Sunday, September 14, 2014

11 వ సంచిక: తెలుగు సాంప్రదాయ శాకాహార రుచులు, అభిరుచుల మేలి కలయిక!



ముందుమాట:

అర్థరాత్రి పన్నెండు గంటలు కావస్తోంది. గోడ మీద ఉన్న కుకూ క్లాక్  లోని పిట్ట తలుపు 

తెరుచుకుని బయటికి  వచ్చి’ కుకూ కుకూ’ అని కూసింది.  లాప్ టాప్ లో  పని  చేసుకుంటున్న 

 నేను ‘అబ్బపన్నెండు అయింది ఇక పడుకోవాలి’ అనుకున్నంతలో పక్కన ఉన్న ఫోన్ లోంచి 

 ‘టింగ్ టింగు’ అన్న మోత! చూద్దును గదా, ‘వాట్స్ఎప్’ లో ఎన్నో గ్రూప్ ల నుండి సుమారు 102 

మెసేజెస్ ఉన్నాయి! అవి ఎప్పుడు చదవను, ఎప్పుడు రిప్లై ఇవ్వను? నాకు అంత అయోమయం 

గా ఉంది. మళ్ళీ ‘టింగ్ టింగ్’. ఈ తల నెప్పి నావల్ల కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. చెప్పటం 

మరిచాను, మొన్న మూడవ ఝాము నిద్దరలో ఉండగా ఒకటే చప్పుడు, దొంగలు పడ్డారేమోనని 

ఉలిక్కిపడి లేచాను. ఇలాంటి వింత సమస్యే ఎదుర్కుంటున్నది మన కామాక్షి. ఆవిడ చెప్పే 

‘వాట్స్ఎప్ విచిత్రాలు’ ఏమిటో ఈ సంచికలో శ్రీమతి రత్నా శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాం.

'చెప్పుకోండి చూద్దాం'  శీర్షికలో వాణి  అడిగిన ప్రశ్నలో ఆ ఇల్లాలు  ఒకే కాయగూరతో కూర పచ్చడి చేసింది. అది బీరకాయ అని మీకు సమాధానం కూడా తెలిసింది. కాయతొ కూర, పొట్టుతో  పచ్చడి.   ఇంక బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో,బీర పొట్టులో కూడా బలవర్ధకరమైన పోషక విలువలు వున్నాయి. ముఖ్యంగా పీచు పదార్ధం, విటమిన్లు తదితర విలువలు వుంటాయి. మరి అ పచ్చడి ఎలా చేయాలో వివరిస్తున్నారు శ్రీమతి నయన కస్తూరి. మీరు ఈ సారి బీరకాయతో వంటకం చేసినపుడు పీచు తీసి పడెయ్యకుండా పచ్చడి చేసి చూడండి . ఇప్పుడు పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాము. ఈ సారి మనము ట్రై చెయ్యొచ్చు!

గత సంచికలో జీవితంలో మనకు తారస పడే వ్యక్తులు, సంఘటనలు వంటిటి పోపుల డబ్బా తో పోల్చి, పోపు ఘుభాళింపులు ‘పోపుల డబ్బా’ వ్యాసం ద్వారా మనకు చేర్చారు శ్రీమతి పద్మ గారు. దానిలో చెప్పినట్లు మనకు ఇప్పుడు ‘తిరగమోత’ విశిస్థాన్ని చక్కగా వివరిస్తున్నారు. ఇక చదువుదామా?


రమణ బంధకవి

సంపాదకుడు




కామాక్షి కబుర్లు:  



వాట్స్ఎప్  విచిత్రాలు



శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు



ఆ మధ్య అన్నగారి కూతురు పెళ్ళికి, కామాక్షి అమలాపురం వెళ్ళినపుడు ఎవరి చేతుల్లో చూసినా అరచేతులు పట్టనంత ఫోన్లే! తెల్లగ ధగధగ లాడుతూ, మరి కొన్ని నల్లగా నిగనిగ లాడుతూ క్లిక్కు క్లిక్కుమని ఫోటోలు తీసేస్తున్నారు. పేరుకు తగ్గట్టు స్మార్ట్ గానే వున్నాయి మరి!  వాటి ముందు కామాక్షి చేతిలోని పాత  బుల్లి ఫోను వెలవెలబోతుంటే పట్టాభి మనస్సు చిన్నబుచ్చుకుంది. ఉండబట్టలేక అనేసాడు “మమ్మీ! నువ్వు కూడా అలాంటి ఫోన్ కొనుక్కోవచ్చు కదా!”

