Friday, September 12, 2014

తూర్పు పడమరల భిన్నత్వంలో ఏకత్వం! - పిల్లలకోసం – వైవిధ్యమైన ‘ఇడ్లి పిజ్జా’



ముందు మాట: 

తెలుగు భోజనం లో ఇప్పటి వరకు తెలుగు సాంప్రదాయపు వంటలు, పండుగలు - వాటి ప్రాశస్త్యాలు, వాడుకలో నున్న  నానుడులను ప్రస్తుత జీవనానికి అన్వయించి రాసిన వ్యాసములను, వాణి  వంటింటి విచిత్రాలు, కామాక్షి కధలు, బామ్మగారి వంటలు మొదలైనవి అందించటం జరిగింది. సహజంగా ‘ పట్టాభి’ లాంటి ఈ కాలం పిల్లలకు ఈ వంటలు, చిరుతిండ్లు అంతగా రుచించక పోవచ్చు అన్నది సత్య దూరం కాదు. 

అలా అని మేము పిల్లలను విస్మరించలేదండోయి!  మన తెలుగు భోజనం లో పిల్లలకు కూడా ప్రత్యేక  స్థానం వుంది. మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుండి వచ్చేక వారికి నచ్చే చిరుతిండ్లు ఏమి చేయాలా అని తల్లులు మధనపడకుండా, పిల్లలకు నచ్చే వంటకాలు కూడా అందించటం జరుగుతుంది.

మరి వారికి కూడా నచ్చే పద్ధతిలో, తూర్పు  పడమరల పద్దతుల మేలు కలయికతో వైవిద్యం ఉట్టి పడేలాగా, స్వీయ అనుభవంతో, ఒక కొత్త అల్పాహారాన్ని తన సృజనాత్మకత తో మన ముందుకు తెస్తున్నారు, మన పాఠకులు శ్రీ శ్రీనివాస్ శిష్ట్లాగారు.  మరి అదేమిటో చూసి, నచ్చితే మీ పిల్లలకు కూడా చేసి పెడతారు గా?


రమణ బంధకవి


సంపాదకుడు


‘ఇడ్లి  పిజ్జా’
                                                                                                   
                                                                                                            శ్రీనివాస్ శిష్ట్లా


మీకు తెలుసా! ఇడ్లీ పిండితో కూడా పిజ్జా చేయవచ్చును. ఎలా అంటారా? “అవసరం సృజనాత్మతకు తల్లి లాంటిది” (Necessity  is  the mother of invention ) అన్న ఆంగ్ల భాష లోని నానుడి విన్నారు కదా!  అందులోంచే పుట్టింది. మా అబ్బాయికి పిజ్జా అంటే ప్రాణం. ప్రతీ వారం కావాలని మారాం చేస్తాడు. మొదట్లో పిల్లాడు ఏదో ముచ్చటపడ్డాడులే అని నేను సరదాగానే కొన్నాను. వారం వారం పిజ్జాలలో వైవిధ్యాలు, కొత్త కొత్త అలంకారాలు తోడయ్యేసరికి  వాడి  పేచీలలోను వైవిధ్యం మొదలైంది. పిజ్జా ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఇంక లాభం లేదని నేను కూడా  కొంచెం వైవిధ్యంను అరువు తీసుకుని ఆలోచించగా ఈ కొత్తరకం పిజ్జా తయారయ్యింది. నా పిజ్జా వైవిధ్యంగా వుందో లేదో మీరే చెప్పండి!
  

కావలసిన పదార్దములు:

ఇడ్లీ పిండి                      3-4 గరిటెలు(ఉప్పు కలిపినది)
నూనె                            75 ml 


టాప్పింగ్స్ కి కావలసినవి:

ఉల్లిపాయలు, కాప్సికమ్, టమేటా, బ్లాక్ ఆలీవ్స్, చీజ్  అన్నీ కొద్దిగా.  జత చేసిన చిత్రంలో చూడవచ్చును. 


తయారు చేయు విధానం :

ఒక దళసరి నాన్ స్టిక్ పాన్ కాని, లేదా ప్రెజర్ పాన్ కాని తీసుకుని నూనె  వేసి వేడెక్కేక పిండి వేసుకుని పరచుకోవాలి.  చిన్న పిజ్జా ఐతే 3-4 గరిటెలు, పెద్దది కావాలంటే కొంచెం ఎక్కువ పిండి వేసుకోవాలి. ఇప్పుడు మీకు కావలసిన టాప్పింగ్స్ పైన వేసుకోవాలి. ఇక్కడ పైన చెప్పినవి వేయటం  జరిగింది. ఇప్పుడు చిన్న మంట మీద సుమారుగా 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. గరిటెతో నెమ్మదిగా అంచు లేపాలి. అంచు రాకపోతే ఇంక కొద్ది సేపు కాలనివ్వాలి. అంచు లేపి రెండవ ప్రక్క మార్చుకోవాలి. ఇంకొక 15-20 నిమిషాల కి రెండవ ప్రక్క కూడా చక్కగా రోస్ట్ అవుతుంది. ఇప్పుడు పాన్ లోంచి తీసి ఒక వెడల్పాటి పళ్ళెంలోకి మార్చుకోండి.


చాకుతో కాని, పిజ్జా కట్టర్ తో కాని మీకు కావలసిన ముక్కలుగా కట్ చేసుకోండి. హోం మేడ్  పిజ్జా రెడీ అయిపోయింది. మీరు కూడా అప్పుడప్పుడు ఇడ్లి పిండితో పిజ్జాని ప్రయత్నించవచ్చు. మా అబ్బాయికి భలేగా నచ్చింది మీ పిల్లలకి కూడా నచ్చవచ్చును.   పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్ కాని, ఒరిగానో సీసనింగ్ కాని, కెచప్  కాని వేస్తే పిల్లలకు మరింత ప్రియం గా ఉంటుంది. ఇక నుండి ‘పిజ్జా హట్’ ఖర్చులు తగ్గినట్లే మరి!         

 













No comments:

Post a Comment