Friday, September 26, 2014

నవరాత్రి వ్యాస పరంపర 7: చతుర్ధం--చతుర్వేద స్వరూపం!



శ్రీ గాయత్రీ మాత అలంకారం 


శ్రీమతి నయన కస్తూరి


ఈ రోజున అందరూ ఆనందంగా అన్నపూర్ణాదేవిని అర్చించుకుంటున్నారు కదా? మరి ఇక రేపటి అమ్మ వారి అవతారమేమిటో, నివేదనలు ఏమిటో తెలుసుకుందాము. దేవీ నవరాత్రులలో ఆశ్వయుజ శుక్ల చవితినాడు అనగా రేపు (28-09-2014) కదంబవనవాసిని అయిన ఆ పరమేశ్వరిని శ్రీ గాయత్రీ మాత  అలంకారం లో పూజించుకుంటారు భక్తులు.


మరి మనమందరం భక్తితో అమ్మను ధ్యానించుకుని, ఆ సర్వ మంగళ స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్టించుకుందాం. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ మాత తేజోవంతమైన  అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ వుంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, శోభన మూర్తిగా కొలువై ఉంటుంది. ఆదిశంకరులు ఆరాధించిన ఈ గాయత్రీ మాతను వీక్షించిన మాత్రాన మనసు పులకితమౌతుంది. దైవ శక్తులకే మూలాధారం శ్రీ  గాయత్రీ మాత!

   ‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య థీ మహీ థియో యోనః ప్రచోదయాత్! 

అని భక్తి తో ఉచ్ఛరించినంతనే  ఉపాసనాబుద్ధి తేజోవంతం అవుతుంది.

ఈ గాయత్రీ మాత అలంకారం లో అమ్మ వారిని ఆరాధిస్తే చతుర్వేద పారాయణ ఫలితం కలిగి, సకల దురిత ఉపద్రవాలు పటాపంచలు అవుతాయి. పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వ క్షేమానికై గాయత్రీ మాత అర్చన అత్యంత ఆవశ్యకం! అందుచేతనే  ఈ శరన్నవరాత్రులలో గాయత్రీ మాత ఉపాసన విశిష్టం గా పొందుపరిచారు దైవజ్ఞులు! శ్రీ గాయత్రీ దేవి అష్టోత్తరంతో  అమ్మ వారికి షోడశోపచార పూజ గావించి, వీలైనన్ని సార్లు గాయత్రీ మంత్రాన్ని పటించి, అమ్మకి వడపప్పు, పానకం, పచ్చి చలిమిడితో  పాటు అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మ వారు మనలను చల్లగా కాపాడుతారు.




ఈ నాడు ధరించవలసిన వర్ణం: కనకాంబరం

ఈ నాటి నివేదన: అల్లపు గారెలు

చేసే విధానం:
పండగ రోజు ఉదయాన్నే లేచి, స్నానం చేసిన తర్వాత రెండు గ్లాసుల ఛాయ మినప్పప్పు, ఒక అరగ్లాసు పొట్టుమినప్పప్పు నాన బెట్టుకోవాలి. పప్పు చక్కగా ననిన తరువాత, నీళ్ళు తక్కువగా పోస్తూ తగినంత ఉప్పు వేసి  మెత్తగా, గట్టిగా రుబ్బుకోవాలి. పప్పుకి సరి పడా పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకుని, శుభ్రం చేసి, మిక్సీ లో వేసి, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ అల్లం పచ్చిమిరపకాయ ముద్దను పిండి లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక మూకుడును  స్టవ్ మీద పెట్టి, గారెలు వేయించడానికి సరి పడా నూనె కాని  ఇష్టమైన వారు నెయ్యి కానీ  పోసి, బాగా కాగాక ఒక అరటి ఆకు ముక్క కాని ప్లాస్టిక్ కవర్ కాని తీసుకుని, పిండి ని మధ్య లో చిల్లు పెట్టి గారెల ఆకారం లో వేసి, రెండు పక్కలా బాగా వేయించుకోవాలి. వేగిన గారెలను నూనె  లేకుండా తీసి, ఆర్చనానంతరం అమ్మవారికి భక్తిగా నివేదన చేసుకోండి.



ఇతర నివేదనలు: వడపప్పు:
ఒక అరగ్లాసుడు చాయ పెసరపప్పును ఒక  గ్లాస్ నీళ్ళలో ఒక అరగంట సేపు నాన బెట్టి, నీళ్లు ఒడ్చేస్తే వడపప్పు సిద్దం. కొంచెం వెరైటీ గా కావాలనుకునే వాళ్ళు నానిన  పప్పు లో కొంచెం నిమ్మరసం పిండి, తగినంత ఉప్పు వేసి, పచ్చి కొబ్బరి తురుముగా  కాని చిన్న చిన్న ముక్కలుగా  కాని కలుపుకోవచ్చు.



పానకం:
రెండు గ్లాసుల నీళ్ళను ఒక గిన్నెలో పోసి దానికి సరి పడా అంటే రెండు గ్లాసుల బెల్లం పొడిని తీసుకుని నీళ్ళల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక అర చెంచాడు మిరియాలు పొడి చేసి బెల్లం కరిగిన నీళ్ళల్లో కలుపుకోవాలి .అమ్మ వారికి అత్యంత ప్రీతికరమైన పానకం సిద్ధమైపోయింది.




నువ్వుపిండి పులిహోర:
పులిహోరకు కావాల్సిన అన్నం కాస్త బిరుసుగా వండాలి.  ఒక కప్పులో తగినంత చింతపండు నాన బెట్టి, మెత్తగా గుజ్జు తీసి పోయ్యమీద మూకుడులో పది నిముషాలు ఉడకబెట్టాలి. దీనిలో నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి తగినన్ని వేసుకుని ఉడకనివ్వాలి. గుజ్జు తడి ఇగిరి గట్టి పడాలి. ఇక ఒక మూకుడులో తగినంత నూనె వేసి, కాగేక, మినపప్పు, సెనగ పప్పు, ఆవాలు, నాలుగైదు ఎండు మిరపకాయలు, కరివేపాకు రోబ్బలు, చిటికెడు ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి. ఇపుడు ఒక పెద్ద పళ్ళెం తీసుకుని, ఉడికిన అన్నం పరిచి, దానిలో ఉడికిన చింతపండు గుజ్జు, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు చల్లి, వేయించిన పోపు కూడా వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు ఒక మూకుడులో 50 గ్రాముల తెల్ల నువ్వులు దోరగా వేయించి, చల్లారాక మిక్సీ లో పొడి చేసి, ఆ పొడిని పులిహోర పైన చల్లి  చక్కగా కలపాలి. ఇప్పుడు నువ్వుపిండి పులిహోర తయార్!




ఇక పచ్చి చలిమిడి ఎలా చేయాలో మీరిదివరకే తెలుగు భోజనం’ లో నేర్చుకున్నారు కదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకుని చేసుకుని, అమ్మవారికి  నివేదించుకోండి.



రేపు అయిదవ అలంకారంతో కలుద్దాము.  
స్వస్తి!          



No comments:

Post a Comment