Thursday, August 7, 2014

మరుగున పడుతున్న మన పండుగలు: ‘జంధ్యాల పౌర్ణిమ (ఆగష్టు 10)


జంధ్యాల పౌర్ణిమ
శ్రీమతి నయనా భాస్కర్, హైదరాబాద్

మన దైనందిన జీవనం లోని పరుగులాటలో, ఈ పోటి ప్రపంచం లోని అర్ధం లేని అతి వేగంలో పడి, మన సంస్కృతికి అద్దం  పట్టే  ఎన్నో అనాదిగా ఆచరణలో ఉన్న సంప్రదాయాలను మరచిపోతున్నాం. ఇలా క్రమం గా మరుగున పడుతున్న సాంప్రదాయాల్లో 'నూతన యజ్ఞోపవీత ధారణ' ఒకటి అని చెప్పుకోవచ్చును. ఇది ఉపనయనము జరిగి, యజ్ఞోపవీతం ధరించే వారందరూ గుర్తు పెట్టుకోవలిసిన విషయము. “అయ్యో! అవును కదా! అయితే ఎప్పుడు యజ్ఞోప వీతము మార్చుకోవాలి?” అనే ఆలోచనలో పడ్డారా? కంగారు పడకండి.  మీకు, మరుగున పడిన మంచి విషయాలు గుర్తు చేసి మన సంస్కృతిని, సంప్రదాయాలను సుసంపన్నం చేసుకునే గురుతరమైన భాద్యత చేపట్టటమే ఈ బ్లాగు లక్ష్యము. ఇక శ్రద్దగా చదువుకోండి .

‘యజ్ఞోపవీతము’ వ్యవహారిక నామము 'జంధ్యము'.  ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు మన దేశం లో ప్రాంతీయ బేధం లేకుండా ప్రజలంతా ఏ పేరుతొ పిలుచుకున్నా 'రాఖి 'పండుగను అన్నా చెల్లెళ్ళందరు ఆప్యాయానురాగాలతో జరుపుకుంటారు కదా? కానీ అదే పర్వదినం 'జంధ్యాల పౌర్ణమి' అని కూడా పిలవబడుతుందనీ, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారులకు కాని, గృహస్తులకు కాని ఆ పర్వదినాన   పాత యజ్ఞోపవీతం విసర్జించి, నూతన యజ్ఞోపవీతము ధరించాలని ఎంతమందికి గుర్తుంది అంటారు?

హిందూ మతం లోని కొన్ని వర్గాలలో మగ వారికి ఏ అనుష్టానం చేయడానికైనా, వివాహం చేసుకోవడానికైనా, అర్హత నిచ్చేది యజ్ఞ్యోపవీత ధారణే! అందుకని వేదపండితుల ద్వారా ఉపనయనం చేసుకున్న మగవారంతా ‘యజ్ఞోపవీతము’ అంటే, జంధ్యం ధరించి  తీరాలి. సంద్యావందనం చేసుకుని  తీరాలి అని తర తరాల సంప్రదాయం. ఒక సారి జంధ్యం ధరించిన తర్వాత కొన్ని సందర్భాలలో జంధ్యం మార్చుకుంటూ వుండాలి. జందెపు పోగు తెగినప్పుడూ, జాతాశౌచ, మృతాశౌచములు ముగిసిన తర్వాతా, శవమును తాకినప్పుడూ, నూతన యజ్ఞోపవీతాన్ని స్నానాంతరం ఆచమనం చేసి, సంకల్పం చెప్పుకుని ధరించాలి.

అలాంటి సందర్భాలలోనే కాకుండా, పవిత్రమైన 'శ్రావణ పౌర్ణమి' రోజున 'జంధ్యాల పౌర్ణమి' పండగ సందర్భముగా, పాత యజ్ఞోప వీతం వర్జించి నూతన యజ్ఞోప వీతం  ధరించాలి. స్నానాదులు కావించి, ఆచమనం  చేసి, సంకల్పం చెప్పుకుని, చివర "మమ శ్రౌత, స్మార్త నిత్య కర్మానుష్టాన, మంత్రానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్నోపవీత ధారణం కరిష్యే!" అని చెప్పి జంధ్యానికి మూడు చోట్ల పసుపు, కుంకుమ రాసి, సర్వ దేవతలను తలుచుకుంటూ ఈ క్రింది శ్లోకమును

"భూరగ్నించ పృథువీం భువో వాయుంచ అంతరిక్ష స్వరాదిత్యంచ దివో భూర్బు వస్వశ్చంద్రమాంచ దిశశ్చ"
యజ్ఞోప వీతం పరమం పవిత్రం
ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం 
యజ్ఞోపవీతం బలమస్తు తేజః"

అని   పటించుకుంటూ, జంద్యమును రెండు చేతుల  వ్రేళ్ళకు తగిలించి దండ వలె ఎత్తి పట్టుకుని, కుడి చేతిలో పూర్తిగా దూర్చి కుడి భుజము నుండి శిరస్సు పై నుంచి ఎడమ భుజము మీదకు వేసుకోవాలి.

పాత జంధ్యం, కొత్త జంధ్యం కలిపి కుడి అరచేతిలో ఉంచుకుని గాయత్రి మంత్రం పది సార్లు జపం చేయాలి. పాత జంధ్యాన్ని క్రింద నుంచి పాదాలకు తగల కుండా తీసి వేసి;

"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మల భూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే"

అని చెప్పుకుని ఎవరు త్రొక్కని చోట వదిలి వేయాలి. 

ఇలా ఏంతో  విశిష్టత కలిగిన యజ్ఞోవీతం యొక్క విశిష్టతను మరువకుండా ఈ నెల పదవ తారీఖున వచ్చే 'జంధ్యాల  పౌర్ణమి' పండుగను 'రాఖి' పండుగతో పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకుని, నిత్యం సంద్యావందనం గావించుకుంటూ దీర్ఘాయురారోగ్యాలను పొందగలరు.      




*****

No comments:

Post a Comment