Sunday, September 28, 2014

నవరాత్రి వ్యాస పరంపర 8: షష్ఠమం-అష్టైశ్వర్యప్రదాయం!


శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం (30-09-2014)

శ్రీమతి నయన కస్తూరి

దేవీ నవరాత్రులలో లలిత పంచమి నాడు భక్తిశ్రద్ధలతో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని కోలుచుకుని, అమ్మ వారి ఆశీస్సులు అందుకున్నారు అని తలుస్తాను.  మరి ఈ శరన్నవరాత్రుల లో ఆరవ రోజైన  రేపు అనగా 30-09-2014 న అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకుంటే  శ్రేష్టమో, ఏ వంటకాలు ఆ దేవికి ప్రీతికరమో, ఏ పూజలు సలిపితే అమ్మ శీఘ్రంగా అనుగ్రహిస్తుందో తెలుసుకుందాము. రేపు అమ్మ వారిని మహాలక్ష్మీ దేవి అలంకారం లో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం! కనుక మనందరం కూడా రేపు శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారిని మనసారా కోలుచుకుందాము. 


శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో  కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయం లో స్థాపించుకుని అర్చించుకుందాము. భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం! మహా కాళి మహాలక్ష్మీ మహా సరస్వతులలో ఈమె  మధ్య శక్తి. 

'విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితాం!
దారిద్ర ద్వంసినీం, దేవీం సర్వోపద్రవ వారిణీం!'

అయిన శ్రీ మహాలక్ష్మీ తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 'యాదేవి సర్వ భూతేషు లక్ష్మి రూపేణ సంస్థితా!’ అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ సూక్తసహితంగా సకల ఉపచారాలు జరిపించి, అర్చించుకుని, పూర్ణాలు, క్షీరాన్నాం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించుకుందాము. భక్తులకు దేనికీ కొదవ ఉండదు. అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారాస్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం!



ఈ నాడు దరించ వలసిన వర్ణం: ఎరుపు

ఈ నాటి నివేదనలు:
నివేదనలు--వడపప్పు, పానకం, పూర్ణాలు, క్షీరాన్నం వీటిలో మొదటి రెండూ  మనం ముందే తెలుసుకుని ఉన్నాం కదండీ? మరి ఈ రోజు పూర్ణాలు, క్షీరాన్నం గురించి గుర్తుచేసుకుందాం.

పూర్ణాలు: వీటినే పూర్ణం బూరెలు అని కూడా అంటారు.
కావలిసిన వస్తువులు: ఒక గ్లాసు మినప్పప్పు, ఒక అరగ్లాసు బియ్యం, ఒక గ్లాసు పచ్చిశనగ పప్పు, గ్లాసుడు బెల్లం పొడి,యాలుకులు -6, పూర్ణాలు వేయించడానికి సరి పడ నూనె. 

తయారు చేయువిధానం: మినప్పప్పు, బియ్యం నాలుగైదు గంటల ముందుగా నానబెట్టుకోవాలి. శనగ పప్పు ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్లో కాకుండా విడిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత పప్పుని నీళ్లన్నీ ఓడ్చి, ఒక చిల్లుల పళ్ళెం లో ఆరబెట్టుకోవాలి. నీళ్లు మొత్తం పోయి ఆరతాయి. ఇప్పుడు బెల్లం పొడిని ఒక దళసరి మూకుడులో వేసి తడవడానికి సరిపడా నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టాలి. పాకం తయారయ్యే లోపు ఆరిన శనగపప్పు, యాలకులను మిక్సీ లో వేసి పొడిగా చేసుకోవాలి. దీనిని ఉడుకుతున్న పాకం లో వేసి గట్టి పడి  ఉండ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు స్టవ్ మీదనుండి దింపి చల్లారనివ్వాలి. ఈ లోగా మనం నానబెట్టుకున్న మినప్పప్పు, బియ్యం గ్రైండర్ లో మెత్తగా జాలు వారుగా బజ్జీ పిండి లాగా తోపు పిండి చేసుకోవాలి. చల్లారిన శనగ పప్పు, బెల్లం పాకాన్ని కొంచెం నెయ్యి చేతికి  రాసుకుంటూగుండ్రటి ఉండలుగా  నిమ్మకాయ పరిమాణం లో చేసుకోవాలి. ఈ పూర్ణం ఉండలని తోపులో ముంచి, కాగిన నూనెలో వేసి బంగారం రంగులో వేయించుకోవాలి. అమ్మ వారికిష్టమైన పూర్ణం బూరెలు సిద్దం. వీటినే కొందరు పూర్ణాలు అని, కొందరు బూరెలు అని  అంటారు. బూరెకి మధ్యలో చిల్లు పెట్టి, స్వచ్చమైన  నెయ్యితో నింపి, తింటే అద్భుతః! 



క్షీరాన్నం:
కావలిసిన వస్తువులు: ఒక లీటర్ ఆవు పాలు, రెండు గ్లాసుల బియ్యం, చారెడు పెసరపప్పు, [శుభానికి చేసుకునే పరమాన్నం ఎప్పుడూ బియ్యానికి పెసరబద్దలు కాని శనగ పప్పు కాని వేయకుండా చేయకూడదని పెద్దలు చెపుతారు), రెండు లేక ఎక్కువ తీపి అక్కర్లేనివారు ఒకటిన్నర గ్లాసు పంచదార, యాలకులు-6, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, కిస్మిస్  సరిపడా. 

తయారు చేసే విధానం: ముందుగా ఒక దళసరి గిన్నె శుభ్రంగా కడిగి అందులో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. బియ్యం రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకోవాలి. దైవ కార్యానికై పరమాన్నం చేసేటప్పుడూ తడిబియ్యం వాడకూడదు అంటారు. అందుకనే పాలు కాగాక, పోడి బియ్యం, పెసరపప్పు పాలల్లో వేసి, సన్న సెగ మీద ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యమధ్య  కలుపుతూ ఉండాలి. అన్నం ఉడకటానికి వచ్చినప్పుడు పంచదార కూడా కలిపి కలుపుతూ ఇంకొం చెంసేపు అంటే ఒక అయిదు నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఒక బుల్లి మూకుడు స్టవ్ మీద పెట్టి, రెండు చెంచాల నెయ్యి వేసి, జీడిపప్పు, బాదం పప్పుకిస్మిస్ వేసి వేయించి, ఉడుకుతున్న పరమాన్నంలో కలపాలి స్టవ్ ఆర్పేసి పరమాన్నం కిందకు దించేయండి. యాలకులను పొడి చేసి క్షీరాన్నం లో కలపండి. క్షీరాన్నం తయారైపోయింది అమ్మ వారు క్షీరాన్నప్రియ అని మనకు తెలుసుకదా? అందుకని రేపు శ్రీ మహాలక్ష్మీ అవతారం రోజున శ్రద్ధగా పూర్ణాలు, క్షీరాన్నం చేసి, భక్తిగా నివేదించుకుని, అమ్మ వారిని ప్రసన్నం చేసుకుందాము. రేపటి రోజున ఏడవ అవతారంతో కలుద్దాం!    






No comments:

Post a Comment