“నాకు చాల్లేరా ఈ ఫోను. క్రిందటి సంవత్సరం మీఇద్దరి పోరు పడలేక కొనుక్కున్న ఫోన్ కాస్తా పారేసుకున్నాను కదా! నాకే స్మార్ట్ ఫోన్లు వద్దు” ఖరాఖండీ గా చెప్పింది. తల్లిని ఒప్పించటం కష్టం అనుకున్నాడు పట్టు.

పెళ్లి నుండి ఇంటికి వచ్చేక పట్టాభి పట్టు పట్టేడు, మమ్మీకి  ఆండ్రాయిడ్ ఫోన్ కొనాల్సిందేనని.  విశ్వం “మమ్మీ బర్త్ డే వస్తోంది కదరా పద కొందాం” అని వంత పాడేడు. ఇక కామాక్షికి తప్పలేదు; అన్నయ్యని అడిగింది అంత ఖరీదు గల ఫోన్ కొనుక్కోవటం నిజంగా అవసరమేనానని?

అన్నగారు “నిక్షేపంగా కొనుక్కొవచ్చే! పెళ్ళిళ్ళకి, పబ్బాలకి ఫోటోలు తీయాలనిపించినపుడు ప్రత్యేకించి కేమరానే తీసుకెళ్లక్కర్లేదు; ఫోనుతోనే తీసేయవచ్చు. అదీగాక, స్మార్ట్ ఫోన్ వుంటే నువ్వు “వాట్సప్” డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీకి ఒక గ్రూప్ కూడా వుంది. మనందరి కబుర్లు, క్షేమసమాచారాలు నీకు ఒకేసారి తెలుస్తాయి; ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సంగతులు తెలుసుకోనక్కర్లేదు. పైగా ఫోన్ చేసిన ప్రతీసారి  “చాల సేపు మాట్లాడేసాను బాబూ! నా ఫోన్లో బ్యాలెన్సు అయిపొయింది” అంటుంటావుగా! వాట్సప్ వుంటే నీకా భయం అక్కర్లేదు. కానీ ఖర్చు లేకుండా మెసేజెస్ పంపుకోవచ్చు. నీ ఫోన్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు. నువ్వు ఈమెయిల్స్ కంప్యూటరే తీసి చూసుకోనక్కర్లేదు. ఫోన్లోంచే  చెక్ చేసుకోవచ్చు, పంపవచ్చును. ఇన్ని మాటలెందుకు, బావ నీకు పుట్టినరోజుకి గిఫ్ట్ ఇస్తానంటుంటే సంతోషంగా తీసుకోక సంకోచిస్తావెందుకు? నువ్వు ఫోన్ కొన్నాక చెప్పు; మన గ్రూపులో నిన్ను కూడా ఆడ్ చేస్తాను” అని వివరంగా చెప్పాడు.

ఇంక కామాక్షి సరేనని బయలుదేరింది. తెల్లగా  పాలపుంత లా వున్న ఒక స్మార్ట్ ఫోన్ని పట్టాభి సెలెక్ట్ చేసేడు. ఇంటికి రావడంతోనే మామ్మ, తాతలకి ఆనందంగా చూపించాడు. “నిండుగా బాగుందే!” అన్నారు అత్తగారు. పట్టు  ‘వాట్సప్’ డౌన్లోడ్ చేసేయడం, అన్నగారు తమ గ్రూపులో చేర్చేయటం చక చక జరిగిపోయింది. ఇంక ‘టింగు టింగు’ మంటూ క్షణానికి ఒకసారి మేస్సేజుల పరంపర, “వెల్కమ్ టు అవర్ గ్రూప్” అంటూ మొదలయ్యింది.

