పనిమనిషి – ములగాకు
రెండవ భాగం
శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు
(గత సంచిక: గజేంద్ర
మోక్షం కూడా చివరికి వస్తోంది. అక్కడ గజేంద్రుడు నిస్సహాయంగా రక్షించు ప్రభో! అని దిక్కులు పిక్కటిల్లెట్లు ఘీన్కరించినపుడు సరిగ్గా కాలింగ్ బెల్ మోగింది... ఇక చదవండి)
అక్కడ
నారాయణుడు గజేంద్రుడి ఘీంకారం విని వున్న పళంగా తన పరివారంతో దిగి వచ్చేడు. ఇక్కడ
సూరిడమ్మగారు సోఫా
లోంచి దిగ్గున లేచారు తలుపు తీయటానికి. కామాక్షి ఆవిడని కూర్చోమని తను వెళ్లి
తీస్తానంది. పనిమనిషి మంజు వచ్చింది. దాని ఆలస్యానికి కారణం అడగమని కామాక్షికి కళ్ళెగరేసి సంజ్ఞ చేసారు. సరేనని నోరు తెరిచి అడగబోతుంటే మంజు తన చేతిలోని ప్లాస్టిక్ కవర్ లోంచి పెద్ద ఆకు కూర కట్ట తీసి కామాక్షి చేతిలో
పెట్టింది.
"ఇదేమిటి?” ఆకు కేసి తేరి పార చూస్తూ అడిగింది కామాక్షి.
"మీకు
తెలవదా? ములగాకు" అంది మంజు.
"మా
ఇంటి కాడ చెట్టు కొట్టేస్తుంటే అందరూ ఎట్టుకెల్తుంటే నేను కూడా పట్టుకొచ్చా"
"ములగాకుతో
ఏమి చేస్తాం?” ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి.
"మీరు
వండుకోరా?” విస్తుపోయింది మంజు.
ఇదంతా
చూస్తున్న సూరిడమ్మ గారు "మాకు అలవాటు లేదు. మా చిన్నప్పుడు కాళ్ళకి దెబ్బలు
తగిలితే ములగాకు పట్టీ వేసుకునే వాళ్ళం అంతే! ఇపుడు నువ్వు తెచ్చావని పడి మా మోచిప్పలు బద్దలు కొట్టుకుని
నీ చేత ములగాకు పట్టీ వేయించుకోవాలి మరి!" వ్యంగ్యంగా
అన్నారు.
అదే
ఇంకొకరు అన్నట్లయితే కోపం వచ్చి ఒంటి కాలి మీద లేచేది కాని దానికేందుకో సూరిడమ్మ
గారు ఏమి తిట్టినా అందులో ఏదో హాస్యం కనిపిస్తుంది. అందుకే తప్పు పట్టు కోదు. నోటికి చెయ్యి అడ్డం
పెట్టుకుని కిసుక్కున నవ్వింది. నయ్యం! అలిగి కూర్చుని పెద్దావిడ వూరు వెళ్లి పోయేంత వరకు రానని పోలేదు. అనుకుంది కామాక్షి.
"అదేంటి
పెద్దమ్మా! ములగాకు ఒంటికి శానా మంచిది. ఒంటికి రగతం పడతది, కీళ్ళు
నెప్పులు తగ్గతయి, పిల్లలకి కడుపులో పురుగులుంటే పోతయి, బీపీ ఎక్కువైన వాళ్ళకి తగ్గుతది, ఇంకా సక్కేర
జబ్బోళ్ళకి, గుండేజబ్బోళ్ళకి శానా మంచిది" రెండు చేతులూ
ఊపుకుంటూ చెప్పుకుపొతోంది మంజు. సూరిడమ్మ
గారు కళ్ళు పెద్దవి చేసుకుని నోరు వెళ్ళబెట్టేరు దాని పరిజ్ఞానానికి.
"పోనీ!
మీకు సైంచదంటే ఇచ్చేయండమ్మా! వేరే వాళ్లకి ఇస్తాను" అంది. ఇన్ని ఆరోగ్య
విలువలున్న ములగాకుని వదిలేయదల్చుకోలేదు కామాక్షి.
"ఆరోగ్యానికి
చాల మంచిదంటున్నావు కదా! ఒక సారి కూర చేసి చూస్తాను" అంది కామాక్షి.
సూరిడమ్మ
గారు ‘గజేంద్ర మోక్షం’ మధ్యలో లేచి వచ్చినందుకు ఒక సారి చెంపలు వేసుకుని, ములగాకు కట్ట ముందు కేసుకుని, ఆకు దూస్తూ, ఈ సారి ఆసక్తిగా వినటం మొదలెట్టారు. (సశేషం)
No comments:
Post a Comment