Saturday, November 1, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 9 : అభిషేకాలూ – అర్చనలు!


ముందుమాట:

గంగమ్మను తలపై మోసే శివయ్యకు, భక్తులు ప్రేమతో చేసే అభిషేకాలు ఎంతో ప్రీతి పాత్రం. మరి కార్తీకం శివాభిషేకాలకు అత్యంత శ్రేష్టం! భక్తులు తమ తమ విభవం కొద్దీ తటాక నదీ కూప జలాలతో కానీ, లేక పంచగవ్య, ఫలోదకాది విభిన్న రసాలతో కానీ స్వామి ని అర్చిన్చుకుంటారు. ఇక శ్రీమన్నారాయణుని పూజించటానికి శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని భక్తులు ఈ మాసం లో విశేషం గా ఆచరిస్తారు. మరి ఈ అభిషేకాలు, అర్చనలు ఎ యే ఇష్ట కామ్యాలకు ఏ విధంగా ఆచరిస్తారో, ఈ వ్యాసం లో శ్రీమతి నయన చక్కగా వివరించారు.

రమణ బంధకవి

సంపాదకుడు


అభిషేకాలూ – అర్చనలు

శ్రీమతి నయన కస్తూరి


శివకేశవులకు ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసం లో ఇరువురి కటాక్షం పొందటానికి స్నాన దీపారాధనలు తర్వాత ఇంకొక ముక్తి మార్గం అభిషేకార్చనలు! శివుడు అభిషేక ప్రియుడు! తన శిరస్సున గంగ జాలువారుతున్నా తన భక్తులు భక్తితో కాసిని నీళ్ళు తలపై చిలకరిస్తే చాలు ఆనందంతో పరవశించి, వాళ్ళు  కోరిన కోరికలెల్ల ఈడేరుస్తాడు. ఈ మాసం లో ప్రతీ రోజు శివునికి అమిత ప్రియం! కనుక కార్తీకమాసం లో ప్రతీ రోజూ విశేషించి సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజు, మాసశివరాత్రి  రోజు మహాశివునికి అభిషేక యోగ్యాలు! ఇక శ్రీ మన్నారాయణుడు వ్రతార్చనల  లోలుడు! కార్తీక మాసం లో శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని, కొలిచిన భక్తులకు ఇహపర సౌఖ్యాలు ఒసగుతాడు.

ఇప్పుడు మనం పార్వతీ వల్లభుడిని ఏ విధంగా అభిషేకించుకోవాలో ఏయే ద్రవ్యాలు వినియోగించుకోవాలో, శ్రీ లక్ష్మీనారాయుణుని ఏ రీతిన పూజించుకోవాలో తెలుసుకుందాము.

ముందుగా శివాభిషేకములు గురించి తెలుసుకుందాం. ఉమామహేశ్వరుడు జలాభిషేకంతో సంతుష్టుడౌతాడు. లభ్యమైతే పవిత్ర నదీజలాలు ఉత్తమం! అభిషేకానికి కావలిసిన మిగిలిన వాటిని చూద్దాం. ఒక కొబ్బరికాయ, పన్నీరు, పంచామృతాలు, [ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనే, మరియు పంచదార]శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ దళాలు [బిల్వ దళాలు మూడు ఆకులు కలిసి వుండాలి] కాసిని బియ్యం, విభూథి, గంధం, పసుపు, కుంకుమ, అగరుబత్తి, కర్పూరం మొదలైనవి. పుష్పాలలో జంగమయ్య కు జిల్లేడు పుష్పాలు విశేషంగా ఇష్టమైనవి.

అభిషేకాలలో లఘున్యాసపూర్వక  ఏక రుద్రాభిషేకం మరియు  మహాన్యాసపూర్వక ఏకాదశ[11 ]రుద్రాభిషేకం.  నమకం, చమకం సహిత అభికరిస్తే  ఆభిషేకం చేస్తే ఫలం అవశ్యం మరియు అధికం!  నమకం, చమకం పుస్తక రూపంలోనూ, సీడీ రూపంలోనూ బజార్ లో లభ్యమవుతాయి. శివుడు భోళా శంకరుడు. ఆయన మన నుండి నిర్మలమైన భక్తి తప్పితే ఏమీ ఆశించడు. కానీ భక్తులు తమ తమ విభవము కొలది, భక్తి కొలది, కోరిక కొలది వివిధములైన ద్రవ్యాలను వినియోగించి, ఉమా మహేశ్వరుని అభిషేకించు కుంటారు. ఒకొక్క ద్రవ్యానికి ఒకొక్క కోరిక శీఘ్రం గా నెరవేరుతుందని నమ్ముతారు.    

ముందుగా  పంచగవ్యాభిషేకం తో  భక్తులు శీఘ్రం గా ఏం పొందుతారో చూద్దాం. పంచగవ్యం తో శివుని అభిషేకిస్తే మానవ జన్మ లోని సర్వ పాపాలు హరింపబడతాయి. అయితే పంచగవ్యం అంటే ఏమిటో తెలుసుకుందామా? ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కలిపితే పంచగవ్యం అనే పవిత్ర పదార్ధం తయారవుతుంది. మరి మీకు అవకాశం దొరికితే   పంచగవ్యం తో అభిషేకం చేసి, పాపహరణం చేసుకోండి. దీర్ఘాయువు కోసం ఆవు పాలతోనూ, మోక్షగాములు ఆవు నేతితోను, సత్సంతానం కావాలనుకునే వారు ఆవు పెరుగు తోనూ, మధురమైన స్వరం అభిలషించే వారు పట్టు తేనెతోనూ, ఐశ్వర్యం కోరుకునే వారు పంచామృతాలతోనూ, ఆరోగ్యం కోసం తాజా చెరుకు రసం తోనూ శివుని అభిషేకం చేసుకుంటే మంచిది అని పెద్దలు చెపుతారు. అంతే కాకుండా శత్రు విముక్తి కోసం పంచదారతో అభిషేకం, ఆనందం కోసం నారికేళ ఫలోదకంతో, మృత్యు భయం తొలగుటకు నిమ్మరసం తోనూ, లక్ష్మీ కటాక్షం కోసం చందనం తోనూ, రాజభోగాలు కావాలనుకునే వారు అన్నముతోను  సదాశివుని అభిషేకించు కోవటం శ్రేయస్కరమని చెపుతారు. మరి మీకు కావలిసిన రీతిలో శివుని అభిషేకించుకుని శివానుగ్రహం పొందండి.

ఇక కేశవుని ఏ రీతిలో ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో  సత్యనారాయణ వ్రతాలు శుభప్రదం! కార్తీక పౌర్ణమి  రోజు విష్ణు పూజకి సర్వశ్రేష్టం !  ఏకాదశి రోజు ఉపవాస దీక్షతో శ్రీ మన్నారాయణని ప్రసన్నం చేసుకోవచ్చు. ద్వాదశి నాడు బృందావనాన్ని దీపాలతో అలంకరించి, తులసి, శ్రీ కృష్ణ పూజలతోనూ, తులసీ వివాహం జరిపించి, ఉసిరిక దీపాలు వెలిగించి, విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు. లక్ష్మీ వల్లభుడిని తులసీ దళాలతోనూ, మల్లెలు, కమలాలు, జాజి పూలతోనూ అవిసె పువ్వులతోనూ, గరిక దర్బలతోనూ అర్చిస్తే  శ్రీ లక్ష్మీనారాయణుని కరుణా కటాక్షాలు పొందవచ్చు.

ఈ విధం గా కార్తీక మాసం లో మనం హరి హరులను ఆరాధించి, మన పాపాలను పోగొట్టుకుని, పుణ్యం సంపాదించుకుని ఇహపర సౌఖ్యాలు పొందుదాం!
స్వస్తి!









No comments:

Post a Comment