Tuesday, September 2, 2014

9 వ సంచిక: తెలుగు సాంప్రదాయ శాకాహార వంటలు, కబుర్లు కమామిషు!



ముందు మాట:

అన్నట్లు మనం కామాక్షి కబుర్లు విని చాల రోజులైనట్టుందే! మరి ఆవిడా, సూరీడమ్మ గారు ఏం 

చేస్తున్నారో? ఆ! ఏమిటి? ఏంటో పనిమనిషి రాక గురించి లుక లుక పడుతున్నట్టున్నారు! 

సూరీడమ్మ గారి మొహం ముట ముట లాడుతూ కందగడ్డ లా ఉంది. లక్ష్మీ కాంతం గారేమో టీవీ 

లో మొహం, చెవులు దూర్చి ఎదో వింటున్నారు. కామాక్షి మొహం లో ఎదో అలజడి. ఆ కదేమిటో 

శ్రీమతి రత్న గారు చెపుతున్నారు చూద్దాం.


పంటికింద కరకర లాడుతూ ఎప్పుడూ ఎదో ఉంటె బావుంటుందని మనలో చాలామంది 

అనుకుంటారు. పాపం అలాంటి వారికోసం మన బామ్మ గారు అందిస్తున్నారు చిట్టి గారెలు...కర 

కర కర...ఒకటే ఇంపైన శబ్దం!


వడ్డించిన విస్తరి ఉంటే ఎంచక్కా పీఠం వేసుక్కూర్చుని ఇక లాగించేయడమే తరువాయి! కాని 

అందరి ముందర వడ్డించిన విస్తర్లే ఉండవు కదండీ! మరి దాని సంగతేమిటో శ్రీమతి పద్మ గారు 

చక్కగా వివరిస్తున్నారు.


ఆ విస్తరి మాట ఏమైనా , ఈ సంచిక మాత్రం మీ ముందు వడ్డించిన విస్తరే! ఇక ఎందుకు ఆలస్యం?



రమణ బంధకవి


సంపాదకుడు



కామాక్షి కబుర్లు:


పనిమనిషి – ములగాకు


శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు


"పనిమనిషి ఇంకా రాలేదుటే?"  ప్రతి పది నిమిషాలకి  ఒక సారి అడుగుతూనే వున్నారు సూరీడమ్మగారు. "ఇంకా రాలేదు అత్తయ్య" చెప్పింది కామాక్షి. 

సూరీడమ్మగారికి, లక్ష్మీకాంతం గారికి విశ్వనాధం పెద్ద కొడుకు. ప్రతి వేసవిలో వాళ్ళు వారి స్వగ్రామం నుండి  బెంగళూరు విశ్వనాధం దగ్గరికి వస్తూవుంటారు. ఆ రోజు పనిమనిషి పది గంటలైన రాలేదు. సూరీడమ్మగారికి  సింకు అంతా అంట్లతో నిండిపోతే నచ్చదు. అందుకని కాఫీలు, టిఫిన్లు అయ్యేక నేను కడిగేస్తాలే అంటూ వంటిట్లోకి వస్తారు.

“మీరుండండి అత్తయ్యా ! పనిమనిషి వచ్చేస్తుంది కదా !”  అంటుంది కామాక్షి. 
“ఆ .... పోనిద్దూ!  అదోచ్చేలోపు ఇంకా అంట్లు జేరుకోవూ? అవి కడుగుతుంది లే! అని తోమటం మొదలెడతారు. పెద్దావిడ చేత తోమించటం ఎందుకని ఇంక కామాక్షికి అంట్లు తోమక  తప్పదు. 

ఆ రోజు కూడా "అదింక వచ్చే దాఖలాలు లేవు గాని, పోనీ నేను కొన్ని తోమనుటే?” అంటూ వచ్చేరు వంటిట్లోకి. 
“వద్దత్తయ్య! అన్ని రెండేసి సెట్లు వున్నాయి. వంటకి ఇబ్బంది లెదు. ఒక్కోసారి అది పదకొండు కూడా చేస్తుంది. మీకు తెలిసిందేగా!” అంది కామాక్షి. 

