Tuesday, September 30, 2014

నవరాత్రి వ్యాస పరంపర 12: ప్రత్యేక వ్యాసం : శ్రీ శాకంబరి మాత



ముందు మాట:

శరత్ కాలం లో వచ్చే శరన్నవరాత్రులు లేదా దేవి నవరాత్రులలో భక్తులు అమ్మవారిని వివిధ అవతారాలలో భక్తి తో పూజించిటం మనం ఈ వ్యాస పరంపర ద్వారా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ శరత్ కాలం లో అనేకరుగ్మతలు పొంచి ఉంటాయని, అమ్మవారిని ఆ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి నట్లయితే మనకు ఆ మహాశక్తి రక్షణ లభించి ఆ తల్లి కరుణ కటాక్షాలకు కూడా పాత్రులవుతాము అని పెద్దలు చెప్తారు. కొన్ని ప్రాంతాలలో  శాకంబరిఅలంకారం లో కూడా భక్తులు అమ్మవారిని కొలుచుకుంటారు.  ఈ అలంకారం యొక్క విశిష్టతను తెలియచేయటానికి ఈ ప్రత్యేక వ్యాసం ద్వారా శ్రీమతి పద్మా రఘునాద్ ‘తెలుగు భోజనం’ ముందుకు వస్తున్నారు. ఈ అలంకార ప్రాభవ విశేషాలను తెలుసుకుని అమ్మవారిని శాకంబరి మాతగా మనుసులో అర్చించు కుందాము.


రమణ బంధకవి


సంపాదకుడు



శ్రీ శాకంబరి మాత


శ్రీమతి పద్మా రఘునాద్


నవరాత్రులలో ఒక రోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరలతో, ఫలాలతో, శాస్త్ర ప్రకారం అలంకరించి శాకంబరి అవతారం గా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుతుంటారుఆ అవతారము మహిమ దాని ఆవిర్భావము వెనకాల వున్న విషయాలను గుర్తుచేసుకుందామా మరి?

పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మ ని మెప్పించి, వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానివలన, లోకంలో అందరు, వేదమంత్రములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు.

పూజలు, యజ్ఞాలు మొదలైనవి లేక పోవటంతో, దేవతలకు హవిస్సులు అందక, కోపించినందువలన, లోకంలో వర్షాలు లేక భూమి ఎండిపోయి బీటలు వారింది. పంటపొలాలు కూడా బీడు వారి భయంకరమైన కరువు కాటకాలు రావటంతో  ప్రజలు చాల బాధలు పడుతూ అన్న పానాదులు లేక మాడిపోసాగారు. అపుడు ఋషులంతా హిమాలయాల మీద కు వెళ్లి అమ్మవారిని దీనంగా ప్రార్ధించారు. వారి వెతలను తీర్చటానికి అమ్మ వారు అమితమైన కరుణతోశతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటలు వారిన భూమిని, కరవు కాటకాలను, లోకం లో వున్న దుస్థితిని  చూసి అమ్మవారి ఒక  కన్నులోంచి నీరు రాగా, ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకం అంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించటానికి కొంచం వ్యవధి  పడుతుంది కాబట్టి, మరి  ప్రజల ఆకలి వెంటనే తీర్చాలి కనుక, అమ్మవారు అమితమైన దయతో  శాకంబరి రూపు దాల్చి వివిధమైన కాయగూరలు పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టు లాగా దర్సనమిచ్చింది.  ప్రజలంతా ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్న ఇంకా తరగని సంపదతో వచ్చింది అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే  ఈ శాకంబరి అవతారం.

పరమ పావనమైన ఈ శరన్నవరాత్రులలో అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా కొలిచి అర్చించటం వెనుక నున్న అంతరార్ధం తెలిసింది కదా! మనం ప్రకృతి ద్వారా లభించే  ప్రతి వస్తువులన్నిటి ఎడల, గౌరవ భావం కలిగి, అమ్మవారి ప్రసాదంగా భావించి దానిని గ్రహిస్తే ఎంత సంతోషము గా, తృప్తి గా వుంటుందో కదా మరి?

స్వస్తి!








