Monday, March 30, 2015

శ్రీ సీతా రామాభ్యానమః

ముందుమాట:

పాఠకులందరకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు! మర్యాదా పురుషోత్తముడైన ఆ ఇనకుల రామయ్య యుగ యుగాలు గా మానవాళి హృదయ మందిరాలలో నెలకొని ఎందరి జీవితాలనో ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. శ్రీరామ నవమి పర్వ దిన సందర్భాన, ఆ కౌసల్యా తనయుని ప్రార్థిస్తూ నా మనసులోంచి వచ్చిన నాలుగు చరణాలను మీ ముందు ఉంచుతున్నాను. చదివి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

రమణ బంధకవి

సంపాదకుడు



శ్రీ సీతా రామాభ్యానమః 


పారిజాత తరువు పరవశించి పూసింది తనువెల్లా సుమాలు,
వనపాళి మురిసి సడిచేసే శతకోటి సన్నాయి స్వరాలు,
తులసమ్మ మై మరచి చిగురించే రెమ్మ రెమ్మ కు వేయి దళాలు, 
ఇనకుల రామయ్య ఉదయించే నేడు, కలుగు అనేక శుభాలు!

పదములు తాకంగా పులకరించెను ఒక రాయి;
                 పడతి గా మారి ప్రణమిల్లెను శాప విమోచనమయి;
కఠిన శిలలు వోలె కారుణ్యము లేక ఇల జనులు, 
                   బడయుచున్నారు, రాలవంటివే వారి హృదయాలు,
కరుణించి పదమిడు మా హృదిని, వీక్షించి నీ శాంత నయనాలు,
           కరిగి జనియించునేమో ప్రేమాను రాగాలు, సమయు కార్పణ్యాలు! 


పరిణయమాడంగ చేపట్టి విరిచేవు మేటైన శివుని విల్లు
                                సీతమ్మ హృదయాన కురిసింది ప్రణయాల విరిజల్లు.
మానవాళి మదియందు నెలకొంది అహంకారపు పెను విల్లు,
                వేగంగా విరువగా రావే, ఇక వెలసేను లోకాన మమతల హరి విల్లు.

కరకు బాణాల బడవైచితివి దనుజులెల్లరినో,
                           త్రుంచి వైచితివి సంగారాన లంకేశు శిరాలెన్నో!
మనుష్య హృదయాన ప్రజ్వరిల్లే అరిషడ్వర్గాలు,
                          దురాశ, దుర్నీతి, వ్యామోహ మద మత్సరాలు!
ఇవియే కాబోలు, మారు మారు మొలకెత్తు 'దశకంఠ' శిరాలు
                   దహియించగా వీటిని, విడువుమయ్య యిక రామ బాణాలు!



Wednesday, March 18, 2015

‘చల్ల కొచ్చి ముంత దాచినట్లు!’


శ్రీమతి పద్మా రఘునాద్

మనందరికీ  రోజు అనేక మందితో వ్యవహారాలు వస్తుండటం, పోతుండటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. వీటిని అనుసరించి వివిధ స్వభావాలున్న వ్యక్తులు మనకి తారస పడటం,వారితో మనకి మాట్లాడే అవసరం కూడా కలుగుతుంటుంది. కొంత మంది ‘చల్లకొచ్చి ముంతని దాచే’ విధంగా మాట్లాడటం పరిపాటే!  ఈ తెలుగు సామెతకి అర్ధం ఏమిటో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం! 

‘చల్ల’ కావాల్సి వచ్చి, మొహమాట పడి ‘ముంత’ ని దాచి పెట్టి మెల్లగా తరువాత దానిని బైటకి తీసి అడగటం అన్న మాట. ఇంకా వివరించాలంటే, ఏదైనా అవసరం పడి నేరుగా దాన్ని తీర్చమని అడగటానికి మొహమాటం, చిన్నతనం అనిపించి వేరే సాకు మీద వచ్చినట్లు గా వచ్చి మాటల సందర్భం లో వారి కోరికను బైట పెట్టటం అపుడపుడు మనం చూస్తూ ఉంటాం! 

