Sunday, September 7, 2014

10 వ సంచిక: తెలుగు సాంప్రదాయ శాకాహార వంటలు, విశేషాలు, కధలు, కబుర్ల మేలు కలయిక!



ముందుమాట!

శెలవ రోజుల్లో సాయంత్రం వేళ వంటింటి లోంచి వచ్చే పోపు వాసనల ఘుభాళింపు పసిగట్టి ఉప్మా 

చేస్తున్నారని పసికట్టే తెలుగు షెర్లాక్ హొమ్స్ ప్రతి ఇంటిలోనూ ఉంటారు. చారు లో పెట్టే పోపు ను 

బట్టి ఇంగువ చారా లేక కొత్తిమెర చారా అని ఇంటి బయటనుంచే కనిపెట్టేసే భోజన వీరులు కొల్లలు. 

పక్క ఇంటిలోంచి వచ్చే వంట సౌరభాలను ఆఘ్రాణించి, వారు గుమ్మడికాయ దప్పళం ప్రయత్నం 

లో ఉన్నట్లు యిట్టె చెప్పేసే నిపుణులు ఇంటికొక్కరు! మరి ఈ పరిశోధనాగ్రేసరుల గొప్ప ఆయుధం- 

పోపు వాసనలు. అన్ని పోపులకు పుట్టిల్లు మన వంటింటి పోపుల డబ్బా! దీని విశిష్టతను, తెలుగు 

ఇల్లాళ్లు దీనికిచ్చే ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు శ్రీమతి పద్మ తమ ‘పోపుల డబ్బా’ 

వ్యాసం లో.


కాకరకాయ అంటే భయపడే వారికీ, కాకరకాయ వేపుడు మాత్రమే ఇష్టపడే వారికి, బెల్లం పులుసు 

పెట్టి వండే ఘుమఘుమల కాకరకాయ పోపు కూర తయారీ గురించి అమ్మ చేతి వంటల శీర్షిక లో 

శ్రీమతి రత్న గారు పూస గుచ్చి వివరించారు. అబ్బ పోపు వాసన బ్రహ్మాండంగా వుంది! 


వంటింటి నాగమ్మ లాంటి మన వాణికి వచ్చింది ఒక చిక్కు. అయ్యవారికి రెండు పదార్థాలు కావాల్సి 

వుంటే ఉన్నది ఒక్కటే కూరగాయ! మరి చిక్కు సమస్యకి మీ సమాధానం ఏమిటి అని ప్రశ్నిస్తోంది. 

మరి వంటిటి తెలివి ఆమె సొత్తే కాదని నిరూపించుదామా?  ఇక సంచిక తెరవండి!



రమణ బంధకవి


సంపాదకుడు



తెలుగు వంటింటి పోపుల డబ్బా!


శ్రీమతి పద్మారఘునాద్

పోపుల డబ్బా లేని వంట ఇల్లు దొరకటం చాల అరుదైన విషయం సుమండీ! అదీ  మన తెలుగు వారి ఇళ్ళల్లో.  పోపుల డబ్బా లాంటి ఉపయోగకరమయిన వస్తువ ఏ  గృహిణికి మరొకటి ఉండదంటే అందులో అంత విడ్డూరమేమీ లేదు. ప్రతీ ఇల్లాలు, ప్రతీ రోజు విరివిగా వాడేది ఈ పోపుల డబ్బానే. మరి ఆ అనుబంధం  అలాంటిది. పోపు డబ్బాలో దినుసులన్నీ  నింపుకుని  తయారుగా ఉంచుకుని వంటకు సిద్ధమవుతారు మన తెలుగు గృహిణులు. ఆ డబ్బా పదిలంగా  వంట ఇంట్లో అతి జాగ్రత్తగా దాచుకుంటారు కూడా. 

కొంతమంది ఇల్లాళ్ళకి అది డబ్బు దాచుకునే బ్యాంకు లాంటిది కూడా. ఇంట్లో ఎవరికి డబ్బు అవసరం పడినా చటుక్కున పోపుల డబ్బా లోంచి తీసి వారి అవసరాలకు అడపా దడపా ఆదుకుంటూనే ఉంటుంటారు. మరి పోపుల డబ్బా మహిమ అల్లాంటిది. పోపు సామానులను బట్టి గృహిణి వంట ఏమి చేయాలో, పోపు కూరా లేదా వేపుడా అని అపుడపుడు నిర్ణయం తీసుకోవటం కూడా జరుగుతుంటుంది.   

