Tuesday, September 30, 2014

నవరాత్రి వ్యాస పరంపర: 11 : సప్తమం--సర్వవిద్యాప్రదాయకం




శ్రీ సరస్వతి దేవి అలంకారం


శ్రీమతి నయన కస్తూరి



ఈ రోజు మహాలక్ష్మీ దేవి అవతారం లో అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించుకున్నారు కదూ?  ఇప్పుడు మనం రేపటి అలంకారం గురించి,నివేదనలు గురించి తెలుసుకుందాము. శరన్నవరాత్రులలో ఏడవ రోజున సప్తమి తిధి నాడు సాధారణం గా మూలా నక్షత్రం వస్తుంది. ఆ రోజున అమ్మవారిని వాగ్దేవీ అలంకారంలో సేవలు సలుపుతారు. అందుకని రేపు అనగా అక్టోబర్ 1 న మూలా నక్షత్రమున్నందున మనమందరం అమ్మవారిని శ్వేత పద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాల ను ధరించి, అభయ ముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీ దేవిని హృదయం లో ముద్రించుకుని ఆ దేవిని పూజించుకుందాము. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదా దేవి అతి విశిష్టమైనది.  ఈ రోజు తల్లితండ్రులు తమపిల్లల చేత విద్యాబుద్దులకై  సరస్వతీ పూజ తప్పక చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చెస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్రవ్రతం ఈ రోజే ఆరంభిస్తారు.  

                                   'వీణాధరే! విపుల మంగళ దానశీలే!
                                    భక్తార్తినాశిని! విరించి హరీశ వంద్యే!
                                    కీర్తిప్రదే! అఖిల మనోరదే! మహర్షే!
                                    విద్యాప్రదాయిని! సరస్వతి! నౌమి నిత్యం!

అని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి, వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను  ప్రకాశింపజేస్తుంది.  వాక్ శక్తిని, స్పూర్తిని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో మూడవ రూపం! ప్రాణకోటి జివ్హాగ్రం పై వసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి మరియు కాళిదాసులను అనుగ్రహించి, వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతి  చెందేలా చేసింది ఈ వీణా పుస్తకధారిణి! మనమందరం కూడా రేపటి రోజున శ్రీ సరస్వతీదేవిని శక్తి కొలది అర్చించి, షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ గావించి, వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, అన్నం పరమాన్నం, దద్దోజనం నివేదన చేసి, మన విద్యాబుద్దులను పెంపొందిచు కుందాము. 



అన్నం పరమాన్నం మరియు దద్దోజనం చేసే విధానం 'తెలుగుభోజనం'లో ముందుగానే వివరించి ఉన్నందున ఒక్కసారి చూసుకుని, చక్కగా చేసి అమ్మ వారికి నివేదించుకుని ఆ తల్లి అపార అనుగ్రహం పొందండి. రేపటి రోజున ఎనిమిదవ అలంకారం ఏమిటో,అమ్మవారికి ఏ వంటకాలు ప్రీతికరమో చెప్పుకుందాము.  








ఈ నాడు ధరించవలసిన వర్ణం:  నీలం

స్వస్తి!



No comments:

Post a Comment