Monday, September 1, 2014

వాన జల్లులు – వాము ఆకు బజ్జీలు:



ముందు మాట!

‘చిటపట చినుకులు పడుతూ ఉంటే....’ పాట సన్నగా వెనుకనుండి వస్తుంటే,  సాయంకాలం 
నల్లటి మబ్బులు ఆకాశం అంతా  పరుచుకుని, తెరలు తెరలు గా వాన జల్లులు పుడమి తల్లిని 
తడిపేస్తూ ఉంటే, బాల్కనీ లో లేదా ఇంటి వరండా లో వాలు కుర్చీ లో కూర్చుని, ఇంటి ముందరి 
పూల మొక్కలు, ఆకులు, సంతత ధారగా  కురుస్తున్న ఆకాశ గంగ లో తల మునకలు గా 
తడుస్తూ పరవశిస్తున్న వేళ, ఆత్మా రాముడు వేడి వేడి గా ఏ ఉల్లిపాయ పకోడీ యో, పచ్చి మిర్చి 
బజ్జి యో, మినప పునుకులో పంటి కింద వేసి మిల్లు ఆడించమని నస పెట్టటం కద్దు.  పై చెప్పిన 
వస్తువులన్నీ మనం అడపా తడపా తినేవే! మరి ఇప్పటి వాన జల్లుల్లో తమాషాగా చేసుకుని తిని 
ఆనందించటానికి ఒక చక్కని స్నాక్ గురించి వివరిస్తున్నారు, మన పాఠకులు, తాడేపల్లి గూడెం 
వాస్తవ్యులు,  శ్రీమతి సుష్మ శ్రీనివాస్ గారు. మరి అదేమిటో చూద్దామా?

రమణ బంధకవి

సంపాదకుడు



వాము ఆకు బజ్జీ!


శ్రీమతి సుష్మ శ్రీనివాస్ క్రొవ్విడి, తాడేపల్లి గూడెం


కావసిన వస్తువులు:

బియ్యపు  పిండి: 1 కప్పు
మైదా పిండి : అర కప్పు
బొంబాయి రవ్వ : 2 స్పూన్లు
పెరుగు: అర కప్పు
నూనె: వేయించటానికి సరిపడా
ఉప్పు: తగినంత
వాము ఆకులు: చిన్న సైజు వి 15

చేసే విధానం:

పైన చెప్పినవన్నీ(ఆకులు, నూనె తప్ప) ఒక గిన్నెలో మిశ్రమం లాగా కలుపుకుని, వాము 
ఆకులు చక్కగా కడిగి, కలిపిన పిండి లో ముంచి, పోయ్యమీద ఒక మూకుడు లో కాగిన నూనెలో 
వేసి, బజ్జీ  లాగ వేయించుకోవాలి.  వేయించిన తరువాత చక్కగా పళ్ళెం లో పెట్టుకుని అల్లం చట్నీ 
గానీ, టమాటో సాస్ తో కానీ నంచుకుని తింటే వానా  కాలపు సాయింత్రం సార్ధకం అయినట్లే!






చెప్పుకోండి  చూద్దాం!   

దేవునికి నివేదన చేసే ఇదు అక్షరాల మధుర పదార్ధం....అందులో దాగి ఉన్న చమత్కారమైన ఆధారాల సహాయం తో కనిపెట్టమని సవాలు విసురుతున్నారు శ్రీమతి నయన కస్తూరి. ఇక విప్పండి ఈ ‘డా వించి కోడ్’ 

రమణ బంధకవి


చెప్పుకోండి  చూద్దాం!

శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్

మనం నిత్యం ఆ భగవంతునికి అనేక పదార్ధాలు ఎంతో  శ్రద్ధ గా చేసిఅంతకంటే ఎక్కువ భక్తి తో నివేదిస్తూ ఉంటాము. పండగ రోజుల్లో అయితే ఇంకా రక రకాల పదార్ధాలు నివేదిస్తూ ఉంటాము.  అమ్మ వారికైనా స్వామి వారికైనా పాయసం, చక్రపొంగలి, లడ్డు, అన్నం పరమాణ్ణం ........... ఇంకా ఎన్నో మధురపదార్ధాలు, పులిహార, వడలు, కట్టే పొంగలి ఉండ్రాళ్ళు ........... ఇలా ఎన్నో కొంచెం కారం గా వుండే పదార్ధాలు నివేదిస్తూ ఉంటాము. అవునా?

అయితే అమ్మవారికైనా స్వామివారి కైనా చాలా ప్రీతికరమైన పదార్ధం ఒకటి ఉంది . అది మధురంగా వుంటుంది. చాలా సాధారణం గా అందరూ  ఈ పదార్ధాన్ని నివేదిస్తూ ఉంటారు.
ఆ పదార్ధం పేరులో అయిదు అక్షరాలు ఉంటాయి. భగవంతునికి ఎంతో  ఇష్టమైన ఈ పదార్ధం మొదటి రెండు అక్షరాలలో మన నవరత్నాల్లొ ఒకటి పొదగబడింది. 'నేనేమైనా తక్కువా?' అంటూ ఆ పేరులోని మిగతా భాగం లో మృగరాజు కూడా కూర్చుని ఉన్నాడు.


అయిదు అక్షరాల ఈ మధురపదార్ధం పేరు మీలో ఎవరైనా చెప్పుకోండి చూద్దాం! 

No comments:

Post a Comment