పోపుల డబ్బా ఎలా ఉంటుందో ఎవరికీ వివరించి పెద్దగా చెప్పనవసరం లేదనుకుంటా! డబ్బా సైజుని బట్టి 6 చిన్న లోటాలు, ఒకటి మధ్యలో మొత్తం 7 లోటాలు పోపు దినుసులకోసం కేటాయింపబడి ఉంటాయి. పైన ఒక మూత కూడా మిరపకాయలు పోసుకోటానికి ఉంటుంది. దానిపైన మొత్తం డబ్బాకి మూత పెట్టుకోవచ్చాన్నమాట. వంట చేసేటపుడు ఈ పోపు దినుసులన్నీ అందుబాటులో ఒకే డబ్బాలో ఉండటం వలన వంట చేసేవారికి మరింత సదుపాయంగా ఉంటుంది. పోపు వేసేటపుడు ఒక్కో దానికోసం వెతుక్కోకుండగా అన్ని ఒకే డబ్బాలో లభించటం వలన పొయ్యి మీద నూనె మాడి పోయే సమస్య కూడా ఉండదు. 

మొత్తానికి ఈ పోపుల డబ్బా తెలుగు వారి వంట ఇళ్ళలో మొదటి పీట వేసుకున్నదనే చెప్పచ్చు. వంట చేసేముందు పోపు దినుసులు అయిపోయాయని తెలిస్తే ఆందోళనగానే ఉంటంది ఇల్లాళ్ళలందరికీ. అవి నింపే వరకు మనస్సు కూడా కుదుటగా ఉండదంటే నమ్మండి.  రక రకాల రుచులు మేళవించిన ఈ పోపు దినుసులన్నీ పడితేనే వంటకాలకి ఆ ఘుమ ఘుమలు, ఒక ప్రత్యేకతా వస్తాయని గట్టిగా చెప్పచ్చు. ఇందులో ఏది తక్కువయినా రుచి లోపిస్తుందని ఆందోళనే కదండీ!  ఇలా రంగు, రుచి, వాసనలలో విభిన్నమయిన లక్షణాలున్న ఈ పోపు దినుసులన్నీ ఒకే చోట ఒకే డబ్బాలో పొందుపరచబడి, వీటన్నిటి సమన్వయంతో పెట్టిన "తిరగమోత" వండిన వంటకానికే ఒక సువాసన, గుభాళింపు తెస్తుంది అనటం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 

అలాగే కుటుంబం లోని సభ్యులంతా పోపు దినుసుల మాదిరి విభన్న మనస్తత్వాలు కలిగి ఉన్నప్పటికీ, వారందరు  కలసి మెలసి,  పోపుల డబ్బా అనే ఒకే కుటుంబం అనిపించేలా వారి ఇంటిలోని ఏ పండుగ, పబ్బం అయినా, ఏ శుభకార్యానికైనా,  కష్ట సుఖాలలో ఒక్కటిగా  చేరి పాల్గొంటే, అమ్మ, నాన్నలు తలపెట్టిన  వంటకమనే కార్యానికి మాంచి ఘుమ ఘుమ లాడే పోపు పెట్టినట్లే కదండీ!  పైగా పోపు దినుసులలో ఏ ఒక్కటి  వేరే దినుసు లోటుని భర్తీ చేయనట్లే, కుటుంబ సభ్యులందరూ పాల్గొంటేనే ఆ కార్యం నూటికి నూరు పాళ్ళు సంతోషాన్ని కలగ చేస్తుందన్న మాట. దీని అర్ధం పోపు దినుసులన్నీ మూకుడులో చిటపట లాడుతూ ఉండటం మాత్రం  కాదండోయ్!

