఉండ కడితే పాకం తయారు ఐనట్టే.  అంతే కాకుండా శనగ పిండి పాకం తెల్ల రంగులోకి వచ్చి మూకుడికి అంటుకోకుండా పాకం దగ్గరగా వచ్చింది.

“వాణి పాకం దగ్గరకు రాగానే స్టవ్ ఆపెయమంది. ఇక ఆపెయచ్చు!” అనుకుంటూ జానకి స్టవ్ ఆపేసి యాలకుల పొడి తయారు చేసుకుని, జీడిపప్పు, బాదం పప్ప్పు, కిస్మిస్ కొంచెం నెయ్యిలో వేయించి పాకం లో కలిపింది.  చల్లారనిచ్చింది బాగా. చల్లారేకా, పాకం ఇంకా దగ్గరకు వచ్చింది ఉండ  చేసుకోవడానికి వీలుగా. బాండీ  ని హాల్ లోకి తెచ్చుకుని, టీవీ  చూస్తూ తనకు కావలిసిన పరిమాణం లో ఉండ కట్టేసింది.  అంతే మైసూర్ లడ్డు తయార్!


ఓహ్! సారీ! మీకు రుచి చూపించదు జానకి! ఎందుకంటే రేపు అమ్మ వారికి నివేదించాలి కదండీ! అయినా ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా ఎలా చేసుకోవాలో?  ఇది ఎప్పుడైనా కుదరక పోవడం అనే ప్రశ్న రాదు. అందరు చాలా సులువుగా ఎక్కువ క్వాంటి టీ  లో  కూడా చేసుకోవచ్చు. ఇది బజార్లో  మీకు దొరికే స్వీట్ కాదు. దీంట్లో మీకు ఎక్కడ దొరకని మైసూరు పాక్, తొక్కుడు లడ్డు రుచుల సమ్మేళనం చూడవచ్చు. మరి మీరు కూడా  ఈ పండుగల సీజన్లో చేసుకుని మీకు ఎలా వచ్చిందో మాతో షేర్  చేసుకుంటారా?















1 comment:

  1. The Laddu recipe is very interesting. Cant wait to try!
    thanks for Vani vantinti vichitraalu.

    ReplyDelete