Thursday, September 11, 2014

సాయంకాలం టిఫిన్లు: ఆత్మారాముని మొదటి అర్జీ – మన వేడి వేడి మైసూరు బజ్జీ!



ముందు మాట:

మైసూరు బజ్జీ! అందరికీ సుపరిచితమే! సాయంత్రం  ఐతే చాలు! ఏ కూడలి లో చూసినా బండ్ల మీద పెద్ద పెద్ద బాండీలో నిండుగా నూనె పోసి, మైసూరు బజ్జీలు వేయిస్తుంటే ఆ వీధి, వీధి అంతా కమ్మటి వాసన గుబాళిస్తుంటే, పని మీద ఆ వీధిలో వెళుతుండే వాళ్ళే కాకుండా, ఆ పక్క వీధి వాళ్ళు కూడా ఆ కమ్మటి వాసనకి ఒక సారి తొంగి చూసి, పళ్ళెం నిండా గుండ్రంగా, బొద్దుగా, ముద్దుగా దర్శనమిచ్చే మైసూరు బజ్జీలను చూడగానే ఒక ప్లేటు బజ్జీ పొట్టలో వేసుకోందే పని జోలికి వెళ్ళరు మరి! తెలుగు నాట మైసూరు బజ్జీ అంత ప్రాచుర్యం పొందింది. మైసూరు బజ్జీకి అభిమానులు ఒక్క తెలుగునాటకే పరిమితమై వున్నారనుకుంటే అది పొరపాటే, అన్ని రాష్ట్రాలలోను వున్నారు. పైగా వయస్సుతో కూడా నిమిత్తం లేదు. చిన్నా, పెద్దా అంతా ఇష్టపడతారు. అంతదాకా ఎందుకు? మా మేనల్లుడు బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చినా రైలు దిగిన వెంటనే “మామయ్యా మైసూరు బజ్జి” అంటాడు. అంతేకాదు వెళ్ళేటప్పుడు “మా డాడీ కి కూడ పార్సెల్ చేసి ఊరికి  తీసుకు వెళ్ళొచ్చా?” అని అడుగుతాడు. మైసూరు బజ్జీకి అంత వీరాభిమాని. మరి అందరి మనసులు చూరగొన్న మైసూరు బజ్జీ తయారు చేయటం నేర్చుకుందామా! ఎలా అంటారా? మన పాఠకురాలైన శ్రీమతి కిరణ్మయి శిష్ట్లా గారు, ఈ కమ్మటి మైసూరు బజ్జీలు చేసే పద్దతే కాకుండా, వాటిని ముంచుకుని, నంజుకోవటానికి రెండు విశిస్టమైన అనుపానాలు కూడా ఎలా చేసుకోవలో వివరిస్తున్నారు.

రమణ బంధకవి

సంపాదకుడు



మైసూరు బజ్జీ మరియు రెండు చట్నీలు


                                                                                           కిరణ్మయి శిష్ట్లా, బెంగుళూరు


కావలసిన పదార్ధాలు :
మైదా                   :     2 కప్పులు
బియ్యప్పిండి           :    ½ కప్పు
పులిసిన పెరుగు       :    ఇంచుమించు ½ కప్పు
కారం                    :     1 టీస్పూన్
జీలకర్ర                  :     1 టీస్పూన్
వంట సోడా              :    చిటికెడు గుల్లతనానికి
ఉప్పు                    :     రుచికి సరిపడా
నూనె                    :      వేయించుకునేందుకు సరిపడా


తయారు చేయు విధానం :
ముందుగా మైదాను జల్లెడ పట్టి,మెత్తటి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పులిసిన పెరుగును కలుపుకోవాలి. మీరు మైసూరు బజ్జీని బ్రేక్ ఫాస్ట్ కి చేసుకోనదలిస్తే ముందు రోజు రాత్రి పిండి కలిపి పెట్టుకోవాలి. పెరుగులో నానటం వలన పిండి పెరుగును పీల్చుకుని మరునాడుకి చక్కగా ఉబ్బుతుంది.

సాయత్రం  స్నాక్స్ కి ఐతే, ఉదయం కలుపుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పిండికి బియ్యప్పిండి, ఉప్పు, వంటసోడా, కారం, జీలకర్ర పైన చెప్పిన పరిమాణంలో వేసి, ఉండలు లేకుండా బజ్జీ  వేయటానికి వీలుగా కలుపుకోవాలి.

ఒక బాండీ తీసుకుని వేయించడానికి సరిపడా నూనె పోసి, వేడెక్కేక చేతితో గుండ్రంగా బంతి లాగా చేసుకుని వేడి నూనెలో వేసుకోవాలి. మీరు బజ్జీని చేతితోనే కాకుండా, గుండ్రటి చిన్న గరిటెతో కూడా వేయవచ్చును. ఇప్పుడు బజ్జీని మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలి. అప్పుడు బజ్జీ లోపల పిండి కూడా పచ్చితనం లేకుండ చక్కగా వేగుతుంది. ఇప్పుడు  ఒక శుభ్రమైన పొడిగా వున్న ప్లేట్ మీద టిష్యూ పేపర్ వేసి, వేగిన మైసూరు బజ్జీలను ప్లేటు లోకి మార్చుకోండి. తయారైన బజ్జీలను మీరు చిత్రం లో చూడవచ్చును.