ఇంకా చెప్పాలంటే ఏ పంచదారో, కాఫీ పోడో బదులు కావాల్సి వస్తే, గిన్నె లేదా కప్పుని దాచి పెట్టి, యోగ క్షేమాలు కనుక్కోటానికి వచ్చినట్లు గా వచ్చి, పిచ్చాపాటీ మాట్లాడితర్వాత బదుళ్ళు అడగటం అన్నమాట. ఇదే ‘చల్ల కొచ్చి ముంత దాయటం’ అంటే!  పనులను సులువుగా జరిగేలా చేసుకోటానికి ఉన్న మార్గాల్లో ఇదొకటి మరి. సరే ఇక మన తెలుగు సామెత లోని ‘చల్ల’ గురించి అందరికి తెలిసిందే అయినా మళ్ళి కొంచెం తెలుసుకుందాం. 

పూర్వ కాలం లో ఈ చల్ల లేదా మజ్జిగని కవ్వం తో తోడూ పెట్టిన పెరుగుని చిలికి చేసుకునే వారు. ముంతల్లోను, మట్టి కుండల్లోను గడ్డ పెరుగు ని తోడు  పెట్టుకుని, దాన్ని కవ్వం తో గంట సేపు చిలికి, మంచి వెన్నని తీసి దాచి తర్వాత దాన్ని పొయ్యి మీద కాచి మంచి ఘుమ ఘుమ లాడే నేయిని చేసుకునేవారు. ఈ వెన్న తీసేసిన మజ్జిగని కూడా ఒక ముంత లేదా పాత్రలో ఉంచుకుని ఎండని పడి  వచ్చిన  అతిధులకి అందులో చిటెకెడు ఉప్పుని వేసి ఇచ్చేవారు.

ఎండని పడి వచ్చిన వారికి ఈ మజ్జిగతో ప్రాణం లేచి వచ్చి కొంచెం సత్తువ వచ్చేదిట.  ఈ మజ్జిగనే ‘చల్ల’ అని కూడా పిలవటం వాడుకలో ఉంది. క్రమక్రమంగా పెరుగుని కవ్వం తో చిలకటం, వెన్న తీయటం, అది కాచి నేయి తీయటం, ఆ మజ్జిగని అతిదులకివ్వటం కనుమరుగయ్యి చాలా కాలం అయిందనే చెప్పాలి. ఇపుడు రెడీ గా దుకాణాలలో తయారు చేసిన పెరుగుని, నేయిని, ఆఖరికి మజ్జిగని కూడా అమ్మటం తో ఇంక పైన చెప్పిన పనులన్నిటితో అవసరం పోయిందనే చెప్పాలి!

ఇపుడు ఇంటికి వచ్చిన వారికి అందించటానికి ఆకర్షణీయమైన రంగు రంగుల, తీపి పులుపులు కలిపి తయారయిన  రకరకాల పానీయాలు కూడా తయారుగా ఉన్నందువలన,  అవే ఇవ్వటం ఈ నాటి సభ్యత గా కుడా చలామణి అయిపోతోంది.  పైగా అవి ఇవ్వకుండగా, మజ్జిగ ఇస్తే చిన్నతనం గా అనిపించే కాలం లో కూడా మనం ఉన్నాం కనుక, ఈ ‘మజ్జిగ’ లేదా ‘చల్లని’ గురించి మనం మళ్లి  గుర్తుకు  తెచ్చుకుని, దానిలోని పోషక లవణాలని, దాని రుచిని, అది మనకి ఇచ్చే శక్తిని మరొక్క సారి గ్రహిస్తే, మళ్లి ఈ చల్లని మనం సేవించే పానీయాలలో చేర్చుకునే అవకాశం ఉందని అనిపిస్తుంది. చల్ల లేదా మజ్జిగని మనం రకరకాల రుచులతో తయారు చేసు కొవచ్చును. 

