Thursday, September 18, 2014

మొదటి ముద్ద గా నోరూరించే పుదీన కారం!


 శ్రీమతి రత్నాశ్రీనివాస్ బెంగళూరు

పుదీన సువాసన కి సువాసన, ఆరోగ్యానికి ఆరోగ్యం. కడుపు ఉబ్బరంగా వున్నప్పుడు పుదీనా రసం తాగితే వెంటనే ఉపశమనం ఇస్తుంది. అలాగే కడుపులో  పురుగులు వున్న, కడుపు నెప్పికి కూడా పుదీన తీసుకుంటే మంచిది. పుదీన కారం మొదటి ముద్దలో తింటే జిహ్వ లేచివస్తుందని అంటుంటారు.  ఇప్పుడు పుదీన కారం తయారీ  తెలుసుకుందాము

కావలసిన వస్తువులు:
పుదీన                                                      1 కట్ట
చింతపండు                                                 50 గ్రాములు
ఉప్పు                                                        రుచికి సరిపడా
బెల్లం                                                         20గ్రాములు

పోపుకు కావలసిన వస్తువులు :

నూనె                                                   4 టేబుల్ స్పూన్స్
మినపపప్పు                                         2  టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి                                          10-12
ఆవాలు                                                2 టీస్పూన్స్
ఇంగువ                                                1 టీస్పూన్
మెంతులు                                             1 టీస్పూన్
పసుపు                                                 చిటికెడు

తయారు చేయటానికి పట్టే సమయం :             15 నిమిషాలు

తయారుచేసే విధానం:

ముందుగా పుదీన ఆకులు వలచుకోవాలి. తరువాత  నీటితో  శుబ్రంగా మట్టి పోయేలాగా కడిగి ఒక గుడ్డలో ఆరబెట్టినట్లుగా పరచుకోవాలి.  చింతపండును కడిగి ఒక కప్పులో తగినంత నీరు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకుని నూనె వేసుకుని వేడిక్కిన తరువాత మెంతులు వేసి రంగు మారేక మినపపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. తరువాత ఆవాలు వేసి చిటపటలాడేక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆఖరుగా ఇంగువ వేసి స్టవ్ ఆపుచేసుకోవాలి.

ఇపుడు పోపును వేరొక పాత్రలోకి తీసుకుని, అదే బాణలిలో కొంచెం నూనె వేసి పుదీన ఆకులను పచ్చిదనం పోయేలాగ వేయించుకోవాలి. ఇప్పుడు  నానపెట్టిన చింతపండును పిసికి ఆ గుజ్జును వేసి కాసేపు వేయించాలి. స్టవ్ ఆపి  బెల్లం వేసుకోవాలి.  ఇప్పుడు పోపు చల్లారి వుండి వుంటుంది. మిక్సీ లో పోపుని తిప్పుకోవాలి. పోపు నలిగిన తరువాత పుదీన మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ లో తిప్పాలి.  ఇప్పుడు పచ్చడిని తీసుకుని ఒక మంచి పాత్రలోకి మార్చుకోవాలి.

సలహాలు:

1.పుదీన పచ్చడిని వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే చాల రుచిగా వుంటుంది.
2. దీనిని చపాతీ, పరాటా, ఇడ్లీ, దోశల్లోకి కూడా నంచుకుని తినవచ్చును.
3. పచ్చడి ఫ్రిజ్ లో వుంచితే వారం, పది రోజుల పాటు నిలువ చేసికొనవచ్చును.

 

 
























No comments:

Post a Comment