నవరాత్రి వ్యాస పరంపర: 11 : సప్తమం--సర్వవిద్యాప్రదాయకం




శ్రీ సరస్వతి దేవి అలంకారం


శ్రీమతి నయన కస్తూరి



ఈ రోజు మహాలక్ష్మీ దేవి అవతారం లో అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించుకున్నారు కదూ?  ఇప్పుడు మనం రేపటి అలంకారం గురించి,నివేదనలు గురించి తెలుసుకుందాము. శరన్నవరాత్రులలో ఏడవ రోజున సప్తమి తిధి నాడు సాధారణం గా మూలా నక్షత్రం వస్తుంది. ఆ రోజున అమ్మవారిని వాగ్దేవీ అలంకారంలో సేవలు సలుపుతారు. అందుకని రేపు అనగా అక్టోబర్ 1 న మూలా నక్షత్రమున్నందున మనమందరం అమ్మవారిని శ్వేత పద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాల ను ధరించి, అభయ ముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీ దేవిని హృదయం లో ముద్రించుకుని ఆ దేవిని పూజించుకుందాము. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదా దేవి అతి విశిష్టమైనది.  ఈ రోజు తల్లితండ్రులు తమపిల్లల చేత విద్యాబుద్దులకై  సరస్వతీ పూజ తప్పక చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చెస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్రవ్రతం ఈ రోజే ఆరంభిస్తారు.  

                                   'వీణాధరే! విపుల మంగళ దానశీలే!
                                    భక్తార్తినాశిని! విరించి హరీశ వంద్యే!
                                    కీర్తిప్రదే! అఖిల మనోరదే! మహర్షే!
                                    విద్యాప్రదాయిని! సరస్వతి! నౌమి నిత్యం!

అని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి, వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను  ప్రకాశింపజేస్తుంది.  వాక్ శక్తిని, స్పూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో మూడవ రూపం! ప్రాణకోటి జివ్హాగ్రం పై వసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి, వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతి  చెందేలా చేసింది ఈ వీణా పుస్తకధారిణి! మనమందరం కూడా రేపటి రోజున శ్రీ సరస్వతీదేవిని శక్తి కొలది అర్చించి, షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ గావించి, వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, అన్నం పరమాన్నం, దద్దోజనం నివేదన చేసి, మన విద్యాబుద్దులను పెంపొందిచు కుందాము. 



అన్నం పరమాన్నం మరియు దద్దోజనం చేసే విధానం 'తెలుగుభోజనం'లో ముందుగానే వివరించి ఉన్నందున ఒక్కసారి చూసుకుని, చక్కగా చేసి అమ్మ వారికి నివేదించుకుని ఆ తల్లి అపార అనుగ్రహం పొందండి. రేపటి రోజున ఎనిమిదవ అలంకారం ఏమిటో,అమ్మవారికి ఏ వంటకాలు ప్రీతికరమో చెప్పుకుందాము.  








ఈ నాడు ధరించవలసిన వర్ణం:  నీలం

స్వస్తి!



Monday, September 29, 2014

నవరాత్రి వ్యాస పరంపర: 10: శ్రీ లలితసహస్ర నామ స్తోత్రం - ఆరోగ్య రహస్య సూత్రం!


ముందుమాట:

దేవీ నవరాత్రులలో లలిత పంచమి నాడు అనగా ఈ రోజు భక్తిశ్రద్ధలతో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని కొలుచుకుని, అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు అని తలుస్తాను.  హిందువులలో చాలామంది ఆడవారు నిత్యమూ ముఖ్యంగా ఈ పండగ రోజులలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూనే ఉంటారు. ఈ స్తోత్రం లో అమ్మవారి యొక్క సహస్ర నామాలు అంటే వెయ్యి నామాలు పొందుపరచి ఉన్నాయని లోక విదితమే. ఈ స్తోత్రానికి ఉన్న ఎన్నో విశిష్ట గుణాలు, పారాయణ రహస్యాలు పూజ్య గురువుల ప్రవచనాల ద్వారా ఎంతో కొంత ఆకళింపు చేసుకుని ఉంటాము. వీటిల్లొ ఏ ఒక్క నామం రెండవ సారి చెప్పబడలేదని,  ప్రతీ నామం ఒక కొత్త విషయం బోధిస్తుందని పెద్దల మాటల వలన తెలుసుకుని ఉంటాము.  

