Monday, September 15, 2014

కామాక్షి కబుర్లు: ‘వాట్స్ఎప్ విచిత్రాలు’ (ఆఖరి భాగం).




శ్రీమతి రత్నాశ్రీనివాస్ బెంగళూరు


(గత సంచిక: ఇంక కొంతసేపు ఫోన్ ముట్టుకోకూడదని, పని ముగించుకుని కాని దాని జోలికి వెళ్లకూడదని దృడంగా నిశ్చయించుకుంది.... ఇక చదవండి)


భోజనాల వేళ అయ్యింది. వంటకూడ గబగబా పూర్తిచేసింది. అత్తగారు కంచాలు పెడుతూ “వాజప్పు మోగిందిటే!” అడిగేరు కామాక్షిని.

“పని వెనుకపడుతోందని చూడలేదు అత్తయ్య! చూస్తాను వుండండి” అంటూ అమ్మలు వద్ద నుండి వచ్చిన సమాచారాన్ని చదివింది.

ఆవిడ లక్ష్మీకాంతం గారికి అన్నం వడ్డిస్తూ “అమ్మలు ఆడపడుచు ఇల్లు కట్టడం పూర్తి అయ్యిందని వాజప్పులో చెప్పిందిట” అని తను వాజప్పు లో విన్న విషయం అయన చెవిని పడేయటానికి ప్రయత్నించారు.

“అయ్యో! ఏమిటి? అమ్మలు ఆడపడుచు ఇల్లు జప్తు చేస్తున్నారా?” అన్నంలో పప్పు కలుపుకుంటూ ఆగిపోయేరు లక్ష్మీకాంతం గారు.

“నా తలకాయ! ఇల్లు జప్తు చేయడం ఏమిటి? శుభమా అని గృహప్రవేశం చేసుకోబోతుంటేను!” అని విసుక్కున్నారు.

కామాక్షి అమ్మలు ఇచ్చిన మెస్సేజ్ వివరంగా చెప్పింది మామగారికి. “అలాగా! మనం వెళ్ళేలా?” “ మనల్ని పిలిచినప్పుడు మాట కదా!" మళ్ళీ విసుక్కున్నారు అత్తగారు.

సాయంత్రం వేళ అత్తగారు వత్తులు చేసుకుంటుంటే, ఆ ఉదయం తనకి వాట్సప్ లో వచ్చిన ఫోటోలు అన్నీ ఆవిడకి చూపించింది కామాక్షి.  ఆవిడకి బాగానే కాలక్షేపం అయ్యింది.

“మన కొత్త ఆవకాయ, నేను తెచ్చిన పళ్ళ కారం, కొత్తగా కొన్న వెట్ గ్రైన్దర్, వడియాలు అన్నీ వాజప్పు లో పెట్టలేకపోయావుటే! అమ్మలు చూసి ఆనందించేది” అన్నారు.

పట్టాభి పరుగున వచ్చి, తల్లి చేతిలోంచి ఫోన్ లాక్కుని, మామ్మ వుండు, అంటూ క్లిక్కుమని ఫోటో తీసి మామ్మ మేకింగ్ వత్తులు” అని రాసి అందరికి పంపించేసాడు.  “మామ్మ! చూడు నువ్వు వత్తులు చేస్తున్న ఫోటో” అని చూపించాడు. ఆవిడ సిగ్గుపడిపోతూ “ఓరి  భడవా! ఎపుడు తీసేవురా చెప్పకుండా? చీర మోకాలి మీదకి పోయి కాలు పారజాపుకుని కూర్చున్నానాయే! ముందు చెపితే సవరించుకునేదాన్ని కాదుట్రా!” మందలించేరు.
“పరవాలేదులే మామ్మ! నేచురల్గానే బావున్నావు” అంటూ బాల్ తీసుకుని ఆడుకోవటానికి పరిగెత్తేడు.

రాత్రి భోజనాలు అయ్యేక ఆ రోజు వాట్సప్ లో వచ్చిన ఫోటోస్, సమాచారాలు నెమరువేసుకుంటూ “మీరు కూడా వాజప్పు పెట్టుకోండి” అన్నారు లక్ష్మీ కాంతం గారితో.

“ఇప్పుడు జున్ను ఏమిటి? వాతం చేయడానికి! అయినా జున్ను ఎక్కడిది? విశ్వం తెచ్చేడా?” అన్నారు.

“నా తలకాయ! జున్ను లేదు, గాడిద గుడ్డు లేదు” అని విసవిసా హాల్లోకి వచ్చి టీవీ చూస్తున్న విశ్వంతో ఇక జన్మలో మీ నాన్న ముందు వాజప్పు పేరు ఎత్తితే ఒట్టు!” అని ఉక్రోషంగా అన్నారు.
విశ్వం నువ్వు వాజప్పు, వాజప్పు అనకమ్మ! ఆయనకు జప్తులాగాను, జున్నులాను, వాతంలాను, లేదా జాడ్యం గానో రకరకాలుగా వినబడుతోంది. చక్కగా ‘వాట్స్ఎప్’ అను” అన్నాడు .

“ఆ ఆ ... నా మొహం! అది మాత్రం లక్షణంగా వినబడిందట్రా! వడపప్పు అనుకోలేదు! అసలు వినపడని గుణం వున్నప్పుడు ఎలా పలికినా వినబడదు” నిష్టూరంగా అన్నారు.


వారిద్దరి సంభాషణ వింటున్న కామాక్షి అనుకుంది. నిజంగా ఈ వాట్సప్ కి  అలవాటు పడిపోతే జాడ్యంలోకే దిగుతుంది. ఏ పరిజ్ఞానాన్ని ఐనా అవసరం మేరకు వినియోగించుకున్నంతవరకు తప్పులేదు; అవసరానికి మించి వినియోగిస్తే పనులు వెనకపడటమే కాకుండా  దానికి బానిస ఐపోయే ప్రమాదం కూడా వుంది సుమా! అనుకుంటూ అప్పుడే ‘టింగ్’ మని మోగిన మెసేజ్ చదవకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. (సమాప్తం)


No comments:

Post a Comment