అందుకే, పోపు డబ్బాలో ఏ  లోటా ఖాళీగా ఉన్నా దాని వెలితి తెలిసి పోతుంది. అందుకే  ఇల్లాళ్ళు అంత ఆత్రుత పడతారు దానిని త్వరగా నింపటానికి.  నిండుగా, కళగా ఉన్న పోపు డబ్బాని చూసి ఉత్సాహంగా వంట చేయని వారేవరుంటారు చెప్పండి


వంటకాలలో పోపు పెట్టుకోవటం మన తెలుగు వారికి ఎప్పటినుండో వస్తున్న అలవాటనే చెప్పాలి. ప్రత్యేకించి మన తెలుగు వంటల్లో మాంచి ఘాటైన పోపు పడితే కాని మజా ఉండదు సుమండీ! ఈ పోపునే తిరగమోత అని కూడా పిలవటం వాడుకలో ఉంది. మరి ఈ తిరగమోత ఏమిటి దాని ఘుమ ఘుమలు మళ్లి ఇంకో సారి తెలుసుకుందాము. అలాగే ఈ పోపు దినుసులేమిటి? వాటి ప్రత్యేకత లేమిటి; మళ్లి  తర్వాత కలిసి నపుడు మాట్లాడుకుందాం. 



అమ్మ చేతి వంటలు: కాకరకాయ పులుసు బెల్లం కూర

శ్రీమతి రత్నాశ్రీనివాస్, బెంగళూరు

కాకరకాయ పులుసు-బెల్లం కూర తెలియని వారుండరు. ఐతే ఈ కాలంలో వేపుళ్ళు ఎక్కువైపోవటంతోనూ, అందునా కాకరకాయ స్వతహాగా చేదుగా ఉండటంతో, బాగా నూనెలో వేసి వేయిస్తేనే కాని దాని చేదు పోదని చాలా మంది వేపుడే ఇష్టపడుతుంటారు. అలాంటి వారు ఒకసారి పులుసు–బెల్లం కూర ప్రయత్నిస్తే తప్పక ఇష్టపడతారు.
ఈ కూరకి వస్తువులు రెడీ చేయుటకు పట్టే సమయం : 20 నిముషములు
వండుటకు పట్టే సమయం: 10 నిముషములు
కావలసిన వస్తువులు
1.కాకర కాయలు                              5 కాయలు
2.ఎండు మిరప కాయలు                    2(రెండేసి ముక్కలుగా తుమ్పుకోవచ్చును)
3.సెనగ పప్పు                                 ½  టీ స్పూన్
3.మినప పప్పు                                ½  టీ స్పూన్
4.ఆవాలు                                       ¼  టీ స్పూన్
5.జీలకర్ర                                        ¼  టీస్పూన్
6.ఇంగువ                                       చిటికెడు
7.ఉప్పు                                         తగినంత
8.కారం                                          ½  టీస్పూన్
9.పసుపు                                       చిటికెడు
10.చింతపండు రసం                        2 టేబుల్ స్పూన్స్
11.బెల్లం                                        2 టేబుల్ స్పూన్స్
12.బియ్యప్పిండి                              1 టేబుల్ స్పూన్
13.కరివేపాకు                                  4-5 రెబ్బలు

 
తయారు చేయు విధానం:
మొదట కాకరకాయని శుబ్రంగా కడిగి చెక్కు తీసి గుండ్రముగా తరుక్కోవాలి.
తరిగిన ముక్కల్ని ప్రెషర్ పాన్ లోకి తీసుకుని ముక్కలు మునిగేంతవరకు (ఇంచుమించుగా చిన్న గ్లాసుడు) నీళ్ళు పోసి చిటికెడు పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.
మొదటి విజిల్ వచ్చేక మంటను తగ్గించి పది నిమిషాలు ఉంచాలి. రెండవ విజిల్ రాగానే స్టవ్ కట్టేసుకోవాలి.
ప్రెషర్ విడుదల అయ్యేలోపు ఒక కప్పులో నిమ్మపండు సైజంత చింతపండును నానబెట్టుకోవాలి.                 
అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను తురుము చేసుకుని పెట్టుకోవాలి.
ఇపుడు కుక్కర్ మూత తీసి ముక్కలని బైటకి తీసుకోవాలి. నీరు ఎక్కువైతే, గరిటెతో ముక్కలు మాత్రమే తీసుకోండి.
ఒక బాండీ లేదా నాన్ స్టిక్ పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి.
నూనె కాగేక సెనగపప్పు, మినపపప్పు వేసి రంగు మారేంత వరకు వేయించుకుని, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి.
ఆవాలు చిటపటలాడేక ఇంగువ, కరివేపాకు వేయాలి.
ఇపుడు ఉడికిన ముక్కలని పోపులో వేసి కలుపుకుని ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి. నానబెట్టిన చింతపండు, బెల్లం, ఉప్పు కూడా జత చేసి ముక్కలను బాగా కలియబెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇపుడు ముక్కలు చింతపండు, బెల్లం మిశ్రమాన్ని బాగా పీల్చుకున్నాక, ఒక టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, అర టీస్పూన్ కారం వేసి బాగా కలియబెట్టి రెండు నిమిషాలు మూత పెట్టుకుండ మగ్గనిచ్చి  స్టవ్  ఆపుకోవాలి.
తయారైన కూరను ఒక శుబ్రమైన పాత్రలోకి మార్చుకోండి. కాకరకాయ పులుసు బెల్లం కూర తయార్!

