Sunday, August 17, 2014

పాఠకులందరికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు: ప్రత్యేక వ్యాసం


ఈ పండుగ శుభ సందర్భం లో శ్రీమతి పద్మా రఘునాద్ గారు ఈ పండగ నాడు చేసుకునే ముచ్చట్లు, పూజల వివరాలు, ఆ చిన్ని కృష్ణునికి సమర్పించే  నైవేద్యాలు తెలుపుతూ, ఒక ముఖ్యమైన నైవేద్యం ‘అటుకులతో తీపి వంటకం’ మనకు వివరించి చెపుతున్నారు.

ఈ పండుగ ఉత్తర మరియు పశ్చిమ  భారతం లో విశేషం గా భక్తి శ్రద్దలతో జరుజరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ఆ లీలా మానుష మూర్తికి భక్తులు సమర్పించుకునే నైవేద్యాలను ఉత్తర భారతం లో చప్పన్ భొగ్ అంటారు. అనగా యాభై ఆరు పిండి వంటలు మరియు భోజన పదార్దాలు. దక్షిణ భారతం లో కూడా తమ తమ ఆచారాలు మరియు వీలును బట్టి వీటిలో కొన్నిటిని స్వామి కి నైవేద్యం పెట్టటం కద్దు. కనుక ఆ యాభై ఆరు నైవేద్యాలు ఎమిటో తెలుసుకుందామా?




స్వామి వారి నైవేద్యం : చప్పన్ భోగ్

మోతీ చూర్ లడ్డు , రవ్వ లడ్డు, బేసన్ లడ్డు,  నువ్వు లడ్డు, గులాబ్ జాము,  రస గుల్ల,  కాజు బర్ఫీ,  పాలకోవా, మైదా జీర బిస్కెట్స్, రస మలైశ్రీఖండ్, తీపి మైదా బిస్కెట్స్, కజ్జికాయ, తీపి పూరీ, మాల్పువా, పాయసం, పటికి బెల్లం, వెన్న, కచోడీ, జిలేబి, హల్వా, గాజర్, ఆనపకాయ హల్వా, కలాకండ్ , డ్రై ఫ్రూట్ మిక్సెరు, అన్నం, పులిహోర, దద్దోజనం’, పాలకూర, గుమ్మడి పండు కూర, పన్నీర్ కూర, బంగాళా దుంప కూర, కాబేజి కూర, పప్పు, కడి, పూరీ, మెంతి పూరీ, పెరుగు పచ్చడి, సగ్గు బియ్యం పరవాన్నం, సగ్గుబియ్యం కిచిడి, సగ్గుబియ్యం వడలు, సగ్గుబియ్యం అప్పడాలు, మిరియపు అప్పడాలు, తియ్యటి పెరుగు, అరటికాయ కూర, కొబ్బరి పచ్చడి, కొత్తిమెర పచ్చడి, చింత పచ్చడి, కారప్పూస, చక్కిలాలు , పెసర వడలు, పకోడీ, ఎర్ర తోటకూర కూర, సెనగల కూర, ఫలాలు

మరి మనం కూడా మన విభవం కొద్దీ ఆ పరమాత్మ కు నైవేద్యాలు సమర్పించుకుందామా?



శ్రీ కృష్ణాష్టమి

శ్రీమతి పద్మా రఘునాద్


శ్రావణ మాసం లో వచ్చే మరో ముఖ్య మైన పండుగ శ్రీ కృష్ణ జన్మాష్టమి. దీనినే జన్మాష్టమి అని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. 

శ్రావణ మాసం లో పదునెనిమిది రోజున (కృష్ణ పక్షం)  శ్రీ కృష్ణ పరమాత్మ జన్మదినం, మహా పర్వదినం గా యావత్ భారత దేశం జరుపు కోవటం ఆనవాయితి గా వస్తోంది.  మోక్షం,  యోగం,  జ్ఞానం, భక్తీ  అన్నిటిని  కలబోసి  తన  అద్భుతమైన  లీలలద్వారా  మానవజాతికి  పరమ పవిత్ర మైన, పూజ్యనీయమైన శ్రీ మద్భగవద్గీత ద్వారా అందించిన  జగన్నాటక  సూత్రధారి మన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకు భక్తి తో నమస్కరిస్తే చాలు  మనల్ని ముక్తి   మార్గం  వేపు తీసుకుని వెళ్ళే మహానుభావుడు.  మరి ఈ పండుగ  సాంప్రదాయం గురించి,  ఆ రోజు సమర్పించే  నివేదనల గురించి కొంచెం తెలుసుకుందామా