భగవద్గీతలో మన నిత్యజీవితం లోని ప్రతీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే,  బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడిన, నిత్యపారాయణ గ్రంధమైన శ్రీ లలితసహస్రనామ స్తోత్రంలో మనకు ఆరోగ్యకరమైన మరియు సౌభాగ్యకరమైన జీవనానికి ప్రయోజనకరంగా ఉండే సూత్రాలు, శాస్త్ర మర్మాలు దాగి ఉన్నాయని, శ్రద్దగా పరిశీలిస్తే మనకు ద్యోతకమౌతాయని;  మన పాఠకులు, అమ్మవారి భక్తురాలు శ్రీమతి జోస్యుల ఉమ గారు లలితా రహస్యనామ స్తోత్రం, తల్లి కాబోయే స్త్రీలకు ఆరోగ్యకరమైన శిశువుకు జన్మ నివ్వడానికి ఏ సూత్రాలు అందిస్తుందో 'తెలుగు భోజనం' ద్వారా చక్కగా వివరిస్తున్నారు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం.

రమణ బంధకవి

సంపాదకుడు



                               శ్రీ లలితసహస్ర నామ స్తోత్రం-ఆరోగ్య రహస్య సూత్రం


                                                                                     శ్రీమతి జోస్యుల ఉమా ప్రసాదరావు

గర్భం  దాల్చినప్పటి  నుండి  స్త్రీలు  ఆహార విషయం లో  ప్రత్యేక  శ్రద్ధ  వహించ  వలిసి   ఉంటుంది. వారు ఎప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో మన 'అమ్మలగన్న అమ్మ- ముగ్గురమ్మల మూలపుటమ్మ' తన సహస్రనామ స్తోత్రంలో పొందుపరచి, తన సంతానమైన మనకు కానుకగా ఒసిగింది. శ్రీ లలితానామాల్లో ఏ యే ఆహారాలు అమ్మవారికి ప్రీతికరమని చెప్పబడ్డాయో, అవి నెలల వారీగా గర్భస్త స్త్రీ స్వీకరిస్తే నవమాసాలు సజావుగా సాగి, గుమ్మడి పండులాంటి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది అనేది ఒక నమ్మకం అని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిని పరిశీలించి మీ ఆలోచనలకు పదును పెట్టమని మనవి.

1వ నెల: అమ్మవారిని 'పాయసాన్నప్రియా'అంటాం. గర్భవతి అయిన స్త్రీ మొదటి నెలలో పాయసాన్నం అంటే పాలల్లో  ఉడకబెట్టిన అన్నం బెల్లంతో కలిపి తింటే, ఎలాంటి అవాంతరం జరగకుండా గర్భం నిలవడానికి ఎంతో  దోహదపడుతుంది. 

2 వ నెల: 'స్నిగ్దౌదన ప్రియా' అని కూడా అమ్మవారిని పిలుస్తాము. 'స్నిగ్దౌదన' అంటే నెయ్యి తో తడిపిన అన్నం. రెండవ నెలలో నెయ్యితో కలిపిన అన్నం గర్భవతి తింటే శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు  ఎంతో సహాయపడుతుంది.

3వ నెల: 'గుడాన్న ప్రీత మానసా' అమ్మ వారి ఇంకొక నామం. మూడవ నెలలో బెల్లపు అన్నం తరుచుగా తింటుంటే తల్లికి, తల్లి గర్భం లోని శిశువుకి కావలిసిన  ఖనిజాలు, రక్తం అందుతాయి. 

4 వ నెల: అమ్మవారు 'దద్యన్నాసక్త హృదయ' మరి నాలుగవ నెలలో గర్భిణీ స్త్రీ పెరుగన్నం మానకుండా తింటే శిశువు ఎత్తు, బరువు సక్రమం గా పెరిగి, ఎముక పుష్టి పెరుగుతుంది.

5 వ నెల: 'ముద్గౌదనాసక్త చిత్త' కూడా అమ్మవారు. 'ముద్గౌదన'అంటే పప్పు దినుసులుతో కలిపి వండిన అన్నం అంటే 'పులగం' అన్నమాట. 'పులగం' అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. గర్భస్త స్త్రీ అయిదవ నెలలో పులగం నెయ్యి వేసుకుని తరచుగా తింటుంటే, తల్లి, కడుపులోని శిశువు సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారు.