వడ్డించుటకు సలహాలు మరియు ఇతరత్రా:
పులుసు –బెల్లం కూరలు వేడి వేడి అన్నంలోకి బాగా రుచిగా వుంటాయి.
కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ  దానిని మధుమేహ వ్యాధి వున్నవారిని ఆహారంలో తప్పక తీసుకోమని చెబుతారు. అలాగే కాకర కాయ రసం కూడా తాగమంటారు.
పులుసు–బెల్లం, పిండి వేయటం వలన కాకరకాయ చేదు తగ్గి తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా వుండి రుచిగా వుంటుంది.
ఇది చేదుకూర కాబట్టి, ఇందులో కొంచెం అన్నీ పులుపు, కారం, బెల్లం ఎక్కువగా వేసుకోవాల్సి వుంటుంది. పైన చెప్పిన పరిమాణంలో కన్నా మీ అభిరుచిని బట్టి బెల్లం, చింతపండు వేసుకొనవచ్చును.









చెప్పుకోండి  చూద్దాం!  - వాణి వంటింటి సమస్యకి మీ సమాధానం!


శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్


వాణి పూజ ముగించుకుని వంట ప్రయత్నం లో పడింది. “ఏమి చెయ్యాలో ఈ పూట?” అనుకుంటూ ఫ్రిజ్ తెరిచింది. తెరిచిన ఫ్రిజ్ లో కూరగాయల బాస్కెట్ చూసి “చచ్చామురా దేవుడా!  ఒకటే ఒక కూర వుంది. అది కూడా కూరకు మాత్రమే సరిపోతుంది. “మరీ బొత్తిగా కూర ఒకటే చేస్తే ఎలాగా? ఆయనకు కనీసం  రెండు పదార్దాలైనా ఉండాలి. ఊరగాయలు కూడా ముట్టుకోరాయే!”  ఏమి చెయ్యాలో తెలియక కాస్త సందిగ్దం లో పడింది. వెంటనే ఆలోచనలో పడింది. ఈ కూరగాయతో ఎలా రెండు ఆధరువులు చేయగలదో తీవ్రంగా ఆలోచించింది.  ఆమె చలాకి బుర్రకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. “అమ్మయ్యా! ఇలా చేస్తే రెండు పదార్ధాలు చేయగలను. అన్నికాయలు తగ్గించకుండా కూరకే  ఉపయోగిస్తాను. ఇంకో ఆదరువు కూడా చేయగలను” అనుకుంటూ మొదట కూర చేయడం మొదలు పెట్టింది. 

అయితే, వాణి రెండో ఆదరువు ఏమి చేసింది? తన దగ్గరున్న కూరగాయలను మొత్తం కూరకే వాడి మరి ఏమి వుపయోగించి రెండో పదార్ధం చేసింది? మరి మీరు కూడా అలా చేయగలరా? వాణి ఫ్రిజ్ లో వున్నా కూరగాయ ఏమిటి? చెప్పుకోండి చూద్దాము!

మీరు కనిబెట్టిన తరువాత ఆ రెండో పదార్ధం ఎలా చేసుకోవాలో మీకు నేను చెప్తాను. ముందు మీరు 

వాణి వాడిన కూరగాయ ఏమిటో చెప్పుకోండి చూద్దాం! ఆల్ ద బెస్ట్!  మీ జవాబు సరి అయినదో 

కాదో తెలుసుకోవాలంటే 'తెలుగు భోజనం' చూస్తూనే (చేస్తూనే) ఉండండి. 





1 comment: