Wednesday, November 5, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 13: కార్తిక పున్నమి ----కన్నుల కలిమి!


ముందుమాట:

కార్తీక పున్నమి గొప్ప పర్వ దినం. కుమారస్వామికి, శివకేశవులకి ఎంతో ప్రీతిపాత్రం! అంతే కాదండోయి! రేపటి రోజున వచ్చే ఈ పండుగ శిక్కుల ఆది గురువు అయిన శ్రీ గురు నానక్ దేవ్ జయంతి మహోత్సవం కూడా! ఈ పండుగ విశేషాలు ఎన్నో! పగలంతా ఉపవాస దీక్ష మరియు అభిషేకాలు, సాయం సమయం లో తులసమ్మ వద్ద లెక్కలేనన్ని దీప పుంజాలు. మరి ఆకాశం లో దేదీప్యమానం గా వెలుగులు వెదజిల్లే  ఆకాశ దీపం మన అందాల చందురుడు. రాత్రికి బంధు మిత్రులతో పండు వెన్నెలలో, తులసి వనం లో కార్తీక సమారాధన. అన్నట్లు మరిచాను! మనం అందరు దీపావళి నాడు కాల్చాలని ఎంత ఉబలాట పడినా, కొంత బాణాసంచా దాచి ఉంచాము చూడండి! మరి ఇప్పుడు ఆ చుచ్చుబుడ్లు, మతాబులు (నాగుల చవితి నాడు కొన్ని వాడేయగా మిగిలినవన్నమాట)  బయటకి తీసి ఈ పున్నమి నాడు చక్కగా వెలిగించేసుకోండి. అందుకే కాబోలు ‘కార్తిక పున్నమి - కన్నుల కలిమి’ అని అందంగా చెపుతున్నారు శ్రీమతి నయన కస్తూరి తమ వ్యాసంలో!

రమణ బంధకవి

సంపాదకుడు



కార్తిక పున్నమి ----కన్నుల కలిమి!

శ్రీమతి నయన కస్తూరి


కార్తీక మాసం లో అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి, సర్వేశ్వరునికి మిక్కిలి ప్రీతికరమైన రోజు. కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి అయితే మిక్కిలి విశిష్టమైనది. కుమార స్వామికి ప్రియమైన రోజు. కార్తీకంఅన్న పేరు కూడా ఈ మాసం ఇందు చేతనే పొందింది. ఈ రోజును మహాకార్తిఅని కూడా పిలుస్తారు. అంతేకాకుండా మన పురాణాల్లోని ఒక కథనం ప్రకారం త్రినేత్రుడు త్రిపురాసురుడు అనే రక్కసుని చంపినంత దేవతలంతా ఆనందం తో జ్యోతులను వెలిగించుకోవడం చేత ఈ రోజును త్రిపురారి పూర్ణిమమరియు దేవ దీపావళి’ అని కూడా పిలువబడుతుంది. ఈ పవిత్రమైన పౌర్ణమిని మనం నవంబర్ 6 న జరుపుకుందాము.

ఈ పవిత్ర మైన రోజున ఏ చిన్న సుకర్మ కైనా హరిహరులు మిక్కిలి సంతసించి, పుణ్య ధామాలు ప్రసాదిస్తారు. అయితే ఈ రోజున ఏమి చేయాలో ఏమి చెయ్యగలమో చూద్దాము. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే లేచి, తలారా స్నానం చేసి(నదీ స్నానం చేయగలిగితే మరీ మంచిది), పగలంతా ఉపవాసం ఉండి,  దైవసేవలో  గడిపితే ఉపవాసం నిజమైన ఉపవాసం అవుతుంది. హరిహరుల నామ జపం చేసుకోవచ్చు. శివాలాయాల్లో, వైష్ణవాలయాలలో దీపారాధన చేసుకోవచ్చు. అరటి దొప్పలో  దీపం వెలిగించి, ఏదైనా నదిలో కానీ, సరస్సులో కాని వదలాలి. పట్టణాల్లో నగరాల్లో కుదరక పొతే ఇంట్లోనే ఒకపెద్ద గిన్నెలో నీళ్లు పోసి అందులో వదిలి కూడా మనం ఆద్యాత్మిక ఆనందం పొందవచ్చును. గృహం లో కానీ, దేవాలయాల్లో కానీ, ఏకాదశ రుద్రాభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చును. విష్ణు సహస్రానామస్తోత్రం, లక్ష్మీ స్తోత్రాలు  పారాయణం చేసుకోవచ్చును. ఇవేమీ కుదరకపోతే దగ్గరలో వున్న ఏదైనా దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవచ్చును. ఈ రోజు దైవ దర్శనం కూడా ఎంతో పుణ్యప్రదం!