“టింగు టింగుమని ఆ మోత ఏమిట్రా పట్టు?” అడిగారు అత్తగారు. "వాట్సప్ మెస్సేజెస్ మామ్మా! మనం ఎవరితోనైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఫ్రీగా మెస్సేజెస్ పంపించుకోవచ్చు. మనకు ఎవరైన పంపిస్తే టింగుమని శబ్దం వస్తుందన్న మాట” ఉత్సాహంగా చెప్పేడు పట్టాభి.

ఏమిటీ! వాజప్పా?” ఆశ్చర్యబోతూ అడిగేరు సూరిడమ్మ గారు. తెలిసీ తెలియకపోయిన వాజప్ అని కుర్రకారు లాగా స్టైల్ గా బాగానే అన్నారు. (సశేషం)

   






బీరకాయ పొట్టు తో పచ్చడి


శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్

వాణి ఉన్న బీరకాయల తో కూర చేసి, వాటికి తీసిన పొట్టు తో కమ్మని పచ్చడి చేసి, భర్తకు పెట్టిందని చెప్పుకున్నాం కదా? ఆ పచ్చడి ఎలా చేస్తే కమ్మగా వస్తుందో ఇప్పుడు చెప్తా వినుకోండి. బీరకాయ పొట్టు తీసేటప్పుడు కాయలను బాగా కడిగి పీచుని తీసివేసి. అప్పుడు పొట్టుని తీసుకోవాలి. పొట్టుని కావాలంటే  మళ్ళీ ఒక సారి శుభ్రం  చేసుకుని, కొంచెం సన్నగా తరుక్కోవాలి.

కావలసిన పదార్దములు:

బీరకాయ పొట్టు                                                   1 కప్పు 
చింతపండు                                                         నిమ్మపండు సైజు 
ఉప్పు                                                                తగినంత 
పసుపు                                                              చిటికెడు 
పచ్చిమిర్చి                                                         2
బెల్లం                                                                 చిటికెడు 


పోపుకు కావలసిన పదార్ధాలు:

ఎండు మిర్చి                                                      
మినపపప్పు                                                      11/2  స్పూన్స్
ఆవాలు                                                             1 టీస్పూన్ 
ఇంగువ                                                             చిటికెడు
మెంతులు                                                          1/2 టీస్పూన్ 
నూనె                                                                2 టేబుల్ స్పూన్స్

తయారు చేయు విధానం :

బీరకాయ చెక్కును లేదా పొట్టును  శుబ్రంగా కడిగి ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకుని టేబుల్ స్పూన్ నూనె వేసి వేడేక్కేక, పచ్చిమిర్చి వేసి వేయించండి. మిర్చికి కొంచెం తెల్ల రంగు వచ్చేక  బీరపొట్టుని వేసి వేయించుకోవాలి. కొంచెం వేగేక ఉప్పు, పసుపు వేసి కలియబెట్టి చిన్న మంట మీద వుంచి మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. పొట్టు మగ్గే లోపు ఒక కప్పులో  చింతపండును నానబెట్టుకుని గుజ్జును చేసుకోవాలి. ఇప్పుడు పొట్టు మగ్గి వుండి వుంటుంది. అందులో చింత పండు గుజ్జుని, చిటికెడు బెల్లాన్ని  వేసి బాగా కలియబెట్టుకోవాలి. పొట్టు చింతపండుని బాగా పీల్చుకున్నాక స్టవ్ ఆపేసుకొవాలి. 

పోపు గరిటెలో కొంచెం నూనె తీసుకుని పైన చెప్పిన పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. పోపు చల్లారేక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొట్టు, చింతపండు, బెల్లం  మిశ్రమాన్ని కూడా మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. తయారైన పచ్చడిని శుబ్రమైన కప్పులోకి తీసుకోండి. 
  
