Sunday, August 10, 2014

శ్రావణ మాసం – పెళ్ళిళ్ళు, పేరంటాలు, కొత్త కోడళ్ళు:


పాఠకులందరికీ ‘రాఖీ’ పండుగ శుభాకాంక్షలు! అన్నా చెల్లెళ్ళ అనుబంధాలు మరింత అనురాగ వంతమై వర్ధిల్లాలని కోరుకుంటున్నాము.


సంపాదకుడు                    



శ్రావణ మాసపు హడావిడి:

ఈ మధ్య మా బంధువొకరు పిల్ల పెళ్ళికి పిలవడానికి వచ్చారు. శ్రావణ మాసపు పెళ్లి. వారు ఈ 
వూరి వారే అయినా పెళ్లి మాత్రం రాజమండ్రిలో! అలా ఎందుకు అని అడిగితె పెళ్లి మంటపం అక్కడే దొరికింది, అయినా మగ పెళ్లి వారు బుక్ చేసారు అని చెప్పారు. అంతే కాదు ముందు చూపుతో మగ పెళ్లి వారు మండపాన్ని సుమారు ఆరు నెలల ముందే బుక్ చేసారుట!  విచిత్రం ఏమిటంటే, పెళ్లి కుదరటానికి ముందే మంటపం బుక్ చేసి పెట్టుకున్నారుట; తరవాత కష్టం అని! శ్రావణ మాసపు పెళ్ళా మజాకా! సంబంధాలు తరువాత కుదురుతాయి లెండి, ముందు ఉన్న పళంగా ఏదో ఒక మంటపం బుక్ చేసి పెట్టు కోండి.

పెళ్లిళ్లు, మంటపాలు, వరలక్ష్మీ వ్రతం, కొత్త కోడళ్ళు వీటన్నిటి పైన చురుకుల్లాంటి చమక్కులు వేస్తూ మన బామ్మ గారు  కలం పట్టారు. చదివి ఆనందించండి.


రమణ

సంపాదకుడు




శ్రావణ మాసం – పెళ్ళిళ్ళు, పేరంటాలు, కొత్త కోడళ్ళు


బామ్మ గారు


శ్రావణ మాసం వచ్చిందంటే సందడే సందడి! పెళ్ళిళ్ళ సీజను వచ్చినట్లే! కళ్యాణ మంటపాలు కిటకిట లాడి పోవటమే కాకుండా వాటి ధరలకు రెక్కలు వచ్చి పైకి ఎగురుతాయి. విదేశాలలో ఉన్నవారు కూడా, స్వదేశం వచ్చి సాంప్రదాయ పద్ధతి లో పిల్లలకు వివాహాలు చేయడం ఈ మధ్య విరివిగా చూస్తున్నాము. దీనితో కళ్యాణ మంటపాలు ఏడాదికి ముందుగానే బుక్ అయిపోతున్నాయి. డాలర్ల మహానుభావులు దేనికీ వెనుకాడటం లేదు. స్టార్ హోటల్స్ అన్నీ ముందుగానే పెళ్ళివారి కోసం రిజర్వు చేసేస్తున్నారు. ఒకప్పుడు మగ పెళ్లి వారు ఏదైనా కట్న కానుకలు ఆడిగితే, గుడ్లు తేలేసేవారు. అటువంటిది ఇప్పుడు పోటీల మీద కొండ మీది కోతిని కూడా దింపేస్తున్నారు. ఇక మేనాలు, పూల పల్లకీలు ఏది కావాలంటే అది రెడీ. పెళ్ళికి వచ్చినవారు తమ ఘనతను, ఏర్పాట్లను, విందు వినోదాలను  వేనోళ్ళ పొగడాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.


ఒక పక్క పెళ్లిళ్ళు పోటా పోటీ గా జరుగుతుంటే, రెండవ పక్క క్రితం ఏడాది పెళ్లిఅయిన వారి ఇళ్ళు కొత్త కోడళ్ళ రాకతో కళ కళ లాడుతున్నాయి. అందునా వరలక్ష్మీ వ్రతం రోజు ఆ కాలంలో కొత్త కోడలికి అత్తగారు, కొత్త చీరా, అర గ్రాము లక్ష్మీ రూపు ఇచ్చి పూజ చేయించి సంబరపడే వారు. మరి ఇప్పుడు, అత్తగార్లు కొత్త కోడలిని కెంపుల సెట్టు తో అలంకరించి ముచ్చట పడటం కద్దు. అంతే కాక కోడలి చేత చక్కగా అమ్మవారి పూజ చేయించి, తొమ్మిది రకాల పిండి వంటలు చేసి, సాయింత్రం కొత్త చీర నగలు ధరింప చేసి, ఇరుగు పొరుగు పేరంటాలకు తీసుకుని వెళ్లి గర్వంగా పరిచయం చేసి ముచ్చట పడుతున్నారు.


అమ్మవారు కూడా పూర్వం లా రాగి చెంబు మీద కలశంలో దర్సనమివ్వడం లేదు. ఇప్పుడు శాస్త్రానికి కలశం పెట్టినా, అమ్మవారిని నిలువెత్తు బొమ్మగా మార్చి, చేతులు, జడలు పెట్టి, పట్టుచీర కట్టి, నగలు పెట్టి, సాక్షాత్తు అమ్మవారే దిగారా అన్న భ్రాంతి కలగ జేస్తున్నారు. అమ్మవారు ఒక్కో ఇంట్లో ఒక్కో రూపం తో దర్శనం ఇస్తోంది. ఏ ఇంట్లో అమ్మవారు, ఏ రూపు దిద్దుకుందో అని చూడటానికి ఎలాగో లాగ తీరిక చేసుకుని వెళ్లి చూసి వస్తున్నారు. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం పూర్తి చేసి, ఆ తల్లి వరాలను అందుకుంటున్నారు.


మరి రాబోయే సంవత్సరం శ్రావణ మాసపు పెళ్లిళ్ళు, కొత్త కోడళ్ళు, అమ్మవారి దర్శనాలు ఎంత కనువిందు చేస్తాయో వేచి చూద్దాం.







*****


1 comment:

  1. బామ్మగారి ముచట్లు చాల విశేషంగా చలాకీగా ఉనాయి.ఇంకా కొన్ని విశేషాలు రాయగలిగితే చదివి సంతోషిస్తాము.

    ReplyDelete