Wednesday, September 24, 2014

నవరాత్రి వ్యాస పరంపర :5 ద్వితీయం---అద్వితీయం!


బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం (26-09-2014)

శ్రీమతి నయన కస్తూరి

నవరాత్రులలో ప్రధమ రోజున భక్తులందరూ అమ్మ వారిని మనసారా శ్రద్దాభక్తుల తో అర్చించుకుని అద్భుతమైన అనుభూతి ని పొంది జన్మ ధన్యం  చేసుకుని ఉంటారు. అయితే మరి 26 న విదియ తిథి నాడు అనగా రేపటి రోజున, ఆ శక్తి స్వరూపిణి ని ఏ విధం గా అలంకరించుకోవాలో, ఏ నామంతో అర్చించుకోవాలో, ఏ పదార్ధం తో అమ్మ వారికి నివేదన చెయ్యాలో, మనం ఏమి చేస్తే అమ్మ అనుగ్రహం శీఘ్రం గా పొందగలమో తెలుసుకుని నవరాత్రులలో రెండవ రోజు పూజకు ఆయత్తమవుదామా?

దేవీనవరాత్రులలో రెండవరోజును ప్రీతి ద్వితీయం అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అని పెద్దలు చెపుతారు. దేదీప్యంగా విరాజిల్లే అమ్మ వారి ద్వితీయ అలంకారం 'శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం’. త్రిపురత్రయం లో ప్రదమ శక్తి స్వరూపిణి  ఈ దేవత. ఈ రోజున నిర్మలమైన ముద్దులొలికే ముచ్చటైన బాలామణి రూపాన పూజలందుకుంటుంది. సర్వేశ్వరుడైన త్రిపురేశ్వరుని అర్ధాంగి అయిన జగన్మాతే ఈ బాలాత్రిపురసుందరీదేవి!

త్రిపురాంతకం అనబడే ఒక శైవక్షేత్రం లో అమ్మను ఈ రూపంలో దర్శించుకోవచ్చు. త్రిపురాసురుడనే ఒక భీకర రక్కసుని అంతమొందించి భక్తుల కొంగు బంగారం చేయడానికి త్రిపురేశ్వరుడు మరియు త్రిపురసుందరీ దేవి ఈ క్షేత్రం లో కొలువై ఉన్నారు. ఈ అవతారం లో అమ్మ అభయ హస్త ముద్ర కలిగి అక్షర మాలను ధరించి వుంటుంది. దేదీప్యమానమైన ఈ దివ్యమంగళ రూపాన్ని మనః ఫలకం పై నిలుపుకుని, ఆరాధిస్తే భక్తుల మనస్సుని, బుద్ధిని  తేజోవంతం చేస్తుంది. ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల లోపు బాలికలకు పూజలు సలిపితే అమ్మ తక్షణం అనుగ్రహిస్తుంది.  శ్రీ చక్రం లోని ప్రధమ దేవత ఈ రూపం! సమస్త కళలకు అధినేత ఈ దేవత. ఏ కళ లో రాణించాలన్నా ఈమె చల్లని చూపులు మన మీద పడాలి. ఈ బాలాత్రిపురసుందరీ దేవి ఆరాధన లో భాగం గానే నవరాత్రులలో బాల పూజ విశిష్ట స్థానం పొందింది. రెండవ రోజైన విదియ నాడు 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాల త్రిపురసున్దర్యై నమః' అని వీలైనన్ని సార్లు జపించుకుంటే చాలా శుభప్రదం! శ్రీ బాల త్రిపుర సుందరి అస్తోత్రం తో షోడశోపచార పూజ చేసి పెసరపప్పు పాయసం నివేదన చేయాలి. 



ఈ నాడు ధరించవలసిన వర్ణంఆకు పచ్చ

ఈ నాటి నివేదన: పెసర పప్పు పాయసం
ఈ పాయసం చేయడం చాలా తేలిక.  ఒక పావు గ్లాసు పెసరపప్ప్పు కుక్కర్లో మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఒక చిన్న బాండీ లో ఒక ఒక అరగ్లాసు  బెల్లం తురుము వేసి, ఒక అరగ్లాసు నీళ్ళు పోసి, పాకం పట్టాలి. కొంచెం లేత తీగపాకం రాగానే, ఉడికిన పెసర పప్పును  బాగా ఎనిపి, పాకం లో వేసి బాగా కలుపుతూ ఒక అయిదు నిమిషాల సేపు స్టవ్ మీద ఉంచి పప్పు పాకం బాగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక చిన్న మూకుడు తీసుకుని రెండు చెంచాల నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేయించి పాయసం లో కలపాలి. నాలుగైదు ఏలకులను పొడి చేసి, పాయసం పైన చల్లాలి. అమ్మ వారి ప్రసాదం నివేదనకి తయార్! మరి అందరం అమ్మ వారిని భక్తి గా అర్చించుకుని, పాయసం నివేదించుకుని, అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాము!



ఇతర నివేదనలు: గోధుమ రవ్వ హల్వా
కొందరు, గోధుమ రవ్వ తో హల్వా చేసి కూడా ఈ రోజు నివేదన చేస్తారు.

కావసిన పదార్థములు :
గోధుమ రవ్వ ఒక గ్లాసు
బెల్లం కాని, చెక్కర కానీ ఒక గ్లాసు
ఆవు పాలు రెండు గ్లాసులు
ఆవు నెయ్యి : రెండు చెంచాలు
యాలకుల పొడి, కాసిని వేయించిన జీడి పప్పు అలంకరణ కోసం

తయారుచేసే విధానం:
పాలు పొయ్య మీద మరిగించి, దానిలో గోధుమ రవ్వ కలిపి సన్న సెగ మీద రవ్వను ఉడికించాలి. రవ్వ వుడికిన తరువాత, బెల్లం తురుము కాని, చెక్కెర కానీ వేసి బాగా కలపాలి. తీగ పాకం వచ్చాక నెయ్యి వెయ్యాలి. రవ్వ బాగా దగ్గర పడిన తరువాత శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని, పైన యాలకులపొడి జల్లి, జీడి పప్పులు అద్దాలి.  గోధుమ రవ్వ హల్వా తయార్!


ఇక తృతీయ అలంకారం తో రేపు 'తెలుగు భోజనం'లో కలుద్దాము!
స్వస్తి!                   


1 comment: