Tuesday, November 18, 2014

కేబేజీ పాటోలి కూర



శ్రీమతి రత్నా శ్రీనివాస్

పాత రోజుల్లో  పాటోలి కూర బాగా ప్రాశస్త్యమైనది. ఈ రోజుల్లో చేసుకోవటం కొంచెం తక్కువ  అనే చెప్పవచ్చు. మా చిన్నప్పుడు మా అమ్మగారు క్యాబేజీ తో ఎక్కువగా పాటోలికూర చేసేవారు. స్వతహాగా క్యాబేజీ చప్పటి కూర అవటం చేత పాటోలి కూర చేస్తే వర్రగా వుండి రుచిగా కూడా వుంటుంది. దీని తయారీ తెలుసుకుందాం.

తయారవటానికి పట్టే సమయం   :                        అర్ధగంట

కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ                               :                        1
సెనగపప్పు                         :                        1 కప్పు
ఎండు మిర్చి                       :                         6
బియ్యం                              :                        1 టేబుల్ స్పూన్
ఇంగువ                              :                        1 టీస్పూన్
ఉప్పు                                :                        తగినంత

పోపుకు కావలసిన పదార్ధాలు :
నూనె                                  :                         3 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి                          :                         2
మినపప్పు                            :                        1 టేబుల్ స్పూన్
ఆవాలు,జీలకర్ర                      :                        చెరొక టీస్పూన్
కరివేపాకు                             :                        5 - 6 రెబ్బలు

తయారు చేయు విధానం:
ముందుగా క్యాబేజీని శుబ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి. తరిగిన ముక్కల్లో తగినంత ఉప్పు, పసుపు వేసి, కొద్దిగా నీరు పోసి ప్రెజర్ పాన్ లో పెట్టి 3 విజిల్స్ వచ్చేక ఆపేసుకోవాలి. లేదా మైక్రోవేవ్ బౌల్ లో పైన చెప్పిన విధంగా తీసుకుని 10 నిమిషాలు మైక్రోవేవ్ చేసుకోనవచ్చును.

ఒక గిన్నె లో సెనగపప్ప, బియ్యం  అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు, బియ్యం నానిన తరువాత నీరు ఓడ్చి మిక్సీ లో వేసుకోవాలి. దీనితో పాటు ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని తిప్పుకోవాలి. తయారైన మిశ్రమాన్ని చిత్రంలో చూడవచ్చును.

ఇప్పుడు ఒక బాణలిలో నూనె తీసుకుని మినపపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసుకుని, దానిలో మిక్సీలో తయారైన సెనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసి పచ్చితనం పోయేంతవరకు బాగా   వేయించుకోవాలి. ఇప్పుడు పాన్లోంచి  క్యాబేజీ ని తీసి ఎక్కువగా వున్న నీరును తీసేసుకుని వేగుతున్న పాటోలి మిశ్రమంలో వేసి కలియబెట్టుకోవాలి. మనం క్యాబేజీ లో మాత్రమె ఉప్పు వేసాము, పాటోలి మిశ్రమానికి వేయలేదు కాబట్టి మరల తగినంత ఉప్పు వేసుకోవాలి. క్యాబేజీ ముక్కలకి  పాటోలి మిశ్రం బాగా పట్టుకున్నాక, ఒక 5 నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆపేసుకోవాలి. దీనిని పొడిగా వున్న శుబ్రమైన పాత్రలోకి మార్చుకోవాలి.

సలహాలు:
పాటోలి కూరను నెయ్యి వేసి అన్నం లో కలుపుకుని చల్ల మిరపకాయలు లేదా వడియాలతో నంచుకుని తింటే  చాల బావుంటుంది. శ్రమ అనుకోకుండా అప్పుడప్పుడు మీరు కూడా చేసుకోండి. అప్పుడప్పుడైనా మన పాత రోజుల్లో కూరలు గుర్తుకు తెచ్చుకోవటం అవసరం.


 



 




No comments:

Post a Comment