Wednesday, September 17, 2014

‘పొరిగింటి పుల్ల కూర రుచి!’


ముందు మాట:

ఇంట్లో ఇల్లాలు కమ్మని వంటకాలు చేసి పెట్టినా, గృహస్తు లేక పిల్లలు ‘అదుగో అప్పుడెప్పుడో ఆ ఆంటీ ఇచ్చిన కూర ఎంత రుచిగా వుందో’ అనటము, ఇల్లాలికి అరికాలి మంట నెత్తి కెక్కటం చూడటం కద్దు! మరి దీనినే ‘పొరిగింటి పుల్లకూర రుచి’ అని మనం అంటే ‘ఘర్ కా ముర్గీ దాల్ బరాబర్!’ అని  ఉత్తర భారతీయులు అంటారు. మరి ఈ సామెత వెనక ఉన్న మర్మాన్ని గురించి చక్కగా వివరిస్తున్నారు శ్రీమతి పద్మా రఘునాద్. ఇక చదివి ఆనందించండి.

రమణ బంధకవి

సంపాదకుడు


‘పొరిగింటి పుల్ల కూర రుచి!’

శ్రీమతి పద్మా రఘునాద్

పొరిగింటి పుల్ల కూర ఎపుడూ రుచి గానే ఉంటుంది అనిపిస్తుంది. అందుకే ‘పొరిగింటి పుల్ల కూర రుచి’ అనే సామెత కూడా ఉంది మనకి.

రోజూ ఒకటే రకమైన పదార్ధాలు తిని తిని విసుగెత్తి కూడా ఎవరైనా ఇరుగమ్మపొరుగమ్మ చేసి ఇచ్చినవి ఎంతో రుచి గా అనిపిస్తాయి మనకి అపుడపుడు; కొంత మందికి ఎపుడూను! పిల్లలు కూడా కొన్ని సందర్భాలలో ఈ కూర పక్కింటి ఆంటీ చేస్తే బాగుంటుంది అనటం, మనింట్లో అదే కూర వండినా తినకపోవటం, పక్క వాళ్ల ఇంటికి వెళ్ళినపుడు మొహం వాచినట్లు తినటం తల్లులకు, ఇల్లాళ్ళకు తరచూ వచ్చే ఇబ్బందే మరి. వాళ్ళ దాక ఎందుకు, మనకే అంటే గృహిణులకు అపుడపుడు మనం చేసుకున్న వంట కాకుండగా వేరే వాళ్ళు వండితే తినాలనిపిస్తుంది కూడాను. 

చాలామందికి వంట ఏ విధంగా అలవాటు అయితే ప్రతీ రోజు ఆ విధంగానే ఏ మార్పులు చేర్పులు లేకుండగా చేసుకుపోవటం అలవాటుగా  ఉంటుంది. ఇంక వారు పప్పులు, కూరలు ఎపుడు చేసినా ఒకేలాగా చేసుకు పోతు ఉంటారు. కొంత కాలం వరకు అది బాగానే ఉంటుంది కాని, కొంతమంది విషయం లో మాత్రం అది ఇంక తినటానికి విసుగ్గా ఉండవచ్చు. మొదట్లో రుచిగా ఉన్నది తర్వాత రుచిగా ఉండకపోవచ్చు. మొహం మొత్తనూ వచ్చు. ఇదివరకటి రోజుల్లో అయితే జనాలు ఏ  మాత్రం మార్పులను ఇష్టపడే వారు కాదు కనుక అవన్నీ చలామణి అయిపోయేవి. కానీ రోజు రోజుకు, క్షణ క్షణానికి ప్రతీదీ మారే, మార్చుకునే కాలం లో ఉన్నాం కనుక మరి మన వంటకాలకి కూడా ఏదైనా వెరైటీ గా మార్పులు, చేర్పులు చేసుకుని వండుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మరి. 

మొత్తానికి ఈ ‘పొరిగింటి పుల్ల కూర రుచి’  కి అనేక కారణాలు వున్నా, మనం దానిలో వుండే ‘పుల్ల’ తనానికి ఉన్న మర్మం గురించి తెలుసు కుందాం! 

కొన్ని కొన్ని చప్పటి పప్పులకి, కూరలకి, పులుపు తనాన్ని జోడిస్తే కొత్త రుచి రావటమో, ఉన్న రుచి ద్విగుణీకృతం అవ్వటమో జరుగుతుంది మరి. ఉదాహరణకి చప్పటి తోటకూర పప్పు, పాలకూర పప్పుల్లో కొంచెం చింతపండు గుజ్జు నీళ్ళు వేసి కలిపితే ఎంతో బాగుంటుంది. ఇంట్లో తినే వారికి కూడా, రోజు తినే చప్పటి పప్పు కాకుండగా నోటికి కొంచెం కొత్తగా, వేరుగా ఉంటుంది. 

అలాగే పుల్లగా ఉండే ఆకు కూరలు గోంగూర, చుక్క కూర లతో పప్పుని అపుడపుడు చేసుకుంటే కూడా కొంచెం మార్పుగా వుంటుంది.  అలాగే చప్పటి ఆనపకాయ పప్పు, బీర కాయ పప్పుల్లో నిమ్మరసం వేసి చూడండీ! రుచి లో తేడా మీకే కనిపిస్తుంది. 

బచ్చలి కూర పప్పులో మూడు, నాలుగు మామిడి కాయ ముక్కలు వేసి వండండి. అలాగే మెంతికూర పప్పులో కొంచెం చింత కాయ పచ్చడి వేసి పోపు పెట్టండి! దోసకాయ పప్పులో టమోటా ముక్కలు కూడా కలిపి పప్పు చేయండి! 

అపుడపుడు అరటి కాయ కూర, కంద కూరబంగాళదుంప ముద్ద కూరల్లో నిమ్మ రసం వేసి, ఇంగువ, కరివేపాకు పోపు పెట్టి చూడండి! నోటికి ఎంత హితవు గా ఉంటుందో చేసుకుని చెప్పండి! 

అలాగే కొన్ని పచ్చళ్ళ లో కూడా, కొబ్బరి మామిడి కలిపి ఒకసారి, కొబ్బరి టమాటో కలిపి ఒకసారి, బీరకాయ టమోటా కలిపి, లేదా నిమ్మ రసం వేసి రుబ్బండి! మజా ఏమిటో మీకే తెలుస్తుంది. 

అపుడు ‘పొరిగింటి పుల్ల కూర రుచి’ ని మర్చిపోయి మనింట్లో పుల్లకూర కూడా రుచి గానే ఉంటుందని ఇంట్లో వారంతా పిల్లలు, పెద్దలతో సహా ఒప్పుకోకపోతే చూడండి! 









No comments:

Post a Comment