Thursday, September 4, 2014

కామాక్షి కబుర్లు: పనిమనిషి – ములగాకు: ఆఖరి భాగం




శ్రీమతి రత్నా శ్రీనివాస్, బెంగళూరు

(గత సంచిక: సూరిడమ్మ గారు ‘గజేంద్ర మోక్షం’ మధ్యలో లేచి వచ్చినందుకు ఒక సారి చెంపలు   వేసుకుని, ములగాకు కట్ట ముందు కేసుకుని, ఆకు దూస్తూ, ఈ సారి ఆసక్తిగా వినటం మొదలెట్టారు....ఇక చదవండి)

కామాక్షి ఆకుని సుబ్బరంగా దులిపి కడిగింది. స్టవ్ వెలిగించి బాండి పెట్టింది. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి  మూడు ఎండు మిరపకాయలు, ఒక స్పూన్ మినప పప్పు వేసి వేయించింది. పప్పు ఎర్రబారుతుండగా చెరొక స్పూన్ ఆవాలు,  జీలకర్ర వేసింది. ఆవాలు పేలేక ఇంగువ జల్లి స్టవ్ తగ్గించివేగిన పోపును వేరొక చిన్న కప్పులోకి తీసి తిరిగి బాండీని స్టవ్ మీద పెట్టింది. ఇపుడు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసింది. నూనె కాగేక అందులో కడిగిన ములగాకును వేసి కొంచెం వేగినట్లుగా చేసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి, కొద్దిగా నీళ్ళు చిలకరించి మూత పెట్టింది. 

ఆకు మగ్గేలోగా ఒక చిన్న కప్పు లో గుప్పెడు సెనగ పప్పు నాన బెట్టింది.  ఫ్రిజు లోంచి చిన్న కొబ్బరి చిప్ప తీసి తురిమిన్ది. మధ్య మధ్యలో మూత తీసి ములగాకు కలియబెట్టింది. మంజు తను తెచ్చిన ములగాకుని కామాక్షి ఏ పద్దతిలో చేస్తోందో, పని చేసుకుపోతూనే ఆసక్తిగా గమనిస్తోంది. 

సెనగపప్పుఅరగంటలో  నానింది. కామాక్షి మిక్సీ చిన్న జారు తీసింది. సెనగ పప్పు నాన బెట్టిన కప్పులోంచి నీరు వంచి, పప్పు, కొబ్బరి తురుము, అర్ధ రూపాయంత అల్లం ముక్క, నాలుగు పచ్చి మిర్చి, చిటికెడు ఉప్పు మిక్సీ జార్లో వేసి తిప్పింది. ఈ లోగా ములగాకు మగ్గింది.  ఆ మిశ్రమాన్ని తీసి ములగాకు వున్న బాండీ లో వేసి కలియబెట్టి మూత  పెట్టింది. ఈ లోగా పక్క బర్నర్ పైన ఒక చిన్న మూకుడు పెట్టి మినప్పిండి వడియాలు వేయించడానికి నూనె పోసింది. నూనె వేగేక గుప్పెడు వడియాలు వేయించి, బైటకి  తీసి ఒక చిన్న పళ్ళెం లో వేసింది. 

ములగాకుకి సెనగపప్పు మిశ్రమం బాగా పట్టుకున్నాక పళ్ళెం లోని పిండి వడియాలు వేసి కలిపింది. ఆ తరువాత ముందుగా వేసి పెట్టుకున్న పోపును కూడా కూర లో వేసి ఒక సారి కలియబెట్టి స్టవ్ ఆపేసింది. 

ములగాకు కూర పచ్చని ఆకుతో, పసుపు పచ్చని సెనగపప్పు, కమ్మని కొబ్బరి, అల్లం పచ్చిమిర్చి వాసన, ఎర్రని ఎండుమిరపకాయ పోపుతో అందంగా తయారయింది. మంజు కూడా  ముచ్చట పడింది. తనూ ఇంటికి వెళ్ళేక చెస్తానంది. కూర పూర్తయింది. గజేంద్ర మోక్షం ఘట్టము కూడా ముగిసింది. 

"కూర అయిందిటే?” టీవీ కట్టేసి వంటిట్లోకి వస్తూ అడిగేరు సూరిడమ్మ గారు.  "అయ్యింది అత్తయ్య! పొడి కూర చేసేను" మూత తీసి చూపించింది.  కూరలో వడియాలు కలపటం చూసి "ఓ ... వడియాలు  కూడా వేసావే! పోనీలే! విశ్వం ఇష్టంగా తింటాడు" అన్నారు. 

మంజు పని చేసి వెళ్లి పోయింది. అందరు భోజనాలకి కూర్చున్నారు. కూర రుచిగా ఉందన్నారు మామ గారు. 
"ములగాకు అన్ని జబ్బులు నయం చేస్తుందని దానికి తెలిసిన పాటి మనకి తెలియకపోయింది" ఒక్క క్షణం మంజుని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు అత్తగారు"ఇంతకీ ఆలస్యంగా ఎందుకు వచ్చిందిటా" తింటూ అడిగేరు లక్ష్మికాంతం గారు. 
"అవును సుమా! ఆ మాటే మర్చిపొయాము. టక్కరిది! వస్తూనే ఇంత ములగాకు చేతిలో పెట్టి, మనల్ని ఉద్దరిస్తున్నట్లు దాని గుణ గణాలు ఏకరువు పెట్టి మా నోరు మూయించింది" క్షణం క్రితం దాన్ని పొగిడిన విషయం మరచి ఎర్రబడ్డ మొహంతో కోపంగా అన్నారు సూరిడమ్మ గారు. 

(సమాప్తం)




No comments:

Post a Comment