Wednesday, November 19, 2014

తెలుగింటి ప్రియతమ రోటి పచ్చడి – మన వంకాయ బండ పచ్చడి



శ్రీమతి రత్నా శ్రీనివాస్ 


వంకాయ బండ పచ్చడి ఏమిటి? బహుశ కారంగా ఉంటుందేమో అనుకుంటున్నారా? లేదండీ! పూర్వం కాల్చిన వంకాయను బండతో నూరేవారు. అందుచేత బండ పచ్చడి అనేవారు. కాలక్రమేణ  ఆ పేరే సార్ధకమై పోయింది. ఐతే దీనినే కొంతమంది వంకాయ ఇగురు అని కూడా అంటారు. 

ఎలా పిలిచినప్పటికిని దీని రుచి మాత్రం అమోఘంగా వుంటుంది. మా వారికి చిన్నప్పుడు పచ్చకామెర్లు వచ్చి తగ్గినపుడు మా అత్తగారు ఈ వంకాయ బండ పచ్చడే చేసి పెట్టేవారుట కారం లేకుండా. దీనిని బట్టి ఇది పథ్యానికి కూడా పనికి వస్తుందని అనుకోవచ్చును. చాలామంది వంకాయలో ఏ పోషక విలువలు లేవు అనుకుంటారు. కాని అది చాల పొరపాటు. వంకాయలో మనకి బాగా పనికి వచ్చే విటమిన్లు A, B, C మాత్రమె కాకుండ కాన్సర్  నివారించడంలోను, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ ఎంతో దోహద పడుతుందిట. 
మరి మన శరీరానికి మేలు చేసే వంకాయతో బండ పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందామా?

తయారు చేయటానికి పట్టే సమయం    :             అర్ధ గంట 

కావలసిన పదార్దములు 
వంకాయ                                                    1
చింతపండు                                                 నిమ్మపండు సైజులో 
ఉప్పు                                                        రుచికి సరిపడా 
ఎండు మిర్చి                                                4
పచ్చిమిర్చి                                                  4
మినపప్పు, ఆవాలు, జీలకర్ర                          చెరొక టీస్పూన్ 
ఇంగువ                                                      సువాసనకు 
కొత్తిమీర                                                     4-5 రెమ్మలు 
పసుపు                                                      చిటికెడు 
నూనె                                                        1 టేబుల్ స్పూన్ 


తయారుచేయు విధానం: 

వంకాయను శుబ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి కాయ మొత్తానికి కొంచెం నూనె రాసి, కత్తితో మధ్య మధ్యలో 2-3  గాట్లు పెట్టి స్టవ్ వెలిగించి ఒక చట్రం  పెట్టి, దాని పైన వంకాయను నిలబెట్టి గాని, పడుకోబెట్టి గాని సన్న సెగన కాల్చాలి. ఒక వైపు కాలేక ముచిక పట్టుకుని జాగ్రత్తగా రెండవైపు కూడా కాల్చాలి. కాల్చిన వంకాయను చిత్రంలో చూడవచ్చును. 

చింతపండుని శుభ్రంగా కడిగి గింజలు, పీచు తీసి ఒక కప్పులో కొద్దిగా నీరు పోసి నానబెట్టుకోవాలి. పోపు మూకుడు తీసుకుని నూనె వేసి వేగేక మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు , జీలకర్ర, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి.  ఈలోగా వంకాయ చల్లారి వుండి   వుంటుంది.  పొట్టును, మసి అంటకుండా   జాగ్రత్తగా తీయాలి. 

వేయించుకున్న పోపులో కొంత మిక్సీలో వేసి, బరక గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, నానిన చింతపండు  కూడా వేసి  గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పొట్టు తీసిన వంకాయలో నలుపుకోవాలి. పూర్వం బండతో నూరేవారు. ఈ రోజుల్లో మిక్సీలో నూరుతున్నారు. ఉప్పు కూడా కలుపు కోవాలి. మిగతా పోపును పైన వేసుకోవాలి. 
బండ పచ్చడి ఎంత తేలికగా తయారయైపోయిందో చూసారు కదా !

సలహాలు : వంకాయ బండ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాల హితవుగా వుంటుంది. 
ఇది చపాతీలలోకి కూడా బాగుంటుంది. 
పులుపు ఇష్టం లేకపోతె చింతపండును మినహాయిన్చుకోవచ్చును. పులుపు పడితే పచ్చడి పుల్ల పుల్లగా, కారం కారంగా వుండి  నోటికి హితవు పుడుతుంది. 


  







No comments:

Post a Comment