"అవును నాకు తెలియకనే?  మనుషులు వస్తే చాలు దానికి ట్టయిలాయించటం కూడా తెలుసును. ఏదైనా మేమొస్తే నీకు ఇబ్బందేనే! నాకా వంట ఇంట్లో అలా అంట్ల  మంగళాలు చూస్తే చేయ్యూరుకోదు; నాకోసం నీ పని మానుకుని ఈ అంట్ల పనిలోకి వస్తావు. మేమే లేకపోతె అంట్లు పడేసి ఏ ఝామైనా దానికోసం చూస్తావు కాబోలు!” నొచ్చుకున్నారు అత్తగారు. 

పనిమనిషి మీదనుండి దృష్టి మరల్చటానికి "టీవీ లో చాగంటి గారి ప్రవచనాలు మావయ్య చూస్తున్నారు. మీరు చూస్తారా?” అడిగింది కామాక్షి. 
“ఆ .... ఏదో చూడటమే గాని ఏమైనా ఆచరిస్తున్నామా? సరేలే  పోనీ! కొంత కాలక్షెపమైనా అవుతుంది” అని హాల్లోకి వచ్చారు.

లక్షికాంతం గారికి అంతగా ....... అంతగా ఏమిటి? బొత్తిగా వినపడదు. టీవీ ప్రక్కగా కుర్చీ లాక్కుని వాల్యూం   తారస్థాయిలో  పెట్టుకుని వింటున్నారు. ఆయన  "గజేంద్ర మోక్షం" గురించి వుత్కంటగా చెప్పేస్తున్నారు. కామాక్షి కూడా వంట ఇంట్లోంచే వింటూ పని చేసుకుంటోంది. కాని సూరిడమ్మ గారికి అదేమీ అంత  ఆసక్తికరంగా అనిపించటం లేదులా ఉంది. ఆవిడ దృష్టి అంతా పనిమనిషి మీదే ఉంది. ఒక చెవితో అనాసక్తిగా వింటూనే, అది బెల్లు కొడితే టీవీ శబ్దానికి వినపడదేమోనని రెండో చెవిని రిక్కించి వుంచారు. 

గడియారం పదకొండు కొట్టింది. పనిమనిషి జాడ లేదు. సూరిడమ్మ గారికి ఒళ్ళు మండిపోతోంది. "ఈ సారి అది ఏ కాకమ్మ కబుర్లు చెప్పినా నమ్మకు. నాగ కట్టుకుంటానని చెప్పు" అక్కసుగా అన్నారు.


గజేంద్ర మోక్షం కూడా చివరికి వస్తోంది. అక్కడ గజేంద్రుడు నిస్సహాయంగా రక్షించు ప్రభో! అని దిక్కులు పిక్కటిల్లెట్లు ఘీన్కరించినపుడు సరిగ్గా కాలింగ్ బెల్ మోగింది …. (సశేషం)






బామ్మ గారి కార్నర్:


చిట్టి గారెలు ----కరకరలు


గారెలైతే అందరూ తిని వుంటారు. మరి కరకరలాడే చిట్టి గారెలు తెలుసా మీకు? తెలియదా? అయితే ఇప్పుడు చెప్తాను; తెలుసుకుని కమ్మగా చేసుకుని, చక్కగా మీ పిల్లలకు  తినిపించి, మీరు కూడా తినండి.

చిట్టి గారెలు కరకర లాడుతూ తినడానికి చాలా బాగుంటాయి. ఇవి పది పదిహేను రోజుల దాకా నిలవ కూడా వుంటాయి. వీటిని పిల్లలు, పెద్దలు కూడా ఇష్టం గా తింటారు. సాయంకాలాలు టీ తో పాటు పంటి కిందకు, పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కాలక్షేపంగా తినడానికి బాగుంటాయి.

