Wednesday, November 26, 2014

‘ఘాటైన అల్లం – ధీటైన బెల్లం’


ముందుమాట:

“ఈ మధ్యనే వాడికి పెళ్ళయ్యింది. అప్పట్నించి వాడికి తల్లి అల్లం, ఆలి బెల్లం అయిపోయింది సుమా!”  అన్న పెదవి విరుపు మాటలు మన నిత్య జీవితంలో ఏ పెద్దవారో అనటం వింటూనే వుంటాం. మరి అల్లం, బెల్లం రెండూ మన తెలుగు భోజనం లో విశిష్టమైన పదార్దాలే కదా? అల్లపు ఘాటు లేని కూరలు, పచ్చళ్ళు మరియు అల్పాహారాలు బహు తక్కువ. అలాగే బెల్లపు తీపితనం లేని పులుసులు, దప్పళాలు, చారులు మరియు పులుసు బెల్లం కూరలు ఊహించగలమా? మరి వీటి మధ్య పోటీలు, పోలికలు ఎందుకోచ్చాయో? నాకైతే తెలియదు గాని, ఈ విషయాన్ని కొద్దిగా లోతుగా పరిశీలించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి పద్మా రఘునాద్. మొన్నటి అల్లం పచ్చడి రుచి ఇంకా జిహ్వని వదిలి ఉండదు. మరి ఇది కూడా చదివి ఆనందించండి.

రమణ బంధకవి

సంపాదకుడు



అల్లం…బెల్లం


శ్రీమతి పద్మా రఘునాద్


ఈ రెండు పదాలని ప్రక్క ప్రక్కన చూడ గానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది; “తల్లి అల్లం.. పెళ్ళాం బెల్లం అయిపొయింది వాడికి”  అనే విసుర్లు, ఛలోక్తులు, విమర్శలు, నిట్టూర్పులే మరి.

అసలు ఈ విధమైన పోలిక ఎందుకు వాడుకలోకి వచ్చిందా? అని ఒక్క నిమిషం ఆలోచిస్తే, బహుశ ఈ రెండు పదార్దాలకున్న వాటి వాటి సహజమైన రుచి, వాసనలు కారణం కావచ్చు అని అనిపిస్తుంది.

అంటే, అల్లానికి వున్న సహజమైన ఘాటు, కారం అనే గుణాల వలన, మనకు అప్రియమైన వారిని అల్లం తో పోల్చటం, అదే విధంగా బెల్లాని కున్న సహజమైన తీపి రుచి వలన, మనకు ప్రియమైన వారిని బెల్లం తో పోల్చటం జరుగుతోంది అని అనుకోవచ్చును.

ఇంకొంచెం పరిశీలించి చూసినట్లయితే, అల్లం పని బెల్లం చేయలేదు. బెల్లం పని అల్లం చేయలేదు. అంటే వేటికవే, వాటి వాటి సహజ మైన, రుచులతో మనకు ఉపయోగకరం గా  వున్నాయన్నమాట. మొదట అల్లం గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాము.

అల్లంకున్న ఘాటైన రుచి వలన అజీర్ణం, దగ్గు, జలుబు, గొంతు నెప్పి మొదలైనవి నెమ్మదిస్తాయని, వికారం తగ్గించే గుణం కూడా వుందని అదే కాకుండగా, కాన్సర్ నివారణకు పనికి వచ్చే మందులు తాయారు చేయటానికి కూడా అల్లం మీద పరిశోధనలు జరుగుతున్నట్లు గా ఆరోగ్యానికి సంబంధించిన పేపర్ల ద్వారాపత్రికల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా సమాచారం తెలుస్తోంది.

ఇక బెల్లం మాటకి వస్తే, బెల్లం కి వున్న అమోఘమైన తీపి రుచి తో పాటు, మనకు జీర్ణ కారి గా ఉపయోగిస్తుందని, అందులో శరీరానికి అవసరమయ్యే రకరకాల మినరల్స్, విటమిన్స్, ముఖ్యంగా ఐరన్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది. కాబట్టి వాటి వాటి  విలువలు, ఉపయోగాలు  గుర్తించి, తగిన మోతాదులలో వాడుకుంటే, మనకు అవి ఎంతో మేలు చేస్తాయి.