6వ నెల: 'హరిద్రాన్నైక రసిక' అనే అమ్మవారి ఇంకో నామం లో కూడా ఆరోగ్య సూత్రం ఉంది. ఆరవ నెలలో అమ్మవారికిష్టమైన 'హరిద్రాన్నం' అంటే పసుపు, కుంకుమ పువ్వు కలిపిన అన్నం తింటే తల్లీ బిడ్డలకు అంటూ వ్యాధులు  సోకకుండా, రోగనిరోధక శక్తి మెరుగుపడి, బిడ్డ శరీరము కూడా కాంతివంతముగా ఉంటుంది. 

7వ నెలనుండి ప్రసవం జరిగే వరకు: 'సర్వౌదనప్రీతి చిత్తా' అంటూ అమ్మ వారిని సంబోధించి నప్పుడు అమ్మవారికి జగదాంబకు అన్ని రకాల ఆహరం మిక్కిలి ప్రీతికరం అని తెలుస్తోంది. అలాగే తల్లి కాబోయే స్త్రీ ప్రసవ సమయం దగ్గర పడుతూ వుంటుంది కనుక ఏడవ మాసం నుండి బిడ్డకు జన్మ నిచ్చేదాకా పోషక విలువలు కలిగిన అన్ని రకాల ఆహారాలు సరి అయిన పరిమాణం లో తింటే శిశువు సకాలం లో చక్కగా పెరిగి, పూర్తిగా తొమ్మిది నెలలు నిండాకా ఆరోగ్యవంతం గా జన్మిస్తాడు.

మరి మీరు కూడా ఈ విషయం మీద అలోచించి, అంగీకార యోగ్యం అనిపిస్తే  మీ  బంధుమిత్రులతో 

పంచుకుని, వారికి కూడా ఈ ఆరోగ్య సూత్రాలు తెలియజేయగలరు!     

స్వస్తి!


    

Sunday, September 28, 2014

నవరాత్రి వ్యాస పరంపర 8: షష్ఠమం-అష్టైశ్వర్యప్రదాయం!


శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం (30-09-2014)

శ్రీమతి నయన కస్తూరి

దేవీ నవరాత్రులలో లలిత పంచమి నాడు భక్తిశ్రద్ధలతో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని కోలుచుకుని, అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు అని తలుస్తాను.  మరి ఈ శరన్నవరాత్రుల లో ఆరవ రోజైన  రేపు అనగా 30-09-2014 న అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకుంటే  శ్రేష్టమో, ఏ వంటకాలు ఆ దేవికి ప్రీతికరమో, ఏ పూజలు సలిపితే అమ్మ శీఘ్రంగా అనుగ్రహిస్తుందో తెలుసుకుందాము. రేపు అమ్మ వారిని మహాలక్ష్మీ దేవి అలంకారం లో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం! కనుక మనందరం కూడా రేపు శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారిని మనసారా కోలుచుకుందాము. 


శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో  కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయం లో స్థాపించుకుని అర్చించుకుందాము. భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం! మహా కాళి మహాలక్ష్మీ మహా సరస్వతులలో ఈమె  మధ్య శక్తి. 

'విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితాం!
దారిద్ర ద్వంసినీం, దేవీం సర్వోపద్రవ వారిణీం!'

అయిన శ్రీ మహాలక్ష్మీ తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 'యాదేవి సర్వ భూతేషు లక్ష్మి రూపేణ సంస్థితా!’ అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ సూక్తసహితంగా సకల ఉపచారాలు జరిపించి, అర్చించుకుని, పూర్ణాలు, క్షీరాన్నాం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించుకుందాము. భక్తులకు దేనికీ కొదవ ఉండదు. అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారాస్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం!



ఈ నాడు దరించ వలసిన వర్ణం: ఎరుపు

ఈ నాటి నివేదనలు:
నివేదనలు--వడపప్పు, పానకం, పూర్ణాలు, క్షీరాన్నం వీటిలో మొదటి రెండూ  మనం ముందే తెలుసుకుని ఉన్నాం కదండీ? మరి ఈ రోజు పూర్ణాలు, క్షీరాన్నం గురించి గుర్తుచేసుకుందాం.

పూర్ణాలు: వీటినే పూర్ణం బూరెలు అని కూడా అంటారు.
కావలిసిన వస్తువులు: ఒక గ్లాసు మినప్పప్పు, ఒక అరగ్లాసు బియ్యం, ఒక గ్లాసు పచ్చిశనగ పప్పు, గ్లాసుడు బెల్లం పొడి,యాలుకులు -6, పూర్ణాలు వేయించడానికి సరి పడ నూనె. 

