శ్రీ
లలితా త్రిపుర సుందరి అలంకారం (29-09-2014)
శ్రీమతి నయన కస్తూరి
నాలుగవ
రోజైన ఈ నాడు వేదాలకే మూలమైన శ్రీ గాయత్రీ మాతను ఆరాధించు కుంటున్నాము. మరి పంచమి తిది వచ్చే రేపటి రోజున(29-09-2014) మన శైల పుత్రిని ఏ విధంగా అలంకరించుకోవాలో, ఏ వంటకాలు నివేదన చేయాలో చూద్దాము. మణి
ద్వీప వాసిని అయిన పరాంబికను శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో పూజలు
జరుపుతారు.
‘త్రిపురత్రయం’
లో రెండవ శక్తి స్వరూపిణి ఈ తల్లి. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని ‘లలిత పంచమి’ అని
కూడా అంటారు. చెరకుగడ, విల్లు, పాశము,
అంకుశము ధరించి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కుడి ఎడమలు సేవలు అందిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తుల
ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కన్యలు
మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి గా అఖండ
సౌభాగ్యం కొరకు ఈ నవరాత్రులలో అయిదవ రోజు ‘ఉపాంగ లలితా వ్రతం’
ఆచరిస్తారు.
అమ్మవారిని
శ్రీ లలితా దేవి అలంకారం లో సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమ పూజలు చేసి, ముత్తైదువలకు
తాంబూలాలు ఇచ్చుకుంటారు. ముత్తైదువులను పిలిచి,
సువాసినీ పూజలు చేస్తారు. కైలాస గౌరీ నోము కాని గ్రామ కుంకుమ
నోముకాని నోచుకున్న వారు చాలా మంది ఈ రోజు ఉద్యాపన చేసుకుంటారు. కొంతమంది తమ
గృహాల్లోనే సామూహిక లక్ష కుంకుమార్చనలు ఏర్పాటు చేసుకుంటారు. బొమ్మల కొలువులు
పెట్టుకున్న వారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుంది. కుంకుమ పూజలు
సలిపేవారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. పంచమి నాడు శ్రీ లలితాదేవి దేదీప్యమైన
మూర్తిని మనస్సులో ప్రతిష్టించుకుని, ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేనమః’ అని వీలైనన్ని సార్లు
జపించుకుంటే అమ్మ మాతృమూర్తి యై చల్లగా చూస్తుంది.
ఈనాడు ధరించవలసిన
వర్ణం: తెలుపు
ఈనాటి నివేదనలు: పులిహోర, పెసర బూరెలు
పులిహోర:
మనకు
కావలిసిన పరిమాణం బట్టి బియ్యం తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక కిలో బియ్యంతో చేద్దాము.
ఒక
కిలో బియ్యం శుభ్రం గా కడిగి రెట్టింపు నీళ్లు కన్నా కొంచెం తక్కువగా పోసుకుని రైస్ కుక్కర్లో కొంచెం బిరుసుగానే అన్నం
వండుకోవాలి. పులిహారకి అన్నం మెత్తనైతే బాగుండదు. అన్నం వుడికే లోపు ఒక వంద
గ్రాముల చింతపండు శుభ్రం చేసుకుని ఒక అరగ్లాస్ నీళ్ళల్లో నానబెట్టండి. నానాక
గుజ్జు తీసుకుని, అందులో ఉసిరికాయంత బెల్లం వేసి ఒక అయిదు
నిమిషాల సేపు ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇక పులిహార పోపుకు కావలిసిన ఈ క్రింది
దినుసులు రెడీ చేసుకుందాము.
ఎండు
మిరపకాయలు-5, జీడిపప్పులు-ఒక
గుప్పెడు, వేరుశనగ పప్పులు- ఒక గుప్పెడు, మినప్పప్పు-మూడు చెంచాలు, ఆవాలు-ఒక చెంచాడు, ఇంగువ-ఒక చిటికెడు, నూనె-సరిపడా, పచ్చి మిరపకాయలు-6 ముక్కలుగా తరిగి, కరివేపాకు-
రెండు రెమ్మలు, మిరియాలు-నాలుగైదు కచ్చాపచ్చాగా పగలగొట్టి, పసుపు-కావలిసిన రంగు రావడానికి సుమారుగా ఒక అర చెంచాడు.