దేవాలయం లో 365 వత్తులతో ఆవునేతి తో దీపం వెలిగించుకుంటే సంవత్సరం పొడుగునా దీపారాధన చేసిన పుణ్యం ప్రాప్తిస్తుంది. దీపదానాలు, వస్త్రదానం, సాలగ్రామ దానం స్వయంపాకం, అన్నదానం లాంటి  కార్తీక దానాలు చేసుకోవడానికి ఈ రోజుని మించిన యోగ్యమైన రోజు లేదు అంటే  అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. శివాలయాల్లో ఈ రోజు సాయంకాలం శివలింగం లాంటి పవిత్ర ఆకారాల్లో దీపాలు పేర్చి, జ్వాలాతోరణం ప్రజ్వరల్లింప చేస్తారు. అందులో పాల్గోనినా, కేవలం దర్శించినా చేసిన పాపాలన్నీ పోయి, జన్మజన్మలకూ తరగని పుణ్యం స్వంతమవుతుంది. మానవులకు ఇది నేత్రపర్వం! ఏవో దేవలోకాల్లో వున్న అనుభూతికి మనస్సు లోను అవుతుంది.

పగలంతా ఉపవాసం ఉండి, సాయకాలం వివాహం అయిన స్త్రీలందరూ తులసి కోటలోనే ఉసిరి కొమ్మని కూడా పెట్టుకుని, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటారు. రంగవల్లులతో తీర్చి దిద్దుతారు. బృందావనం తో పాటు ఇల్లంతా దీపాలతో దీపావళికి అలంకరించినట్లు అలంకరించుకుంటారు. తులసమ్మ  దగ్గర తులసీ, శ్రీ కృష్ణ భగవానుడికి లక్ష్మీ నారాయణులకి షోడశోపచార పూజ చేసుకుని, తులసీ మహాత్మ్యంతులసీ  స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాని పారాయణం చేసుకుని, వడపప్పు, పానకం, పచ్చిచలిమిడి, వివిధ రకములైన పళ్ళు, నివేదన చేస్తారు. అన్ని పదార్ధాలతో మహానివేదన కూడా చేస్తారు. రాత్రి చంద్రుడిని, నక్షత్రాన్ని చూసి బంధుమిత్రులతో కలిసి సామూహిక భోజనం వీలు అయితే తులసి వనం లో ఉసిరిక చెట్టు క్రింద భోజనం చేసి, ఉపవాస దీక్ష విరమిస్తారు. ఇలా చేసుకున్న వారికి దీర్ఘాయువు, స్వర్గ సుఖాలు, పితృదేవతల ఆశీస్సులు, మోక్షము ఆ హరిహరుల సాక్షిగా లభిస్తాయి అని భక్తుల నమ్మకం!  కనుక మనం అందరూ రేపు కార్తీక పౌర్ణమి పర్వ దినాన్ని మహా భక్తి ప్రపత్తులతో ఆచరించి ధన్యులం అవుదాము. ప్రధమ గురువైన శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ ని కూడా భక్తి ప్రపత్తులతో స్మరించుకుందాం!
స్వస్తి:


  














No comments:

Post a Comment