Wednesday, August 27, 2014

వినాయక చవితి – ‘నాడు – నేడు’ - ప్రత్యేక వ్యాసం (ఆఖరి భాగం)


ముందు మాట:

గత సంచికలో బామ్మ గారు ఆ రోజుల్లో వినాయక చవితి పండుగను గృహస్తులు ఏవిధంగా 

ఉత్సాహం తో జరుపుకునే వారో వివరించారు. మన అందరిని గ్రామ సీమల లోని, డొంకలు 

పెరడులు తిప్పి మన చేత పత్రి తెమ్పించి, చెలమలు, చెరువుల్లో కలువ పువ్వులు కోయించి, 

మట్టి వినాయకుని ప్రతిమను శ్రద్దా భక్తులతో పూజ చేయించారు. మరి ఈ రోజు ఏం చూపిస్తారో 

చూద్దామా?


రమణ బంధకవి

సంపాదకుడు




బామ్మ గారి కార్నర్:



వినాయక చవితి – ‘నాడు – నేడు’

(ఆఖరి భాగం)



మరి ఈ రోజుల్లోనో....?
పండుగ అదే అయినా, హంగులు, ఆర్భాటాలు ఎక్కువని ..... ఒప్పుకుంటారా?
ఇంటిలోని వినాయకుని తల్లికి అప్పచెప్పేసి, వీధి వీధికి పెద్ద ఎత్తులో భారీ  గణపతులను పెట్టి, గణపతి నవరాత్రులు ఘనంగా జరుపుకోవడానికి  కమిటీలు ఆవిర్భవిస్తున్నాయి. ఎంత పెద్ద గణపతి ని ఎంత వెరైటిగా చేస్తే అంత ఘనం గా భావిస్తున్నారు. దీని ప్రతిఫలంగానే మనం ‘సిక్స్ పేక్’  గణపతిని, ఫుట్ బాల్ లేక  క్రికెట్ ఆడుతున్న గణపతిని .... ఇంకా ఎక్కడా పురాణాల్లో కనిపించని గణపతులను రోడ్ల మిద దర్సించు కుంటున్నాము. అంత భారీ గణనాదునికి  పాలవెల్లిని ఎలా అమరుస్తారు?  కనుక పాలవెల్లులు మరుగునపడ్డాయి.

ఎక్కువ సంఖ్యలో గణపతులు వుండటం వలన పూజారుల కొరత ఏర్పడి, ఎప్పుడు పూజారి వస్తే, అపరాహ్న వేళా లేక అర్ధరాత్రా చూడకుండా, పూజలు పెట్టుకోవడం జరుగుతోంది. గణపతి కి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, మోదకాలు కనుమరుగై,  పెద్ద పెద్ద లడ్డూలు గణపతి చేతిలో కూర్చుని వేలం పాటల వెర్రిని పెంచుతున్నాయి.

సాంప్రదాయకమైన మట్టి తో కాకుండా, ఇనుప ఊచలతో, ప్లాస్టర్ ఆఫ్ పేరిస్ తో వినాయకుని విగ్రహాలు తయారు అవుతున్నాయి. వ్యాపారస్తులు యువకులు పోటీలు పడి, పర్యావరణాన్ని కాలుష్యం చేసే పదార్ధాలు, రంగులు వినియోగించి గణపతి విగ్రహాన్ని కేవలం తమ ప్రతిష్టాత్మక విషయం గా మాత్రమే భావించి, ఈ పవిత్ర నవరాత్రులు జరుపుకుంటున్నారు.  ఇదివరకు నవరాత్రులలో సాంస్కృతిక కార్యక్రమాల్లో దేవతల చరిత్రలు, పురాణ గాథలు వుంటే ఇప్పుడే వాటి స్థానే,  దేవతలకు ఏ మాత్రం సంబంధం లేని సినిమా పాటలు, డాన్సులు చోటు చేసుకుంటున్నాయి.

ఇక గణపతి నిమజ్జనోత్సవాల గురించి చెప్పనే అక్కర్లేదు. భారీ విగ్రహాల నిమజ్జనలను  నియంత్రణ చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి ఎంతో కష్టతరం అయిపోతోంది. ఒక్కోసారి మతకలహాలకి కూడా దారితీయటం కద్దు.  అంగుళం మట్టి గణపతిని భక్తితో పూజిస్తే, అరవై అడుగుల భారీ గణపతిని  పూజించిన ఆనందం కన్నా ఎక్కువ మన బొజ్జ గణపతికి. మన విఘ్నాలను తొలిగించి మనలను అనుగ్రహించే విఘ్న రాజాధిపతిని  భక్తి శ్రద్ధలతో పూజించుకుని, అన్నిటా విజయాలు సాధించుకుందాము. అంతే కానీ ఆర్భాటాల పేరుతో మనకీ, పర్యావరణానికి ఆపదలును కొని తెచ్చుకోవద్దు.

కుడుములు, ఉండ్రాళ్ళు  భక్తి శ్రద్ధలతో ఆయనకు అర్పించి,  తన చిన్ని ఎలుక వాహనం పై ఎన్ని విజయాలు సాధించాడో, తల్లితండ్రులను ఎలా మెప్పించాడో, ఆయన తన నిరాడంబరం తో సిద్ధిబుద్ధులను ఎలా వరించాడో  తెలుసుకుని, ఆయన తత్వాన్ని మనం కొంతవరకైనా పాటించగలిగితే మనల్ని విజయం వరించక మానదు.  

అయితే మరి ఈ నెల ఇరవై తొమ్మిదిన వచ్చే వినాయక చవితి పర్వదినాన్న కాలుష్యాన్ని పెంచే రంగు రంగు భారీ విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన చేసిన ప్రతిమకు భక్తిశ్రద్ధలతో పూజలు సలిపి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలు నివేదించుకుని, నవరాత్రులను పవిత్ర మైన భక్తి భావంతో జరుపుకుని ఆ పార్వతీ ప్రియపుత్రుని అనుగ్రహాన్ని పొందుదాము.

వక్రతుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ!


నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా!






No comments:

Post a Comment