మన నిత్య జీవితం లో మనకు తారసపడే వ్యక్తులు కానీ, మనకు సంబంధం వున్న వ్యక్తులు కాని, ఎవరికీ వారే, వారి వారి సహజ గుణాలతో ప్రత్యేకంగా వుంటారు. ఎదుటి వారి సహజ గుణాలను గుర్తించి అర్ధం చేసుకుని, వాటిని వారి దోషాలు గా  ఎత్తి చూపకుండగా, సమన్వయం తో వ్యవహరిస్తే వారిలో మనకు నచ్చే గుణాలు కూడా త్వరగా, సులభంగా విదితమయ్యే అవకాశం ఉంటుంది.

ఇక అల్లం, బెల్లం గురించి అంటారామంచి ఘాటైన అల్లం పచ్చడి నూరుతున్నపుడు ఒక బెల్లం ముక్క కూడా వేసి చూడండి. అల్లం పచ్చడి అమోఘమైన రుచితో తయారవుతుంది. ఇకముందు ఎపుడైన, “తల్లి అల్లం.. పెళ్ళాం బెల్లం” అని వినిపిస్తేరెండు విభిన్న గుణాలున్న  ఈ రెండు పదార్ధాలు కలిపినపుడు తయారయ్యే రుచి కరమైన పచ్చడిని వెంటనే దృష్టికి తెచ్చుకుంటే, ఇంటికి, వంటకి మరి వంటికి కూడా చాలా మేలు జరుగ్తుందని ఆశిస్తూ ఇక సెలవు.







Monday, November 24, 2014

‘జీర్ణ కారిణి – అల్లం చట్నీ’


ముందు మాట:

“సార్ కి పెసర రోస్ట్, అల్లం చట్నీ స్పెషల్!” అని ఆదివారం పొద్దుట నేను టిఫిన్ కి వెళ్ళినప్పుడు మా వీధి చివర రాఘవేంద్ర భవన్ రమేష్ వాళ్ళ పని వాళ్ళకి పురమాయించడం కద్దు! తెలుగునాటి అల్పాహారాలు; ముఖ్యం గా పెసరట్టు, వడ, మైసూరు బజ్జి, ఇడ్లి, తమ ప్రియతమ సఖి అయిన ‘అల్లం చట్నీ’ కైవారం చెయ్యకుండా పళ్ళెం లోకి వేంచేయటం అరుదు. ఇక ప్రాంతానుసారం, కొన్ని చోట్ల అరుణ వర్ణం లోను, మరి కొన్ని చోట్ల ఆకుపచ్చ వర్ణం లోను దర్శనం ఇవ్వటం చూస్తూ ఉంటాం. అలాగే, ఒక్కోసారి పొగరైన కారం పులుపు రుచుల సమ్మేళనం గా ఉంటే, మరి కొన్ని తావులలో నమ్రత గా బెల్లపు తీపి తనాన్ని కలుపుకుని జిహ్వకి గిలిగింతలు పెడుతుంది.  మరి అటువంటి చట్నీ తయారీ గురించి రత్న గారు ఏమి చెపుతున్నారో చూద్దామా?

రమణ బంధకవి

సంపాదకుడు



‘అల్లం  చట్నీ’


శ్రీమతి రత్నా శ్రీనివాస్

అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో మీకు తెలిసిందే! దీన్ని జీర్ణకారిగా పరిగణిస్తారు. అలాంటి అల్లంతో పచ్చడి చేయటం తెలుసుకుందాము.


కావలసిన వస్తువులు :
అల్లం                                                          25 గ్రాములు
చింతపండు                                                  50 గ్రాములు
ఉప్పు                                                         రుచికి సరిపడా
బెల్లం                                                           30 గ్రాములు

పోపుకు కావలసిన వస్తువులు :

నూనె                                                          4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు                                                2  టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి                                                 10-12
ఆవాలు                                                       2 టీస్పూన్స్
ఇంగువ                                                      1 టీస్పూన్
మెంతులు                                                   1 టీస్పూన్

తయారు చేయటానికి పట్టే సమయం :             15 నిమిషాలు

తయారు చేసే విధానం: 

ముందుగా అల్లాన్ని శుబ్రంగా మట్టి పోయేలాగా కడిగి చెక్కు తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి. చింతపండును కడిగి ఒక కప్పులోతగినంత నీరు పోసి నానబెట్టుకోవాలి. ఒక బాణలి తీసుకుని నూనె వేసుకుని వేడిక్కిన తరువాత మెంతులు వేసి రంగు మారేక మినపపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. తరువాత ఆవాలు వేసి చిటపటలాడేక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆఖరుగా ఇంగువ వేసి స్టవ్ ఆపుచేసుకోవాలి.