కావలసిన పదార్ధాలు :
సెనగ పప్పు : పావు గ్లాసు
పెసర పప్పు : పావు గ్లాసు
బియ్యం పిండి : ఒక గ్లాసు
జీలకర్ర : చిటికెడు
కారం, ఉప్పు : తగినంత
నూనె : వేయించడానికి సరిపడా

తయారు చేసే విధానం:
చిట్టి గారెలు చేసుకోవాలంటే ముందుగా శనగ పప్పు, పెసర పప్పు పావు గంట నాన బెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో నానిన శనగ పప్పు, పెసర పప్పు, జీలకర్ర, తగినంత కారం, ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి. అప్పుడు వేడి నీళ్ళతో ఈ మిశ్రమాన్ని గట్టి ముద్దలాగా చపాతీ పిండి అంత గట్టి గా కలుపుకుని, అర గంట సేపు మూత పెట్టి ఉంచుకోవాలి.

ఒక  శుబ్రమైన గుడ్డను తీసుకుని, తడిపి, బాగా పిండి టేబుల్ మీద పరుచుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా గోళికాయ పరిమాణం లో చేసుకుని, అంగుళం అంగుళం దూరంలో తడిపి పిండిన గుడ్డ మీద ఒక సగభాగం లో పరుచుకోవాలి. మిగతా సగం గుడ్డను ఈ ఉండల మీద కప్పాలి. ఒక గ్లాస్ తో ఈ ఉండల మీద వున్న గుడ్డ మీద గట్టిగా నొక్కాలి. ఉండలు పలుచగా బిస్కట్స్ షేప్ లో వస్తాయి.

ఒక మూకుడు లో నూనె వేసి, బాగా కాగిన తర్వాత సన్న సెగ లో పెట్టుకుని ఈ బిళ్ళల్ని కరకర లాడేలా వేయించుకోవాలి. డబ్బాలో వేసి గాలి తగలకుండా పెట్టుకుంటే పది పదిహేను రోజుల దాకా నిలవ వుంటాయి.




వడ్డించిన విస్తరి



శ్రీమతి పద్మా రఘునాద్



"అబ్బ! వాడికి ఏమితక్కువండి?  జీవితం అంతా వడ్డించిన విస్తరే కదండీ!”  అని  ఎవరైనా సంపన్నులని చూసి ఈ మాట అంటుండటం సర్వ సాధారణం గా వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇల్లు, కుటుంబము, ఉద్యోగం, ఆస్తులు మొదలైనవి ఉంటే ఇంక అన్ని పరిపూర్ణం  అయ్యాయి కనుక వారి జీవితం వడ్డించిన విస్తరి లాగా ఉంది అని ఆ మాటకి అర్ధం అయి ఉండవచ్చు.  విస్తరి లో అన్ని పదార్ధాలు అమరిన తర్వాత వారికి  ఇంక తినటమే తరువాయి, ఇంకేమి వండుకోవాల్సిన పని లేకుండగా.  

అలాగే ఒక్కొక్కరికి  జీవితం లో కావాల్సినవి అన్నీ ముందే సమకూరి ఉండటం, ఎక్కువ శ్రమ లేకుండ గానే, వాటిని అనుభవించే అదృష్టం  లభించి నపుడు వారి జీవితాన్ని వడ్డించిన విస్తరి తో పోల్చటం జరుగుతూ ఉంటుంది. అలా జీవితాన్ని పోల్చటం చాలా  వరకు కూడా సబబే అని అనిపిస్తుంది. ఎలా అని ఆలోచిస్తున్నారా?  అయితే చూడండిలా!

విస్తరి లో అన్ని వడ్డించాక కూర్చుని భోజనం చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో మన జీవితాలలో తలచిన అన్ని పనులు సక్రమం గా నెరవేరి, పరిస్తితులు అనుకూలం గా ఉన్నపుడు కూడా అలాగే ఉంటుంది.  ఎందుకంటే కొంత మందికి జీవితం లో ఖాళీ విస్తరి ఉండవచ్చు. అందులో పదార్ధాలన్నీ కష్టపడి సమ కూర్చుకుని రావాల్సి ఉంటుంది. ఓపికగా అన్ని సమ కూర్చుకుని వారికి కావలసినవి అన్ని వండుకుని, తృప్తిగా భోజనం చేయటానికి సమయం పట్ట వచ్చు. దీనికి ఎంతో సహనం  కూడా కావాలి. అందుకే చాల శ్రమ కోర్చి విస్తరినింపుకునే వారికి, వారి విస్తరి లోని పదార్ధాలు చాల విలువైనవి గా కూడా అనిపిస్తాయి.

