Wednesday, September 17, 2014

బామ్మగారి కార్నర్: కర కర లాడే రెండు చక్కని ఉపాహారాలు!



ముందు మాట;

ఈ రోజు మన బామ్మగారు సాయంకాలం తేనీరు తో పాటు తినటానికి పనికి వచ్చేవి, నోరూరించే వి అయిన రెండు ఉపాహారాలు గురించి చెపుతున్నారు. మరి చదివి వీలైతే చేసుకోండి.

రమణ బంధకవి

సంపాదకుడు


సాయంకాలం  తేనీటి తో పాటు చల్లపొంగరాలు


సాయం సమయాన టీ తో పాటు తినడానికి ముఖ్యంగా వానాకాలం లో ఏదో ఒకటి ఉండాలని పిన్నలు- పెద్దలు కోరుకుంటారు. సాయంకాలం చిరుతిళ్ళకి ఎన్ని రకాలు ఉన్నా ఇంకా ఏదైనా కొత్త వెరైటీ కావాలని పిల్లలు మారాము చేస్తూనే ఉంటారు. అందుకే మీకిప్పుడు చాలా సులభం గా తయారయ్యే చల్లపొంగరాలు చేసుకునే విధానం చెప్తాను.

చల్లపొంగరాలు అప్పటికప్పుడు  చేసుకోవచ్చు. సాధారణం గా ప్రతి ఇంట్లో  ఏదో విధంగా కాస్త మజ్జిగ మిగలకుండా ఉండదు. అది మర్నాటికి పులిసిపోతుంది. ఈ మజ్జిగ లో కాస్త గోధుమ పిండి, బియ్యం పిండి  వేసి  ఉండ కట్టకుండా  కలుపుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా తరిగి పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు, జీలకర్ర, చిటికెడు కారం, పసుపు కుడా కలుపుకోవాలి. పిండి మరీ పలచ గానూ లేక గట్టిగానూ  కాకుండా కొంచెం జాలువారుగా బజ్జీ పిండి లాగా కలుపుకోవాలి. స్టవ్ మీద మూకుడు  పెట్టి  సరిపడగా నూనె పోసుకుని, నూనె  కాగాక సెగ  తగ్గించుకుని,  చెంచాతో  పిండిని  కాస్త కాస్త వేసి,  బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకోవాలి.  పొంగి గుల్లగా ఉంటాయి. చిల్లుల చట్రం  తో నూనె లేకుండా తీసి, ఒక చిల్ల్లుల పళ్ళెంలో వేస్తె నూనె కిందకి జారిపోతుంది. ఇలా చేసిన చల్ల పొంగరాలు పుల్లపుల్లగా, కమ్మ కమ్మగా ఉండి టీ తో తినడానికి ఎంతో బాగుంటాయి.


మధ్యాహ్నం ఎవరైనా అనుకోకుండా వస్తే ఏమి చేసి పెట్టాలా అని కంగారు పడక్కర్లేదు. నేను చెప్పిన చల్లపొంగరాలు చేసి పెడితే వాళ్లు ఇష్టం గా తినడం ఖాయం! మరి ఇంకెందుకు ఆలోచన? వెంటనే మీరు కూడా ఈ చల్ల పొంగరాలను ట్రై చేయండి!




మొక్కజొన్న పొత్తు వడలు


ఇది మొక్కజొన్న పొత్తులు విరివిగా వచ్చే కాలం. లేత మొక్కజొన్న పొత్తులు కాల్చుకు తినటాకి బాగుంటాయి. పొత్తులు ముదిరితే అలా కాల్చుకుని తినటానికి బాగుండవు. కొంచెం ముదిరిన పొత్తుల గింజలు వలిచి కడిగి కొంచెం సేపు నీళ్ళల్లో నాననిచ్చి మిక్సీ లో వేసి మరీ అంత  మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. రెండు ఉల్లిపాయలు, నాలుగు మిరపకాయలు ముక్కలుగా కోసుకుని, రుబ్బుకున్న మొక్కజొన్న గింజల ముద్దలో కలుపు కోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. రెండు కరివేపాకు రెమ్మలు తీసుకుని ఆకులు కడిగి కలుపుకోవాలి. ఒక మూకుడులో నూనె పోసి బాగా కాగాక పిండిని చిన్న చిన్న వడల ఆకారం లో వేసి వేయించాలి. బంగారు రంగులో వచ్చేదాకా వేయించుకోవాలి. నూనె లేకుండా తీసి పళ్ళెం లో వేసుకోవాలి. ఈ వడలు కరకర లాడుతూ, శనగ వడల్లాగానే బాగుంటాయి. పిల్లలు ఇష్టం గా తింటారు ఎప్పుడైనా పొరపాటున తెచ్చుకున్న మొక్కజొన్నలు ముదురుగా ఉన్నా బాధ పడకుండా వాటి గింజలు వలిచి, వడలుగా వేసుకుని తినండి.


No comments:

Post a Comment