పోపును వేరొక పాత్రలోకి తీసుకుని, అదే బాణలి లో నానపెట్టిన చింతపండును పిసికి ఆ గుజ్జును వేసి మరగబెట్టుకోవాలి.  చింతపండు పులుసు మరుగుతున్నప్పుడే బెల్లం కూడా వేసుకోవాలి.  రెండింటి మిశ్రమము మరిగి గుజ్జులాగా అయిన తరువాత స్టవ్ ఆపెయ్యాలి.
పోపు చల్లారిన తరువాత, మిక్సీ లో పోపుని తిప్పుకోవాలి. తరువాత తరిగిన అల్లం ముక్కలు, చింతపండు-బెల్లం  గుజ్జు, తగినంత ఉప్పు వేసి మిక్సీ లో తిప్పుకోవాలి. నలిగిన పచ్చడిని తీసుకుని ఒక మంచి పాత్రలోకి మార్చుకోవాలి.

సలహాలు:
1.అల్లం పచ్చడిని వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాల రుచిగా వుంటుంది.
2. దీనిని ముద్ద పప్పులో నంచుకుని తింటే పప్పు రుచి ద్విగుణీకృతం అవుతుందనటంలో సందేహం లేదు
3. వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేసినప్పుడు, దాని మీద నెయ్యి వేసుకుని అల్లం చట్నీ నంచుకుని చూడండి. ఆ మజానే వేరు.
4. దీనిని చపాతీ, పరాటా,ఇడ్లీ, దోసలల్లోకి కూడా నంచుకుని తినవచ్చును. దీనిని కొందరు ఏడాది నిలువ పచ్చడి గా కూడా పెడతారు. ఐతే అందులో మినపపప్పు పోపులో వేయరాదు.
5. పైన చెప్పిన పచ్చడి ఫ్రిజ్ లో వుంచితే వారం, పది రోజుల పాటు నిలువ చేసికొనవచ్చును.




  












Saturday, November 22, 2014

పిల్లల కోసం ప్రత్యేకం! ప్రాచ్య పాశ్చాత్య వంటల మేలి కలయిక – ‘ఉప్మారోని’


ముందుమాట:

పట్టాభి లాంటి పిల్లల మనసు రంజించే ఉపాహారాలను మీ ముందుకు తెస్తామని ఇదివరలో చెప్పుకున్నాం. మీ పిల్లలంతా ఇంకా ‘ఇడ్లీపిజ్జా’ రుచి మరచి ఉండరు. అలాంటి మరియొక ఆకర్షనీయమైన ఉపాహారం ‘ఉప్మారోని’ ని మీ ముందుకు తెస్తున్నారు శ్రీమతి రత్నా శ్రీనివాస్. ఇది ఇటలీ సాంప్రదాయానికి చెందిన ‘మేకరోనీ’ అనీ వంటకాన్ని మన సాంప్రదాయపు ఉప్మాతో కలిపి చేసిన రుచికరమైన ఉపాహారం. మీరు కూడా మీ పిల్లలకు చేసే పెట్టండే!

రమణ బంధకవి

సంపాదకుడు


‘ఉప్మారోని’

శ్రీమతి రత్నా శ్రీనివాస్

పట్టాభి వేసవి సెలవుల్లో సమ్మర్ కాంప్ కి వెళుతుంటాడు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు సమ్మర్ కాంప్ లో రకరకాల కార్యక్రమాలు వుంటాయి. తోచలేదనే  పేచి వుండదు.

"పట్టు గాడు వచ్చే వేళ ఐనట్లుందే!” బాల్కనీ లో కూర్చుని మజ్జిగ చిలుకుతూ అన్నారు సూరిడమ్మగారు. 

పట్టాభి రానే వచ్చాడు. వస్తూనే "మమ్మీ! మాకొక ప్రాజెక్ట్ ఇచ్చారు. అందరికి ఒకొక్క టాపిక్ ఇచ్చేరు. నాకు ‘Indianising Italian cuisine ఇచ్చేరు" ఎంతో ఉత్సాహంతో చెప్పేడు. 

"అంటే ఏమిట్రా?" అంతే ఉత్సకతో అడిగేరు సూరిడమ్మ గారు . 
"మామ్మా! నేను ఇటలీ డిష్ ని ఇండియన్ స్టైల్ లో చేసి తీసుకెళ్ళాలి" వివరించాడు . 

