Monday, September 29, 2014

నవరాత్రి వ్యాస పరంపర: 10: శ్రీ లలితసహస్ర నామ స్తోత్రం - ఆరోగ్య రహస్య సూత్రం!


ముందుమాట:

దేవీ నవరాత్రులలో లలిత పంచమి నాడు అనగా ఈ రోజు భక్తిశ్రద్ధలతో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని కొలుచుకుని, అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు అని తలుస్తాను.  హిందువులలో చాలామంది ఆడవారు నిత్యమూ ముఖ్యంగా ఈ పండగ రోజులలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తూనే ఉంటారు. ఈ స్తోత్రం లో అమ్మవారి యొక్క సహస్ర నామాలు అంటే వెయ్యి నామాలు పొందుపరచి ఉన్నాయని లోక విదితమే. ఈ స్తోత్రానికి ఉన్న ఎన్నో విశిష్ట గుణాలు, పారాయణ రహస్యాలు పూజ్య గురువుల ప్రవచనాల ద్వారా ఎంతో కొంత ఆకళింపు చేసుకుని ఉంటాము. వీటిల్లొ ఏ ఒక్క నామం రెండవ సారి చెప్పబడలేదని,  ప్రతీ నామం ఒక కొత్త విషయం బోధిస్తుందని పెద్దల మాటల వలన తెలుసుకుని ఉంటాము.  

భగవద్గీతలో మన నిత్యజీవితం లోని ప్రతీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే,  బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడిన, నిత్యపారాయణ గ్రంధమైన శ్రీ లలితసహస్రనామ స్తోత్రంలో మనకు ఆరోగ్యకరమైన మరియు సౌభాగ్యకరమైన జీవనానికి ప్రయోజనకరంగా ఉండే సూత్రాలు, శాస్త్ర మర్మాలు దాగి ఉన్నాయని, శ్రద్దగా పరిశీలిస్తే మనకు ద్యోతకమౌతాయని;  మన పాఠకులు, అమ్మవారి భక్తురాలు శ్రీమతి జోస్యుల ఉమ గారు లలితా రహస్యనామ స్తోత్రం, తల్లి కాబోయే స్త్రీలకు ఆరోగ్యకరమైన శిశువుకు జన్మ నివ్వడానికి ఏ సూత్రాలు అందిస్తుందో 'తెలుగు భోజనం' ద్వారా చక్కగా వివరిస్తున్నారు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం.

రమణ బంధకవి

సంపాదకుడు



                               శ్రీ లలితసహస్ర నామ స్తోత్రం-ఆరోగ్య రహస్య సూత్రం


                                                                                     శ్రీమతి జోస్యుల ఉమా ప్రసాదరావు

గర్భం  దాల్చినప్పటి  నుండి  స్త్రీలు  ఆహార విషయం లో  ప్రత్యేక  శ్రద్ధ  వహించ  వలిసి   ఉంటుంది. వారు ఎప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిదో మన 'అమ్మలగన్న అమ్మ- ముగ్గురమ్మల మూలపుటమ్మ' తన సహస్రనామ స్తోత్రంలో పొందుపరచి, తన సంతానమైన మనకు కానుకగా ఒసిగింది. శ్రీ లలితానామాల్లో ఏ యే ఆహారాలు అమ్మవారికి ప్రీతికరమని చెప్పబడ్డాయో, అవి నెలల వారీగా గర్భస్త స్త్రీ స్వీకరిస్తే నవమాసాలు సజావుగా సాగి, గుమ్మడి పండులాంటి బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది అనేది ఒక నమ్మకం అని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిని పరిశీలించి మీ ఆలోచనలకు పదును పెట్టమని మనవి.

1వ నెల: అమ్మవారిని 'పాయసాన్నప్రియా'అంటాం. గర్భవతి అయిన స్త్రీ మొదటి నెలలో పాయసాన్నం అంటే పాలల్లో  ఉడకబెట్టిన అన్నం బెల్లంతో కలిపి తింటే, ఎలాంటి అవాంతరం జరగకుండా గర్భం నిలవడానికి ఎంతో  దోహదపడుతుంది. 

2 వ నెల: 'స్నిగ్దౌదన ప్రియా' అని కూడా అమ్మవారిని పిలుస్తాము. 'స్నిగ్దౌదన' అంటే నెయ్యి తో తడిపిన అన్నం. రెండవ నెలలో నెయ్యితో కలిపిన అన్నం గర్భవతి తింటే శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు  ఎంతో సహాయపడుతుంది.

3వ నెల: 'గుడాన్న ప్రీత మానసా' అమ్మ వారి ఇంకొక నామం. మూడవ నెలలో బెల్లపు అన్నం తరుచుగా తింటుంటే తల్లికి, తల్లి గర్భం లోని శిశువుకి కావలిసిన  ఖనిజాలు, రక్తం అందుతాయి. 

4 వ నెల: అమ్మవారు 'దద్యన్నాసక్త హృదయ' మరి నాలుగవ నెలలో గర్భిణీ స్త్రీ పెరుగన్నం మానకుండా తింటే శిశువు ఎత్తు, బరువు సక్రమం గా పెరిగి, ఎముక పుష్టి పెరుగుతుంది.

5 వ నెల: 'ముద్గౌదనాసక్త చిత్త' కూడా అమ్మవారు. 'ముద్గౌదన'అంటే పప్పు దినుసులుతో కలిపి వండిన అన్నం అంటే 'పులగం' అన్నమాట. 'పులగం' అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. గర్భస్త స్త్రీ అయిదవ నెలలో పులగం నెయ్యి వేసుకుని తరచుగా తింటుంటే, తల్లి, కడుపులోని శిశువు సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారు.

6వ నెల: 'హరిద్రాన్నైక రసిక' అనే అమ్మవారి ఇంకో నామం లో కూడా ఆరోగ్య సూత్రం ఉంది. ఆరవ నెలలో అమ్మవారికిష్టమైన 'హరిద్రాన్నం' అంటే పసుపు, కుంకుమ పువ్వు కలిపిన అన్నం తింటే తల్లీ బిడ్డలకు అంటూ వ్యాధులు  సోకకుండా, రోగనిరోధక శక్తి మెరుగుపడి, బిడ్డ శరీరము కూడా కాంతివంతముగా ఉంటుంది. 

7వ నెలనుండి ప్రసవం జరిగే వరకు: 'సర్వౌదనప్రీతి చిత్తా' అంటూ అమ్మ వారిని సంబోధించి నప్పుడు అమ్మవారికి జగదాంబకు అన్ని రకాల ఆహరం మిక్కిలి ప్రీతికరం అని తెలుస్తోంది. అలాగే తల్లి కాబోయే స్త్రీ ప్రసవ సమయం దగ్గర పడుతూ వుంటుంది కనుక ఏడవ మాసం నుండి బిడ్డకు జన్మ నిచ్చేదాకా పోషక విలువలు కలిగిన అన్ని రకాల ఆహారాలు సరి అయిన పరిమాణం లో తింటే శిశువు సకాలం లో చక్కగా పెరిగి, పూర్తిగా తొమ్మిది నెలలు నిండాకా ఆరోగ్యవంతం గా జన్మిస్తాడు.

మరి మీరు కూడా ఈ విషయం మీద అలోచించి, అంగీకార యోగ్యం అనిపిస్తే  మీ  బంధుమిత్రులతో 

పంచుకుని, వారికి కూడా ఈ ఆరోగ్య సూత్రాలు తెలియజేయగలరు!     

స్వస్తి!


    

No comments:

Post a Comment