Saturday, September 6, 2014

కమ్మని తెలుగు వంటకం: పెసర పుణుకులు – అల్లం పచ్చడి



ముందు మాట!


చిన్నప్పుడు మా గ్రామం లో మేము భుజానికి స్కూల్ సంచులు తగిలించుకుని బడి అయిపోయాక 

ఇంటిముఖం పట్టినప్పుడు, దారిలో చెరువు పక్క సుబ్బారాయుడి గుడి పక్కన ఉన్న బొండు 

సుబ్బయ్య పాక హోటల్ నుంచి వస్తున్న ఘుమ ఘుమలు కి కాళ్ళకి బ్రేకులు వేసే వాళ్ళం. లోపల 

పెద్ద ఇనుప బాండీ లో ఎర్రగా వేగుతున్న పెసర పునుకులు మా మనసునిండా నిండి పోయేవి. పది 

పైసలకు బాదం ఆకులో రెండు పెద్ద పునుకులు, అవి తడిసి పోయేలాగ అల్లం పచ్చడి వేసే వాడు. 

వేడి పునుకులు ఊదుకుంటూ తింటూ ఇళ్ళ వైపు నడిచే వాళ్ళం. వాటి రుచికి మాకు వేరే మాటలు 

వచ్చేవి కావు. గత కొన్ని దశాబ్దాలుగా ఎక్కడి ఎన్ని సార్లు పెసర పునుకులు తిన్నా, బొండు 

సుబ్బయ్య  పునుకులు మాత్రం మరచిపోలేను. ఇప్పుడు అటువంటి కమ్మని తెలుగు వంటకాన్ని 

మన ముందుకు తీసుకు వస్తున్నారు శ్రీమతి నయన. ఇక చూద్దాం వీటి రుచి ఎలా వుంటుందో!


రమణ బంధకవి


సంపాదకుడు




పెసర పుణుకులు – అల్లం పచ్చడి


శ్రీమతి నయన కస్తూరి, హైదరాబాద్


“అమ్మా! ఈ రోజు నేను లంచ్ బాక్స్ తీసుకెళ్లను. ఈవెనింగ్ తొందరగా వచ్చేస్తా. ఏమైనా స్నాక్స్ చేయి” అన్నాడు  రాజా కాలేజ్  కి వెళ్తూ  తల్లి వాణి తో.  “పకోడీలు చేయనా ?” అడిగింది వాణి. 

“అమ్మా! ప్లీజ్ పకోడీలు మాత్రం వద్దు; మాట్లాడితే పకోడీలు  చేసేస్తావు!” అడ్డుతగిలాడు కొడుకు. “మరి సాయంకాలాలు పకోడీలు కాకుండా ఇంకేమి చేస్తారు? పోనీ అరటికాయ బజ్జి చేయనా?”

“వద్దమ్మా!  ఏదైనా వెరైటి గా చేయి” అన్నాడు షూస్ వేసుకుంటూ. “చూడండి అత్తయ్యా! ప్రతిదీ వద్దంటాడు ఇంకేది చేయాలి? మీరు చెప్పండి పోనీ” అక్కడే కూర్చుని ఇద్దర్నీ గమనిస్తున్న అత్తగారితో అంది. రాజా  ‘బై’ చెప్పి వెళ్ళిపోయాడు.

“సరే! నేనొకటి చెప్తా అది చేసి చూడు వాడికి నచ్చుతుందనే అనుకుంటున్నా! పద వంటింట్లోకి” ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళారు. “రెండు గ్లాసులు ఛాయ పెసరపప్పు నాన బెట్టు” చెప్పింది కోడలికి. పప్పు నానబెట్టింది వాణి. ఇద్దరూ హాల్ లోకి వచ్చారు. “సరే అత్తయ్యా! ఇప్పుడు చెప్పండి ఎలా చేయాలి; అసలు ఏమి చేయాలి?” అత్తగారిని వివరం గా చెప్పమని అడిగింది.

“ఇది కమ్మనైన తెలుగు వంటకం! పెసర పుణుకులు అంటారు. ఈ కాలం పిల్లలు ఎప్పుడూ సమోసాలు, మిర్చి బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ మన కమ్మని పెసర  పుణుకులు రుచి చూసే వుండరు. వాడికి కొత్తగా వుంది తింటాడు చూడు!   శ్రద్ధగా విను ఎలా చేయాలో చెప్తా” అత్తగారు చెప్పడం మొదలు పెట్టారు.