సలహాలు:
మైసూరు బజ్జీని సెనగ చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ లేదా కారప్పొడి తోగాని మరేదైనా చట్నీ తోనైనా తినవచ్చును. ఇక్కడ వైవిధ్యం కొరకు రెడ్ బెల్ పెప్పర్ టమాటో చట్నీ, కొబ్బరి -వేరుసెనగ చట్నీతో చూపించటం జరిగింది. మీకు ఆ రెండింటి  తయారీ విధానం కూడా ఈ క్రింద తెలియజేయటం జరిగింది.
త్వరితగతిని  చేసుకోవాలంటే మైదా లో పులిసిన  పెరుగు కలిపినపుడే వంటసోడా వేసుకుంటే , 5 లేక 6 గంటల్లో పిండి ఉబ్బుతుంది .
‘సెల్ఫ్-రైసింగ్ ఆల్ పర్పస్ ఫ్లోర్’  దొరికినట్లయితే మీకు కొద్ది గంటల్లోనే పిండి ఉబ్బుతుంది .
మైసూరు బజ్జీ, చట్నీ లతో పాటు వేడి వేడి ఫిల్టర్ కాఫీ జతగా ఉంటే ఇంక ఆ అనుభూతి  చెప్పక్కర్లేదు కదా!




ఎర్ర కాప్సికమ్ - టమేటా చట్నీ


కావలసిన పదార్ధాలు :
ఎరుపు కాప్సికమ్                                            2
టమేటాలు                                                      
ఉప్పు                                                            తగినంత 
పసుపు                                                           చిటికెడు 

పోపుకు కావలసిన పదార్ధాలు :
మినపపప్పు                                                    1 టేబుల్ స్పూన్ 
 ఎండు  మిర్చి                                                   4
ఆవాలు,జీలకర్ర                                                  చెరొక టీస్పూన్ 
ఇంగువ                                                            చిటికెడు 
మెంతులు                                                         1/4 టీస్పూన్ 
కరివేపాకు రెబ్బలు                                              4
నూనె                                                               2 టేబుల్ స్పూన్స్ 

తయారు చేయు విధానం :
ముందుగా ఎరుపు కాప్సికమ్, టమేటాలు ముక్కలుగా తరుక్కోవాలి. ఒక బాణలి తీసుకుని నూనె వేసి వేదేక్కేక ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఒక నిమిషం వరకు పెద్ద మంట మీదనే వుంచి వేయించుకోవాలి. ఇప్పుదు ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మంటను తగ్గించి ముక్కలను మగ్గ పెట్టుకోవాలి. 

ఒక పోపు గరిటెను తీసుకుని నూనె వేసి వేడెక్కేక పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పొపు చల్లరేక కొద్దిపాటి పోపును, కరివేపాకును పైన వేయటానికి  వుంచి మిగతా పోపును మిక్సీ లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మెత్తగా మగ్గి వుండి వుంటాయి. ముక్కలు చల్లారిన తరువాత అవి కూడా మిక్సీ లో వేసి  మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తయారైన పచ్చడిని ఒక శుబ్రమైన పొడి పాత్రలోకి తీసుకుని విడిగా ఉంచిన పోపును వేసుకోవాలి. ఎర్రటి  టమేట -కాప్సికమ్ చట్నీ తయారైనట్లే !    



కొబ్బరి వేరుసెనగ చట్నీ


కొబ్బరి వేరుసెనగ చట్నీ మీ కందరికీ సుపరిచితమే!

కావలసిన పదార్ధాలు :
వేయించిన(డ్రై రోస్ట్)  వేరుసెనగ గుళ్ళు           చిన్న కప్పు
తాజా కొబ్బరి తురుము                               చిన్న కప్పు
పచ్చి మిర్చి                                              3-4
ఉప్పు                                                      రుచికి సరిపడా

పోపుకు కావలసిన పదార్ధాలు :
ఎండు మిర్చి                                             1 (రెండుగా తుమ్పుకోనవచ్చును)
మినపప్పు                                                1 టీస్పూన్
ఆవాలు,జీలకర్ర                                           చెరొక ½ టీస్పూన్
ఇంగువ                                                     సువాసన కొరకు
కరివేపాకు రెబ్బలు                                       4
నూనె                                                        1 టేబుల్ స్పూన్

తయారు చేయు విధానం :
ముందుగా వేయించిన వేరుసెనగ గుళ్ళు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి  తగినంత ఉప్పు తీసుకుని బరకగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దానికి తగినంత నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నలిగిన పచ్చడిని ఒక శుబ్రమైన పాత్రలోకి తీసుకుని దానిలోకి పైన చెప్పిన  పోపు దినుసులతో పోపు  వేసుకోవాలి. కమ్మటి కొబ్బరి-వేరుసెనగ చట్నీ తయారైనట్లే!

సలహాలు :
కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు చింతపండు రసం కూడా కలుపుకోవచ్చును.
 మైమరపించే మైసూరు బజ్జీలు, జతగా రెండు చట్నీలు మీ ముందే వున్నాయి. మరి మీదే ఆలస్యం! అన్నట్లు స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ చేసుకోవటం మర్చిపోకండే !











No comments:

Post a Comment