Thursday, November 6, 2014

కార్తీక మాస ప్రత్యేక వ్యాస పరంపర – 14: ముక్కంటి మర్మము!


ముందుమాట:

 రోజు కార్తీక పౌర్ణమి పర్వదినం. ఆ పరమశివుని ఆలోచనలతో   రోజు గడపటం ఎంతో  మంచిదని పెద్దలు చెపుతారు. శివతత్వం గురించి తెలుసుకునే జ్ఞానం లేకపోయినాకనిపించే 
శివుని మూర్తి లో కనిపించని భావం ఏదైనా ఉందా అని ఆలోచిస్తుంటేనామనసులో కదలిన 
భావనలే  కవితా రూపము లో ఉంచుతున్నాను. భావం అనాదిదే అయినా పలుకులు మాత్రం క్రొత్తవి. చదివిన వారు ఆనందిస్తారనిభావాన్ని ఆస్వాదిస్తారని, పలుకులను ఆదరిస్తారని  ఆశిస్తూ....
రమణ బంధకవి
సంపాదకుడు

ముక్కంటి మర్మము!


రమణ బంధకవి


మూడు కన్నుల సామివి నిను ముదమార చూడంగ,
రెండు కన్నుల కెట్లు కుదిరేను ఏమి చేతుముర లింగా!
నిర్గుణ నిరాకారుడవైన నిను భక్తిమీర కొలవంగ
వివిధ పూజలు జేయ జూసేము మనసు పొంగంగ!

నిండార నీ మేను దొడగంగ బట్టు
వలిపెములు దేచ్చేము మేము;
మృగ చర్మ ధారివై, చిరునగవు న చూసేవు
ఇవి యేల నాకని పశుపతి వైన నీవు! 

కస్తూరి, జవ్వాజి సుగంధాలు నీ తనువున
పుయ్యంగ ప్రేమ దీరగ తెచ్చేము మేము; 
వొడలంతా భూది తో ఇవి యేల నాకని
 మందహాసం చేసావు భస్మ లేపితుడవైన నీవు!

ముదమార నిను అర్చింపగ, దివ్య కుసుమంపు
 మాలలు అనేకములు దేచ్చేము మేము; 
పన్నగము మెడ దాల్చి, అవి యేల నాకని
నగు మోము చూసేవు నాగ భూషణుడవైన నీవు!

భక్త వత్సలుడవైన నిను భక్తి మీరగ బూజింప
 పుణ్య నదీ సప్త సాగర జలాలు తెచ్చేము మేము;
జడల మాటున గంగను దాల్చి, ఇవి యేల నాకని,
అచ్చెరువున చూసేవు గంగాధరుడవైన నీవు!

ప్రేమ మీరగ నివేదించగ నీకు, పంచ భక్ష్య
 పరమాన్నములు దేచ్చేము మేము; 
లోకాల గాయంగ గరళ మెత్తి, ఇవి యేల నాకని,
 ప్రసన్నమున జూసేవు నీలకంటుడవైన నీవు! 

సంగీత నృత్యాల మురిపంప నీ సన్నిధిని
 అనంత వైభవముగ నర్తించేము మేము; 
తాండవ కేళిని జగముల నూగించి, ఇవి యేల నాకని,
ఆభయమిచ్చేవు నటరాజ మూర్తివైన నీవు! 

తైల దివ్వెల కాంతిని కనులార నిను గన
వేలాది కార్తిక దీపములు వెలిగించేము మేము; 
నెలవంక శిరమున దాల్చి, ఇవి యేల నాకని,
సంబ్రమమున జూసేవు, తేజో రూపుడవైన నీవు!

సిరి సంపదలు, ధన ధాన్యములు, ఇహ లోక
సుఖములు పొందంగ కై మోడ్చి అర్చించేము మేము; 
కపాలము చేపట్టి, మరు భూమిన దిరుగుచు,
 చిద్విలాసము చేసేవు అది భిక్షువైన నీవు! 

తెలిసీ తెలియక, మాయ వాగుర చిక్కుకుంటిమి,
తెలిసినది దేవాధిదేవా నీ 'మర్మమిపుడు';
నేరేడు మారేడు, తంగేడు గన్నేరు,
నీకు మనసారా యిచ్చిన చాలునని నేడు! 

నిను జూడ చర్మ చక్షువులకు సాధ్యంబు గాదు,
కావలెను మనో నేత్రంబు నిక్కంబు యద్దానికి;
'కనులు మూసి' నిను ప్రార్తిన్తుము, మా
'కను విప్పు’ జేయుము కరుణించి యిక! 

మనో నేత్రమున జూడ అగుపించును
ముక్కంటి, ముమ్మాటికీ ఇది తథ్యము! 
ఉన్నాడని తెలియునులే మనయందే
 పరమేశుడు ఇది 'పరమ సత్యము'! 

నిండును మది యంతా అవశ్యము
 యొక దివ్య చైతన్య పార వశ్యము!
నిక్కముగా గోచరించును మదిని,
జగమంతా 'శివ మయం' సుమా అని! 

స్వస్తి!



No comments:

Post a Comment