Saturday, August 23, 2014

8 వ సంచిక: తెలుగు సాంప్రదాయ శాకాహార వంటలు మరియు విశేషాల పసందైన కూర్పు!



ముందు మాట!


ఈ సంచికలో కామాక్షి ఎర్రటి ఎండలో వడియాలు పెట్టటం, అవి ఎండి గల గలా డబ్బాలో పడటం, 

వాటిని చక్కగా మనకు వేయించి పెట్టటం చూస్తారు. అంతేకాక విచిత్రాల వాణి తన స్నేహితురాలి 

కుటుంబ ఆరోగ్య సమస్యని తన వంటిటి చిట్కాతో చిటికిలో ఎలా పరిష్కరించిందో చూడొచ్చు. ఆ 

కాలపు వంటలు ఈ తరం ఎక్కడ మరిచిపోతుందో అన్న బెంగతో మన బామ్మ గారు, కలానికి 

పదును పెట్టి, మనకోసం ఎక్కవ శ్రమ లేకుండా, వినగానే నొరూరించే చక్కటి అధరువుల జంట; 

‘పెసర పచ్చడి – ఉల్లిపాయ పులుసు’ ను పోపు ఘుమ ఘుమల తో తెచ్చి వడ్డిస్తున్నారు.  

‘ఆలస్యం అమృతం విషం’ ఇక వాయ కలపడమే తరువాయి.



రమణ బంధకవి


సంపాదకుడు






కామాక్షి కబుర్లు:  వెట్ గ్రైండర్ – గుమ్మడి వడియాలు

ఆఖరి భాగం


శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు

(గత సంచిక: దానికి తోడు ఎండలో అంతసేపు కూర్చుని వడియాలు పెట్టడంతో ఆవిడకి తల తిరిగి అలసటగా ఉంది. ఆయన చెవుడికి ఈవిడికి చిర్రెత్తుకొచ్చింది. “అబ్బబ్బా... దోసకాయ పప్పు అంటున్టేనూ!”  చిరాకు పడ్డారు సూరీడమ్మ గారు.....ఇక చదవండి.)


సాయంకాలం 5 గంటలు దాక ఎండా బాగానే కాసింది. ఒక వైపు వడియాలు బాగానే ఎండేయి. అవి జాగ్రత్తగా ఒలిచి లోపల పెట్టేరు. మరునాడు ఎండ వచ్చాక వడియాలని రెండో వేపు తిప్పి  ఎండబెట్టేరు. రెండు రోజులు ఇంక ఇదే పని! మూడో రోజు వడియాలు సుబ్బరంగా ఎండి పోయాయి. లక్ష్మి కాంతం గారు ఒక వడియం తీసుకుని నొక్కి చూసేరు. పొడిపొడి లాడుతూ విరిగింది. వడియాలు ఎండేయని నిర్ధారించుకున్నాక, కామాక్షి పెద్ద స్టీలు డబ్బా తెచ్చింది. షీట్లోంచి వడియాలని డబ్బాలో వేస్తుంటే గల గలమని శబ్దం వచ్చింది. పట్టాభి ఆ శబ్దానికి తెగ సంబరపడిపోయాడు. మామ్మా! ఇపుడు వడీడాలు వేయించుకోవచ్చా?” అడిగేడు. “ఓ! నిక్షేపంగా!” అన్నారు సూరీడమ్మ గారు.


కామాక్షి వడియాలు వేయించింది. అత్తగారు పట్టాభికి అన్నంలో నెయ్యి వేసి వడియాల ముక్కల్ని నంచి పెడుతున్నారు. పట్టాభి డాడి! వడీడాలు రెడీ అయ్యేయి" అన్నాడు విశ్వనాథంతో. ఒరేయి! నువ్వు పెద్దవాడి వైపోయావురా! ఇంకా వడీడాలు అనకూడదు; వడియాలు అనాలి ముద్దు చేసేడు విశ్వనాథం.


లక్ష్మీ కాంతం గారు కామాక్షిని వడియాలు నంచుకోవటానికి ఏమిచేసావమ్మ?అడిగేరు.  ముక్కల పులుసు మావయ్యా!” అని చెప్పింది.  “ములక్కాడ కూరా!  వుండు. పళ్ళు పెట్టుకొస్తాను లేకపోతే ములక్కాడలు చిగుళ్ళలలో గుచ్చుకుని నెప్పిపెడతాయి అని వెళ్లబోయారు.  పళ్ళు పెట్టుకోవడం కాదు. ముందు చెవిటి మిషను పెట్టుకోండిఆక్షేపణగా అన్నారు అత్తగారు. తండ్రి చిన్న బుచ్చుకుంటారని మాట మారుస్తూ విశ్వనాథం ఎందుకమ్మా! అంత  కష్టపడి వడియాలు పెట్టేరు? బజారులో కొనుక్కోవచ్చు కదా!” అన్నాడు. “బజార్లో కొనుక్కోవటం ఎందుకురా? ఇంట్లో చక్కదనాల వస్తువుందాయే! చేతిలో విద్య పెట్టుకుని ఉపయోగించుకోకపోతే ఎలా?” అన్నారు. 