ఉడికిన
అన్నం ఒక పెద్ద బేసిన్ లో కాని, పళ్ళెం లో కాని వేసి ఆరబెట్టుకోవాలి. ఒక మూకుడులో తగినంత నూనె పోసి, వేడెక్కాక పైన చెప్పిన దినుసులతో పోపు వేయించుకుని, వేగిన తర్వాత కిందకు దింపిన తర్వాత పసుపు వేస్తె పచ్చివాసన లేకుండా
అన్నానికి పసుపు బాగా పడుతుంది. వేగిన పోపు, తగినంత ఉప్పు
ఆరబెట్టుకున్న అన్నం లో కలిపి, ఉడికించి పెట్టుకున్న
చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంతమంది పచ్చిమిరపకాయ
కారం బాగా దిగాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ ముక్కలను చింతపండు గుజ్జులో వేసి వుడకబెట్టుకోవచ్చు.
ఇవి పులిహార తినేటప్పుడు కొరుక్కు తింటే పుల్లపుల్లగా కారంకారంగా చాలా బాగుంటాయి.
అమ్మవారికి నివేదన చేసేటప్పుడు ఒక నేతి గరిటెడు నెయ్యి అభికరించడం మర్చిపోకండే?
దైవ నివేదనకి చేసిన ప్రతి వంటకం లో నెయ్యి అభికరించేకా నివేదన
చేయాలి అని పెద్దలు చెప్తారు. పులిహార సిద్దం
అయింది. ఇక పెసర బూరెలు ఎలా చేయాలో చూద్దామా?
పెసరబూరెలు: కావలిసిన పదార్ధాలు:
ఒక
గ్లాస్ మినప్పప్పు, ఒక
అరగ్లాస్ బియ్యం తోపు పిండికి బాగా నానేలా ముందుగా నాన బెట్టుకోవాలి.
రెండు
గ్లాసుల చాయ పెసర పప్పు విడిగా ఒక గంట ముందు నాన బెట్టుకోవాలి.
బెల్లం
పొడి- రెండు గ్లాసులు, యాలకులు-6,
నూనె బూరెలు వేయించడానికి సరిపడా.
ముందుగా
నానిన పెసరపప్పుని మెత్తగా ఇడ్లి పిండి లా రుబ్బుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో
ఇడ్లీల్లా వేసి, ఉడికాకా చల్లారనివ్వాలి. ఈ లోగా నానిన మినప్పప్పు, బియ్యం గ్రైండర్ లో వేసి
మెత్తగా రుబ్బి జాలువారుగా తోపు పిండి తయారు చేసుకోవాలి. బెల్లం పొడి మునగడానికి
సరిపడా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి పాకం తయారు చేస్తూ వుండాలి. పెసర ఇడ్లీలను
ముక్కలుగా చేసి, మిక్సీ లో
వేసి పొడి చేసుకోవాలి. దీనిని ఉడుకుతున్న్న బెల్లం పాకంలో వేసి, గట్టి పడేదాకా ఉడకనివ్వాలి. బాగా దగ్గర పడ్డాకా స్టవ్ ఆర్పేసి
చల్లారనివ్వాలి. పైన యాలకుల పొడి కలపాలి. చల్లారాకా ఇక గట్టిపడి ఉండ చేసుకోవడానికి వీలుగా తయారు అవుతుంది. దానిని ఉండలుగా చేసి వుంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి, దాంట్లో బూరెలు
వేయించుకోవడానికి సరి పడా నూనె పోసుకోవాలి. నూనె కాగాకా మనం పూర్ణం బూరెలు
వేసుకున్నట్లుగా ఉండలను ఒక్కోక్కటి తోపు పిండిలో ముంచి నూనె వేసి, బంగారు వర్ణం వచ్చేలాగా వేయించుకోవాలి. ఇడ్లీ పిండిని ఉండలుగా
చేసుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చేస్తే ఉండలూ బాగా వస్తాయి. అమ్మ వారి
బూరెలకు నేతి ఘుమ ఘుమ అంటుకుంటుంది.
శ్రీ
లలితా పరభట్టారికా దేవికి వడపప్పు, పానకం, చలిమిడి తో పాటు ఈ పులిహార, పెసరబూరెలు శ్రద్ధగా చేసి, భక్తిగా
నివేదించుకుందాము.
మరి
రేపటి రోజున ఆరవరోజు అలంకారం లో కలుద్దాము.
స్వస్తి!
No comments:
Post a Comment