శ్రీమతి
నయన కస్తూరి, హైదరాబాద్
(గత సంచిక: “ఏమా మొదటి ముద్ద? అమ్మ ముద్ద,నాన్న
ముద్ద విన్నాం కాని ఈ మొదటి ముద్ద ఏమిటబ్బా?” అనుకుంటున్నారా?
మొదటి ముద్ద అంటే ఈ రోజుల్లో స్టార్టర్స్ అన్న మాట! ...ఇక చదవండి)
మనం భోజనం ఎప్పుడు సంతోషం గా ఆస్వాదించగలం? మనకు ఆకలిగా ఉన్నప్పుడు! ఆకలి
ఎప్పుడు పుడుతుంది? మన ఉదరంలో జటరాగ్ని పుట్టినప్పుడు! ఈ
మొదటి ముద్దచేసే పని జటరాగ్నిని పుట్టించి, మరి కొంచెం పెంచి,
మన జీర్ణ వ్యవస్థను ఆహారం స్వీకరించి, జీర్ణం చేసుకోవడానికి ఆయత్తం చేస్తుంది. ఈ మొదటి ముద్ద ఎంత అవసరమో మరి తెలుసుకున్నారు
కదూ? ఈ మొదటి ముద్ద ఎలా తినాలో,
దేనితో తినాలో మన పెద్దలే నేర్పారు మనకు ఏ కష్టం లేకుండా! మరి అవి ఎమిటోచూద్దాం.
ఉసిరికాయ పచ్చడి, కొంచెం అన్నం కొంచెం నెయ్యి వేసుకుని
బాగా కలుపుకుని ఒకటి లేక రెండు ముద్దలతో
మీ భోజనానికి శ్రీ కారం చుట్టడం అన్నిటికన్నా శ్రేష్టం! నిమ్మకాయ పచ్చడి, కొత్తిమీర కారం, పుదీనా కారం, తాజాగా చేసిన నిమ్మకాయ కారం, ధనియాల పొడి లేక
కరివేపాకు పొడి కూడా ఒక్క ముద్ద అన్నం లో
కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తినవచ్చు. దీని వలన మీకు నోటి
హితవు పెరుగుతుంది, భోజన రుచిని పూర్తిగా ఆస్వాదించవచ్చు,
జీర్ణ వ్యవస్థను మెరుగు
పరుచుకోవచ్చు ఇంకా ముఖ్యం గా మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తొంబై సంవత్సరాల
మా మామగారు ఇప్పటికీ ఆరోగ్యం గా, చురుగ్గా ఉన్నారంటే దాని
వెనక రహస్యం ఏ మందులు మాకులు కాదు; ఈ మొదటి ముద్దేనండోయ్! పైన నేను చెప్పిన ఏదో ఒకటి ఆయనకు రోజు
వుండవలిసిందే! దానితోటే ఆయన తన భోజనానికి శ్రీ కారం చుడతారు. ఒకటి
గుర్తు పెట్టుకోండి; మొదటి ముద్దలోని ఏ ఆధరువులోనూ నూనె ఎక్కువ వాడకూడదు. సరేనా? మీకిప్పుడు కరివేపాకు కారం ఈ మొదటి ముద్ద కోసం ఎలా చేసుకోవాలో చెప్పమంటారా?
కరివేపాకు కారం:
ఒక మూడు కట్టల కరివేపాకు రెమ్మలు తీసుకుని, ఆకు వలుచుకోండి. శుభ్రం గా కడిగి, ఒక మంచి గుడ్డ మీద కొంచెం సేపు ఆరబెట్టండి. నిమ్మ కాయంత చింతపండును
కాసిని నీళ్ళల్లో నానబెట్టండి. స్టవ్ మిద చిన్న మూకుడు పెట్టి, కొంచెం నూనె వేసి, నాలుగు ఎండు మిరప కాయలు, ఒక చెంచా శనగ పప్పు, రెండు చెంచాల మినప్పప్ప్పు, ఒక పావు చెంచా మెంతులు, ఒక అరచెంచాడు ఆవాలు వేసి
పోపు వేయించండి. బాగా వేగాక అందులో ఆరబెట్టిన కరివేపాకు కూడా కలిపి ఒక్క నిమిషం
కరివేపాకు యొక్క పచ్చి వాసన పోవడానికి వేయించండి. స్టవ్ ఆపేసి, దానికి సరిపడా ఉప్పు, తీపి ఇష్టం అయిన వారు కొంచెం
బెల్లం, చిటికెడు పసుపు వేసుకోండి. నాన బెట్టిన చింత
పండు నుండి గుజ్జు పూర్తిగా తీసి ఉంచుకోండి. పోపు చల్లారాక మిక్సీలో
వేసి, మెత్త గా నలిగేలా చూసుకోండి. మెత్తగా
అయ్యాక చింత పండు గుజ్జు కూడా తీసుకుని మిక్సీ లొ వేసి మెత్తగా రుబ్బాలి. మెత్తగా
అయ్యాక తీసి, ఒక శుభ్రమైన సీసా లో పెట్టుకోండి. ఈ కరివేపాకు కారాన్ని మొదటి ముద్దగానే కాకుండా
ఇడ్లీల్లోకి, దోశల్లోకి కూడా నంజుకోవడానికి బాగుంటుంది. దీనిని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక వారం రోజుల
దాకా రుచి మారకుండా బాగుంటుంది. చింతపండు గుజ్జుకు బదులుగా
సరిపడా నిమ్మకాయ రసం పిండుకున్నా బాగుంటుంది.
మరి మీ భోజనానికి శ్రీ కారం ఎలా చుట్టు కోవాలో తెలుసుకున్నారు కదండీ?
No comments:
Post a Comment