Monday, August 18, 2014

7 వ సంచిక: తెలుగు సాంప్రదాయ శాకాహార వంటల మరియు కబుర్ల చమత్కార బాణం!


సంపాదకీయం:

గత సంచిక లో మనం మడికేరి విహార యాత్రా పర్వం లో రచయత శ్రీ కృష్ణ భవన్ వారి టిఫిన్ విశేషాలను మనసారా ఆస్వాదించటం చూసాం. దోసె పెనం మీద ‘టంగ్’ మన్న అట్లకాడ శబ్దానికి పులకరించిన వారి మనసును చదివి చూసాము. మరి ఆ విహార వీరంగానికి కొస మెరుపు ఎలా వుంటుందో ఈ సంచికలో చూద్దాము.

మరి అమ్మ చేతి వంటలకి అర్రులు చాస్తూ వేచి ఉన్న పాఠకులకు ఈ భాగం లో ఎవరు ఏ వంటను ఏ ఆత్మా రామునికి  కైంకర్యం చేస్తారో చూద్దాం.

ఇక కామాక్షి కధ కు వస్తే, కొత్తగా కొని తెచ్చిన గ్రైండర్ కు పసుపు కుంకుమల హరతులిచ్చి పట్టాభి చేత స్విచ్ నొక్కిన్చేరు. మరి ఆ గ్రైండర్ నడిచి వారి వడియాల కలను ఎంతవరకు సఫలీకృతం చేస్తుందో ఈ భాగం లో చూద్దాం.  
ఇక చదివి ఆనందించండి.

రమణ

సంపాదకుడు



విహారం లో భోజన వీరంగం

శ్రీ కృష్ణ భవన్
(అనే కాఫీ, టీ, అల్పాహార శాల, మడికేరి)

                                                                                                                రమణ

(గత సంచిక: హోటల్ యజమానులు శ్రీ రాజశేకర్, శ్రీ రమేష్ అధికారి కొద్ది పరిచయం తోటే మాకు సన్నిహితులు అవటం, మా కోసం రాత్రి పొంగల్, మర్నాడు ఉదయం బిసి బేల బాత్, కూర్గ్ స్పెషల్ 'తట్ట ఇడ్లీలు' చేస్తామని వాగ్దానం చేయటం జరిగింది... ఇక చదవండి)

పార్ట్ 3

రోజు మేము 'దుబారే' ఏనుగుల క్యాంపు, కాఫీ తోటల పర్యటన ముగించుకుని అలసి వెనక్కు 

వచ్చేసరికి బాగా పొద్దు పోయింది. హోటల్ కట్టేసే సమయం ఐయి వారు కొంచెం నిరుత్సాహ 

పడుతున్న సమయం లో మేము రావటం. సిసింద్రి గాడు 'పొంగల్ పార్టీ ఆగయా' అని పోలి కేక 

పెట్టటం జరిగింది. ఆలస్యానికి నొచ్చుకుంటూ రాజశేకర్ మమ్మల్ని పది నిముషాలు ఓపిక 

పట్టమని వేడిగా పొంగల్ తయారు చేసి ఇస్తానని చెప్పటం జరిగింది. అలసిన శరీరానికి ఊరటగా 

వేడి వేడి పొంగల్ రావటం, రెండు మూడు  వాయలు  తినడం  జరిగింది.


మర్నాడు మేము కూర్గ్ వదలి వెళ్ళవలిసిన రోజు. మహీంద్రా బస ఖాళీ చేసి పొద్దున్న పది 

గంటల ప్రాంతం లో కృష్ణ భవన్ చేరు కున్నాము. మా కోసం వేడి బిసి బేల బాత్ మరియు 'తట్ట 

ఇడ్లీలు' తయార్. రాజశేఖర్, వారి ఇంటి నుంచి పేరిన నెయ్యి కూడా తెచ్చి ఇచ్చారు. తనివి తీర 

టిఫిన్లు తిని చక్కటి ఫిల్టర్ కాఫీ  తాగేము.


మడికేరి లో క్లబ్ మహీంద్రా ఒక మనో రంజకమైన వసతి గృహం ఐయితే, దానికి దీటుగా మా 

ఆత్మ రాముని సేవకు అద్వితీయముగా సాయ పడిన 'శ్రీ కృష్ణ భవన్' చిరస్మరణీయం. రమేష్ 

మరియు  రాజశేఖర్  వద్ద  సెలవు  పుచ్చుకుని, ధన్యవాదాలు  తెలిపి మాకు తెలిసిన వారు 

ఎవరు మడికేరి వచ్చినా మీ హోటల్ ఆతిద్యం పొందుతారని చెప్పి, బరువైన ఉదరము

హృదయముతో మెట్ల వైపు కదిలాము


అయ్యా ! మనకు ఎక్కడ విధము గా ఎవరితో అనుబంధం ఏర్పడుతుందో చెప్పటం   కష్టం

మీరు ఎప్పుడైనా అటు కూర్గు కాఫీ తోటల విహారానికి వెళ్ళితే 'శ్రీ కృష్ణా భవన్

సందర్శించండి. ఇది చదివి, వివరణలతో నోరూరి, ఇడ్లి, దోసె, పొంగల్ తినాలని అనిపిస్తే

భేషుగ్గా చేసుకోండి 'శ్రీ కృష్ణార్పణం' అని లాగించండి.


