ముందుమాట:
నిన్నటి వ్యాసం లో హిందువులకు అతి పవిత్రమైన మూడు
వృక్షాలలో మొదటిది అయిన తులసీ వృక్షం గురించి తెలుసుకున్నాం. ఈ నాటి వ్యాసం లో శ్రీమతి
నయన బిల్వ వృక్షం (మారేడు చెట్టు), మరియు ధాత్రీ వృక్షం (ఉసిరి చెట్టు) యొక్క
ప్రాభవం గురించి విపులీకరిస్తున్నారు. శివపూజకు బిల్వ వృక్షం యొక్క ప్రాధాన్యత తెలియని
వారు వుండరు. మన పాఠకురాలు శ్రీమతి జోస్యుల ఉమాధర్ కూడా బిల్వ వృక్షం గురించి
నాలుగు మంచి మాటలు చెపుతున్నారు. అవి ఏమిటంటే, వేయి పద్మాలతో శివుని పూజిస్తే
వచ్చే ఫలం ఒక్క బిల్వ దళంతో శివుని పూజిస్తే వస్తుందట. అంతే కాక బిల్వ వృక్షం
చుట్టూ దీపారాధన చేస్తే జ్ఞానం లభిస్తుందని; ఆ చెట్టుకింద ఒకరికి అన్నం పెడితే,
కోటి మందికి అన్నం పెట్టిన ఫలితం వస్తుందని; ఈ చెట్టు క్రింద అన్న పాయసాన్ని శివ
భక్తునికి దానం చేస్తే, జన్మ జన్మలకూ అన్నానికి లోటు ఉండదనిదని కూడా శ్రీమతి ఉమాధర్
చెపుతున్నారు. మిగతా వివరాలు శ్రీమతి నయన వ్యాసం లో చదువుదాం.
రమణ బంధకవి
సంపాదకుడు
కార్తీక మాసం --వృక్ష త్రయం! (ఆఖరి భాగం)
శ్రీమతి నయన కస్తూరి
2. బిల్వ
వృక్షం:
బిల్వ దళం అనగానే మనకు మహాశివుడు మదిలో మెదులుతాడు. ఈ వృక్షాన్నే మారేడు
వృక్షం అని కూడా పిలుస్తారు. శివ పూజ లో బిల్వపత్రం అగ్రస్తానం వహిస్తుంది. బిల్వ
దళం లేనిదే శివ పూజ పూర్తి కాదు. బిల్వ వృక్షం హిందువులకు చాలా పవిత్రమైనది.
ఈ వృక్షం లక్ష్మీ దేవి వక్షస్తలం నుంచి ఉద్బవించిందని, శివుని కి చాలా
ప్రీతిపాత్రమైనదని ఒక కధనం ఉంది. మరి యొక కధనం ప్రకారం; పార్వతీ దేవి యొక్క
స్వేదబిందువులు మందర పర్వతం మీద పడ్డాయని, ఆ ప్రదేశం నుండి
బిల్వవృక్షం ఆవిర్భవించిందని అందుకే హిందువులందరికీ మహా పవిత్రమైనదని నమ్ముతారు. బిల్వ
వృక్షాన్ని స్పర్శించినంత మాత్రాన మానవుడు తన పాపాలను అన్నిటిని
పోగొట్టుకుని, పుణ్యవంతుడు అవుతాడు. ఈ వృక్షం క్రింద
శివునికి అభిషేకం చేసుకుంటే జన్మజన్మ పాపాలు పటాపంచలు అవుతాయి. మూడు ఆకులు కలిసి
వున్న బిల్వదళాన్ని శివునికి అర్పిస్తే ఆయన బహు సంతుష్టుడై ఇహ లోకమునందే
స్వర్గసుఖాలను ప్రసాదిస్తాడు అని భక్తుల ప్రగాడ విశ్వాసం. మారేడు దళం లోని
మూడు ఆకులు ముక్కంటి త్రినేత్రాలకు ప్రతీక అని కొంతమంది భక్తులు భావిస్తే
మరికొంతమంది శక్తి త్రయానికి ప్రతిరూపమని నమ్ముతారు. బిల్వ త్రిదళం ముక్కంటికి
నివేదిస్తే మూడు జన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయి.