చిటికెడు ఉప్పు,నిమ్మ రసం కలిపిన నిమ్మ కాయ మజ్జిగ ఎండా కాలం లో ఎంతో తీసుకుంటే ఎంతో శక్తిగా ఉంటుంది. అలాగే అందులో కొంచెం ఆవాలు, కరివేపాకు, జీలకర్రని పోపు పెట్టుకుని, చిటెకెడు ఉప్పు వేసుకుని తాగితే అదో రుచి మరి. అలాగే కొంచెం వాము పొడి లేదా వాముని పోపు పెట్టుకుని వాము మజ్జిగాగా చేసు కోవచ్చును. లేదా కొంచెం జీల కర్ర పొడి, చిటికెడు ఉప్పు, పుదీనా ఆకులని వేసుకుని పుదీనా మజ్జిగని కూడా చేసుకోవచ్చును. గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కూడా ఈ మజ్జిగతో  ‘చాస్’ అని ‘లస్సి’ అని చేస్తారని అందరకు తెలిసిన విషయమే!

ఒకమాట మాత్రం నిజం సుమండీ! బాగా దాహం గా ఉన్నపుడు, బడలికగా ఉన్నపుడు ఈ ‘చల్ల’ లేదా ‘మజ్జిగ’ తాగితే సేద తీరినట్లుగా ఇంక వేరే ఏ  పానీయాలు తీసుకున్నా రాదనీ గట్టిగా చెప్పవచ్చు. 

పైన చెప్పిన రకరకాల మజ్జిగలని మనమే చాల సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టకుండగానే! ఈ సారి మనకి  ఎవరింట్లో అయినా  ఈ చల్లని ‘చల్ల’ చేసి ఇస్తే, మనస్పూర్తిగా సేద తీరినట్లే మరి. మనం కూడా అలానే వారికీ సేద తీరుద్దామా? ఏమంటారు చెప్పండి




Wednesday, March 4, 2015

టమేటా ఊరగాయ పచ్చడి



శ్రీమతి రత్నా శ్రీనివాస్

కావలసిన వస్తువులు:
టమేటాలు                                           1 కేజీ
ఉప్పు                                                తగినంత 
పసుపు                                              తగినంత 
చింతపండు                                          50 గ్రాములు 
కారం                                                 50 గ్రాములు
(ఎక్కువ కావాలనుకునే వారు అదనంగా వేసుకోనవచ్చును)
మెంతి పిండి                                        2 టేబుల్ స్పూన్స్ 
నూనె                                                250 ml 
ఆవాలు                                              1-2 టేబుల్ స్పూన్స్ 
ఇంగువ                                              కావలసినంత 
ఎండు మిర్చి                                        2

తయారు చేయు విధానం :
ఊరగాయ కోసం ఎర్రగా, కొంచెం గట్టిగా వున్న టమేటాలను ఎంచుకోవాలి. వాటిని శుబ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తడి లేదని నిర్ధారించుకున్నాక, ముక్కలుగా తరుక్కుని జాడీలో కాని సీసాలో కాని వేసుకోవాలి. ముక్కలకి తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మూత పెట్టుకోవాలి. రెండో రోజున ముక్కలకి ఉప్పు వేయటం వలన ఊట ఊరుతుంది. తరువాత ముక్కలను ఊట లోంచి తీసి పళ్ళెంలో కాని చేటలో కాని వేసి  ఎండ బెట్టుకోవాలి. ఇప్పుడు  చింత పండుకి పీచు, గింజలు తీసి గుండ్రంగా బంతి లాగ చేసి  టమేటా ఊట లో వేసుకోవాలి. ముక్కలు 2,3 రోజులకి బాగా ఎండుతాయి. 

ఊట లో వున్న చింతపండు కూడా చక్కగా మెత్తగా నానిపోతుంది. నానిన చింతపండు ని బైటకి తీసి,  ఊట లో మెంతి పిండి, పైన చెప్పిన పరిమాణంలో సగం కారం  ఉండలు లేకుండా సమానంగా కలుపుకొవాలి. ఎండిన టమేటా ముక్కలు, నానిన చింతపండుని గ్రైండర్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే మెంతి పిండి, కారం కలిపిన వూటని కూడా గ్రైండర్ లో ముక్కలతో పాటుగా వేసుకోవచ్చును. 

ఒక బాండీ  తీసుకుని నువ్వుల నూనె పోసి వేడెక్కేక  ఆవాలు, ఎండు మిర్చి ఇంగువ వేసి పోపు పెట్టుకుని చల్లరేక పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇపుడు ఘుమ ఘుమ లాడే ఇంగువ పోపుతో టమేటా పచ్చడి  తయార్!