Wednesday, September 24, 2014

నవరాత్రి ప్రత్యేక వ్యాస పరంపర: 4


శరన్నవరాత్రులు-------- ప్రధమం - ప్రసన్న రూపం (25-09-2014)

శ్రీ స్వర్ణకవచాలంకృత దేవీ అలంకారం

                                                                                            శ్రీమతి నయన కస్తూరి

వసంత ఋతువు దేవీ పూజకు ఎంత శ్రేష్టమో శరదృతువు కూడా అమ్మ ఆరాధనకు అంతే శ్రేష్ఠం. వేదాలు ఆవిర్భవించక పూర్వం నుండే శ్రీ శక్తిని పూజించే విధానం పురాణేతిహాసాల ద్వారా మనకు విదితమవుతోంది. మహాభారత సమయం లో శ్రీ కృష్ణుడు పాండవుల విజయం కోసం అమ్మవారిని ప్రార్ధించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నవరాత్రులలో దేవీ ఆరాధనే ప్రముఖం గా వుంటుంది కనుక ఈ నవరాత్రులు, దేవీ నవరాత్రులుగా కూడా భక్తులచే పిలవబడుతున్నాయి.


మనం నవరాత్రులలో ఏ రోజు ఏ శక్తి రూపానికి పూజలు జరిపిస్తామో చెప్పుకున్నాం కదా? అయితే నవరాత్రుల యందు ప్రధమ మైన శుక్ల పాడ్యమి రోజున అలరారించే సువర్ణ కవచాలంకృత దేవీ దివ్య రూపాన్ని ఈ రోజు దర్శించుకుందాము. ఒకసారి కనులు మూసుకుని ఆ సువర్ణ దివ్యమంగళ విగ్రహాన్ని మనసు నిండా నింపుకుని, ధ్యానించు కుందాము.

ఓం హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం!
చంద్రాం హిరణ్మయిం లక్ష్మీం జాతవేదో మా అవహ!

అమ్మ మనసు ఎప్పుడూ బంగారమే! ఇక రూపం కూడా సువర్ణమైతే చెప్పేదేముంది? అమ్మ వారి స్వర్ణకవచాలంకారం వీక్షించడానికి సహస్రాక్షువులు ఉన్నా తక్కువే! అమ్మ అందం స్వర్ణ కవచాలంకరణతో ద్విగుణీకృతం అవుతుంది. అష్ట భుజాలతో శంఖ, చక్ర, గదాంకుశ, త్రిశూల దారి అయి, అలరారుతుంది. శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి గా సువర్ణ రత్న ఖచిత సింహాసనం మీద ఆసీనురాలై  చిరుమందహాసం తో భక్తుల కోరికలు ఈడేరుస్తుంది. ఆ శాంభవి యొక్క సువర్ణ కవచం భక్తుల పాలిట  రక్షణ కవచం అవుతుంది. ఆపదలకు అడ్డు కాస్తుంది. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించుకుని, శ్రీ దుర్గా అష్టోత్తరం తో షోడశోపచార పూజలు సలిపి, రాజోపచారాలు, భక్తోపచారాలు, శక్త్యోపచారాలు జరిపి తీపి బూందీని, నాన బెట్టిన శనగలు సుండలు శ్రద్ధగా చేసి, భక్తిగా నివేదించుకుని, మంగళ నీరాజనాలు అలది, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీ దుర్గా చాలీసా పారాయణం చేసి, ప్రధమ రోజు పూజ ముగించుకుని, దివ్యమైన ద్వితీయ అలంకారం తో రేపు కలుద్దాము!   

ధరించవలసిన వర్ణం:  పసుపు

ప్రసాద నివేదన:
ఇక ఈ నాటి అమ్మ వారి ప్రసాదాల తయారీ ని ఒక సారి చూద్దామా?

తీపి బూందీ:
రెండు గ్లాసుల జల్లించిన శనగపిండిని తీసుకోండి. తగినన్ని నీళ్ళు తీసుకుని పిండిని జాలువారుగా కలుపుకోండి. ఒక బాండీ లో రెండు గ్లాసుల పంచదార రెండు గ్లాసుల నీళ్ళ లో కలిపి, స్టవ్ మీద పెట్టి తీగ పాకం పట్టుకోవాలి. పాకాన్ని పక్కకు పెట్టి, ఇంకొక బాండీ లో నూనె పోసి స్టవ్ మీద పెట్టాలి, నూనె కాగాకా బూంది చట్రం తీసుకుని, దాని మీద ఇంకొక గరిటతో పిండి పోసి, కింద నుండి బూందీ ఆకారం లో పడేలా తిప్పుతూ వుండాలి. బూందీ మరీ కరకర మనకుండా నే తీసి, పంచదారపాకం లో వేస్తూ వుండాలి. పాకానికి సరి పడ బూందీ అయ్యాక బాగా కలిపి, ఒక పళ్ళెంలో కి తీసుకుని ఆరబెట్టు కోవాలి. బూందీ పాకం పీల్చుకుని బాగుంటుంది.

శనగల సుండలు:

ఒక అరకిలో శనగలు ముందు రోజు రాత్రి బాగా కడిగి నాన బెట్టుకోవాలి. మరునాడు నానిన 

శనగలను తీసి సరి పడ  నీరు పోసి కుక్కర్ లో ఉడక బెట్టుకోవాలి. బాగా ఉడకడానికి కుక్కర్ ఆరు 

విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఉడికిన తర్వాత చిల్లుల బుట్టలో వేసి నీళ్ళు పోనివ్వాలి. ఒక బాండిలో 

కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి, నాలుగు ఎండు మిరపకాయ ముక్కలు, రెండు చెంచాల 

మినప్పప్పు, ఒక అరచెంచా ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర వేసి, పోపు వేయించుకోవాలి. చివరలో 

నాలుగు పచ్చి మిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఒక చిటికెడు పసుపు, తగినంత 

ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. సుండలు తయార్! ఈ సుండలంటే అమ్మ వారికి అత్యంత ప్రీతి 

సుమండీ!


ఇతర నివేదనలు:

పై చెప్పినవే కాక కొందరు పెసర సున్నుండలు కూడా తయారు చేసి నివేదించటం కద్దు!


పెసర సున్నుండలు :

పెసర పప్పు ని  వేయించి, మెత్తగా పొడి చేసుకుని, పెసర పిండి, చెక్కర ను కలిపి, కరిగించిన 

నేతిని తగినంత వేసి, యాలకుల పొడి వేసి చక్కగా ఉండలు కట్టుకుంటే పెసర సున్నుండలు 

తయార్!

 









No comments:

Post a Comment