''లక్ష్మ్యాస్చస్తన ఉత్పన్నం మహాదేవ సదాప్రియం, బిల్వ వృక్షం ప్రయస్చ్చామి
ఏక బిల్వం శివార్పణం!” అని మారేడు దళాలతో 'మన రేడు' ని అర్చిస్తారు.
"దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం, అఘోరపాపసంహారం ఏక బిల్వం
శివార్పణం!" అని మనసా వాచా హిందువులు నమ్ముతారు. అంతే కాకుండా ఈ బిల్వవృక్షం వలన
మానవజాతి ఎన్నో రుగ్మతల నుండి కూడా విముక్తుడవుతాడు. బిల్వ పత్రాలు, పండు, కఫం జీర్ణ సంబంధ వ్యాధులు, కామెర్లు లాంటి
అనారోగ్యాలను తగ్గించడమే కాకుండా దెబ్బలను, పుండ్లను నయం
చేస్తాయి. ఇంత పవిత్రమైన మరియు ఉపయోగకరమైన బిల్వ లేక మారేడు వృక్షం మనకు మన
క్షేమాన్ని కోరే మహేశ్వరునితో సమానం అంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ
కాదంటే మీరు కూడా ఒప్పుకుంటారు కదూ?
3. ధాత్రీ వృక్షం:
ఇక కార్తీక త్రయం లోని మూడవ పవిత్ర వృక్షం ధాత్రీ
వృక్షం అంటే అదేనండీ మన ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు కూడా ఎంతో పవిత్రతను
సంతరించుకుని హిందువులకు పూజ్యనీయము అయింది. ఉసిరి చెట్టు మూలం లక్ష్మీ నారాయణుని
నివాసము. కార్తీక మాసం లో ముఖ్యం క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీ ధాత్రీ సమేత
లక్ష్మీ నారాయణుడికి పూజిస్తాము. ఈ చెట్టు పవిత్రము! ఫలములు పవిత్రము. కొన్ని
పురాణాల ప్రకారం క్షీర సాగరమధనం సమయంలో అమృతం కోసం అసురాసుర వివాదసమయం లో క్రింద
పడిన అమృత బిందువుల నుండి ఉసిరి చెట్టు ఆవిర్భవించిందని నమ్ముతారు. అందుచేతే ఈ
ఫలములు అమృత ఫలములని, లక్ష్మీ దేవికి మిక్కిలి ప్రీతికరమని, ఎటువంటి
వ్యాధినైనా నిర్మూలించ గలవని నమ్ముతారు. ఉసిరి ఫలాన్ని దానం చేస్తే అమ్మ వారు
కనకధార కురిపిస్తుందని జగద్గురువు ఆది శంకారాచార్యుల వారు వివరించారు. క్షీరాబ్ది
ద్వాదశి రోజు, కార్తీక పౌర్ణమి రోజు తులసి మొక్కతో పాటు
ఉసిరి మొక్కను కూడా అలంకరించి, ఉసిరి దీపాలు వెలిగించి,
తులసీ ధాత్రీ సమేత లక్ష్మీ నారాయణుడికి అర్చనలు
చేస్తారు. ఏకాదశి వ్రతం ఆచరించి ద్వాదశి ఘడియలలో ఉసిరి ఫలాన్ని స్వీకరిస్తే
ద్వాదశవ్రతం ఆచరించిన పూర్తి ఫలం వస్తుంది. దీపదానం లో ఉసిరి దీపం దానం
చేస్తే బంగారు దీపదానం తో సమానం గా అనంతకోటి పుణ్యాలు లభిస్తాయి.
ఉసిరిని ప్రతి రోజూ స్వీకరిస్తే అమృతం సేవించి నంత
ఆరోగ్యం కలుగుతుంది. వాత పిత్త కఫ రోగాలను అరికడుతుంది. రోగనిరోధక శక్తి ని
పెంచుతుంది. సమ శీతలం కలిగిస్తుంది. మంచి పైత్యహారిగా పనిచేస్తుంది. జటరాగ్నిని
ఉత్తేజపరుస్తుంది. ఆద్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఇన్ని సుగుణాలు ఉన్న ఈ వృక్షాలనే
కాకుండా ఇంకా ఇలాంటి ఎన్నో వృక్షాలనీ రక్షించుకుని వన్య సంరక్షణ చేసుకుందాం.
స్వస్తి!
No comments:
Post a Comment