ఎవరికైనా ప్రతి రోజు భోజనం లో ఒక పప్పు, కూర, పులుసు, పచ్చడి, అన్నం, పెరుగు, నేయి ఉంటె తృప్తి గా, కడుపు నిండుగా చేసే భోజనం  తయారు అయినట్లే! అపుడపుడు ప్రత్యేకంగా పండుగలలో పిండి వంటలు, తీపి పదార్ధాలు కూడా తోడు  అయితే మరింత ఆనందంగా భోజనం చేయటానికి ఇష్ట పడతారు. ఈ పిండి వంటలని మన జీవితం లో సంభవించే శుభ సంతోషాలుగా పోల్చు కోవచ్చును. 

కొంత మందికి ముందే విస్తరి లో అన్నీ వడ్డించి ఉండటం వలన వాటి రుచి, విలువ తెలుసు కోలేక  పోవటం కూడా జరుగుతుంటుంది. అలాగే రోజు పిండి వంటలు తినే వారికి కూడా పండుగ రోజున వండిన పిండి వంటలు మరీ అంత ప్రత్యేకంగా కూడా కనిపించక పోవచ్చు. 

కొంత మందికి  వడ్డించిన విస్తరి ఉన్నా అవి తృప్తిగా తిని జీర్ణం చేసుకోలేని పరిస్తితులలో ఉండవచ్చు. లేదా ఏ బిపి, షుగర్ వ్యాధుల వలన పిండి వంటలు తినలేని పరిస్థితి కూడా కలుగ వచ్చు. మరి కొందరికి విస్తరి నిండా పదార్ధాలు ఉన్నా, వాటిలో వారి రుచి కి నచ్చిన పదార్ధం ఒకటి కూడా లేక పోవచ్చు. ఇలాగ  ప్రతివారి మనో జీవన ప్రవత్తులు బట్టి వారి వారి విస్తళ్ళలో వడ్డించిన పదార్ధాలు ఎంత తృప్తి గా తినగలరో ఆధార పడి ఉంటుంది. 

ప్రక్క వారి  విస్తరిలోకి తొంగి చూడనంత వరకు, ఎవరి విస్తరి లోని పదార్ధాలు వారికి సరి పడతాయి అని అనుకోవటం సులభం అవుతుంది.  లేదా  విస్తరిని వారి వారి శక్తులని బట్టి, ఇంకా నింపుకునే ప్రయత్నం చేయటమో అలా వీలులేని పరిస్థితి లోవాటి తోనే సరి పుచ్చుకునే ప్రయత్నం చేస్తే, నిరాశ నిస్పృహ లకు లోను కాకుండగా ఉండటం సాధ్యం అవుతుంది. 

ఒక్కోసారి విస్తరి లో వడ్డించిన పదార్ధాలు అన్నీ  మన నోటికి రుచికరంగా ఉండక పోవచ్చును. ఉప్పు ఎక్కువ అయినవి క్రొద్దిగా తీసుకుని వాటిలో అన్నం కొంచెం ఎక్కువగా కలుపుకుని తినగలిగేలా చేసుకున్నట్లు, అలాగే కారం ఎక్కువ అయిన వాటిల్లో నేయి వేసుకుని నోరు మంట పుట్టకుండగా ఎలా సరిపుచ్చుకుని భోజనం చేస్తామో, అలానే  జీవిత పరిస్థితులనుకూడా, కొన్ని సందర్భాలలో మనకు అనుకూలంగా చేసుకోటానికి ప్రయత్నిస్తే మన జీవితం అనే భోజనాన్ని వీలయింత తృప్తికరం గా చేయటానికి సాధ్యపడుతుంది. 

విస్తరి నిండా  ఎన్ని పదార్ధాలు ఎలా నింపు కోవాలో దిగులు పడటం కన్నాఉన్నపదార్ధాలను 

ఎంత తృప్తి గా తిని జీర్ణించు కోగలమో అని ఆలోచిస్తే అందరివి ‘వడ్డించిన విస్తర్లె’ అని 

అనుకోవచ్చు కదా!  అవునా  కాదా?  మీరే చెప్పండి!



No comments:

Post a Comment