అప్పటివరకు టీవీ చూస్తున్న లక్ష్మీ కాంతం గారు వాల్యూం తగ్గించి వారి సంభాషణ వినటానికి ప్రయత్నించారు. ఆయనకి ఇటలీ లో '', డిష్ లో 'డి'  తప్ప తతిమ్మ సంభాషణ ఏది చెవి కెక్కలేదు. 
"ఏమిటి పట్టు! ఇడ్లీ తింటావా? ? ఇంట్లో పిండి లేదా? ఇద్దరి ఆడవాళ్ళని అడిగేరు అమాయకంగా . 
పట్టాభికి నవ్వాగలేదు. కామాక్షి చెప్పబోతున్నంతలో  పట్టాభి నవ్వుతూ "ఇడ్లీ కాదు తాతా! నేను ఇటలీ డిష్ ని ఇండియన్ మెథడ్ లో చేయాలి. మిగతా వాళ్లకి వేరే కంట్రీస్ వి ఇచ్చేరు. అందరం అన్ని షేర్ చేసుకుని తింటాము" ఇంకా విడమర్చి చెప్పేడు.  
"ఓ! అలాగా ! ఇటలీ డిష్ అంటే ఏమి చేస్తావు?
"నేను చేయలేను కదా! మమ్మీ చేస్తుంది" అమాయకంగా అన్నాడు. 
ఈ ప్రాజెక్టులు అవీ పిల్లలకు కాదు. పిల్లల తల్లులకే. ఏమిటో ఈ చదువులు! అర్ధం కానట్లు అన్నారు అత్తగారు. 

కాదత్తయ్య! పిల్లలందరూ తెచ్చినవి అందరిని పంచుకుని తినమంటారు. అందువల్ల వాళ్లకి ఒకరితో పంచుకునే గుణం అలవడుతుంది, అంది కామాక్షి. 
ఏమోనే! ఇటలీ దేశం ది చేయాలిట. ఏమి చేస్తావో? ఎలా చేస్తావో?
కామాక్షి అడిగింది "పట్టూ! Italian Cuisine లో ఏముంటాయి చెప్పు?"
"నాకు పీజ, పాస్తానే తెలుసు" అన్నాడు
"కిందటి సారి ఇడ్లి పిండి తో పిజ్జా చేసేము కదా!  కనుక ఇపుడు పాస్తాతోనే ఏమైనా చేయాలి. సరేలే నువ్వు బట్టలు మార్చుకుని రా. అన్నం తిందువు గాని" అంది కామాక్షి. పట్టాభి బట్టలు మార్చుకోవటానికి వెళ్ళేడు. 
భోజనాలకి కూర్చున్నారు. "మమ్మీ ! ఆలోచించేవా ! ఏమి చేస్తావు? అడిగేడు పట్టాభి. 
ఇండియన్ స్టైల్ లో చేయాలి అంటే మన సంప్రదాయం వుండాలి. ఉప్మా చేద్దాం. సరేనా?అంది 
ఛీ! పాస్తతో ఉప్మానా?
నేను బాగా చేస్తానుగా!  స్కూల్ లో అంతా  మెచ్చుకుంటారు చూడు అంది కామాక్షి.
"మమ్మీ! ఐతే రేపు  నువ్వు లేచినపుడు నన్ను కూడా లేపు. నువ్వు చేస్తుంటే నేను చూసి నేర్చుకుని క్యాంపు లో ఎక్ష్ ప్లైన్ చేస్తాను" అన్నాడు పట్టాభి. 

మరునాడు ఆరు గంటలకల్లా పట్టాభిని లేపింది. మొహం కడుక్కుని వస్తే ఉప్మా చేద్దామని చెప్పిన్ది. పట్టాభి మొహం కడుక్కుని, బుక్, పెన్ తెచ్చుకుని వచ్చాడు . 