పెసర పునుకుల తయారీ:

పప్పు బాగా నానిన తర్వాత గ్రైండర్ లో వేసి, తగినంత ఉప్పు వేసుకుని  మెత్తగా రుబ్బుకోవాలి. పిండి గట్టిగా గారెల పిండి లాగా రుబ్బుకోవాలి. పలచన కాకూడదు సుమా! పిండిలో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఒక చిటికెడు సోడా ఉప్పు వేస్తె పుణుకులు గుల్ల గా వస్తాయి. ఒక బాండీ లో నూనె పోసి నూనె బాగా కాగాక   పిండి ని గుండ్రం గా ఉండల్లా చేసి నూనెలో వేయాలి. బాగా వేగి బంగారం రంగులోకి వచ్చిన తర్వాత చిల్లుల చట్రం తో నూనె లేకుండా చూసి తీయాలి. అంతే! పెసర పుణుకులు తయార్!

“బాగుంది మరి దీనితో నంజుకోవడానికి ఏది బాగుంటుంది అత్తయ్యా?” అత్తగారిని అడిగింది వాణి. “పుణుకులు తో కొంచెం పలుచగా చేసుకున్న అల్లం పచ్చడి బేషుగ్గా వుంటుందే కోడలా! అది కూడా చెయ్యి. నీకు తెలుసుగా అల్లం పచ్చడి ఎలా చేయాలో?” అంది అత్తగారు.

“తెలుసనుకోండి! ఐనా అది కూడా చెప్పండి. మీ పద్ధతికి నా దానికి తేడా ఉందేమో!” అడిగింది వాణి.

అల్లంపచ్చడి తయారీ:

“సరే విను! ఓ ఆరు ఎండు  మిరపకాయలు తీసుకో. రెండేసి చెంచాలు శనగ పప్పు, మినప్పప్పు , అర చెంచాడు మెంతులు, ఒక అరచెంచాడు ఆవాలు వేసి పోపు వేయిచుకోవాలి. పోపుకి సరిపడా అల్లం తీసుకుని, శుభ్రం చేసుకుని ముక్కలుగా తరుగు కోవాలి. రుచి కి తగ్గ కారం కోసం నాలుగు పచ్చి మిర్చి కూడా తీసుకోవాలి. తగినంత చింత పండు తీసుకుని శుబ్రం చేసుకుని కాసిని నీళ్ళల్లో నానబెట్టాలి. గుజ్జు తీసుకుని ఒక చిన్న మూకుడు లో వేసుకుని ఉడక బెట్టుకోవాలి. ఇలా ఉడక బెట్టుకుంటే పచ్చడి నిలవ ఉంటుంది. ఆ ఉడికే చింత పండు గుజ్జు లో కాస్త బెల్లం వేస్తే పచ్చడి పుల్ల పుల్ల గా, తియ్య తియ్య గా వుంటుంది. వేయించి ఉంచుకున్నపోపు, తగినంత ఉప్పు మిక్సీ లో వేసి మెత్తగా అయ్యాక, చింత పండు గుజ్జు కూడా కలిపి కొంచెం సేపు రుబ్బాలి. ఇలా తయారైన అల్లం పచ్చడి ని కొంచెం విడిగా ఒక కప్పు లో తీసుకుని కాసిని నీళ్ళు కలుపుకుంటే పుణుకులు తో నంజుకోవడానికి బాగుంటుంది”.

“ఈ పచ్చడి మినప దోశలు, ఇడ్లీ, గారేల్లోకి కుడా బాగుంటుంది. గట్టి పచ్చడి అన్నం లోకి ముద్దపప్పు లోకి కూడా బాగుంటుంది. ఇది మంచి పైత్యహారం కూడాను. గట్టి పచ్చడిని ఫ్రిజ్ లో పెట్టుకుని, తడి చేయి పెట్టకుండా వుంటే ఈ అల్లం పచ్చడి పది పదిహేను రోజులు దాకా నిలవ వుంటుంది” అని అత్తగారు చెప్పడం ముగించారు. “అయితే ఈ రోజు సాయంకాలం పుణుకులు, అల్లం పచ్చడి ఫలహారం మన ఇంట్లో” అని వాణి ఉత్సాహం గా వంటింటి వైపు నడిచింది.

సాయంకాలం వాణి పెసర పునుకులు –అల్లం పచ్చడి చేయడం, రాజా కి చాలా బాగా నచ్చడం జరిగిందని మీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.


 



No comments:

Post a Comment