Saturday, September 6, 2014

అమ్మ చేతి వంటలు: మామిడికాయ పప్పు



ముందు మాట:

ఏ శుభకార్యమప్పుడు విందు భోజనం కి వెళ్ళినా, ముందుగా ఆకులో ఠీవి గా రారాజు లా వచ్చి కూర్చునేది మామిడికాయ పప్పే సుమా!  ఎన్ని పదార్థాలు పెట్టినా, మామిడి కాయ పప్పు కి ఉన్న విశిష్టత వేరు. ఇప్పుడు నిక్షేపం లా ఏటి పొడుగునా మామిడి కాయలో, పిందెలో దొరుకుతున్నాయి. మరి ఘుమఘుమ లాడే పోపు సువాసనలతో, ఈ వారాంతపు అమ్మచేతి వంటల శీర్షిక కింద దర్శనం యిస్తోంది శ్రీమతి రత్న గారి మామిడికాయ పప్పు రెసిపీ. ఎవరో అన్నట్లు “ బాగుంటే ఇప్పుడే చేసుకోండి! నచ్చితే ఎప్పుడైనా సరే చేసుకోండి!”

రమణ బంధకవి

సంపాదకుడు


మామిడికాయ పప్పు

శ్రీమతి రత్నాశ్రీనివాస్, బెంగుళూరు

“జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేల!” అన్నట్లు మామిడికాయ పప్పు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని ప్రత్యేకతను అదే చాటి చెప్పుకుంటుంది. దాని పులుపుకు తగ్గట్లు ఎర్రగా, వర్రగా పోపు అంటిన్చేమంటే ఇంక దాని రుచే వేరు. అందుకే  పెళ్ళిళ్ళలోను, పండుగలు, శుభకార్యాలలోను  ప్రధమస్థానాన్ని సంతరించుకుంటుంది. తెలుగు జాతి గర్వించదగ్గ వంటకం మామిడికాయ పప్పు అంటే అతిశయోక్తి కాదు సుమా! అలాంటి మామిడికాయ పప్పు తయారు చేయువిధానం తెలుసుకుందామా?

కావలసిన వస్తువులు :

పుల్లటి మామిడి కాయ  : 1
కందిపప్పు  : 1 కప్పు
తయారు చేయటానికి పట్టే సమయం  : అర్ధగంట

పోపుకు కావలసిన వస్తువులు :

నూనె               2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి       4 నుంచి 5
మెంతులు         1 టీస్పూన్
మినపపప్పు     1 1/2టీస్పూన్స్
ఆవాలు            1 టీస్పూన్
జీలకర్ర             1 టీస్పూన్
ఇంగువ            1 టీస్పూన్
ఉప్పు                  తగినంత
పసుపు                చిటికెడు
కరివేపాకు             5-6 రెబ్బలు

తయారుచేయు విధానం:
ఒక మంచి పుల్లటి మామిడికాయను తీసుకుని శుబ్రంగా కడిగి చెక్కు తీసుకుని  చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ముక్కలను ఒక గిన్నేలోనికి కాని, ఒక చిన్న బాండీ లోకి కాని  తీసుకుని కొద్దిగా నీరు పోసి, పసుపు వేసి, 3-4 పచ్చిమిర్చి తుంపులుగ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టాలి.

ముక్కలు వుడికేలోపు కందిపప్పు శుభ్రంగా కడిగి ప్రెజర్ పాన్ లోకి తీసుకుని  తగినంత నీరు పోసి, పసుపు వేసి స్టవ్ మీద పెట్టాలి. ఈ లోగ వేరే స్టవ్ మీదున్న ముక్కలు వుడికేయోలేదో ఒక సారి చూసుకోవాలి.  ముక్కలు తొందరగానే అంటే ఒక పది నిమిషాలలో మెత్తగా వుడికిపోతాయి.

ఇపుడు కుక్కర్ మొదటి విజిల్ రాగానే మంట తగ్గించి 5-10 నిమిషాలు ఉంచాలి. రెండో విజిల్ వచ్చేలోపు పోపు సంగతి చూద్దాము. వేరొక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, నూనె వేగేక పైన చెప్పిన పరిమాణంలో  మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేక మినప పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు చిటపటలాడేక ఇంగువ వేసి, కరివేపాకు వేయాలి.

ఇప్పుడు రెండో విజిల్ వచ్చేసివుంటుంది. స్టవ్ ఆపేసుకుని ప్రెజర్ విడుదల అయ్యేక మూతను తీసి పప్పుని మెత్తగా గరిటెతో ఎనుపుకోవాలి. దానిలో తగినంత ఉప్పు వేసి, మామిడికాయ ముక్కలు వేసి చక్కగా కలియబెట్టాలి. ఇప్పుడు వేసినపోపులో ఎండుమిరపకాయలు తీసుకుని చేతితో మెదిపి, మిగతా పోపును కూడా వేసి స్టవ్ మీద కొంచెంసేపు వుడకనీయాలి. 5 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపి  పప్పుని ఒక శుబ్రమైన తుడిచిన పాత్రలోకి మార్చుకోండి. మహారాజా లాంటి మామిడికాయ పప్పు రెడీ.

సలహాలు :
1. కుక్కర్లో పెట్టె ముందు  కొంచెం కందిపప్పును దోరగా వేయించుకుని కూడా పెట్టవచ్చును.
2. మామిడికాయ పప్పు తో చల్ల మిరపకాయలు నంచుకుని తింటే చాల బాగుంటుంది.

3. పులుపు కావలసిన వారు మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసుకోనవచ్చును.

 




No comments:

Post a Comment