మంగళం  మహత్




*****


అమ్మ చేతి వంట:


పొన్నగంటి ఆకు సెనగ పప్పు కూర



శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్


వాణి అత్తగారు తో కలిసి భర్త రైతు బజార్ నుండి తెచ్చిన కూరలు నీట్ గా ఫ్రిజ్ లో సర్దుకుంటోంది. “వాణీ, చూడు ఈ పొన్నగంటి ఆకు ఎంత తాజాగా ఉందో! ఇప్పుడే  తెంపు కొచ్చినట్టు ఎంత నవ నవ లాడుతూ ఉందో! పొన్నగంటి ఆకు కట్టలను చేతిలో పెట్టుకుని అటూ ఇటు తిప్పుతూ మురిసిపోతోంది, అత్తగారు.  “అవునమ్మా!  అందుకే మరింత తీసుకున్నా.  ఈ రోజు వాడేయండి, ఫ్రిజ్ లో పడేసి వాడగొట్టేయకండి” అన్నాడు వాణి భర్త. 
“అయితే అత్తయ్యా! అది బయటే ఉంచుదాము. ఈ రోజు పొన్నగంటాకు కూర చేసేస్తాను” అంది వాణి.

“అమ్మా!  వాణి వంట బాగానే వుంటుంది కాని పొన్నగంటాకు కూర మాత్రం నీలాగా ఎవ్వరు చేయలేరమ్మా ..... కొడుకు మాటలకు సంబరపడి పోతూ “ దాందేముంది లేరా ఈ రోజు నేను చేస్తాను కూర, ఇంకా నాకు కాలు చేయి బాగానే ఆడుతోంది కదా?  కోడలి కేసి చూస్తూ అంది.  “బాగానే వుంది అత్తయ్యా ! ఆయన అడగడం మీరు తయారవడం, ఈ వయసులో మీకు శ్రమ కాకపొతే! కాస్త మనసు పెట్టి చేస్తే అదే బాగుంటుంది.  కాస్త వలిచి పెట్టి ఇవ్వండి చాలు. ఈ లోగా మిగతా వంట కానిస్తా! అంటూ లేచి వంటకు ఉపక్రమించింది.

వాణి వంటింటి దృశ్యం:

ఒక పావు గ్లాస్ సెనగ పప్పుని నీళ్ళల్లో నాన బెట్టింది. అత్తగారు ఆకుని కాడలు లేకుండా వలిచి ఇచ్చారు. వాణి దానిని శుభ్రంగా కడిగి సన్నగా తరుగుకుంది. ఒక మూకుడు తీసుకుని, స్టవ్ వెలిగించి దాని మీద పెట్టింది. మూడు చెంచాల నూనె పోసింది. నూనె వేడెక్కాక నాలుగు ఎండు  మిరపకాయ ముక్కలు ఒక చెంచా మినప్పప్పు, పావు చెంచా ఆవాలు, ఒక పావు చెంచా జీలకర్ర వేసింది. పోపు వేగిన తర్వాత నానిన సెనగ బద్దలు వేసి, తరిగిన పొన్నగంటి కూర కూడా వేసింది. కొంచెం పసుపు, చిటికెడు కారం వేసింది. తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, మంట సిమ్ లో పెట్టి మూత పెట్టింది. ఒక కొబ్బరి చిప్ప తీసి కొబ్బరి తురుము చేసుకుని ఉంచుకుంది. మధ్య మధ్య లో కూర ని కలుపుతూ కూర  అడుగంట కుండా జాగ్రత్త పడింది. కూర తడిలేకుండా బాగా ఉడికి పొడి పొడి గా అయ్యాక రెడీ గా ఉంచుకున్న కొబ్బరి తురుము వేసి, బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి వుంచి స్టవ్ ఆపేసింది.

ఒక చిన్న మూకుడు తీసుకుని, తగినంత నూనె పోసి కాగిన తర్వాత డబ్బాలో నుండి చిన్న చిన్న మినప వడియాలు, కొన్ని ఊరు మిరపకాయలు వేయించి, విడిగా పెట్టుకుని, అందరికి వడ్డించే ముందు కూర లో కలిపి వడ్డించింది. భర్త తో సహా అందరికి నచ్చింది. 

“అమ్మా! నీ  కోడలు చాలా తెలివైనది. పొన్నగంటాకు కూరలో వడియాలు, వూరు మిరపకాయల జత చేర్చి, ఈ కూర చేయడం లో కూడా నిన్ను మించిపోయింది” అంటూ భర్త  మళ్లీ మళ్లీ కూర వేయించుకుని  తింటుంటే, అత్తగారి మెచ్చుకోలు చూపులు చూసి వాణి మురిసిపోయింది.     
   
 *****  
 






కామాక్షి కబుర్లు:

వెట్ గ్రైండర్ – గుమ్మడి వడియాలు


                                                                             శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు


(గత సంచిక:  రెండు మూడు  సార్లు నీళ్ళు పోసి సుబ్బరంగా కడిగింది. సూరీడమ్మ గారు పప్పుని దోసిలితో పట్టుకుని క్రిష్ణాక్షయం అంటూ వేసేరు. పట్టాభి  గ్రైండర్ బటన్  నేను నొక్కుతా! నేను నొక్కుతా”! అంటూ  నొక్కేడు....ఇక చదవండి)

పార్ట్ 3:


...పొత్రం గర గర మని శబ్దం చేస్తూ తిరిగింది.  పట్టాభికి ఇదంతా మహదానందంగా ఉంది

మామ్మా! ఇపుడే వడీడాలు ఐపొతాయా?అడిగేడు. “అపుడే అవుతాయట్రా! ఇంకా మూడు 

రోజులు ఆగాలి అన్నారు సూరీడమ్మ గారు. ” ఇంకా త్రీ డేసా?” నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు 

పట్టాభి. పప్పు నలిగేలోగా సూరీడమ్మ గారు పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి, బాగా కడిగి 

పళ్ళెంలో ఆరబెట్టేరు ఆరేకా, మిక్సీ లో వేసి కచ్చాపచ్చాగ తిప్పమన్నారు కామాక్షిని.పిండి ఇంకా 

నలుగుతోంది. కామాక్షి వంట పని చేసుకుంటూ మధ్య మధ్యలో పర్యవేక్షిస్తోంది.


పిండి నలిగింది..గుమ్మడి కాయ ముక్కలు నీళ్ళోడాయి. క్రితం రోజు అత్తగారి చెప్పిన సూచనల

మేరకు పిండిని జాగ్రతగా తీసి ఒక బేసిన్ లో వేసిన్ది. కామాక్షి, అత్తగారు కలిసి గుమ్మడి కాయ 

ముక్కల్ని చేత్తో పిండి, రుబ్బిన మినప పిండిలో పడేసారు. ముక్కలు వేయటం అయ్యేక 

గ్రైండ్  చేసిన పచ్చి మిర్చిని, తగినంత ఉప్పుని  కలిపేరు; మంచి ఘాటైన పాల ఇంగువని 

చిటికెడు కలిపేరు. వడియాల పిండి తయారయ్యింది.  ఎండ బాగానే వచ్చిందని ప్లాస్టిక్ షీట్లు 

తీసుకుని బాల్కనీలోకి రమ్మని  కామాక్షికి చెప్పేరు. అందరూ బాల్కనీలోకి జేరేరు. పట్టాభికి 

ఇదంతా తమాషాగా వుంది.. అత్తగారు పసుపు గణపతి చేసి ప్లాస్టిక్ షీటు  ఒక చివర్లో పెట్టి 

నమస్కరించి, ఎర్రటి ఎండ కాచి వడియాలు పెళ పెళ లాడాలని, ఏ మబ్బో, వానో వచ్చి 

వడియాలు కొట్టుకుపోకూడదని సూర్యనారాయణ మూర్తికి చేతులెత్తి మొక్కేరు. ఒక షీటు మీద 

కామాక్షి స్పూన్తో వడియాల పిండి వేస్తుంటే, అత్తగారు చేత్తో నొక్కి వెడెల్పు చేస్తున్నారు. 

రెండో షీటు మీద పట్టాభి వేస్తుంటే నొక్కే పని మామగారు చేస్తున్నారు. మొత్తానికి వడియాలు 

పెట్టడం పూర్తి అయింది.


వడియాల పనితో వేళ దాటడం వల్ల లక్ష్మీ కాంతం గారికి ఆకలి వేసింది భోజనాల బల్ల దగ్గర 

కూర్చుని వంటేమి చేశావమ్మఅని  అడిగేరు కామాక్షిని. “దోసకాయ పప్పు మావయ్యా! అని 

చెప్పింది.  “ఓ!  దొండ కాయా? మేము కాశీలో వదిలి పెట్టేసామునువ్వు చెప్పలేదా” అడిగేరు 

అత్తగారిని తనదైన చెవిటి ధోరణిలో. అసలే నిన్న  గ్రైండర్ కొనటం దగ్గర నుండి ఇవాళ వడియాలు 

పెట్టడం దాక తెగ హైరానా పడ్డారు అత్తగారు.  దానికి తోడు ఎండలో అంతసేపు కూర్చుని 

వడియాలు పెట్టటం తో ఆవిడకి తల తిరిగి అలసటగా ఉంది.  ఆయన చెవుడికి ఈవిడికి 

చిర్రెత్తుకొచ్చింది. “అబ్బబ్బా... దోసకాయ పప్పు అంటున్టేనూ!” చిరాకు పడ్డారు సూరీడమ్మ 

గారు.  


(సశేషం)











1 comment:

  1. వడియాలు పెట్టటం గురించి వివరించిన కామాక్షి కబుర్లు చాలా బాగున్నాయి.
    అమ్మచేతి వంట గా వాణి గారి పొన్న గంటి ఆకుకూర చాల కొత్తగా ఉంది

    ReplyDelete