Thursday, November 20, 2014

తెలుగు భోజనం లోని కరకరలు --అప్పడాలు, వడియాలు, చల్ల మిరపకాయలు


ముందుమాట:

“మామిడికాయ పప్పులో వేయించిన కరకర లాడే ఊర మిరపకాయలు, తోటకూర పప్పుకూర లో 

కరకర లాడే బాగా వేగిన గుమ్మడి వడియాలు, సాంబారులోకి కరకర లాడే పెళపెళ మంటున్న 

పెసర అప్పడాలు నంచుకుని తినని తెలుగు వాడు ఉండడనటం అతిశయోక్తి కాదేమో! తెలుగింటి 

పెళ్ళిళ్ళలోనూ, పబ్బాలకి, కరకర లాడే ఆకలితో వేచి ఉన్న జనానికి, ఈ తెలుగింటి ‘కర కరలు’ 

ఎంతో భోజనానందాన్నికలిగిస్తాయి. పంక్తి భోజనాలప్పుడు, ఎన్ని పదార్ధాలు వడ్డించినా, ఈ 

కరకరలు రాకపోతే,  వడ్డించేవారి పై కారాలు మిరియాలు నూరటం కద్దు! మరి ఇంత వైభవం కలిగిన 

ఈ తెలుగింటి ‘కరకరలు’ గురించి శ్రీమతి పద్మ కరకర లాడే వాక్యాలతో మీ విస్తర్లో వడ్డిస్తున్నారు. 

ఇక కానీయండి...కర...కర... కర ...!


రమణ బంధకవి


సంపాదకుడు




తెలుగు భోజనం లోని కరకరలు --అప్పడాలు, వడియాలు, చల్ల మిరపకాయలు



శ్రీమతి పద్మా రఘునాద్



అప్పడాలు, వడియాలు, వూరు మిరపకాయలు తెలుగుభోజనంలో ఇమిడి పోయినట్లుగా వేరే ఏ ఇతర భోజనం లోను అంతగా సరిపడవనే చెప్పచ్చు. మన భోజనానికి వన్నె తెచ్చే పెట్టే ఈ మూడు అద్వితీయమైన వస్తువులు, తెలుగు వారి వంట ఇంట్లో ఏదో ఒక డబ్బాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. ఎంత సాదా సీదా మామూలు భోజనానికి అయినా ఇవి తోడయితే ఆ భోజనం ఎంతో ప్రత్యేకతని సంతరించుకుంటుంది. వీటిని చూడగానే అన్నం మీద ఆసక్తి, వెంటనే తినాలన్న తలంపు కలగటం సహజం. పదార్ధాల రుచిలో ఏమి లోట్లు ఉన్నాకూడా  ఇవి నంచుకుని తింటే అవన్ని కూడా భర్తీ అయిపోయినట్లే. 

అప్పడాలు, వడియాలు పెళ్ళిళ్ళు, పండుగల భోజనాలలోను తప్పనిసరిగా ఉండవలసినవే! ఇంటికి ఎవరినా ముఖ్యమైన వారు భోజనానికి వస్తే, వెంటనే డబ్బాలు వెతికి కొంచెం అప్పడాలు, వడియాలు వేయిద్దాం అనే తలంపు అందరికి కలుగుతుంటుంది మరి. అదేకాకుండగా మనం నిర్ణయించుకున్న పదార్ధాలలో ఒకటి, రెండు ఏ కారణం చేత నయినా చేయలేకపోతే, వెంటనే  ఆ లోటు అనిపించకుండగా అప్పడాలు, వడియాలే ఆదుకుంటాయని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనం వీటిని కూడా ఒక ఆధరవు కిందనే పరిగణిస్తూ ఉంటాం!

ఇదివరకటి కాలం లో అప్పడాలు, వడియాలు ఇంట్లోనే పెట్టుకునే వారు. ఉమ్మడి కుటుంబాల లోని గృహిణులు మధ్యాహ్నం పూట పిచ్చాపాటి మాట్లాడుకుంటూ అప్పడాలు వత్తుకునే వారని, వాటిని డాబా మీద ఎండలో నులక మంచం మీద పాత చీరలు వేసి వాటి ఫై ఎండబెట్టే వారని  మా బామ్మగారు చెప్పేవారు. 

ఇపుడు ఇవన్ని మార్కెట్లలో విరివిగా దొరకటం చేత ఇళ్ళల్లో శ్రమకోర్చి పెట్టటం చాలా తగ్గిపోయిందనే చెప్పాలి.  పైగా  దుకాణాల్లో దొరికే అప్పడాలు ఒకే సైజులో చూడటానికి ముచ్చటగా కూడా కనిపిస్తుంటాయి.  ఈ అప్పడాలు రకరకాలు. పెసర అప్పడాలు, మినప అప్పడాలు, మిరియపు అప్పడాలు, కారపు అప్పడాలు మొదలైనవి. ఎవరి అభిరుచిని  బట్టి వారు ఆయా రకాల అప్పడాలు వాడుతూ ఉంటారు. 

ఇక వడియాల సంగతికి వస్తే ఎన్ని రకాలో చెప్పలేము.  మినప వడియాలు, గుమ్మడి వడియాలు, పెసర వడియాలు, ఉల్లిపాయ వడియాలు, పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, టమాటో వడియాలు, రేగి వడియాలు కొన్నిముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చును. ఇవి కూడా దుకాణాలలో విరివిగానే దొరుకుతున్నాయి. అయితేఇప్పటికి వడియాలు, చల్ల మిరపకాయలు  మాత్రం కొంతమంది ఇళ్ళల్లో స్వయంగా  పెడుతూనే ఉంటారు.  ఈ మధ్యనే మనం కామాక్షి కధల్లో ని కామాక్షి గారు వారి అత్తగారు సురీడమ్మ గారితో కలసి గుమ్మడి వడియాలు పెట్టుకునే విధానం గురించి నేర్చుకున్నాము కూడా! 

అప్పడాలు, వడియాలు, చల్ల మిరపకాయలు దాదాపు అన్ని పదార్ధాలలో నంచుకోటానికి బాగున్నప్పటికీ, కొన్నిటిలో నంచుకోవటం చాల ప్రత్యేకంగా తప్పనిసరిగా ఉంటే  బాగుంటుందని అనిపించక మానదు.  అప్పడాలు సాంబారు, పులుసు, చారుల్లో నంచుకుని తింటే చాలా  బాగుంటాయి. అప్పడాలు వేయించుకున్నా, కాల్చుకుని తిన్నా కూడా బాగుంటాయి. మిరియపు అప్పడాలను కాల్చుకుని కొంచెం పైన నేయి చుక్క రాసుకుని తింటే కూడా బాగుంటాయి. భోజనం లోనే కాకుండగా  అప్పడాలను కాలక్షేపంగా కూడా మధ్యాహ్నం టీ తో పాటుగా కూడా తినటానికి బాగుంటాయి. 

చల్ల మిరపకాయలు కమ్మటి పప్పుకి సరి అయిన జోడి. అన్ని రకాల కలగూర పప్పుల్లోనూ, ముఖ్యంగా మామిడి కాయ, దోసకాయ పప్పుల్లోనుమజ్జిగ పులుసులోను ఆఖరికి కమ్మటి పెరుగులో కూడా కొరుక్కుని తింటే భలే మజా గా ఉంటుంది సుమా!

ఇక వడియాలు దప్పళం లోను, అన్ని రకాల పులుసుల్లోను, చారుల్లోను కూడా  నంచుకుని తినటానికి బాగుంటాయి. వడియాలను నంచుకుని తినటానికే కాకుండగా కొంతమంది వడియాలతో కూర, వడియాలతో పులుసు కూడా పెడుతూ ఉంటారు. 

ఉల్లి పాయలు, పచ్చి మిర్చి సన్నగా తరిగి దోరగా వేయించుకుని, చింత పండు పులుసులో, కొంచెం ఉప్పు, బెల్లం వేసుకుని ఉడక నిచ్చి, వడియాలను కూడా వేయించుకుని ఆ మరుగుతున్న పులుసులో వేసి, కొంచెం సేపు కాగనిచ్చి, కరివేపాకు, ఇంగువ దట్టించి పోపు పెట్టుకుంటే ఆ  వడియాల పులుసు మహా రుచి గా ఉంటుంది. కొంతమంది ఇందులో కొంచెం ఒక చెంచా  శనగ పిండి కాని, బియ్యం పిండి కాని నీళ్ళలో కలిపి చిక్కదనం కోసం పులుసులో వేసి ఉడికిస్తారు. ఈ వడియాల పులుసు కందిపొడి లోకి నంచుకుని తినటానికి చాలా  బాగుంటుందని వేరే చెప్పక్కర్లేదు.  

మొత్తానికి ఈ అప్పడాలు, వడియాలు, వూరు మిరపకాయల కరకరలుమన భోజనానికి గొప్ప ప్రత్యేకతని తేవడమే కాకుండగా, ఒక పండుగ భోజనం తింటున్న అనుభూతినికూడా  కలగ జేస్తాయని చెప్పటంలో ఎంత మాత్రం సందేహం లేదు సుమా! అనుమానంగా ఉంటె, వెంటనే వేయించుకుని, భోజనం లో నంచుకుని తిని చెప్పండి!  


 


 





No comments:

Post a Comment