ఇపుడు గ్రైండర్ ఉంది, వడియాలు చేసే పద్దతీ తెలిసింది కదా! ఇంక నుండి ప్రతి సంవత్సరం నేనే వడియాలు పెట్టి మనవాళ్ళందరికీ ఇస్తానత్తయ్యా ధీమాగా అంది కామాక్షి.  “నువ్వు కొన్న వస్తువుని వృధా పోనివ్వవని నాకు తెలియదుటే!” మెచ్చుకోలుగా అన్నారు సూరిడమ్మ గారు. 


(సమాప్తం)







వాణి వంటింటి విచిత్రాలు:

మెంతులు చేసే మేలు

శ్రీమతి నయన కస్తూరి

ఒక ఆదివారం మధ్యాహ్నం వాణి  స్నేహితురాలు  జానకి  ఇంటికి వెళ్ళింది. ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. బయట వాన పడి  చల్లగా వుండటంతో టీ తో పాటు పకోడీలు తింటే బాగుంటుంది అనుకుంది జానకి.  వెంటనే శనగపిండి, దాంట్లోకి కొంచెం బియ్యం పిండి తగినంత ఉప్పు  వేసి కలుపుతుంటే, వాణి ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు తరుగుతోంది.

"వాణీ! మా వారికీ, మా మామగారికి శనగపిండి తో చేసినవి తినాలంటే భయం. ఇద్దరికీ ఎసిడిటి,  గ్యాస్ ప్రొబ్లెమ్. అందుకే నేను బియ్యం పిండి కొంచెం ఎక్కువే వేస్తాను” అంది. "మంచిదే కాని జానకీ ఒక కప్పుడు జొన్న పిండి కలుపు. బియ్యం కన్నా జొన్న పిండి మంచిది. నూనె కుడా ఎక్కువ పీల్ఛదు. అలాగే సోడా చాలా కొంచెమే వేసి ఒక అర కప్పుడు  పెరుగు వేయి. పకోడీలు క్రిస్ప్ గా బంగారు రంగులో వస్తాయి. అలాగే ఒక అర చెంచాడు వాము వేయి. వాము గ్యాస్ కి  మంచి విరుగుడు" సలహా ఇచ్చింది వాణి.

"అలాగే” అంటూ తు . చ . తప్పకుండా పాటించి పకోడీలను సిద్దం చేసింది జానకి. అందరికి ప్లేట్లలో పెట్టి ఇచ్చింది. రోజూ కన్నా బాగా వచ్చాయనుకున్నారు తండ్రి కొడుకులు .

స్నేహితురాళ్లిద్దరు పకోడీలు, టీ ని తీసుకుని బాల్కనీ లో కూర్చున్నారు. “మీ ఆయన, మామగారు, గ్యాస్ ప్రాబ్లం కి ఏమైనా మందులు వాడుతున్నారా?"  అడిగింది వాణి పకోడిని నోట్లో వేసుకుంటూ.

"ఎందుకు వాడట్లేదు బాబూ! ఇద్దరు వాడని మందు లేదు. మాత్రలు, సిరప్పు లే కాకుండా ఈనొ లు సోడాలు కొబ్బరి బొండాలు తాగుతూనే ఉంటారు. మంట, గ్యాస్ మాత్రం వాళ్ళని వదలడం లేదు"  అంది జానకి.

దానికి వాణి "ఇన్ని రోజులు నాతొ ఎందుకు అనలేదు? దానికి నా దగ్గర ఒక మంచి మందు ఉంది. కాకపొతే నువ్వు రోజు నేను చెప్పినట్టు చేయాలి" అంది . "చేస్తాను తల్లీ! అవి తగ్గుతాయంటే తప్పక చేస్తా! చెప్పు ... చెప్పు!” అంటూ జానకి తొందర చేసింది. 

"ఏమీ లేదు. రోజు రాత్రి ఇద్దరికీ చెరొక గ్లాస్ నీళ్ళల్లో ఒకొక్క చెంచాడు మెంతి గింజలు వేసి మూత పెట్టి ఉంచు. మర్నాడు ఉదయం లేస్తూనే పళ్ళు తోముకోక ముందే ఆ నీళ్ళు తాగేయమను. నానిన ఆ మెంతి గింజలు బాగా నమిలి తినేయమను. ఇలా క్రమం తప్పకుండా రోజూ  చెయ్యమను వాళ్ళ కడుపులో మంట ఉబ్బరం మాయం కాకపొతే నా చేవి కోయించుకుంటాను"  అని చెప్పింది వాణి నొక్కి వక్కాణించి.

జానకి అలాగే  రోజు ఉదయాన్నే  మెంతుల నీళ్ళు తాగిస్తోంది. చాల ఉపయోగకరం గా అనిపించింది. మామగారు “పొట్ట ఉబ్బరం గా వుంది" అనడం  మానేశారు. భర్త త్రేన్పులు చాలా మటుకు తగ్గి పోయాయి. ఎసిడిటి, గ్యాస్ ప్రాబ్లం కోసం మందులు వాడకం తగ్గిపోయింది. థాంక్స్ చెప్పడానికి స్నేహితురాలికి ఫోన్ చేసింది. "నీకు థాంక్స్ చెప్పాలే! మెంతులు భలే మేలు చేసాయే! ఇద్దరి దగ్గరనుండి గ్యాస్ కంప్లైంట్ రావడం లేదు”
సంతోషం వ్యక్తం చేసింది జానకి.

"వాళ్ళిద్దరే కాదు నువ్వు కూడా రోజూ త్రాగు. దీనివలన అధిక బరువు వుంటే తగ్గుతుంది; జీర్ణ శక్తి మెరుగు పడుతుంది; ముఖ్యం గా మన శరీరం లోని ఇన్సులిన్ ఉత్పత్తి సమతుల్యం గా ఉంచి మధుమేహం వ్యాధిని దూరం  గా ఉంచుతుంది” చెప్పింది వాణి. "అమ్మో మెంతులు ఇంత గొప్ప మేలు చేస్తాయా!" ఆశర్యపోయింది జానకి.

మరి మీరు కూడా తెలుసుకున్నారు కదండీ మెంతులు చేసే మేలు? రోజు నేను చెప్పినట్టుగా మెంతులు నానబెట్టిన నీళ్ళు ఆ మెంతులుతో సహా తీసుకుని మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యమని మరువకండి. 






బామ్మగారి కార్నర్:


పెసర పచ్చడి – ఉల్లిపాయ పులుసు



అన్నిటి కంటే తేలిక గా చేసుకునే ఆదరువు పెసర పచ్చడి. రుచి కూడా కమ్మగా బావుంటుంది. 
ఇక తయారు చేసుకునే విధం చూద్దామా?


ఒక అర గ్లాసుడు పెసర పప్పు బాగా కడిగి ఇదు నిముషాలు నాన బెట్టాలి. ఇలా నానితే తొందర గా నలుగుతుంది. నానిన పప్పును గ్రైండర్ లో వేసి, కాస్త జీల కర్ర, కొద్దిగా ఇంగువ, ఓ రెండు ఎండు మిరప కాయలు వేసి తిప్పుకుంటే మెత్తఃగా పెసర పచ్చడి తయారు. కావలసిన వారు ఒక చెక్క నిమ్మ రసం పిండు కుంటే చక్కటి రుచి వస్తుంది. ఇక ఈ పచ్చడి లోకి నంచుకోవటానికి ఉల్లిపాయ పులుసు వుంటే, దీని రుచి ద్విగుణీకృతం అవుతుంది. 


నాలుగు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని ఉంచుకోవాలి. రెండు పచ్చి మిర్చి కూడ ముక్కలు చేసుకుని పెట్టుకోవాలి, మూకుడు లో కాస్త నూనె వేసి, రెండు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకుని, ఆవాలు జీల కర్ర  కూడా వేసి పోపు వేగాక అందులో తరిగిన ఉల్లి మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లి ముక్కలు బాగా మగ్గేక కాస్త చింత పండు రసం వేసి మరి కాసిని నీరు పోసి మరిగించాలి. కొంచెం తీపి రుచి కావసిన వారు, చిన్న బెల్లం ముక్క గాని,  చెంచాడు పంచదార గాని వేసుకోవచ్చు. బాగా మరిగిన తరువాత  కాసిని నీళ్ళలో చెంచాడు సెనగ పిండి కాని, బియ్యపు పిండి కానీ బాగా కలిపి, మూకుడులోని పులుసులో వేసి కొంచెం కలుపుతూ ఉడికించాలి. దీనివలన పులుసు చిక్కగా పాకం వచ్చి అసువు గా వుంటుంది. పులుసును పొయ్య మీద నుంచి దించి గిన్నెలోకి తీసుకుంటే, పెసర పచ్చడి లో నంచుకోవటానికి మంచి జోడీ తయారు.


ఈ ఉల్లిపాయ పులుసును ఇందులోకే కాకుండా కంది పచ్చడి లేక కంది పొడి లేక పాఠోలీ లోకి నంచుకున్నా దివ్యమైన రుచి నిస్తుంది. 






No comments:

Post a Comment