తయారు చేయువిధానం: మినప్పప్పు, బియ్యం నాలుగైదు గంటల ముందుగా నానబెట్టుకోవాలి. శనగ పప్పు ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పప్పుని నీళ్లన్నీ ఓడ్చి, ఒక చిల్లుల పళ్ళెం లో ఆరబెట్టుకోవాలి. నీళ్లు మొత్తం పోయి ఆరతాయి. ఇప్పుడు బెల్లం పొడిని ఒక దళసరి మూకుడులో వేసి తడవడానికి సరిపడా నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టాలి. పాకం తయారయ్యే లోపు ఆరిన శనగపప్పు, యాలకులను మిక్సీ లో వేసి పొడిగా చేసుకోవాలి. దీనిని ఉడుకుతున్న పాకం లో వేసి గట్టి పడి  ఉండ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు స్టవ్ మీదనుండి దింపి చల్లారనివ్వాలి. ఈ లోగా మనం నానబెట్టుకున్న మినప్పప్పు, బియ్యం గ్రైండర్ లో మెత్తగా జాలు వారుగా బజ్జీ పిండి లాగా తోపు పిండి చేసుకోవాలి. చల్లారిన శనగ పప్పు, బెల్లం పాకాన్ని కొంచెం నెయ్యి చేతికి  రాసుకుంటూగుండ్రటి ఉండలుగా  నిమ్మకాయ పరిమాణం లో చేసుకోవాలి. ఈ పూర్ణం ఉండలని తోపులో ముంచి, కాగిన నూనెలో వేసి బంగారం రంగులో వేయించుకోవాలి. అమ్మ వారికిష్టమైన పూర్ణం బూరెలు సిద్దం. వీటినే కొందరు పూర్ణాలు అని, కొందరు బూరెలు అని  అంటారు. బూరెకి మధ్యలో చిల్లు పెట్టి, స్వచ్చమైన  నెయ్యితో నింపి, తింటే అద్భుతః! 



క్షీరాన్నం:
కావలిసిన వస్తువులు: ఒక లీటర్ ఆవు పాలు, రెండు గ్లాసుల బియ్యం, చారెడు పెసరపప్పు, [శుభానికి చేసుకునే పరమాన్నం ఎప్పుడూ బియ్యానికి పెసరబద్దలు కాని శనగ పప్పు కాని వేయకుండా చేయకూడదని పెద్దలు చెపుతారు), రెండు లేక ఎక్కువ తీపి అక్కర్లేనివారు ఒకటిన్నర గ్లాసు పంచదార, యాలకులు-6, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, కిస్మిస్  సరిపడా. 

తయారు చేసే విధానం: ముందుగా ఒక దళసరి గిన్నె శుభ్రంగా కడిగి అందులో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. బియ్యం రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి. దైవ కార్యానికై పరమాన్నం చేసేటప్పుడూ తడిబియ్యం వాడకూడదు అంటారు. అందుకనే పాలు కాగాక, పోడి బియ్యం, పెసరపప్పు పాలల్లో వేసి, సన్న సెగ మీద ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యమధ్య  కలుపుతూ ఉండాలి. అన్నం ఉడకటానికి వచ్చినప్పుడు పంచదార కూడా కలిపి కలుపుతూ ఇంకొం చెంసేపు అంటే ఒక అయిదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఒక బుల్లి మూకుడు స్టవ్ మీద పెట్టి, రెండు చెంచాల నెయ్యి వేసి, జీడిపప్పు, బాదం పప్పుకిస్మిస్ వేసి వేయించి, ఉడుకుతున్న పరమాన్నంలో కలపాలి స్టవ్ ఆర్పేసి పరమాన్నం కిందకు దించేయండి. యాలకులను పొడి చేసి క్షీరాన్నం లో కలపండి. క్షీరాన్నం తయారైపోయింది అమ్మ వారు క్షీరాన్నప్రియ అని మనకు తెలుసుకదా? అందుకని రేపు శ్రీ మహాలక్ష్మీ అవతారం రోజున శ్రద్ధగా పూర్ణాలు, క్షీరాన్నం చేసి, భక్తిగా నివేదించుకుని, అమ్మ వారిని ప్రసన్నం చేసుకుందాము. రేపటి రోజున ఏడవ అవతారంతో కలుద్దాం!