Sunday, September 21, 2014

నవరాత్రి ప్రత్యేక వ్యాస పరంపర:2 - శరన్నవ రాత్రులు---సర్వ సౌభాగ్య సోపానాలు: రెండవ భాగం



శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్

ఈ నవరాత్రి ఉత్సవాలు, కొందరు కొన్ని నియమాలు పాటిస్తూ, తొమ్మిది రోజులు పూజలు చేసుకుంటారు. తొమ్మిది రోజులు అమ్మ వారిని వివిధ అలంకారాలు చేసి, ఆయా దేవతా స్వరూపాలకి శోడషోపచారాలతో అష్టోత్తర పూజ చేసుకుని, ఆ రోజు నిర్దేశింప బడ్డ వంటకాన్ని చేసి నివేదించుకుంటారు. మరి కొందరు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనం చేస్తారు. తొమ్మిది రోజులు చేసే ఓపిక, సమయం లేని వారు త్రిరాత్ర వ్రతమని సరస్వతీ దేవి పూజ రోజు నుండి [మూలా నక్షత్రం వున్న రోజున  సరస్వతీ దేవి పూజ చేస్తారు] చివరి మూడు రాత్రులు చేసుకుంటారు.

కొన్ని ప్రాంతాల ప్రజలు సంక్రాంతి పండగ సమయం లో బొమ్మల కొలువును పెట్టుకుంటే, మరి కొన్ని ప్రాంతాల వారు శరన్నవరాత్రులలో బొమ్మల కొలువును పెట్టుకుని, అమ్మ వారికి అర్చన, దీప ధూప నివేదనలు చేసి, హారతులిచ్చి, పేరంటం చేసుకుంటారు. ఈ బొమ్మల కొలువులు రకరకాల బొమ్మలతో చూడటానికి కన్నుల పండుగ గా ఏర్పాటు చేస్తారు. దుర్గాష్టమి నాడు అనగా, ఎనిమిదవ రోజున బాల పూజ అని, ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల లోపు తొమ్మిది మంది ఆడ పిల్లలను అమ్మ వారి రూపంగా భావించి, సకల ఉపచారాలతో పూజిస్తారు. ముత్తైదువులకు సుహాసిని పూజలు చేస్తారు. పట్టు వస్త్రాలతో ఆడవారంతా చూడ ముచ్చటగా వుండి, పెళ్లి సందడి లాగే వుంటుంది. ఈ కన్యా పూజ కాని, ముత్తైదువుల పూజ కాని స్త్రీ శక్తి కి మన సంప్రదాయాలు ఎంత ప్రాముఖ్యతని ఆపాదిస్తున్నాయో చెప్పకనే చెప్తాయి.




ఇక పాండవులచే మొదలు పెట్టబడిన ఆయుధ పూజ ఇప్పటికి మహానవమి నాడు కొంతమంది; విజయదశమి నాడు కొంతమంది; కర్మాగారాల్లో యంత్రాలకు, రైతులు వారి వ్యవసాయ పనిముట్లకి, వివిధ వాహనాలకి చేసే పూజల రూపం లో ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాము. శమీ వృక్షాని కి పాండవులు చేసినట్లుగా మనం కూడా ప్రదక్షణలు చేసి, ఈ క్రింది శ్లోకాన్నిఎంతో భక్తి గా పఠిస్తాము.

'శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శినీ!













ఈ నవరాత్రుల పర్వ దినాల్లోనే తెలంగాణా ప్రాంత ప్రజలు బతుకమ్మ పండగను తొమ్మిది రోజులు ఎంతో వైభవం గా ఘనం గా జరుపుకుంటారు. ఇవి పవిత్రమైన రోజులు కనుక స్త్రీలు 'గ్రామ కుంకుమ నోము' 'కైలసగౌరి నోము' లాంటి  పెద్ద నోములు చేసుకుంటారు. విజయదశమి నాడు సకల శక్తి స్వరూపిణి అయిన జగన్మాతను భక్తి శ్రద్ధలతో పూజించుకుని, ఒకరినొకరు అభినందించుకుని వారి వారి సంతోషం కొలది కానుకలు ఇచ్చుకుంటారు. ఇదివరలో గురువులు విద్యార్థులతో కలిసి అందరి ఇళ్ళకు వెళ్లి, ‘అయ్య వారికి చాలు అయిదు వరహాలు, పిల్ల వాళ్లకు చాలు పప్పు బెల్లాలు’ అంటూ పిల్లలు పాడగా, తల్లిదండ్రులు ఇచ్చిన కానుకలను సంతోషం గా స్వీకరించే వారు. అదే కాలక్రమేణా 'దసరామామూలుగా రూపాంతరం చెందింది.   

ఇక ఆయా రోజుల్లో ఏమేమి అలంకారాలు చేస్తారో, ఏయే ఏయే నివేదనలు సమర్పిస్తారో మరి రేపు తెలుసుకుందాం. (సశేషం)











No comments:

Post a Comment