ముందుమాట:
పవిత్ర కార్తీక మాసం లో వచ్చే మరో ఉత్కృష్ట
విశేషం – ఏకాదశ ద్వాదశ వ్రతాలూ మరియు క్షీరాబ్ది
ద్వాదశి. ఈ మాసం శివకేశవులకు
సమంగా ప్రీతీ పాత్రమైనదని ముందే చెప్పుకున్నాము. ఇక
రేపు కార్తీక సోమవారమే కాక, సాయం
సమయంలో ద్వాదశి గడియులు ఉండటం వలన తులసీ
ధాత్రీ సమేత శ్రీ మన్నారాయుణుని అర్చనకు శ్రేష్టం.
ఈ ఏకాదశ ద్వాదశ వ్రతాల గురించి శ్రీమతి
నయన సవివరంగా తెలియ జేస్తున్నారు.
రమణ బంధకవి
సంపాదకుడు
ఏకాదశ ద్వాదశ వ్రతాలు---దీర్గాయువు
ప్రదాయకాలు!
శ్రీమతి నయన కస్తూరి
కార్తీక మాసం లో ప్రతీ రోజు
హరిహరులకు ఎంతో ప్రీతికరం! ప్రతీ రోజు దైవకార్యాలకు విశేషం గా యోగాదాయకమైనది. మనం
ఏ రోజు ఏ చిన్న దైవ కార్యం చేసినా సమస్త కోరికలు నెరవేరి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు,
సకల సౌభాగ్యాలు తక్షణమే అనుగ్రహిస్తారు దేవతలు అని మన నమ్మకం. ఇక
విశేష దినాలైన శుద్ద ఏకాదశి, ద్వాదశి రోజుల గురించి చెప్పనే
అక్కర్లేదు! ఈ రెండు రోజులలో పూజలు, వ్రతాలు ఆచరిస్తే వెయ్యి
రెట్లు ఫలితాలు పొందగలరని, నారదుడికి బ్రహ్మ
చెప్పినట్టుగా వ్యాసమహర్షి ధర్మ రాజుకి చెప్పాడు అని తెలుస్తోంది.
శ్రీ
మహావిష్ణువు ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వేంచేసి, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు .ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి
అంటే కార్తీక శుద్ద ఏకాదశిని 'ప్రబొధినీ ఏకాదశి'
అనీ ,'ఉత్తాన ఏకాదశి' అని
కూడా పిలుస్తారు. ఎందుచేతనంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు
కాబట్టి. ఆషాడం లో ప్రారంబమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశి తో పూర్తి అవుతుంది.
ఈ రోజు తల స్నానం చేసి, కార్తీక దీపారాధన చేసుకుని, ఉపవాసం ఉండి, శివాభిషేకాలు, నారాయణుని అర్చనలు, వ్రతాలతో దైవ చింతనలో రోజంతా
గడిపి, మరునాడు తలస్నానం చేసి, దీపారాధన
చేసుకుని, ద్వాదశ పారనం చేసుకుని, ఉపవాస
దీక్ష విరమించి, ఏకాదశ వ్రత ఫలితం సంపూర్ణం గా పొందుతారు. వీరికి
పునర్జన్మ లేక ఇహపర సుఖాలు పుష్కలం గా లభిస్తాయి అని మనకు పురాణాల వలన
తెలుస్తోంది.
మరునాడు
క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు పాల సంద్రము నుండి, శ్రీ మహా లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో కూడి, తులసీ
బృందావనానికి విచ్చేస్తాడు. అచ్చట లక్ష్మీ నివాసమైన ఉసిరి చెట్టు కొమ్మని కూడా
తులసి పక్కన పెట్టి, అలంకరించి పూజలు చేసి, తులసీ దామోదర వ్రతం ఆచరిస్తే, నారాయణుడు సంతుష్టుడై,
భక్తులు సమస్త పాపములచే విముక్తులై, తన సాన్నిధ్యము
చేరుకుందురని శ్రీ మహా విష్ణువు వరమిచ్చెనని పురాణాల్లో చెప్పబడింది.
సూర్యాస్తమయం
అయిన తర్వాత స్నానం చేసి, శుద్దులై, తులసి
వనమున లక్ష్మీ సమేతుడైన నారాయణుని ఉసిరి దీపాలతో, ఆవునేతి దీపాలతో, రంగవల్లులు
పేర్చి, పూజించాలి. లక్ష్మి తులసి అష్టోత్తరాలు, కృష్ణ, మహావిష్ణు అష్టోత్తర నామాలతో షోడశోపచార పూజ
చేసుకోవాలి. తులసీ నారాయణుల వివాహం జరిపిస్తారు. తులసీ దాత్రీ సమేత లక్ష్మీ
నారాయణుడికి వడపప్పు, పానకం, చలిమిడి,
బెల్లం, ఖర్జూరాలు, పేలాల
పొడి, కొబ్బరికాయ, పళ్ళు నైవేద్యం
పెట్టుకోవాలి. తులసి మహాత్మ్యం చదువుకోవాలి. విష్ణుసహస్ర నామ స్తోత్రం పారాయణం చేసుకోవాలి.
నక్షత్రాన్ని చూసి భుజించాలి.
క్షీరాబ్ది
ద్వాదశిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు
పూర్ణాయువుతో, ఇహం లోనే సమస్త సుఖాలూ అనుభవించి, మోక్ష
ధామం జేరుకుంటారు అని పెద్దలు చెపుతారు. పాఠకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ నెల 3 వ
తారిఖు విశేషమైన రోజు. ఆ రోజు ఏకాదశి
మరియు ద్వాదశి తిధులే కాక కార్తీక సోమవారం అవటం వలన ఉపవాసానికి ఎంతో ఉత్తమం! ఇంతటి
సువర్ణ అవకాశాన్ని వదులుకోకుండా మనందరం కూడా ఈ నెల 3 న (రాత్రి వేళ ద్వాదశి ఘడియలు
ఉన్నందున) వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుని దామోదరుని దయకు
పాత్రులమవుదాము.
స్వస్తి!
No comments:
Post a Comment