కామాక్షి మేకరోని తో చేద్దామా అంది. సరే అన్నాడు పట్టాభి.  ప్యాకెట్ కట్ చేసి 100 గ్రాముల ఒక బౌల్లో పోసింది. సుమారు 500గ్రాములు నీళ్ళు కొలిచి గిన్నెలో పోసి మరిగించింది. పట్టాభి జాగ్రతగా గమనిస్తూ పుస్తకం లో రాసుకుంటున్నాడు. నీళ్ళు మరిగేక మేకరోని వేసి కలిపింది. 
"ఇది కుక్ అవ్వటానికి ఎంత సేపు పడుతుంది మమ్మీ?” 
" సుమారు 15 నిమిషాలు. ఈలోగా నువ్వు పాలు తాగు" అని పాలు ఇచ్చింది . 
పట్టాభి పాలు తాగుతుంటే ఉప్మా పోపు కి సామాను తీసుకుంది. బాండి  పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసింది. సెనగ పప్పు, మినప పప్పు వేసి వేయించింది. ఆవాలు వేస్తుంటే పట్టాభి ఉత్సాహంగా దగ్గరకి వచ్చి నుంచుంటే ఆవాలు పేలుతాయి దూరంగా నుంచోమంది. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆపేసింది.  మేకరోని కుక్   అయిందేమో చూస్తా నన్నాడు పట్టాభి. కామాక్షి గరిటెతో తీసి నొక్కి చూడు అంది. పట్టాభి నొక్కి చూసి నోట్లో వేసుకున్నాడు. ఇంకా కొంచెం సాఫ్ట్ గా అవ్వాలి అన్నాడు. 
“అయితే నువ్వు ఈ లోగా స్నానం చేసేయి" అంది కామాక్షి . 
"నా స్నానం అయ్యేంతవరకు వెయిట్ చేయి. నువ్వు చేసేయకు" అన్నాడు. సరేనని వాడికి బట్టలు ఇచ్చింది. 
పట్టాభి స్నానం చేసి వచ్చేలోపు ఉడికి పోయింది. పట్టాభి కూడా బట్టలు వేసుకుని రెడీ ఐపోయాడు. 
ఒక చిల్లుల పళ్ళెం తీసుకుని ఉడికిన మేకరోని  వేసి నీళ్ళు వార్చేసింది. ఇపుడు పోపు వున్న పాన్ లో మేకరోని వేసి కలిపింది. పట్టాభి నేను కలుపుతానని కలిపేడు. వాడికి ఒక మైక్రోవేవ్ బౌల్ ఇచ్చి మేకరోని ఉప్మా అందులో పెట్టింది. ఇంకొక చిన్న బాక్స్ లో నిమ్మకాయ చెక్క కూడా పెట్టి ఇచ్చింది. 

మీ స్కూల్ లో మైక్రోవేవ్ వుంది కదా! మీరు తినే ముందు 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసి , నిమ్మకాయ పిండి ఈ గరిటెతో కలుపు అని ఒక గరిటె ఇచ్చింది. పిల్లలకి పెట్టడానికి పేపర్ ప్లేటులు, ప్లాస్టిక్ స్పూన్స్ అన్ని సర్ది ఒక బాగ్ లో పెట్టింది. మీ టీచర్ ఏమి తెచ్చావంటే "ఉప్మారొని" అని చెప్పు అంది. పట్టాభి చాల సంతోషించాడు. 

అత్తగారు, మావ గారు వచ్చి చూసారు. చాల తొందరగా ఐపోయింది మామ్మ! మమ్మీ దీని పేరు "ఉప్మారొని " అని పెట్టింది. మమ్మీ చేసిందంతా చూసి నేను బుక్ లో రాసుకున్నాను" అని చూపించాడు . 
 "మా నాయనే! బాగా చెప్పు నాన్నా  అని అత్తగారు ముద్దు చేసేరు. 
 మావ గారు ప్లాస్టిక్ బాగ్ పట్టుకుని పట్టాభిని బస్సు ఎక్కించి వచ్చేరు.
    
మధ్యాహ్నం పట్టాభి సమ్మర్ క్యాంపు నుండి వచ్చేడు. "మమ్మీ నేను బాగా ఎక్ష్ ప్లైన్ చేసెను. అందరు టేష్టి గా ఉందన్నారు. నువ్వు ఇచ్చిన ఉప్మా అంతా  ఐపోయింది" అని డబ్బా చూపించాడు. కామాక్షి "మరి నేను చెప్పలేదు? అందరు బాగుంది అంటారని! కొంచెం గర్వం, కొంచెం ఆనందంగాను అంది. 
"బావుందిరా! అన్ని దేశాల వాళ్ళ తిండిని మన సంప్రదాయం లో తిన్నారన్న మాట" ఆశ్చర్యపోతూ అన్నారు సూరిడమ్మ గారు. 
  
మరి మీరు కూడా అలోచించి మీ పిల్లలకు నచ్చే ఇటువంటి ఉపాహారాలు చేసి పెట్టొచ్చు.