సలహాలు:

బీర పొట్టు పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని మొదటి ముద్దలో తింటే చాల హితవుగా వుంటుంది. 
దీనిని ఇడ్లీ, దోశ, చపాతీ, పరాటాలలో కూడా నంచుకోవచ్చును. 
పోట్టును  శుబ్రంగా కడిగి ఆరబెట్టి ఒక జిప్లాక్ బ్యాగ్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకుని అవసరమైనప్పుడు పచ్చడికి వాడుకొనవచ్చును. 

 


  



'తిరగమోత'


శ్రీమతి పద్మారఘునాద్


తిరగమోత పేరు తలుచు కుంటుంటే మంచి ఇంగువ దట్టించిన పోపు గుభాళింపు గుర్తుకు వస్తుంది ఎవరికైనా!  మరి ఈ తిరగమోత మహాత్మ్యమే అది!  ఈ తిరగమోత లేదా తాలింపు లేదా పోపు అన్న మాటలు తెలియని తెలుగువారు ఎవరు వుండరు సుమీ! ప్రతీ తెలుగువారింట, తిరగమోత లేని వంటకమే ఉండదనతం అతిశయోక్తి కాదు.

మిరియాల చారులో పోపు గాను, దప్పళంలో తాలింపు గాను, కూరల్లో, పప్పుల్లో, పచ్చళ్లలో తిరగమోత గాను అన్ని వంటకాలలో లేదనకుండా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది.   తిరగమోత యొక్క గొప్పతనం మనం వేరేగా చెప్పుకోక పోయినా, దీని ప్రాధాన్యత అందరికి విదితమే. ప్రతి వంటకానికి ఇచ్చే ఫైనల్ టచ్ ఇది. ఇది లేకపోతే వంటకం పూర్తి అయినా కానట్లేనండోయ్! కూరకైనా చారుకైనా; పప్పుల కైనా పచ్చళ్ల కైనా;  పులిహోర కైనా పులుసుల కైనా రంగు, రుచి, వాసనా పెంచేది, లేకపోతే తెప్పించేది మాంచి ఘాటైన పోపే నండోయ్!

ఈ తిరగమోతలు కూడా రకరకాలుగా పెట్టచ్చు నండోయ్! చిన్నమోస్తరుపోపు నుండి భారీ ఎత్తునవేసే తిరగమోత దాక, పిండికొద్దీ రొట్టె ఎలాగో, పదార్ధం బట్టి పోపు అలా  ఉంటుందన్నమాట!  అంటే రోజూ చేసుకునే చారు, రసంలో నాలుగు పోపు గింజలతో పాటుగా ఇంగువ, కరివేపాకు చాలన్నమాట. అదే పులుసుల్లో అయితే నాలుగు ఎండుమిరపకాయల పాటుగా, పోపు దినుసులన్నీ అర స్పూన్ చొప్పున వేయాల్సి వస్తుంది. ఇక పచ్చళ్ల దగ్గరకొస్తే అన్నీకొంచెం దండిగానే పడాలన్నమాట. అంటే ప్రతీ దినుసు ఒక్కో స్పూన్ చొప్పున.  ఇక పులిహోర లాంటి పెద్ద పెద్ద పండగ వంటలు ఉంటాయి చూసారు, వాటిలో అయితే ఇంత చింతపండు పులుసు, గుప్పెడు ఎండుమిరపకాయలు,   గుప్పెడు వేరుశనగ పప్పు కాని, గుప్పెడు జీడిపప్పు కానీ కూడా జత చేయాలండీ!  మరి మన తిరగమోతల్లో, తాలింపులో, పోపుల్లో వేసుకునే ముడి పదార్దాలేమిటో కొంచెం తెలుసుకుందామాఅపుడపుడు కొద్ది మినహాయింపులు తప్పిస్తే , సాధారణంగా ఇవండీ మనం ప్రతిరోజూ వాడే  పోపు దినుసులు - ఆవాలు, మెంతులు, మినప పప్పు, శనగ పప్పు, జీలకర్ర , ఇంగువ,  ఎండుమిర్చి, మిరియం  గింజలు.

మరి ఇవేమిటో, వీటి ప్రయోజనాలేమిటో, వీటిని వాడే పద్దతులేమిటో ముందు సంచికలలో తెలుసుకుందాము.


 








No comments:

Post a Comment