అష్టమి తిధి రోజు అర్ధరాత్రి మొదలుకొని ఆ మరునాడు అంతా కూడా శ్రీ కృష్ణుని భజనల ద్వారా, భక్తీ గీతాల ద్వారా అరాధిస్తారు.  ఇళ్ళలోనూ, ఆలయాల లోను చిన్న చిన్న ఉయ్యాలలు కట్టి చిన్ని కృష్ణుని ఊపడం ఒక సాంప్రదాయం గా చెప్పబడుతోంది. ఇళ్ళ ముంగిళ్ళ లోను, ఇంటిలోనూ, శ్రీ కృష్ణుని చిన్న చిన్న పాదాలు వేసి, ముగ్గులతో, రంగులతో అలంకరించి చిన్ని కృష్ణుని కి స్వాగతం పలుకుతారు.  రంగు రంగుల ‘ఉట్టి’ లు కట్టి వాటిని పైకి ఎక్కి కొట్టే పోటీలు కూడా అనేక చోట్ల జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్రం లో దీన్ని ‘దహి హండి’ అన్న గొప్ప పండుగ గా చేసుకుంటారు. భారత దేశం లో ఉత్తర ప్రదేశ్ లోని మధుర, గోకుల్, బృందావనం, మరియు గుజరాత్ లోని ద్వారక  శ్రీ కృష్ణుని జన్మమునకు, బాల్యానికి, రాజ్య పాలనకు  ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలుగా చెప్తూ ఉంటారు. ఈ పర్వ దినమున చాల మంది భక్తులతో ఈ పుణ్య క్షేత్రాలు చాల రద్దీగా ఉండటం కూడా చూస్తూ ఉంటాము. 

మరి ఈ చిన్ని గోపాలునికి సమర్పించే నివేదనల గురించి కూడా తెలుసుకుందామా? మన తెలుగు వారు 16 రకాల ప్రసాదాలు జన్మాష్టమి సందర్భంగా నివేదనలు చేస్తారని చెప్పబడుతోంది. వీటిలో చాలా నివేదన పదార్ధాలు మనం రోజు వాడుతూనే ఉంటాము కూడా!

అటుకులు, బెల్లం, వెన్న, పెరుగు, పాలు, పాల తాలికలు, కొబ్బరి, పేలాల పొడి, పానకం, వడపప్పు, బెల్లం గవ్వలు, వెన్న ఉండలు, వరి పిండి తో చేసే జిల్లేడు కాయలు, కజ్జి కాయలు, సోంపాపిడి, పాయసం ఇలా ఎవరి అభిరుచిని బట్టి వారు భక్తి తో ఆ గోవర్ధన ధారికి సమర్పించటం ఒక ఆచారంగా కూడా తెలుపబడుతోంది. 

అటుకుల తో తీపి నైవేద్యం:
వెన్న, పెరుగు, పాలు చిన్ని కృష్ణునికి చాల  ప్రీతి  కరమైనవి  అయినా,  అటుకులతో  చేసిన తీపి వంటకం విశిష్ట మైన నైవేద్యం గాచెప్పబడుతోంది. మరి ఇది చేసే విధానం కూడా తెలుసుకుందామా

కావలసిన వస్తువులు:
కొంచమే లావుగా వున్న అటుకులు - 1 కప్పు. 
బెల్లం: 100 గ్రాములు. 
నీరు: అర కప్పు 

చేసే విధానం:
అరకప్పు నీటిలో 100 గ్రాముల బెల్లాన్ని వేసి అది కరిగి కొంచెం లేత పాకం అయ్యేదాక స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండండి. మంట తగ్గించి ఉంచండి. 
అటుకులు శుభ్రంగా కడిగి వెంటనే నీరు పూర్తి గా తీసి వేసి, అవసరం అయితే నీటిని పిండిఈ పాకం లో వేసి కలపండి. 
పాకానికి సరిపడా అటుకులను వేయండి. అటుకులు ముద్దలాగా కాకుండగా చూసుకోండి. ఇపుడు స్టవ్ మీద నుండి దింపి నివేదనకు సిద్ధం చేసుకోండి. ప్రసాదం రెడీ!. 
మరి ఇక అందరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినానఆ జగన్నాటక సూత్రధారిని భక్తి తో పూజించి ఈ నివేదన సమర్పిద్దామా







No comments:

Post a Comment